తల్లి పాలు తాగడం పిల్లల హక్కు
సాక్షి,సిటీబ్యూరో: తల్లి పాలు తాగడం పిల్లల హక్కుగా భావించి.. తల్లి పాల బ్యాంకులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పసిబిడ్డలు తల్లి పాలకు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపైన, తల్లికి, బిడ్డకు పెరుగుతున్న దూరాన్ని తగ్గించడం పైన శిశు సంక్షేమ సంస్థలు, ఆరోగ్య శాఖ దృష్టి సారించడం లేదన్నారు.
దేశంలో ఏటా లక్షన్నరకు పైగా తల్లులు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలోనే కన్నుమూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా తల్లులను కోల్పోయిన పిల్లలు పాలకు నోచుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. పౌష్టికాహార లోపంతో 48 శాతం తల్లులు, భయంకరమైన వ్యాధులు, జన్యుపరమైన కారణాల వల్ల 7 శాతం మహిళలు పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు.