Dr Sushila vavilala
-
స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం బేబీకి మంచిదేనా? తెలియజేయండి. - సురేఖ, హైదరాబాద్ గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే. మొదటి ట్రైమిస్టర్లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది. ఇక రెండో ట్రైమిస్టర్లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి. ఇక మూడో ట్రైమిస్టర్లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
పీరియడ్స్ సమయంలో నొప్పి...ఏం చేయాలి?
నా వయసు 15 ఏళ్లు. ఏడాది క్రితం పుష్పవతిని అయినప్పటి నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి ఏం చేయాలి? భవిష్యత్తులో దీనివల్ల ఏమైనా ప్రమాదమా? దయచేసి వివరించగలరు. నాకు చాలా భయంగా ఉంది. - పారిజాత, విజయవాడ చాలామంది యువతుల్లో రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలా మంది దీని గురించి ఆందోళన పడతారు. అయితే ఇది చాలా సహజమైన విషయం. ఇలా నొప్పి రావడం చాలా మందిలో కనిపించేదే. పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందుది ఓవ్యులేషన్ పీరియడ్ అన్నమాట. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. చాలామందికి ఈ టైమ్‌లో నొప్పి వస్తుంది. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతులకే పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా... పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే..?
సాధారణంగా గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినా దాని కారణంగా గర్భస్రావం కావడం అన్నది చాలా అరుదు. అయితే చికెన్‌పాక్స్ ప్రభావం కడపులోని బిడ్డపై ఎలా ఉంటుందన్నది గర్భవతికి ఏ నెల అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. అయితే చికెన్‌పాక్స్ సోకిన గర్భవతులు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినట్లయితే వారి ప్రెగ్నెన్సీలోని 12వ వారం, 16వ వారం, 20వ వారం, 24వ వారాల్లో నిపుణుల చేత పరీక్ష చేయించుకుని, బిడ్డపై ఎలాంటి ప్రభావాలు లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఏడు నెలల గర్భంతో(అంటే 28 వారాల ప్రెగ్నెన్సీ) ఉన్నవారికి చికెన్‌పాక్స్ సోకితే దాని ప్రభావం కడుపులోని బిడ్డపైనా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. చికెన్‌పాక్స్ కారణంగా బిడ్డలో కళ్లు, కాళ్లు, భుజాలు (ఆర్మ్స్), మెదడు, బ్లాడర్, ెపేగులు (బవెల్) వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అయితే ఇలాంటి అవకాశం చాలా అరుదు. దాదాపు నూరు కేసుల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గర్భవతికి 7వ నెల నుంచి 9వ నెల మధ్యకాలంలో చికెన్‌పాక్స్ సోకితే అప్పుడు పుట్టబోయే బిడ్డలో కూడా చికెన్‌పాక్స్ వైరస్ ఉంటుంది. కానీ ఆ వైరస్ తాలూకు ఎలాంటి ప్రభావాలూ బిడ్డపై పడవు. కాకపోతే బిడ్డ కాస్త బరువు తక్కువగా పుట్టవచ్చు. ఇక 36 వారాల ప్రెగ్నెన్సీలో (అంటే... 9 నెలలు నిండాక, ప్రసవానికి దగ్గరగా) గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే... పుట్టిన తర్వాత బిడ్డకూ సోకిందేమోనంటూ దాదాపు 28 రోజుల వరకు పరిశీలించాలి. ఒకవేళ సోకి ఉంటే బిడ్డకు కూడా చికెన్‌పాక్స్ చికిత్స అందించాలి. అయితే బిడ్డకు తల్లిపాలు పట్టడానికి ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు ఉండవు. నిర్భయంగా పట్టవచ్చు. ఇక చికెన్‌పాక్స్ వచ్చిన తల్లికి జ్వరం, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో తల్లికి యాంటీవైరల్ మందులను ఇస్తారు. అయితే చికెన్‌పాక్స్ అన్నది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సంక్రమించే వ్యాధి కాబట్టి ఒకవేళ ఇది సోకినప్పుడు మనమే స్వచ్ఛందంగా మిగతా గర్భవతులు, బిడ్డ తల్లుల వంటి వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం అన్నది మనందరి సామాజిక బాధ్యత. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్