ఓవరీలో సిస్ట్‌ ఉన్నవాళ్లకి సంతాన అవకాశం ఉండదా? | Family health counseling dec 05 2018 | Sakshi
Sakshi News home page

ఓవరీలో సిస్ట్‌ ఉన్నవాళ్లకి సంతాన అవకాశం ఉండదా?

Published Wed, Dec 5 2018 12:43 AM | Last Updated on Wed, Dec 5 2018 12:43 AM

Family health counseling dec 05 2018 - Sakshi

ఫెర్టిలిటీ కౌన్సెలింగ్స్‌

నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం స్కానింగ్‌ తీయిచాం. నా ఓవరీలలో సిస్ట్‌ ఉందని ఆ పరీక్షలో తేలింది. ఆ సిస్ట్‌ భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందని కొందరు అంటుంటే నాకు  ఆందోళనగా ఉంది. అలాగే సిస్ట్‌ ఉన్నవారికి సంతానం పొందే అవకాశాలు ఎలా ఉంటాయి. ఈ విషయాలపై నాకు సలహా ఇవ్వండి.  – శ్రీలత, కందుకూరు 
ఓవేరియన్‌ సిస్ట్‌ (అండాశయాల్లో నీటితిత్తులు) చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇది చాలా సాధారణ సమస్య. ఈ నీటితిత్తులు క్యాన్సర్‌ కణాలుగా మారవు. మీ వయసులో ఉన్న వాళ్లలో చాలామందిలో అవి కొద్దికాలం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీలా ఒవేరియన్‌ సిస్ట్స్‌ ఉన్న మహిళలు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తారు. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని అలా వాళ్ల  కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చి ఉంటే వారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒవేరియన్‌ సిస్ట్‌లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్‌  అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చాలా మందికి  సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్‌లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్‌ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. 
ఇక మీరు అడిగినట్లుగా మీ గర్భధారణ అవకాశాల విషయానికి వస్తే మీకు ఇంకా గర్భధారణ జరగకపోవడానికి ఏయే అంశాలు కారణమో పూర్తిగా తెలుసుకోవాలి. దాంతోపాటు మీలో వచ్చే సిస్ట్‌లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని  మీరు వీలైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి. 

ఎండో మెట్రియాసిస్‌ వస్తే పిల్లలు పుట్టే అవకాశాలుఉన్నాయా? 
నా వయసు 36 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లయి ఎమినిదేళ్లు అవుతోంది. పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్‌ను కలిశాను. డాక్టర్‌గారు నాకు ‘ఎండోమెట్రియాసిస్‌’ ఉందని నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్‌ ఆపరేషన్‌ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? అలాగే నాకు పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయా? – ఒక సోదరి, హైదరాబాద్‌ 
ఎండోమెట్రియాసిస్‌ చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది రావడం అన్నది చాలామంది మహిళల్లో చాలా సందర్భాల్లో కనిపించేదే.  కొంతమందిలో ల్యాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స తర్వాత ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇక కొంతమందిలో మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే లైఫ్‌స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా... అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా వంటి రిలాక్సేషన్‌ ప్రక్రియలతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతుండటం వంటి చర్యలతో నొప్పిని చాలావరకు నియంత్రణలో ఉంచవచ్చు. కానీ కొందరిలో నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో మళ్లీ గర్భధారణను కోరుకోని వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. అయితే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖలో మీరు రాసినదాన్ని బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్‌’ (అంటే గర్భధారణకు గల అవకాశాలను పరీక్షించే కొన్ని రకాల పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్‌/మైల్డ్‌ ఎండోమెట్రియాసిస్‌ ఉండటం వల్ల లాపరోస్కోపిక్‌ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల అయ్యేలా (ఒవ్యులేషన్‌)/ ఐయూఐ (ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌) వంటి ప్రక్రియలతో గర్భధారణకు తగిన అవకాశాలే ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్‌ (సివియర్‌ ఎండోమెట్రియాసిస్‌) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్‌ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతానసఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. çమీరొకసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి.

స్పెర్మ్‌  కౌంట్‌  జీరో అయితే పిల్లలు  పుట్టే  అవకాశాలే ఉండవా? 
నా వయసు 33 ఏళ్లు. నాకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల నేను వీర్య పరీక్ష చేయించుకుంటే అందులో శుక్రకణాలు లేవని తెలిసింది. ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వడండి. – ఎమ్‌. సురేశ్‌బాబు, కోదాడ 
పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేని కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. దీనికి శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన శుక్రకణాలు ప్రయాణం చేసే దారిలో ఏదైనా అడ్డంకి ఉండటం కారణాలు కావచ్చు. అయితే మీలాంటి కేసుల్లో మారుమారు ఇదే పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత మీరు కొన్ని వైద్య పరీక్షలు... అంటే హార్మోనల్‌ అల్ట్రాసౌండ్, క్యారియోటైపింగ్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కండిషన్‌కు తగిన కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. హార్మోనల్‌ సప్లిమెంట్స్‌ ద్వారా శుక్రకణాలు సంఖ్య పెంచవచ్చు. అప్పటికీ సాధ్యంకాకపోతే ఐవీఎఫ్‌ (టెస్ట్‌ట్యూబ్‌) విత్‌ టెస్టిక్యులార్‌ స్పెర్మ్‌ యాస్పిరేషన్‌తో చికిత్స చేయవచ్చు. అంటే ఈ ప్రొసిజర్‌లో నేరుగా టెస్టిస్‌ నుంచి శుక్రకణాలు సేకరిస్తారు. అయితే అన్ని కేసుల్లో ఇలా శుక్రకణాల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ మరికొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. వాటి పూర్తి వివరాల కోసం మీరు ఒకసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి.
డాక్టర్‌ రత్న దూర్వాసుల, 
సీనియర్‌ ఇన్‌ఫెర్టిలిటీ కన్సల్టెంట్, 
బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement