Chicken Pox
-
ఎంపాక్స్‌పై భయం వీడండి
చికెన్‌పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహా వ్యాధి ఎంపాక్స్. కరోనా వైరస్ మాదిరిగా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇన్ఫెక్షన్కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. దేశంలో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ శ్రీనాథ్రెడ్డిసాక్షి, అమరావతి: మూడేళ్ల కిందటే ఎంపాక్స్ వ్యాప్తి ఆఫ్రికాలో ప్రారంభమైంది. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయితే ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకే ఈ వ్యాధి పరిమితం కావడం, త్వరగా నియంత్రణలోకి రావడంతో పెద్ద ప్రమాదం లేదని గుర్తించి ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఆ సమయంలో భారత్‌లోని కేరళ రాష్ట్రంలో పరిమిత సంఖ్యలో కేసులు నమోదైయ్యాయి. మళ్లీ తిరిగి ఇప్పుడు ఎంపాక్స్ కారక వైరస్‌లలోని క్లేడ్ 1బీ అనే కొత్త రకం వేరియంట్ రూపంలో ప్రమాదకరంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తికి ఆఫ్రికా కేంద్ర బిందువు కాగా, గల్ఫ్, యూరప్ నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి పెరుగుతోంది. ఎందుకంటే ఆఫ్రికా దేశాలకు గల్ఫ్, యూరప్‌ల నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో వైరస్ ప్రాథమిక వ్యాప్తి ఆఫ్రికాలో, రెండో దశ వ్యాప్తి యూరప్, గల్ఫ్లలో, మూడో దశలో ఇతర దేశాల్లో ఉంటోంది. మన పక్కనున్న పాకిస్తాన్లో వెలుగు చూసిన కేసుల్లో వ్యాధిగ్రస్తులు గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా తేలింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంపాక్స్‌పై అప్రమత్తమైంది. విమాన, నౌకాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించింది.స్మాల్‌పాక్స్‌తో దగ్గరి సంబంధంభారత్తో పాటు, ప్రపంచ దేశాలను ఒకప్పుడు స్మాల్‌పాక్స్(మశూచి) ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. స్మాల్‌పాక్స్‌కు ఎంపాక్స్‌కు దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ రెండు వ్యాధులు ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినవే. ఎలుకలు, ఉడతలు, కుందేలు వంటి జంతువుల నుంచి మనుషులకు ఎంపాక్స్ సోకినట్లు మూడేళ్ల కిందటే నిర్ధారించారు. దీన్ని మంకీపాక్స్ అని పిలవడం కూడా సరికాదు. 1978 వరకూ ప్రపంచ వ్యాప్తంగా స్మాల్‌పాక్స్‌కు వ్యాక్సినేషన్ చేశారు. ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించినట్లు డబ్ల్యూహెచ్‌వో, ఇతర సంస్థలు ప్రకటించడంతో 1980 తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. కాగా, స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎంపాక్స్ నుంచి రక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌పై చర్చలుఎంపాక్స్ నియంత్రణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరమా? అనేదాని మీద ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ తిరిగి తయారు చేయాలా? లేదా అటువంటి వ్యాక్సిన్‌ను తయారు చేయాలా అనేదాని మీద ఆలోచనలున్నాయి. ఎంపాక్స్‌కు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా, జర్మనీలో వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తరహాలో పెద్ద ఎత్తున అందుబాటులో ఈ వ్యాక్సిన్ ఉండదు. సన్నిహితంగా మెలగడం ద్వారానే..కోవిడ్ మాదిరిగా గాలి ద్వారా ఎంపాక్స్ వ్యాపించదు. లైంగిక సంబంధం, ఇన్ఫెక్షన్కు గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికే వ్యాధి సోకుతుంది. అదే విధంగా వ్యాధిగ్రస్తుల నోటి తుంపరలు, ఉమ్ము, శరీర స్రావాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. చర్మం మీద గీసుకుపోయిన, గాయాలు, పుండ్లున్న ప్రాంతంలో వ్యాధిగ్రస్తుల స్రావాలు పడినా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా, పెద్దల్లో అరుదుగా చికెన్ పాక్స్‌ను చూస్తుంటాం. చికెన్ పాక్స్(ఆటలమ్మ, అమ్మవారు) తరహాలోనే ఎంపాక్స్ సోకిన వారిలో కూడా చర్మం మీద పొక్కులు వస్తాయి.అయితే ఎంపాక్స్ సోకిన వారికి అరికాళ్లు, అరచేతుల్లో కూడా పొక్కులు వస్తాయి. అదే విధంగా మల, మూత్ర విసర్జన భాగాలు, కళ్లు, నోరు, ఇలా శరీరంలోని అన్ని భాగాల్లో పొక్కులు ఏర్పడతాయి. దీంతో పాటుగా జ్వరం, తీవ్ర అలసట, గొంతు నొప్పి, తల, కీళ్లు, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడం వంటివి జరుగుతాయి. వైరస్ సోకిన వారిలో 5 నుంచి 21 రోజుల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి.విమానాలు, నౌకల ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్ క్యారియర్లుగా ఉంటారు. ఈ క్రమంలో విమాన, నౌకాయానం ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి. విమానాశ్రయం, నౌకాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఎదుటి వ్యక్తి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా నోటి తుంపరలు మీద పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో వ్యక్తుల నుంచి ఎడం పాటించాలి. మాస్క్ ధరించడం ఉత్తమం. సాధారణ ప్రజలు సైతం ఎదుటి వారితో మాట్లాడేప్పుడు సన్నిహితంగా మెలగకూడదు. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి -
అనారోగ్యంతో బాధపడుతున్న కస్తూరి, స్వయంగా వెల్లడించిన నటి
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను తరచూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తాను అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తన వ్యాధి గురించి చెబుతూ కస్తూరి వాపోయింది. అలాగే ఆ వ్యాధి తనపై ఎంతగా ప్రభావం చూపిందో పేర్కొంటూ ఫొటోలను షేర్ చేసింది. ‘ప్రస్తుతం చికెన్ పాక్స్‌తో(అమ్మావారు) బాధపడుతున్నా. ఈ వ్యాధి సోకడంతో నా శరీరమంతా వికృతంగా మారింది. నా ముఖం, శరీరంపై ఈ చికెన్ పాక్స్ మచ్చలు చూడండి ఎలా ఉన్నాయో. అదృష్టవశాత్తు నా కళ్లపై వాటి ప్రభావం చూపలేదు. ఇందుకు చికెన్ పాక్స్‌కి కృతజ్ఞురాలిని. ఎప్పటి లాగే నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ(అభిమానులు) ప్రేమ, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నా. ఎంతోకాలంగా సంరక్షించుకుంటున్నా నా మృదువైన చర్మం ఇప్పుడు మచ్చలు, మొటిమలతో ఇబ్బందిగా మారింది’ అంటూ ఆమె రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) -
యూపీ పాఠశాలలో 9 మంది విద్యార్థులకు మంకీపాక్స్.. లక్షణాలివే..!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బలియా జిల్లాలో చికెన్‌పాక్స్ కలకలం రేపింది. గోవింద్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సహా 9 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఈ విద్యార్థుల్లో కొద్దిరోజుల క్రితం నుంచే చికెన్‌పాక్స్ లక్షణాలు కన్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒంటిపై, మొహంపై దద్దుర్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. వీరందరికీ చికెన్‌పాక్స్ సోకిందనని శుక్రవారం నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వెంటనే వారికి చికిత్స ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. చికెన్ పాక్స్ లక్షణాలు.. ► తీవ్రమైన జ్వరం ► గొంతులో ఇబ్బందిగా అన్పించడం ► ఒళ్లుమొత్తం ఎర్రటి దద్దుర్లు ► తలనొప్పి ► దురద చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
మంకీపాక్స్-చికెన్‌పాక్స్ తేడాలు తెలుసా?
కరోనా కథ తగ్గుముఖం పడుతుందనుకున్న టైంలో.. మంకీపాక్స్ వైరస్ కలకలం మొదలైంది. కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యిందనుకున్న ఈ వైరస్.. యూరప్, అమెరికా ఖండాల్లో కేసులతో కలకలం రేపుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ కేసులు వెలుగు చూస్తుండడం, తాజాగా కేరళలో ఒక మరణం నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో కలకలం.. అంటూ నిత్యం ఏదో మూల దేశంలో ఇప్పుడు ఇది వినిపిస్తోంది. దీనికి తోడు వ్యాధి లక్షణాలు కనిపించిన వాళ్లకు.. మంకీపాక్స్ సోకిందేమో అని అధికారులు హడలిపోతుండడం, వైరస్ నిర్ధారణకు శాంపిల్స్‌ను పంపిస్తుండడం.. చూస్తున్నాం. అయితే నెగెటివ్‌గా తేలిన కేసులన్నీ చాలావరకు చికెన్‌పాక్స్ కావడం ఇక్కడ అసలు విషయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రాజస్థాన్, యూపీ.. ఇలా చాలా చోట్ల వైరస్ భయంతో పరీక్షించగా.. నెగెటివ్‌గా తేలడం, అవన్నీ చికెన్‌పాక్స్ కేసులు కావడం గమనార్హం. అయితే.. మంకీపాక్స్ లక్షణాలు చాలా వరకు చికెన్ పాక్స్ తరహాలోనే ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. వర్షాల నేపథ్యంలో చికెన్ పాక్స్ విస్తరిస్తుండడంతోనే ఇదంతా. పైగా లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. చికెన్ పాక్స్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుండడమే అందుకు కారణం. రెండింటి తేడా తెలుసుకుంటే.. కొంతవరకు ఆందోళన తగ్గవచ్చు. చికెన్ పాక్స్ లక్షణాలు ► ముందుగా చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► ఆ తర్వాత జ్వరం లక్షణం కనిపిస్తుంది. ► చికెన్ పాక్స్ లో దద్దుర్లు కాస్త చిన్నగా ఉంటాయి. విపరీతంగా దురద ఉంటుంది. ► అరచేతులు, పాదాల దిగువన దద్దుర్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువ. ► చికెన్ పాక్స్ వల్ల ఏర్పడే దద్దుర్లు..పొక్కులు ఏడెనిమిది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. మంకీపాక్స్ లో .. ► మంకీపాక్స్ సోకిన వారిలో ముందుగా జ్వరం, తలనొప్పి, కొందరిలో దగ్గు, గొంతు నొప్పి, లింఫ్ నాళాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ► సుమారు నాలుగు రోజుల తేడాలో చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. ► మంకీపాక్స్‌లో దద్దుర్లు పెద్దగా ఉంటాయి. దురద ఎక్కువగా ఉండదు. ► పొక్కులు ముందుగా చేతులు, కళ్ల వద్ద ఏర్పడి.. తర్వాత శరీరమంతా విస్తరిస్తాయి. ► మంకీ పాక్స్ లో అర చేతులు, పాదాలపైనా దద్దర్లు వస్తాయి. ► చాలా మందిలో 21 రోజుల వరకు కూడా అవి ఏర్పడుతూనే ఉంటాయి. ► జ్వరం కూడా ఎక్కువ రోజుల పాటు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇక.. ఆందోళన వద్దు, కానీ.. మంకీ పాక్స్, చికెన్ పాక్స్ రెండూ కూడా ప్రమాదకరం కాదని, మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెండింటిలో దేని లక్షణాలు గుర్తించినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి వ్యక్తుల రోగ నిరోధక శక్తిని(ఇమ్యూనిటీ) బట్టి లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఏ అనారోగ్యమైనా సరే కచ్చితంగా వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
వెన్నులో వైరస్ల వణుకు.. ఒకటి పోతే మరొకటి!
వానాకాలం రాకుండానే రకరకాల వైరస్ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్ కేసులు దడపుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంకీ పాక్స్ అనుమానిత కేసు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు కరోనా వైరస్ మరోసారి విజృంభించి ఫోర్త్ వేవ్ ఉధృతమవుతుందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కరోనా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతోంది. రోజువారి పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పైగా నమోదైంది. గత 24 గంటల్లో 4,270 కేసులు నమోదయ్యాయి. క్రియా కేసుల సంఖ్య 24 వేలు దాటేసింది. ప్రముఖులు చాలా మంది కరోనా బరిన పడతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీకి కరోనా సోకగా, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ –19 నిబంధనల్ని పాటిస్తూ ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు మహారాష్ట్ర మాస్కులు ధరించాలని కోరుతుండగా కేంద్రం అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని, టీకా సాయంతోనే దేశం కరోనా నుంచి గట్టెక్కుతోందని అంటోంది. వెస్ట్ నైల్ రకరకాల వైరస్‌లకు పుట్టినిల్లు అయిన కేరళలో వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి త్రిశూర్‌కు చెందిన 47 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. వైస్ట్ నైల్ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ వ్యాధి తీవ్రంగా సోకితే ప్రాణాలు పోవడం ఖాయం. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం కాస్త తక్కువగా ఉంటుంది. 150 మందిలో ఒకరికి ఈ వైరస్ అత్యంత తీవ్రమైన వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రమైతే జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దవడల దగ్గర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కూడా వచ్చిన వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వైరస్ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. కేరళలో టమాటా వైరస్, నిఫా వైరస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చి ఆందోళనని పెంచుతున్నాయి. మంకీపాక్స్ ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ సోకిందన్న అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పట్నా నుంచి ఘజియాబాద్‌కు వచ్చిన ఆ అమ్మాయి శరీరం మీద దద్దుర్లు చూసి వైద్యులకు మంకీ పాక్స్ సోకిందేమోనన్న అనుమానం వచ్చింది. అందుకే శాంపిల్స్‌ను పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపి ఆ అమ్మాయిని క్వారంటైన్లో ఉంచినట్టుగా ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ బిపి త్యాగి వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ మాదిరిగానే మంకీ పాక్స్ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. స్మాల్ పాక్స్‌కు ఇచ్చే టీకాలు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెప్పారు. చికెన్‌పాక్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చికెన్‌పాక్స్ వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఛత్తర్పూర్, చింద్వారా, దాటియా, నీమచ్, భోపాల్, ధార్, ఖండ్వా జిల్లాల్లో 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి అత్యత వేగంగా అంటుకునే లక్షణం కలిగిన వ్యాధి కావడంతో చిన్నారులు, గర్భిణులు, టీనేజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్ సర్కార్ అన్ని జిల్లా కేంద్రాలను అప్రమత్తం చేసింది. కరోనా హాట్‌స్పాట్‌గా కరణ్ బర్త్‌డే ? బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మే 25న తన 50వ పుట్టిన రోజు వేడుకల్ని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఘనంగా చేశారు. ఈ పార్టీకి షారూక్‌ఖాన్ దగ్గర్నుంచి జాన్వికపూర్ వరకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కోవిడ్–19 బారిన పడ్డారన్న వార్తలు బీ టౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని వెల్లడించారు. హీరోయిన్లు కత్రినా కైఫ్, అదితి రాయ్‌లు కూడా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. పార్టీకి హాజరైన వారిలో చాలా మంది తమకు కరోనా సోకినట్టు బహిరంగంగా వెల్లడిం చలేదని, కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ కోవిడ్ –19 సూపర్ స్ప్రెడర్గా మారిందని బాలీవుడ్ హంగా మా ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అయితే కరణ్ జోహార్ టీమ్ ఈ విషయాన్ని ఖండిస్తోంది. ముం బైలో కేసులు పెరుగుతూ ఉండడంతో వారందరికీ కరోనా సోకి ఉండవచ్చునని వాదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డెల్టాప్లస్.. ఆటలమ్మ కంటే వేగం
న్యూయార్క్: చికెన్‌పాక్స్(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్ సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) హెచ్చరించినట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ తీసుకోనివారిలో వ్యాపించినంత వేగంగానే, టీకా తీసుకున్నవారికి కూడా అంతేవేగంగా డెల్టా సోకవచ్చని సీడీసీ తెలిపింది. టీకా తీసుకోని వారి ముక్కు, గొంతులో ఎంత వైరల్ లోడు ఉంటుందో, టీకా తీసుకున్న వారిలో నూ అంతే లోడుంటుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్ వాలెన్‌స్కై చెప్పారు. అలాగే ఆల్ఫా వేరియంట్ బాధితుల్లో ఉండే వైరల్ లోడు కన్నా 10 రెట్లు అధిక లోడు డెల్టా వేరియంట్ సోకినవారిలో గమనించినట్లు సీడీసీ తెలిపింది. మెర్స్, సార్స్, ఎబోలా, జలుబు, స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా సోకుతుందని తెలిపింది. అమెరికాలో టీకా తీసుకున్న వారిలో సైతం డెల్టా సోకినట్లు్ల సీడీసీ పేర్కొంది. వివిధ రాష్ట్రాల గణాంకాలను విశ్లేషించి సీడీసీ ఈ పత్రాన్ని రూపొందించింది. ప్రతి చోటా ప్రతి ఒక్కరూ మరలా మాస్కులు ధరించడం మంచిదని రొచెల్ సూచించారు. ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. టీకా తీసుకున్నవారు సైతం డెల్టా వ్యాప్తికి కారకులు కావడం ఆందోళనకరమైన విషయమని మరో సైంటిస్టు వాల్టర్ ఓరెన్స్టైన్ చెప్పారు. అయితే డెల్టా సోకినా సరే టీకా తీసుకున్నవారు సురక్షితంగా ఉన్నట్లేనన్నారు. టీకా వల్ల వ్యాధి తీవ్రత 90 శాతం వరకు తగ్గుతుందని, అందువల్ల వీరు తీవ్ర అనారోగ్యం పాలయ్యేందుకు, లేదా తీవ్ర వ్యాప్తికి కారణమయ్యేందుకు ఛాన్సులు తక్కువన్నారు. -
డెల్టా వేరియంట్‌పై షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మూడో వేవ్ ముంచుకొస్తోందన్న ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ‘డెల్టా వేరియంట్’ పై తాజా నివేదిక మరింత ఆందోళన పుట్టిస్తోంది. ఇది ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని, అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని యూఎస్ హెల్త్ అథారిటీని ఉటంకిస్తూ అక్కడి మీడియా నివేదించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇంకా ప్రచురితం కాని డేటా ప్రకారం భారతదేశంలో ముందుగా గుర్తించిన డెల్టా వేరియంట్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించాయి. డెల్టా సోకిన వ్యక్తిలో వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది. దీనిపై శుక్రవారం సీడీసి అదనపు డేటాను ఏజెన్సీ ప్రచురిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తోందని, వ్యాక్సిన్ల రక్షణ వలయం కూడా దీన్ని అడ్డుకోలేదని, మరింత విధ్వంసకరంగా విజృంభించే ప్రమాదముందని సీడీసీ వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, వారి ముక్కు, గొంతులో ఎంత వైరస్ ఉంటుందో, వ్యాక్సిన్ తీసుకోని వారిలో కూడా అంతే వైరల్ లోడ్ ఉంటుందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ పీ వాలెన్స్కీ వెల్లడించారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువనీ, మెర్స్, సార్స్, ఎబోలా, కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైరస్ల కన్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌తో చాలా తీవ్రమైన ముప్పు అని వస్తున్న డేటాతో ఆందోళన రేపుతోందని, దీనిపై తక్షణమే గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నారు. అందుకే అందరూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇతరులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని వాలెన్స్కీ చెప్పారు. కాగా అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారితో వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు తాజాగా తేలింది. దీంతో అందరూ మాస్క్ ధరించాలని సీడీసీ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. టీకా వైరస్ తీవ్రతను 90 శాతం అడ్డుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ లేదా ట్రాన్స్‌మిషన్‌ను నివారించడంలో తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు అని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇతర కేసులతో పోలిస్తే వైరల్ లోడ్ అధికంగా ఉందనీ, ఆల్ఫా వేరియంట్ సోకినవారు గాలిలోకి వదిలే లోడ్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుదలయ్యే వైరల్ లోడ్ పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీడీసీ అంచనా వేసింది. -
జనాలతో..ఆటలమ్మ
గరివిడి (చీపురపల్లి) : గరివిడి మండలం కొండదాడి గ్రామంలో చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) విజృంభిస్తోంది. సరాసరి రోజున 5 నుంచి ఆరుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రస్తుతం 100 మందికి పైగా ఆటలమ్మ బాధితులు ఊర్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రతీ ఇంట్లోనూ ఇద్దరు ముగ్గురు బాధితులు ఉన్నారని పేర్కొంటున్నారు. తొలుత నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వారికి ఎలాగోలా తగ్గినా ఆ రోజు నుంచి వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం మొదలైంది. ఊపందుకున్న పుకార్లు.. ఊరంతా అమ్మవారి బారిన పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది గ్రామ దేవత పండగను సరిగా నిర్వహించకపోవడం వల్లే అమ్మవారు ఉగ్రరూపం దాల్చి ఇలా ప్రతాపం చూపిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు. అయితే బాధితుల బాధలు మాత్రం వర్ణనాతీతం. ఇంటి చిట్కాలు, నాటు వైద్యం పాటించి సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. మూఢ నమ్మకాలను పట్టుకుని అశాస్త్రీయ పద్ధతిలో చికిత్సలు చేయించుకుంటుండడంతో వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడమే కాక మరింత మందికి వ్యాపిస్తోంది. పీహెచ్‌సీకి వెళ్లినా.. కొంతమంది వైద్యం కోసం బొండపల్లి పీహెచ్సీ గడప తొక్కినా అక్కడి వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదు. నిజానికి విషయం తెలుసుకోగానే వైద్యులు అప్రమత్తమై సకాలంలో వైద్య సేవలందించాలి. శాస్త్రీయ పద్ధతుల వైద్యాన్ని వారికి పరిచయం చేయాలి. కానీ ఇప్పటివరకు అలాంటిది జరిగిన దాఖలాలు లేవు. వైరస్ ద్వారా వ్యాపించే చికెన్ పాక్స్ వేసవి వాతావరణం అనుకూలంగా ఉండడంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇతర గ్రామాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించాలి.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగ జేసుకుని వ్యాధి బారినుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మొదట్లోనే వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించి ఉంటే బాగుండేదని, ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఒక సారి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించలేదని చెబుతున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన మంత్రి సూర్యనారాయణ, మంత్రి వసంత, వినయ్, మండాది అప్పయ్యమ్మ, బార్నాల తవుడమ్మ, మండాది రాము, బంగారమ్మ తదితర 100 మంది రోగులు వ్యాధితో మంచం పట్టారు. పీహెచ్సీ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. బొండపల్లి పీహెచ్సీ అధికారులు ఆటలమ్మ వ్యాధితో బాధపడుతూ వెళ్తే పట్టించుకోవడం లేదు. కొంత మంది సిబ్బందికి ఆటలమ్మ వ్యాధి సోకిందన్న విషయమే తెలియదు. ఏదో రెండు నెలలకోసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారే తప్ప గ్రామంలో సమస్యలు పట్టించుకోవడం లేదు. – కొండదాడి వాసులు. నా దృష్టికి రాలేదు.. కొండదాడిలో ఆటలమ్మ విజృంభిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. రాజకీయ నాయకులు, ప్రజలు ఎవరైనా వచ్చి చెబితే చర్యలు తీసుకునేదాన్ని. స్థానిక నేతలను అడిగి వివరాలు తెలుసుకుని, చర్యలు తీసుకుంటా. – ఎన్.భార్గవి, బొండపల్లి పీహెచ్సీ వైద్యాధికారి. -
చేటుచేయదు... ఆటలమ్మ
చికెన్‌పాక్స్ ఇప్పుడు చికెన్‌పాక్స్ కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు. ఆటలాడే వయసులో చిన్నారుల్లో కనిపిస్తుందిది. కేవలం చిన్నపిల్లల్లోనే కాదు... అప్పుడప్పుడు పెద్దలూ, గర్భవతులకూ వస్తుంది. అయితే పిల్లల్లో వస్తే తీవ్రత ఒకింత తక్కువ. సాధారణంగా చికెన్‌పాక్స్ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, అరుదుగా దుష్ప్రభావాలనూ తెస్తుంది.ఇది వస్తే స్నానం చేయించవచ్చా, కూడదా... లాంటి అనేక సందేహాలనూ రేకెత్తిస్తుంది. ఈ వ్యాధి ప్రభావాలపై అవగాహనతో పాటు అపోహల నివృత్తి కోసమే ఈ కథనం. చికెన్‌పాక్స్... ఇప్పుడు సాధారణ జలుబు, ఫ్లూ లాగే ఎక్కువగా కనిపిస్తోంది. అందునా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో మరీ ఎక్కువ. చికెన్‌పాక్స్ అన్నది అన్ని ఆర్థిక, సామాజిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. ఇది రెండు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటువ్యాధులలో చికెన్‌పాక్స్ చాలా సాధారణంగా కనిపించే వైరస్. వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల ఇది వస్తుంది. మొదట ఒకసారి వచ్చి ఉన్నా లేదా దీని కోసం వ్యాక్సిన్ తీసుకొని ఉన్నా మళ్లీ మరోసారి ఇది రావడం చాలా తక్కువ. కానీ అంతవరకూ ఎప్పుడూ చికెన్‌పాక్స్‌కు గురికాని వారిలో ఇది కనిపిస్తుంది. చికెన్‌పాక్స్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపిస్తుంటుంది. ఇది వచ్చిన వారి ఒంటిపై పొక్కులు, దద్దుర్ల వంటివి (బ్లిస్టర్స్) కనిపిస్తాయి. ఇది సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి, తుప్పర్ల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. తగ్గడమూ ఒకింత కష్టమవుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? ⇒ఇది సోకిన వారిలో కొన్ని నీటిపొక్కుల వంటివి, మరికొంత ర్యాష్ వంటిది ఒంటి మీద కనిపిస్తుంది. జ్వరం ∙ఆకలి తగ్గుతుంది తలనొప్పి ⇒దగ్గు గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తొలుత జ్వరంతో మొదలై ఆ తర్వాత తల నుంచి ప్రారంభించి, కిందివైపునకు ఈ దద్దుర్లు వస్తూ, పెరుగుతూ పోతుంటాయి. ⇒ర్యాష్ కనిపించిన తర్వాత నాలుగు –ఐదు రోజుల తర్వాతి నుంచి తమ నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. ఈ ర్యాష్లో కాస్తంత దురదగా కూడా ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా చూసుకోవాలి. పెద్దలైతే కార్యాలయం/కార్యస్థలం నుంచి దూరంగా ఉండాలి. ఒంటి మీద వచ్చే ఈ దద్దుర్ల వంటివి దశల వారీగా వస్తున్నట్లుగా కనిపిస్తాయి. మొదట వచ్చిన ఎర్రటి దద్దుర్లు ఒకటి నుంచి రెండు రోజుల్లో తగ్గుతాయి. ఆ తర్వాత వచ్చిన దద్దుర్లు మెల్లగా తగ్గడం మొదలుపెట్టినట్లుగా ఎండిపోతూ ఉంటాయి. ఐదు నుంచి ఏడు రోజుల పాటు ప్రతిరోజూ ఇలా కొత్త కొత్త దద్దుర్లు (బ్లిస్టర్స్) కనిపిస్తూనే ఉంటాయి. పదిరోజుల్లో ఇవన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఆ తర్వాత మాత్రమే పిల్లలను స్కూల్‌కు పంపడం మొదలు పెట్టాలి. వచ్చిన పొక్కుల వంటి దద్దుర్లు మానుబట్టాక మాత్రమే పెద్దలు కూడా కార్యాలయానికి వెళ్లాలి. నిర్ధారణ ఎలా? ⇒దద్దుర్లనూ, వాటి తీరును చూడగానే డాక్టర్లు/పెద్దలు వాటిని గుర్తించి చికెన్‌పాక్స్‌ను నిర్ధారణ చేస్తారు. అవసరమైతేనే ల్యాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేయాల్సి వస్తుంది. వ్యాధి తీరుతెన్నులు : దాని మానాన దాన్ని వదిలేసినా చికెన్‌పాక్స్ వచ్చి, ఆ తర్వాత తనంతట తానే తగ్గిపోతుంది. అయితే కేవలం వ్యాధి కలిగించే బాధ నుంచి, ఆ దద్దుర్ల దురద నుంచి ఉపశమనం కలిగించడానికీ, వ్యాధి కలిగించే బాధ నుంచి, తర్వాత్తర్వాత మరిన్ని కాంప్లికేషన్లు రాకుండా ఉండటానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి డాక్టర్లు మందులను సూచిస్తారు. ఇక మంచి మృదువైన కాటన్ దుస్తులను ధరించడం ద్వారా దద్దుర్లు కలిగించే అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒంటిపై ఎలాంటి వాసన లేని కాలమైన్ లోషన్‌ను రాసుకోవచ్చు. రోగి విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటి? ⇒రోగికి నిత్యం తగినంత ద్రవాహారం ఇస్తూ, అతడు/ఆమె డీ–హైడ్రేట్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ⇒ఉప్పు/మసాలాలు వీలైనంత తక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం మంచిది. ఆహారంలో ఎలాంటి పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. ⇒రోగి అన్నం నమలలేకపోతుంటే, దాన్ని ద్రవరూపంలోకి మార్చి ఇవ్వడం మేలు. అంతే సూప్‌లు తాగించడం మంచిది. చికెన్‌పాక్స్‌తో రిస్క్ ఎప్పుడు? చికెన్‌పాక్స్ చాలా చిన్న వ్యాధి. అంతగా బెంగపడాల్సిన అవసరం లేదు. అదే వచ్చి, దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొన్నిసార్లు మాత్రం తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీనివల్ల వచ్చే అనర్థాలలో ముఖ్యమైనది పెద్దల్లో కనిపించే నిమోనియా. చికెన్‌పాక్స్ వల్ల వచ్చే ఈ దుష్ప్రభావాన్ని (కాంప్లికేషన్‌ను) వారిసెల్లా నిమోనియా అంటారు. ఒకసారి వచ్చినవారిలో మళ్లీ మళ్లీ వస్తుందా? ఈ జబ్బుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల ఇటీవల ఇది చాలా తక్కువమందిలోనే కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినా దీని లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వల్ల 85 శాతం సందర్భాల్లో మళ్లీ చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అలాగే ఒకవేళ వచ్చినా 97 శాతం మందిలో దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అన్నది సాధ్యమైనంత వరకు రాకుండా నివారించడంతో పాటు, చాలావరకు తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇటీవల నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు రెండో డోసు కూడా ఇవ్వడం జరుగుతోంది. నివారణ ఎలా? చికెన్‌పాక్స్‌ను నివారించడం చాలా తేలిక. ఇప్పుడు దీన్ని నివారించే వ్యాక్సిన్ (టీకా మందు) అన్నిచోట్లా లభ్యమవుతోంది. దీన్ని రెండు డోసులలో ఇస్తారు. పిల్లలకు దీన్ని 12 – 18 నెలల వయసులో మొదటి మోతాదు ఇస్తారు. అలాగే 4 – 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రెండో డోస్ ఇస్తారు. ఇక పెద్ద పిల్లల్లోనూ, పెద్దల్లోనూ దీన్ని రెండు మోతాదుల్లో ఇస్తారు. మొదటి మోతాదు ఇచ్చిన నాలుగు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో రెండో మోతాదు ఇస్తే సరిపోతుంది. ఈ వ్యాక్సిన్ (వార్నాక్స్) తీసుకోని వారు, గతంలో చికెన్‌పాక్స్ రాని వారు... ఇది సోకిన వారి నుంచి దూరంగా ఉండాలి. ఇక చికెన్‌పాక్స్ వల్ల చాలావరకు దీర్ఘకాలంలో సంభవించే దుష్పరిణామాలన్నవి చాలా చాలా తక్కువ. కొద్దిశాతం మందిలో మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే అక్యూట్ దశలో నిమోనియా, రక్తం గడ్డకట్టడంలో మార్పులు, మెదడుకు సంబంధించిన సమస్యలు చూడటం జరుగుతుంటుంది. కానీ వ్యాక్సిన్ అస్సలు తీసుకోని పిల్లల్లో లేదా మరీ చిన్న పిల్లల్లో (నియోనేటల్), పుట్టుకతోనే వ్యాధినిరోధకశక్తి లోపాలు ఉన్న పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ గాని, లేదా చికెన్‌పాక్స్ మళ్లీ మళ్లీ తిరగబెట్టడం గాని చూస్తుంటాం. గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకితే... ! గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనలివి: ⇒సాధారణంగా నెలలు ఇంకా పూర్తిగా నిండని గర్భవతులకు (అర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి) ఒకవేళ చికెన్‌పాక్స్ సోకినా దాని కారణంగా గర్భస్రావం కావడం చాలా అరుదు. ⇒గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినట్లయితే వారి ప్రెగ్నెన్సీలోని 16వ వారం, 20వ వారం, 24వ వారాల్లో నిపుణుల చేత, వారు సూచించిన విధంగా పరీక్ష చేయించుకుని, బిడ్డపై ఎలాంటి ప్రభావాలు లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ⇒నాలుగో నెల గర్భంతో ఉన్నవారికి చికెన్‌పాక్స్ సోకితే దాని ప్రభావం కడుపులోని బిడ్డపైనా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. చికెన్‌పాక్స్ కారణంగా బిడ్డలో కళ్లు, కాళ్లు, భుజాలు, మెదడు, బ్లాడర్, పెద్దపేగు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అయితే ఇలాంటి అవకాశం చాలా అరుదు. దాదాపు నూరు కేసుల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. ⇒ఒకవేళ గర్భవతికి తన 7వ నెల నుంచి 9వ నెల మధ్యకాలంలో చికెన్‌పాక్స్ సోకితే అప్పుడు పుట్టబోయే బిడ్డలో కూడా చికెన్‌పాక్స్ వైరస్ ఉంటుంది. కానీ ఆ వైరస్ తాలూకు ఎలాంటి ప్రభావాలూ బిడ్డపై పడవు. కాకపోతే బిడ్డ కాస్త బరువు తక్కువగా పుట్టవచ్చు. ⇒ఇక 36 వారాల ప్రెగ్నెన్సీలో (అంటే... 9 నెలలు నిండాక) గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే కడుపులోని బిడ్డకు కూడా అది సోకిందేమో చూడాలి. అంటే తల్లికి ఒంటిపై రాష్ వచ్చినట్లుగానే బిడ్డకూ సోకిందేమో పరిశీలించాలి. ఒకవేళ సోకి ఉంటే పుట్టిన వెంటనే ఆ బిడ్డకు కూడా చికెన్‌పాక్స్ చికిత్స అందించాలి. ఒకవేళ నెలలన్నీ నిండాక ప్రసవం సమయంలో బిడ్డకు చికెన్‌పాక్స్ సోకితే వారిద్దరికీ చికిత్స అందిస్తారు. తల్లికి జ్వరం, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో తల్లికి యాంటీవైరల్ మందులను ఇస్తారు. ఇక తల్లికీ, బిడ్డకూ చికెన్‌పాక్స్ వచ్చినా రాకున్నా బిడ్డకు తల్లిపాలు పట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. పాలు యథావిధిగా పట్టించాల్సిందే. అయితే చికెన్‌పాక్స్ అన్నది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సంక్రమించే వ్యాధి కాబట్టి ఒకవేళ ఇది సోకినప్పుడు మనమే స్వచ్ఛందంగా గర్భవతులు, బిడ్డ తల్లుల వంటి వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం అన్నది సామాజిక బాధ్యతగా మనందరం నిర్వర్తించే మంచి పని అన్నమాట. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... చికెన్‌పాక్స్ లక్షణాలు గర్భిణీ స్త్రీలలో వచ్చినప్పుడు ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపై కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణులలో చికెన్‌పాక్స్ వస్తే తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించి, తగిన చికిత్స చేయించాలి. పిల్లలు, పెద్దల్లో కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ టి.జి. కిరణ్ బాబు సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్ -
ఆ నాలుగు చతుర్ముఖ పారాయణమే...
దక్షిణాదిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు పెద్దగా ప్రాచుర్యం లేదు. హైదరాబాద్‌లో మాత్రం గుజరాతీల ఇళ్లలో ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. నాలుగు రోజులూ వారు సరదాగా, సందడిగా గడుపుతారు. జన్మాష్టమి రోజున ఉట్టెకొట్టడం, కోలాటాలు వంటి వేడుకలు గుజరాతీలకు, మన తెలుగువారికీ మామూలే. అయితే, షష్టి నుంచి నవమి వరకు సాగే వేడుకల్లో నాలుగు రోజులూ చతుర్ముఖ పారాయణం సాగించడం గుజరాతీల ప్రత్యేకత. జూదాన్ని సప్తవ్యసనాల్లో ఒకటిగా పరిగణిస్తాం. కానీ ఆ నాలుగు రోజులూ వారు చతుర్ముఖ పారాయణంలోనే పొద్దుపుచ్చుతారు. గుజరాతీల జన్మాష్టమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ ఇదే. మామూలు రోజుల్లో పిల్లలు పేక ముట్టుకుంటేనే మండిపడే పెద్దలు సైతం, జన్మాష్టామి వేడుకలు జరిగే నాలుగు రోజులూ పిల్లలతో కలసి పేకాడతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పేకాడాలనే సనాతన ఆచారమేదీ లేకపోయినా, గుజరాతీలకు చాలాకాలంగా అదో ఆనవాయితీగా మారింది. ఆ నాలుగు రోజుల పేకాటల్లో కనీసం ఒకసారైనా గెలిస్తే, ఆ ఏడాదంతా వ్యాపారం వృద్ధి చెందుతుందని వారు విశ్వసిస్తారు. దక్షిణాదిన శ్రీకృష్ణ జన్మాష్టమికి పెద్దగా ప్రాచుర్యం లేదు. అయినా, హైదరాబాద్ నగరంలోని గుజరాతీల లోగిళ్లు జన్మాష్టమి వేడుకల్లో అంగరంగ వైభవంగా వెలిగిపోతుంటాయి. సంప్రదాయాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే గుజరాతీల జన్మాష్టమి నాలుగు రోజుల పాటు సందడిగా జరుగుతాయి. షష్టి నుంచే సందడి మొదలు... నిత్యం వ్యాపార లావాదేవీల్లో తలమునకలుగా ఉండే గుజరాతీలు ఈ వేడుకలను అష్టమికి ముందుగా షష్టి నుంచే మొదలు పెడతారు. షష్టి రోజును ‘రాన్దన్ ఛట్’గా వ్యవహరిస్తారు. అది వంటలకు ప్రత్యేకించిన రోజు. రాన్దన్ అంటే వంట అని అర్థం. అష్టమికి ముందురోజైన సప్తమిని ‘శిత్లా సాతన్’గా వ్యవహరిస్తారు. ఆ రోజు వారు ఇంట్లో వంట చేయరు. ముందురోజు సిద్ధం చేసుకున్న పదార్థాలనే ఆరగిస్తారు. సప్తమి రోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, పొయ్యినే సుఖాసనంగా చేసుకుని కొలువుదీరుతుందని నమ్ముతారు. సప్తమి రోజున దేవాలయానికి వెళ్లి, వేపచెట్టును పూజిస్తారు. శ్రీకృష్ణుడిని తలచుకుని, వేపాకును తాకితే ఆటలమ్మ (చికెన్‌పాక్స్) సోకదని నమ్ముతారు. మూడోరోజు శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. నవమిని ‘నోమ్’గా జరుపుకుంటారు. - గౌరీభట్ల నరసింహమూర్తి -
చికెన్‌పాక్స్‌కు నివారణ, చికిత్స చెప్పండి...
మా బాబు వయసు రెండున్నరేళ్లు. ప్రస్తుతం జలుబు విపరీతంగా ఉంది. మా పక్కింటి బాబుకు ఇలాగే జలుబు చేసి, చికెన్ పాక్స్‌గా వ్యక్తమయ్యింది. కాబట్టి దీని నివారణకు, చికిత్సకు ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - నేమాని సుబ్బారావు, మణికొండ ‘చికెన్‌పాక్స్’, ‘మీజిల్స్’ వ్యాధులను ఆయుర్వేదంలో ‘లఘు మసూరిక’, ‘రోమాంతికా’ అనే పేర్లతో వివరించారు. ఇవి ఒకరి నుంచి మరొకరికి ప్రాప్తించే సాంక్రమిక వ్యాధులు. ఇవి రావడం, రాకపోవడం అన్న అంశం వారి వారి క్షమత్వ శక్తిపై ఆధారపడి ఉంటుంది. నివారణకైనా, చికిత్సకైనా ఈ కింది జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఇంట్లోనూ, పరిసరాల్లోనూ పరిశుభ్రత ముఖ్యం. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. సాంబ్రాణి ధూపం రెండుపూటలా వేస్తే మంచిది. వేపకొమ్మలను ఇంటి ద్వారానికి తోరణంగా కడితే చాలా రకాల క్రిములను అవి లాగేసుకుంటాయి. క్రిమిహరణంగా పనిచేస్తుంది. స్నానానికి పసుపుకలిపిన వేడినీళ్లు మంచివి. అనంతరం బాలునికి కూడా సాంబ్రాణి ధూపం వేయవచ్చు. పరిశుభ్రమైన బట్టలను ప్రతిరోజూ మారుస్తుండాలి. ఇలాంటి పరిస్థితుల్లో నీరసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మంచి బలవర్థకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ద్రవాహారం కూడా ఎక్కువగా ఉండాలి. బాదంపప్పు, జీడిపప్పు, ఖర్జూరం, బత్తాయి, కమలాపండ్ల రసాలు చాలా మంచిది. ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు మజ్జిగ ప్రయోజనకరం. మందులు తులసీరసం, తేనె ఒక్కొక్క చెంచా కలిపి, రెండుపూటలా నాకించండి. లేదా తేనెలో రెండు చుక్కల వెల్లుల్లిరసం కలిపి ఇవ్వవచ్చు. దాల్చినచెక్క చూర్ణం రెండు చిటికెలు, పసుపుముద్ద ఒక చిటికెడు తేనెతో కలిపి రోజుకొక్కసారి తినిపించవచ్చు. ఆమలకి (ఉసిరిక) రసం ఒక చెంచా రెండుపూటలా ఇవ్వవచ్చు. బజారులో లభించే మందులు అరవిందాసవ: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా నీటితో. చందనాసవ: ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా నీటితో. లక్షణాలను బట్టి ప్రత్యేక ఔషధాలు జ్వరానికి: ఆనందభైరవీరస (మాత్రలు... ఉదయం 1, రాత్రి 1 చర్మంపై పొక్కులు: ‘మహామరిచాది తైలా’న్ని కొంచెం దూదితో, మెల్లగా చర్మంపై పూయాలి. గమనిక ఒకవేళ ఈ వ్యాధులు సోకితే, తగ్గిన అనంతరం అశ్రద్ధ చేయకూడదు. వీటి ఉపద్రవాలు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా బయటపడవచ్చు. కాబట్టి క్షమత్వ వర్ధకానికై ‘అగస్త్యహరీతకీ రసాయనం’ (లేహ్యం) అనే మందును ఒక చెంచా మోతాదులో రెండు పూటలా, రెండుమూడు నెలల పాటు తినిపించడం మంచిది. సాంప్రదాయికంగా ఈ జబ్బుల్ని ‘ఆటలమ్మ, అమ్మవారు’ అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. వీటికి మందులు వాడకూడదని నమ్ముతుంటారు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు కనుక వాటికి మందులక్కర్లేదనడం వాస్తవమే అయినా, మూఢవిశ్వాసాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ వ్యాధి సోకే ముందుగాని, లక్షణాలు బయటపడ్డప్పుడు గాని రోగికి చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఆయా లక్షణాలను బట్టి శమన చికిత్స కోసం మందులు వాడటం తప్పనిసరి. అదేవిధంగా ఎక్కువ నీరసం ఉంటుంది కాబట్టి బలకర ఔషధాలు కూడా తప్పనిసరి. వీటి ఉపద్రవాలను నివారించడం కోసం ఆయుర్వేదోక్త రసాయన ద్రవ్యాలను చాలాకాలం వైద్యుని పర్యవేక్షణలో వాడటం అత్యంతావశ్యకమని గుర్తుంచుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్), సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్, హుమయున్ నగర్, హైదరాబాద్ -
చికెన్‌పాక్స్ ఉన్న స్టూడెంట్‌తో మాట్లాడాను... నాకు సోకుతుందా?
నా వయసు 25. ఇప్పుడు నేను ఐదోనెల గర్భిణిని. టీచర్‌గా పనిచేస్తున్నాను. మా క్లాస్‌లో ఒక అబ్బాయికి చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) సోకింది. తగ్గేవరకు స్కూల్‌కు రావద్దని చెప్పినా... కాసేపు అతడితో మాట్లాడాల్సి వచ్చింది. అప్పట్నుంచి చికెన్‌పాక్స్ నాకు కూడా అంటుకుంటుందేమోమోనని ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సునందిని, హైదరాబాద్ చికెన్‌పాక్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వెరిస్టెల్లా హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ వల్ల సోకుతుంది. చిన్నపిల్లల్లో ఇది చాలా సహజం. చిన్నప్పుడు దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెద్దల్లో వస్తే మాత్రం దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. చికెన్‌పాక్స్ వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు శ్వాసతీసుకునే సమయంలో వెలువడే తుంపర్ల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. సాధారణంగా ఐదు నిమిషాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల గాని, 15 నిమిషాల పాటు చికెన్‌పాక్స్ ఉన్నవారితో ఒకే గదిలో ఉండటం వల్ల గాని ఇది సోకే అవకాశాలు ఉంటాయి. నిజానికి మీరు చికెన్‌పాక్స్ వచ్చిన పిల్లాడితో కాసేపు మాట్లాడారు. అయితే చికెన్‌పాక్స్ వచ్చిన రెండు లేదా మూడోరోజుకుగాని అవి శరీరంపై పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలో బయటపడవు. కానీ అది సోకినవారిలో శరీరంపై పొక్కులు రావడానికి రెండు రోజుల ముందునుంచే వారు దీన్ని మరొకరికి వ్యాప్తి చేయగల స్థితిలో ఉంటారు. అందుకే మనకు తెలియకుండానే దీనికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. చికెన్‌పాక్స్ సోకగానే మొదట జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత రెండు రోజులకు అవి తగ్గాక గానీ శరీరంపై చికెన్‌పాక్స్ పొక్కులు కనిపించవు. శరీరంపై పొక్కులు వచ్చాక అది మరింత వేగంగా వ్యాప్తిచెందడానికి అవకాశం ఎక్కువ. సాధారణంగా చికెన్‌పాక్స్ అన్నది రెండు వారాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఆ వైరస్ వారి నరాల చివర్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ తర్వాత వారు ఎప్పుడైనా బలహీనపడ్డా లేదా వారిలో వ్యాధినిరోధకశక్తి క్షీణించినా అది బయటపడుతుంది. ఇలా రెండోసారి పునరావృతమయ్యే చికెన్‌పాక్స్‌ను షింగిల్స్ అంటారు. షింగిల్స్లో చికెన్‌పాక్స్‌తో పోలిస్తే మరి కాస్త తీవ్రత ఎక్కువ. నిజానికి చిన్నప్పుడే చికెన్‌పాక్స్ సోకిన వారు మళ్లీ ఆ వ్యాధిగ్రస్తులతో ఎంత సన్నిహితంగా గడిపినా వారికి చికెన్‌పాక్స్ సోకదు. కాకపోతే అది చిన్నప్పుడు వచ్చిందో, రాలేదో తెలియదు కాబట్టి... గతంలో అది వచ్చి ఉందా అని నిర్ధారణ చేయడానికి ఒక రక్తపరీక్ష చేస్తారు. దానికి సంబంధించిన యాంటీబాడీస్ సహాయంతో అది గతంలో వచ్చిందా రాలేదా అన్న విషయం తెలుస్తుంది. చిన్నప్పుడే ఆ వ్యాధి వచ్చి ఉన్నవారు ఇకపై దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒకసారి వస్తే ఇక జీవితకాలం ఇమ్యూనిటీని ఇస్తుంది. అయితే ఒకవేళ రాకపోతే వారికి వారిస్టెల్లా జోస్టర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ప్యాసివ్ ఇమ్యూనైజేషన్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ కూడా చికెన్‌పాక్స్ ఉన్నవారికి ఎక్స్పోజ్ అయిన నాటి నుంచి 10 రోజుల లోపు ఇవ్వాలి. చికెన్‌పాక్స్‌కు యాక్టివ్ ఇమ్యూనైజేషన్గానూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే అది గర్భవతులకు ఇవ్వడానికి వీలుకాదు. కాకపోతే గర్భం రాకముందు మాత్రం తీసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒకసారి మీరు మీ డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
వ్యాక్సిన్ ఇప్పించాక కూడా చికెన్‌పాక్స్..!
మా బాబుకు ఆరేళ్లు. వాడికి ఇటీవలే చికెన్ పాక్స్ వచ్చింది. అది కాస్త తీవ్రంగా వచ్చి, మందులు వాడాక తగ్గింది. అంతకుమునుపే మా బాబుకు వ్యాక్సిన్ ఇప్పించాం. అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిన చికెన్‌పాక్స్ భవిష్యత్తులో ఏవైనా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? అలాగే నేను బాబుకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నాక్కూడా చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉందా? - సీతామహాలక్ష్మి, రాజమండ్రి మీరు చెప్పిన వివరాలను బట్టి మీ బాబుకు చికెన్‌పాక్స్ చాలా తీవ్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. చికెన్‌పాక్స్ అన్నది అన్ని ఆర్థిక, సామాజిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. ఇది రెండు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ జబ్బుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల ఇటీవల ఇది చాలా తక్కువమందిలోనే కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినా దీని లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వల్ల 85 శాతం సందర్భాల్లో మళ్లీ చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అలాగే ఒకవేళ వచ్చినా 97 శాతం మందిలో దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అన్నది సాధ్యమైనంత వరకు రాకుండా నివారించడంతో పాటు, చాలావరకు తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రన పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇటీవల నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు రెండో డోసు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక చికెన్‌పాక్స్ వల్ల చాలావరకు దీర్ఘకాలంలో సంభవించే దుష్పరిణామాలన్నవి చాలా చాలా తక్కువ. కొద్దిశాతం మందిలో మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే అక్యూట్దశలో నిమోనియా, రక్తం గడ్డకట్టడంలో మార్పులు, మెదడుకు సంబంధించిన సమస్యలు చూడటం జరుగుతుంటుంది. కానీ ఇది వ్యాక్సిన్ అస్సలు తీసుకోని పిల్లల్లో లేదా మరీ చిన్న పిల్లల్లో (నియోనేటల్), పుట్టుకతోనే వ్యాధినిరోధకశక్తి లోపాలు ఉన్న పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ గాని, లేదా చికెన్‌పాక్స్ మళ్లీ మళ్లీ తిరగబెట్టడం గాని చూస్తుంటాం. ఇక మీ పిల్లాడికి దగ్గరగా ఉండటం వల్ల మీకు కూడా సోకే విషయానికి వస్తే... థియరిటికల్‌గా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినప్పటికీ, మీకు ఇదివరకే చికెన్‌పాక్స్ వచ్చి ఉన్నా లేదా ఆ లక్షణాలు కనిపించి ఉన్నా మళ్లీ మీకు తీవ్రమైన చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే ఇటువంటి లక్షణాలు గర్భిణీ స్త్రీలలో వచ్చినప్పుడు ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపై కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇక చివరగా... మీ బాబుకు చికెన్‌పాక్స్ తిరగబెడుతుందా అన్న విషయంలో మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అవి వచ్చి తగ్గిపోయాయి కాబట్టి ఇకపై మీరు నిశ్చింతగా ఉండవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్