ultrasound scanning
-
మోనోపాజ్ తర్వాత రక్తస్రావం?!
మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం చాలా సహజం. అయితే రుతుక్రమం ఆగిపోయి, వాళ్లకు మెనోపాజ్ దశ వచ్చాక మాత్రం...కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపిస్తే అది ప్రమాద సంకేతం. రుతుస్రావం ఆగిపోయి... ఏడాది కాలం దాటాక రక్తస్రావం కనిపిస్తుందంటే... అది ఎందుకు జరుగుతోంది, దానికి కారణాలు ఏమిటో కనుగొని, తగిన చికిత్స చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తుందంటే దానికి కారణాలేమిటో, అదెంత ప్రమాదకరమో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు/ చికిత్స ఏమిటో అవగాహన కలిగించేందుకే ఈ కథనం. ఓ యువతికి యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అండాశయాల్లోని అండాలన్నీ నెలకు ఒకటి చొప్పున విడుదల అవుతూ ఉంటాయి. అవి పూర్తిగా సంసిద్ధంగా ఉన్న సమయంలో కలయిక జరగనప్పుడు అవి క్రమంగా క్షీణించి, అండం ఉన్న ఎండోమెట్రియం పొరతో పాటు రాలిపోతాయి. ఇలా రాలిపోయినప్పుడే మహిళల్లో నెలసరి తాలూకు రక్తస్రావం కనిపిస్తుంది. దీన్నే రుతుస్రావం అంటుంటారు. మహిళలు తమ మధ్యవయసుకు చేరేనాటికి వారిలోని అండాలన్నీ పూర్తిగా అయిపోతాయి. దాంతో వారికి అండం విడుదల ఆగిపోవడంతో పాటు నెలసరి అయ్యే రుతుస్రావమూ ఆగిపోతుంది. దీన్నే ఇంగ్లిష్‌లో మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ దశలో కొన్ని హార్మోన్ల ఉత్పత్తి కూడా మునుపటిలా ఉండదు. దాంతో పన్నెండు, పద్నాలుగేళ్ల వయసులో మొదలైన రుతుక్రమం నిలిచిపోతుందన్నమాట. అది జరిగాక కొద్దిపాటి రక్తస్రావం కనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే నలభైఏళ్లలోపు రుతుక్రమంలో కొద్దిపాటి మార్పులు కనిపించినా అవి చాలావరకు క్యాన్సర్‌కు సంబంధించినవి కాకపోవడంతో... క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ.. ఏళ్లు గడిచేకొద్దీ క్యాన్సర్ ముప్పు (రిస్క్) పెరుగుతుంది. సాధారణంగా అయితే యాభై లేదా అరవై ఏళ్లు దాటాక రక్తస్రావం కనిపిస్తే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యేందుకు పది నుంచి పదిహేను శాతం వరకు ఆస్కారం ఉంది. అలాంటప్పుడు మందులివ్వడం, డీఅండ్‌సీ చేయడం లాంటి చిన్న చికిత్సలు సరిపోవు. మహిళకు అవసరమైన అన్ని పరీక్షలూ నిర్వహించి... అలా రక్తస్రావం జరగడానికి కచ్చితమైన కారణాన్ని తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. చేయించుకోవాల్సిన పరీక్షలివి... మహిళల్లో మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపించిన పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ చేస్తారు. ఈ పరీక్షలో గర్భాశయ పనితీరూ, ఎండోమెట్రియం పొర మందం గురించి తెలుస్తుంది. మెనోపాజ్ దశ దాటిన స్త్రీలలో ఎండోమెట్రియం పొర మందం ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. పదిహేను, ఇరవై మిల్లీమీటర్లు ఉంటే అది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు. కాబట్టి మరికొన్ని ఇతర పరీక్షలూ చేయించుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్లూ, గర్భాశయ పరిమాణం, ఆకృతి వంటి వివరాలు తెలుస్తాయి. అండాశయాలు చిన్నగా కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకు భిన్నంగా అండాశయాల్లో సిస్టులు ఉండటం, వాటి పరిమాణం పెరుగుతుండటం, కణుతుల్లాంటివి ఉంటే అది అసహజమని గుర్తించాలి. స్కాన్ మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయాల్సి రావచ్చు. గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర నమూనా సేకరించి బయాప్సీకి పంపిస్తారు. ఈ పరీక్ష కోసం ఎలాంటి మత్తూ, ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. చిన్న గొట్టం ద్వారా నమూనాను సేకరిస్తారు. అయితే ఈ పరీక్షకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నమూనా సేకరించే సమయంలో... సమస్య ఉన్న ముక్క మాత్రమే రాకుండా ఆరోగ్యవంతమైనదీ రావచ్చు. దాంతో రిపోర్టు తప్పుగా వచ్చే అవకాశాలూ లేకపోలేదు. కొన్నేళ్ల కిందటివరకూ డీఅండ్ సీ (డైలటేషన్ అండ్ క్యూరటార్జీ) పద్ధతిలో నమూనాలను సేకరించేవారు. అంటే విడివిడిగా గర్భాశయం పైభాగం, కిందిభాగం, గర్భాశయ ముఖద్వారం నుంచి సేకరించేవారు. అప్పటికీ నూటికి నూరు పాళ్లు కచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మరో పరీక్ష హిస్టెరోస్కోపీ. గర్భాశయ ముఖద్వారం నుంచి సన్నని టెలిస్కోప్ని లోపలికి పంపి, కెమెరా ద్వారా లోపలి దృశ్యాలను మానిటర్‌పై చూస్తారు. అక్కడి పరిస్థితి అంతా భూతద్దంలో చూసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా సరైన చోటునుంచే నమూనా సేకరించవచ్చు. గర్భాశయం లోపలి పొర మందం, పాలిప్, ఫైబ్రాయిడ్, క్యాన్సర్ కణితి లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ పద్ధతి ద్వారా చిన్న చిన్న పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి గుర్తించడంతోపాటూ అదే సమయంలో చికిత్స కూడా చేయవచ్చు. అంటే సమస్యను గుర్తించడం, చికిత్స చేయడం... ఈ రెండూ ఏకకాలంలో పూర్తవుతాయన్నమాట. సమస్యను గుర్తించేందుకు మరో పరీక్ష సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. అంటే, గర్భాశయంలోకి సెలైన్‌ని ఎక్కించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తూ కారణాలు తెలుసుకుంటారు. ఇలాంటి పరీక్షలు చేసినా కూడా కారణం కనిపించకపోతే సిస్టోస్కోపీ, ప్రాక్టోస్కోపీ, కొలనోస్కోపీ లాంటివీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అంచనా వేసేందుకు పాప్‌స్మియర్ లాంటివి చేయాల్సి రావచ్చు. ఈ ఫలితాలను బట్టి, చికిత్స లేదా ఆ తర్వాత ఏం చేయాలనేది వైద్యులు నిర్ణయిస్తారు.. ఇతర కారణాలూ ఉంటాయి... మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అనగానే అది తప్పక క్యాన్సరే అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితికి ఇతర కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు... పెద్దవయసులో బాత్రూంకి వెళ్లినప్పుడు రక్తస్రావం కనిపించగానే చాలామందికి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అందుకే వైద్యులు ముందు జననేంద్రియభాగం చుట్టుపక్కల ఉండే ఇతర అవయవాలనూ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మూత్రాశయం, మలద్వారం నుంచి కూడా రక్తస్రావం కావచ్చు. మలబద్ధకం ఉన్నప్పుడు, మలద్వారం నుంచి కూడా కొన్నిసార్లు రక్తస్రావం అవుతుంది. ఏళ్లు గడిచేకొద్దీ యోనిలోని పొర పలుచబడటం వల్ల పొడిబారి చిట్లిపోయి, అక్కడి నుంచి రక్తస్రావం అయ్యేందుకూ అవకాశముంది. జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గర్భాశయంలో పాలిప్స్, ఉన్నా ఇలా రక్తస్రావం కనిపించవచ్చు. అలాగే జననేంద్రియ, గర్భాశయ ముఖద్వార, ఫెల్లోపియన్ ట్యూబులు, అండాశయ క్యాన్సర్లున్నా కూడా రక్తస్రావం అవుతుంది. మెనోపాజ్ దశ దాటాక హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునేవారిలో మధ్యమధ్య రక్తస్రావం కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ కోసం వాడే టామోక్సిఫిన్ వల్ల... గర్భాశయం లోపలి పొర మళ్లీ పెరిగి కొంతమందిలో పాలిప్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. కొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వస్తాయి. ఈ పరిస్థితిని ‘లించ్ సిండ్రోమ్’ అంటారు. కారణాలేమైనప్పటికీ మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అయితే తప్పక గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి కొన్ని సూచనలూ... చికిత్సలు ఎండోమెట్రియం పొర నాలుగు మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు, పాప్‌స్మియర్ ఫలితం మామూలుగానే ఉన్నప్పుడూ రక్తస్రావం కనిపించినా భయపడాల్సిన అవసరంలేదు. మూడునెలలు ఆగి మళ్లీ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఎండోమెట్రియం పొర ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే బయాప్సీ ఫలితాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని తేలితే మళ్లీ ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ క్యాన్సర్ ఎండోమెట్రియం పొరకే పరిమితమైందా, లేదంటే గర్భాశయ కండరానికీ విస్తరించిందా, గర్భాశయం దాటి లింఫ్ గ్రంథులూ, కాలేయం, ఊపిరితిత్తుల వరకు చేరిందా అని వైద్యులు నిశితంగా పరీక్షిస్తారు. దాన్ని బట్టి ఎలాంటి చికిత్స / శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తారు. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఉన్నా దానికి అనుగుణమైన చికిత్స చేసి ఆ భాగాలను తొలగిస్తారు. తరవాత రేడియేషన్, కీమోథెరపీ లాంటివి చేయాలా వద్దా అన్నది నిర్లణయిస్తారు. ఒకవేళ క్యాన్సర్ కాకపోతే చాలామటుకు హిస్టెరోస్కోపీలోనే... పాలిప్స్, ఫైబ్రాయిడ్ల లాంటివి కనిపిస్తే... వాటిని తొలగిస్తారు. ఎండోమెట్రియం పొర మందం ఎక్కువగా పెరిగి.. రిపోర్టులో హైపర్‌ప్లేసియా అని వస్తే తీవ్రతను బట్టి ప్రొజెస్టరాన్ హార్మోను సూచిస్తారు. లేదంటే హిస్టెరెక్టమీ చేస్తారు. కొన్నిసార్లు హార్మోన్లు లేకపోవడం వల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి ‘ఎట్రోఫిక్ ఎండోమెట్రియం’ పరిస్థితి వస్తుంది. అప్పుడు అందుకు తగినట్లుగా హార్మోన్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. ముందు జాగ్రత్తలు ముఖ్యమే.. అధిక బరువూ, అధిక రక్తపోటూ, మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు సాధారణ మహిళల కంటే ఈ సమస్య బారిన పడే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి వారు తమ బరువును అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. పీసీఓడీ ఉన్న వారు తప్పనిసరిగా మందులు వాడాలి. పిల్లలు కలిగాక వైద్యుల సలహాతో గర్భనిరోధక మాత్రలు లేదా ప్రొజెస్టరాన్ లూప్‌ని వాడటం ద్వారా ఎండోమెట్రియం పొర ఎదుగుదలను అదుపులో ఉంచొచ్చు. హార్మోన్ చికిత్స (హెచ్ఆర్టీ) తీసుకునే వారు ఈస్ట్రోజెన్‌తో పాటూ తప్పనిసరిగా ప్రొజెస్టరాన్‌ని వాడాలి. కుటుంబంలో లింఛ్ సిండ్రోమ్ (వంశపారంపర్యంగా క్యాన్సర్లు వచ్చే కండిషన్) ఉన్న స్త్రీలు ముప్ఫై అయిదేళ్లు దాటినప్పటి నుంచి తప్పనిసరిగా గర్భాశయ, అండాశయ, పెద్దపేగుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌కి మందులు వాడుతున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్‌తో ఎప్పటికప్పుడు ఎండోమెట్రియం పొర గురించి తెలుసుకోవాలి -
కవల పిండాల క్యూట్ ఫైట్
-
వైరల్ వీడియో : ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు
బీజింగ్ : తోబుట్టువుల మధ్య పోట్లాట అనేది సహజం. ప్రతీ విషయానికి గొడవపడటం.. కొట్టుకోవటం కూడా కామనే. ఇదంతా బయట అంటే వారు పుట్టాక జరుగుతుంది. కానీ ఈ వీడియో చూస్తే.. తల్లి గర్భంలోనే ఈ తగదా ప్రారంభమవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలలు కూడా నిండని ఇద్దరు కవలలు అమ్మ పొట్టలోనే కిక్‌బాక్సింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కవల పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. ఈ సమయంలో ఆమె గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు ఒకరితో ఒకరు ఫైటింగ్ చేస్తూ కనబడ్డారు. అక్కడే ఉన్న ఆమె భర్త దీన్నంతా వీడియో తీశాడు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవ్వడమే కాక అనేక ప్రశంసలు అందుకుంటుంది. ‘తల్లి గర్భంలోనే ఇలా పోట్లాడుకుంటున్నారు.. ఇక బయటకు వచ్చాక ఇంకెంత తన్నుకుంటారో’.. ‘ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
నిరీక్షణ.. ఓ పరీక్ష!
ఆసుపత్రిని స్కాన్ చేయండి! ► ప్రహసనంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ► రేడియాలజిస్టుల కొరతతో అవస్థలు ► అందుబాటులే ఒక్కరే వైద్యురాలు ► గర్భిణుల అవస్థలు వర్ణనాతీతం ► గంటల తరబడి వేచి చూడాల్సిందే.. మహారాజశ్రీ జిల్లా కలెక్టర్ గారికి.. అయ్యా! మేము నిరుపేదలం. ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేం. నెలలు నిండడంతో ప్రసవ వేదన పడుతున్నాం. కొన్ని రకాల స్కానింగ్‌లు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. స్కానింగ్ థియేటర్‌కు ఉదయం 9 గంటలకు వస్తే 11 గంటలైనా పరీక్షలు చేయడం లేదు. సంబంధిత వైద్యులు రాకపోవడంతో మేమంతా వరుసలో నిల్చొని, అలసిపోతే కూర్చొని గంటల తరబడి నిరీక్షిస్తున్నాం. కూర్చోవడానికి బండ ఒక్కటే ఉండడంతో మా అవస్థలు వర్ణనాతీతం. మీరైనా మా బాధలు తీర్చండి. ఇట్లు, సర్వజనాస్పత్రిలో చికిత్సకు వచ్చిన గర్భిణులు. అనంతపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. నిరుపేదలకు పెద్దదిక్కుగా నిలిచే ఈ ఆసుపత్రిలో ఎక్కడికక్కడ నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలంటే గర్భిణులు, మూత్రపిండాల వ్యా«ధిగ్రస్తులు, కడుపునొప్పి బాధితులు చుక్కలు చూడాల్సి వస్తోంది. వైద్య సేవలు బాగుంటాయనే ఆశతో వచ్చే రోగులకు ఇక్కడి పరిస్థితితో పైప్రాణం పైనే పోతోంది. పేరుకు 500 పడకల ఆసుపత్రే అయినా.. ఇన్‌పేషెంట్లు 800 మందికి పైమాటే. రేడియాలజీ విభాగం పరిధిలోని ఎక్స్‌రే, సిటీ స్కాన్ల విషయం పెద్దగా సమస్య లేనప్పటికీ.. అల్ట్రాసౌండ్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ విభాగం హెచ్ఓడీ కృష్ణవేణి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత రేడియాలజిస్టు శారద ఇన్చార్జి బాధ్యతలు తీసుకోగా.. ఆమె కూడా బదిలీపై వెళ్లిపోయారు. మరో రేడియాలజిస్టు పద్మ అనధికారికంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ఇంకో రేడియాలజిస్టు వసుంధర సైతం గత 15 రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో భారమంతా డాక్టర్ దీప మోస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు సీనియర్ రెసిడెంట్ మధుబాబు ఉన్నా.. కేటాయించిన గడువు పూర్తి కావడంతో వెళ్లిపోయారు. ఇటీవల డాక్టర్ దీప సెలవు పెట్టడంతో ఒక రోజు స్కానింగ్‌ను సైతం నిలిపేయాల్సిన దుస్థితి తలెత్తింది. మధ్యాహ్నం దాటితే అంతే.. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందిస్తున్నారు. ఆ తర్వాత కాల్ డ్యూటీ పేరుతో వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర కేసులుంటే చాలా మంది బయట స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ సేవలకు ‘స్కానింగ్’ కట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు నిత్యం 300 మంది వరకు గర్భిణులు, మహిళలు వస్తుంటారు. గర్భంలో శిశువు ఎదుగుదల, లోపాలు గుర్తించాలంటే స్కానింగ్ తప్పనిసరి. అయితే వైద్యుల కొరత కారణంగా ప్రస్తుతం ఓపీ సేవలు నిలిపేశారు. గైనిక్ ఓపీకి వచ్చే వాళ్లు స్కానింగ్ చేయించుకోవాలంటే బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇతర సమస్యలతో ఇక్కడికొచ్చే వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది. జిల్లా కలెక్టర్ ఆసుపత్రిపై దృష్టి సారించి పరిపాలనను గాడిన పెట్టాలని రోగులు వేడుకుంటున్నారు. ఈమె పేరు కృష్ణకుమారి. పుట్లూరు మండలం సంజీవపురం. రెండో కాన్పు కోసం మూడు రోజుల క్రితం సర్వజనాస్పత్రికి వచ్చింది. రక్తం తక్కువగా ఉండడంతో వారం తర్వాత సిజేరియన్ చేస్తామన్నారు. శుక్రవారం అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవసరం కావడంతో ఆ విభాగం వద్దకొచ్చి ఇలా కూర్చుండిపోయింది. గుత్తికి చెందిన ఈమె పేరు లావణ్య. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే ఈనెల 26న డెలివరీ డేట్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో పరీక్ష చేసుకుంటే ఈనెల 4వ తేదీనే ప్రసవ తేదీ వచ్చింది. ఈ క్రమంలోనే నడుము నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేరింది. శుక్రవారం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వచ్చి గంటల తరబడి నిరీక్షించింది. డీఎంఈతో మాట్లాడుతున్నాం రేడియాలజిస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. హెచ్ఓడీల మీటింగ్ పెట్టి ఔట్ పేషెంట్స్ కేసులకు స్కానింగ్ రాయొద్దని చెప్పాం. ఇక్కడి సమస్యపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)తో మాట్లాడుతున్నాం. కర్నూలు ఆస్పత్రి నుంచి ఎవరినైనా పంపాలని కోరాం. సీనియర్ రెసిడెంట్స్నైనా పర్వాలేదన్నాం. – డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి ఆ ఇద్దరికీ సెలవు ఇవ్వలేదు రేడియాలజిస్టులు వసుంధర, పద్మలు సెలవు కావాలని కోరారు. ఇక్కడి పరిస్థితి దృష్ట్యా కుదరదని చెప్పాం. ఒకరు రిజిస్టర్ పోస్టులో పంపారు. మరొకరు నేరుగా ఇచ్చారు. ఇద్దరివీ తిరస్కరించాం. డ్యూటీలకు రాకపోవడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మెడికల్ కళాశాల. -
స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం బేబీకి మంచిదేనా? తెలియజేయండి. - సురేఖ, హైదరాబాద్ గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే. మొదటి ట్రైమిస్టర్లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది. ఇక రెండో ట్రైమిస్టర్లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి. ఇక మూడో ట్రైమిస్టర్లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్