ఆ టైమ్‌లో గర్భం వస్తుందా? | Funday health councling | Sakshi
Sakshi News home page

ఆ టైమ్‌లో గర్భం వస్తుందా?

Published Sun, Sep 2 2018 1:22 AM | Last Updated on Sun, Sep 2 2018 1:22 AM

Funday health councling - Sakshi

నా వయసు 18. నేనింత వరకూ మెచ్యూర్‌ కాలేదు. డాక్టర్లకు చూపించే స్తోమత లేక అమ్మానాన్నలు నన్నిలా వదిలేశారు. ఒకవేళ నేను వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? నాకు కూడా అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని సుఖపడాలని అనిపిస్తోంది. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండే అవకాశం నాకు లేనే లేదా? రజస్వల కావాలంటే నేను ఏం చేయాలి? 
– మృణాళిని, ఖమ్మం

మీరు మీ ఎత్తు, బరువు రాయలేదు. సాధారణంగా అమ్మాయిలు పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు... వారి వారి బరువు, హార్మోన్ల నిష్పత్తిని బట్టి రజస్వల అవుతారు. పద్దెనిమిదేళ్లు దాటినా మీరు రజస్వల కాలేదు అంటే కచ్చితంగా ఏదో సమస్య ఉండి ఉండవచ్చు. థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రోలాక్టిన్‌ వంటి పలు హార్మోన్లలో లోపం... గర్భాశయం, అండాశయాలు లేకపోవడం లేదంటే వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యు పరమైన సమస్యలు, మరీ సన్నగా లేక లావుగా ఉండటం, గర్భాశయ టీబీ, యోనిభాగం మూసుకుపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా పదహారేళ్లు దాటిన తర్వాత కూడా మెచ్యూర్‌ కాకపోవడం జరుగుతుంది. మీకు పరిష్కారం చెప్పాలంటే ముందు మీలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దాన్నిబట్టి తగిన చికిత్స చేస్తే మీరు తప్పకుండా మెచ్యూర్‌ అవుతారు. అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. మీకు ఖర్చుపెట్టే స్తోమత లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉన్నాయి. అక్కడి గైనకాలజిస్టును సంప్రదిస్తే స్కానింగ్, రక్తపరీక్షల వంటివి ఉచితంగా చేస్తారు. కారణాన్ని బట్టి తగిన చికిత్స అందిస్తారు.

నాకు వైట్‌డిశ్చార్జి అవుతోంది. బ్లడ్‌ వస్తోంది. క్యాన్సర్‌ అని భయంగా ఉంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కావచ్చు అనే అనుమానం ఉంది. ఇది ఏ  వయసు వాళ్లకు వస్తుంది? మీ సలహా కోరుతున్నాను.
– వీఎన్, రాజోలు. 

వైట్‌ డిశ్చార్జి అవ్వడానికి సాధారణంగా ఇన్‌ఫెక్షన్స్, గర్భాశయ ముఖద్వారంలో పుండు, హార్మోన్లలో మార్పులు వంటివి ఇంకా ఇతర కారణాలు ఉండవచ్చు. అరుదుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) ఉండే అవకాశాలు ఉంటాయి. నీకు వైట్‌ డిశ్చార్జితో పాటు బ్లీడింగ్‌ అవుతుంది అంటున్నావు. దీనికి, గర్భాశయ ముఖద్వార పుండు, పాలిప్స్, గర్భాశయంలో కణితులు, సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్, ఇన్‌ఫెక్షన్స్, చాలా అరుదుగా గర్భాశయ క్యాన్సర్‌ కావొచ్చు. కాబట్టి నువ్వు డాక్టర్‌ను సంప్రదించి స్పెక్యులమ్‌ పరీక్ష, ప్యాప్‌స్మియర్‌ స్కానింగ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి. కానీ నీకు నువ్వే క్యాన్సర్‌ ఏమో అని ఊహించుకుని భయపడుతూ ఇంట్లోనే ఉంటే ఎలా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి, వ్యక్తిగత పరిశుభ్రతను బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి సెక్స్‌లో పాల్గొనే వారిలో ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే ఇది 80 శాతం వరకు సెక్స్‌ ద్వారా, హ్యూమన్‌ ప్యాపిలోమా అనే వైరస్‌ ఎక్కువ రోజులు గర్భాశయ ముఖద్వారంలో చేరడం ద్వారా సంక్రమిస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కచ్చితంగా ఈ వయసు వారికే రావాలని ఏమీ లేదు. 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరికైనా రావచ్చు. ఈ వైరస్‌ వల్ల వచ్చే క్యాన్సర్‌ని చాలావరకు అరికట్టడానికి ఇప్పుడు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. ఈ క్యాన్సర్‌ వచ్చే 5–10 సంవత్సరాల ముందే మార్పులను ప్యాప్‌స్మియర్‌ అనే పరీక్ష ద్వారా తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. 

పీరియడ్స్‌ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఉందా? గర్భం దాల్చడానికి సురక్షితమైన సమయం ఏది? వివరంగా తెలియజేయగలరు.
– ఎన్‌ఆర్, తాడిపత్రి, అనంతపురం.

పీరియడ్స్‌ నెలనెలా సక్రమంగా వచ్చేవారికి బ్లీడింగ్‌ మొదలైన రోజును మొదటిరోజు కింద లెక్కపెడితే, 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కలవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీర్యకణాలు 48 నుంచి 72 గంటల వరకు ఉత్తేజంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల కొంతమందిలో కొన్నిసార్లు అండం ఆలస్యంగా 16 రోజుల తర్వాత కూడా ఎప్పుడైనా విడుదల కావొచ్చు. పీరియడ్స్‌ సక్రమంగా రాని వారిలో అండం ఎప్పుడు విడుదల అవుతుంది, అసలు అవుతుందా లేదా అని చెప్పడం కష్టం. కాబట్టి పీరియడ్స్‌ సమయంలో కలవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఉండవు. 
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement