బ్లీడింగ్ ఎక్కువగా అవుతోంది...
నా వయసు 37. ఇటీవల నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
- కాత్యాయని, విజయవాడ
పీరియడ్స్ సమయంలో రక్తం చాలా ఎక్కువగా పోతోందనడం చాలామంది చేసే ఫిర్యాదే. అయితే అది ఎక్కువా, తక్కువా అని నిర్ణయించడం కష్టం. ఎందుకంటే... నిర్ణీతంగా ఇంత పరిమాణంలో పోతే అది ఎక్కువని, లేదా ఇంత పోతే అది తక్కువని చెప్పడానికీ ప్రమాణాలేమీ లేవు. ఇలా రక్తం పోవడం అన్నది వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని బట్టి ఎవరికి వాళ్లు అది ఎక్కువా, తక్కువా అని నిర్ణయించుకోవచ్చు. కాకపోతే బ్లీడింగ్ ఎక్కువగా జరగడం అన్నది మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా మారినప్పుడు మాత్రం దానికి కారణమేమిటో తెలుసుకోవాలి. కొందరిలో ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.
సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం జరుగుతున్నా... దాన్ని క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యగా అనుమానించి, వైద్యపరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో అయితే మీ వయసు వారిని ఏడాదికోమారు పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తుంటారు.
మన దేశంలో ఇంకా అంత అవగాహన పెంపొందలేదు. అయితే ఈ పరీక్ష వల్ల దాదాపు 10 ఏళ్ల తర్వాత రాబోయే గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌ను ముందే కనుక్కుని పూర్తిగా చికిత్స చేయవచ్చు. మీ వయసుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అయినా రిస్క్ తీసుకోకుండా ఒకసారి మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోండి. కారణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి హార్మోన్ల చికిత్సతో లేదా ఇతరత్రా మార్గాల్లో ఈ సమస్యకు చికిత్స అందించవచ్చు.
డాక్టర్ సుశీల వావిలాల
ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్