చికెన్‌పాక్స్ ఉన్న స్టూడెంట్‌తో మాట్లాడాను... నాకు సోకుతుందా?
నా వయసు 25. ఇప్పుడు నేను ఐదోనెల గర్భిణిని. టీచర్‌గా పనిచేస్తున్నాను. మా క్లాస్‌లో ఒక అబ్బాయికి చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) సోకింది. తగ్గేవరకు స్కూల్‌కు రావద్దని చెప్పినా... కాసేపు అతడితో మాట్లాడాల్సి వచ్చింది. అప్పట్నుంచి చికెన్‌పాక్స్ నాకు కూడా అంటుకుంటుందేమోమోనని ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వగలరు.
- సునందిని, హైదరాబాద్
చికెన్‌పాక్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వెరిస్టెల్లా హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ వల్ల సోకుతుంది. చిన్నపిల్లల్లో ఇది చాలా సహజం. చిన్నప్పుడు దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెద్దల్లో వస్తే మాత్రం దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. చికెన్‌పాక్స్ వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు శ్వాసతీసుకునే సమయంలో వెలువడే తుంపర్ల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. సాధారణంగా ఐదు నిమిషాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల గాని, 15 నిమిషాల పాటు చికెన్‌పాక్స్ ఉన్నవారితో ఒకే గదిలో ఉండటం వల్ల గాని ఇది సోకే అవకాశాలు ఉంటాయి.
నిజానికి మీరు చికెన్‌పాక్స్ వచ్చిన పిల్లాడితో కాసేపు మాట్లాడారు. అయితే చికెన్‌పాక్స్ వచ్చిన రెండు లేదా మూడోరోజుకుగాని అవి శరీరంపై పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలో బయటపడవు. కానీ అది సోకినవారిలో శరీరంపై పొక్కులు రావడానికి రెండు రోజుల ముందునుంచే వారు దీన్ని మరొకరికి వ్యాప్తి చేయగల స్థితిలో ఉంటారు. అందుకే మనకు తెలియకుండానే దీనికి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. చికెన్‌పాక్స్ సోకగానే మొదట జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత రెండు రోజులకు అవి తగ్గాక గానీ శరీరంపై చికెన్‌పాక్స్ పొక్కులు కనిపించవు. శరీరంపై పొక్కులు వచ్చాక అది మరింత వేగంగా వ్యాప్తిచెందడానికి అవకాశం ఎక్కువ.
సాధారణంగా చికెన్‌పాక్స్ అన్నది రెండు వారాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఆ వైరస్ వారి నరాల చివర్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ తర్వాత వారు ఎప్పుడైనా బలహీనపడ్డా లేదా వారిలో వ్యాధినిరోధకశక్తి క్షీణించినా అది బయటపడుతుంది. ఇలా రెండోసారి పునరావృతమయ్యే చికెన్‌పాక్స్‌ను షింగిల్స్ అంటారు. షింగిల్స్‌లో చికెన్‌పాక్స్‌తో పోలిస్తే మరి కాస్త తీవ్రత ఎక్కువ.
నిజానికి చిన్నప్పుడే చికెన్‌పాక్స్ సోకిన వారు మళ్లీ ఆ వ్యాధిగ్రస్తులతో ఎంత సన్నిహితంగా గడిపినా వారికి చికెన్‌పాక్స్ సోకదు. కాకపోతే అది చిన్నప్పుడు వచ్చిందో, రాలేదో తెలియదు కాబట్టి... గతంలో అది వచ్చి ఉందా అని నిర్ధారణ చేయడానికి ఒక రక్తపరీక్ష చేస్తారు. దానికి సంబంధించిన యాంటీబాడీస్ సహాయంతో అది గతంలో వచ్చిందా రాలేదా అన్న విషయం తెలుస్తుంది. చిన్నప్పుడే ఆ వ్యాధి వచ్చి ఉన్నవారు ఇకపై దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒకసారి వస్తే ఇక జీవితకాలం ఇమ్యూనిటీని ఇస్తుంది. అయితే ఒకవేళ రాకపోతే వారికి వారిస్టెల్లా జోస్టర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ప్యాసివ్ ఇమ్యూనైజేషన్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ కూడా చికెన్‌పాక్స్ ఉన్నవారికి ఎక్స్‌పోజ్ అయిన నాటి నుంచి 10 రోజుల లోపు ఇవ్వాలి.
చికెన్‌పాక్స్‌కు యాక్టివ్ ఇమ్యూనైజేషన్‌గానూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే అది గర్భవతులకు ఇవ్వడానికి వీలుకాదు. కాకపోతే గర్భం రాకముందు మాత్రం తీసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒకసారి మీరు మీ డాక్టర్‌ను సంప్రదించండి.
డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్