స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా? | Will scanning harm pregnant and the baby inside? | Sakshi
Sakshi News home page

స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?

Published Thu, Oct 24 2013 11:38 PM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?

స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?

 నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం  బేబీకి మంచిదేనా? తెలియజేయండి.
 - సురేఖ, హైదరాబాద్

 
 గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే.
 మొదటి ట్రైమిస్టర్‌లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది.
 
 ఇక రెండో ట్రైమిస్టర్‌లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్‌లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి.
 
 ఇక మూడో ట్రైమిస్టర్‌లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
 సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి.
 
 ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం.
 
 డాక్టర్ సుశీల వావిలాల
 ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
 ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement