చేటుచేయదు... ఆటలమ్మ | special storyt to Chicken Pox | Sakshi
Sakshi News home page

చేటుచేయదు... ఆటలమ్మ

Published Wed, Apr 12 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

చేటుచేయదు... ఆటలమ్మ

చేటుచేయదు... ఆటలమ్మ

చికెన్‌పాక్స్‌

ఇప్పుడు చికెన్‌పాక్స్‌ కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు. ఆటలాడే వయసులో చిన్నారుల్లో కనిపిస్తుందిది. కేవలం చిన్నపిల్లల్లోనే కాదు... అప్పుడప్పుడు పెద్దలూ, గర్భవతులకూ వస్తుంది. అయితే పిల్లల్లో వస్తే తీవ్రత ఒకింత తక్కువ. సాధారణంగా చికెన్‌పాక్స్‌ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, అరుదుగా దుష్ప్రభావాలనూ తెస్తుంది.ఇది వస్తే స్నానం చేయించవచ్చా, కూడదా... లాంటి అనేక సందేహాలనూ రేకెత్తిస్తుంది. ఈ వ్యాధి ప్రభావాలపై అవగాహనతో పాటు అపోహల నివృత్తి కోసమే ఈ కథనం.

చికెన్‌పాక్స్‌... ఇప్పుడు సాధారణ జలుబు, ఫ్లూ లాగే ఎక్కువగా కనిపిస్తోంది. అందునా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో మరీ ఎక్కువ. చికెన్‌పాక్స్‌ అన్నది అన్ని ఆర్థిక, సామాజిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. ఇది రెండు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

అంటువ్యాధులలో చికెన్‌పాక్స్‌ చాలా సాధారణంగా కనిపించే వైరస్‌. వారిసెల్లా జోస్టర్‌ అనే వైరస్‌ వల్ల ఇది వస్తుంది. మొదట ఒకసారి వచ్చి ఉన్నా లేదా దీని కోసం వ్యాక్సిన్‌ తీసుకొని ఉన్నా మళ్లీ మరోసారి ఇది రావడం చాలా తక్కువ. కానీ అంతవరకూ ఎప్పుడూ చికెన్‌పాక్స్‌కు గురికాని వారిలో ఇది కనిపిస్తుంది.

చికెన్‌పాక్స్‌ ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపిస్తుంటుంది. ఇది వచ్చిన వారి ఒంటిపై పొక్కులు, దద్దుర్ల వంటివి (బ్లిస్టర్స్‌) కనిపిస్తాయి. ఇది సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి, తుప్పర్ల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. తగ్గడమూ ఒకింత కష్టమవుతుంది.

లక్షణాలు ఎలా ఉంటాయి?
ఇది సోకిన వారిలో కొన్ని నీటిపొక్కుల వంటివి, మరికొంత ర్యాష్‌ వంటిది ఒంటి మీద కనిపిస్తుంది.  జ్వరం ∙ఆకలి తగ్గుతుంది  తలనొప్పి

దగ్గు  గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తొలుత జ్వరంతో మొదలై ఆ తర్వాత తల నుంచి ప్రారంభించి, కిందివైపునకు ఈ దద్దుర్లు వస్తూ, పెరుగుతూ పోతుంటాయి.

ర్యాష్‌ కనిపించిన తర్వాత నాలుగు –ఐదు రోజుల తర్వాతి నుంచి తమ నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. ఈ ర్యాష్‌లో కాస్తంత దురదగా కూడా ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా చూసుకోవాలి. పెద్దలైతే కార్యాలయం/కార్యస్థలం నుంచి దూరంగా ఉండాలి.

ఒంటి మీద వచ్చే ఈ దద్దుర్ల వంటివి దశల వారీగా వస్తున్నట్లుగా కనిపిస్తాయి. మొదట వచ్చిన ఎర్రటి దద్దుర్లు ఒకటి నుంచి రెండు రోజుల్లో తగ్గుతాయి. ఆ తర్వాత వచ్చిన దద్దుర్లు మెల్లగా తగ్గడం మొదలుపెట్టినట్లుగా ఎండిపోతూ ఉంటాయి. ఐదు నుంచి ఏడు రోజుల పాటు ప్రతిరోజూ ఇలా కొత్త కొత్త దద్దుర్లు (బ్లిస్టర్స్‌) కనిపిస్తూనే ఉంటాయి. పదిరోజుల్లో ఇవన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఆ తర్వాత మాత్రమే పిల్లలను స్కూల్‌కు పంపడం మొదలు పెట్టాలి. వచ్చిన పొక్కుల వంటి దద్దుర్లు మానుబట్టాక మాత్రమే పెద్దలు కూడా కార్యాలయానికి వెళ్లాలి.

నిర్ధారణ ఎలా?
దద్దుర్లనూ, వాటి తీరును చూడగానే డాక్టర్లు/పెద్దలు వాటిని గుర్తించి చికెన్‌పాక్స్‌ను నిర్ధారణ చేస్తారు. అవసరమైతేనే ల్యాబ్‌ టెస్ట్‌ ద్వారా నిర్ధారణ చేయాల్సి వస్తుంది.
వ్యాధి తీరుతెన్నులు : దాని మానాన దాన్ని వదిలేసినా చికెన్‌పాక్స్‌ వచ్చి, ఆ తర్వాత తనంతట తానే తగ్గిపోతుంది. అయితే కేవలం వ్యాధి కలిగించే బాధ నుంచి, ఆ దద్దుర్ల దురద నుంచి ఉపశమనం కలిగించడానికీ, వ్యాధి కలిగించే బాధ నుంచి, తర్వాత్తర్వాత మరిన్ని కాంప్లికేషన్లు రాకుండా ఉండటానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి డాక్టర్లు మందులను సూచిస్తారు. ఇక మంచి మృదువైన కాటన్‌ దుస్తులను ధరించడం ద్వారా దద్దుర్లు కలిగించే అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒంటిపై ఎలాంటి వాసన లేని కాలమైన్‌ లోషన్‌ను రాసుకోవచ్చు.

రోగి విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటి?
రోగికి నిత్యం తగినంత ద్రవాహారం ఇస్తూ, అతడు/ఆమె డీ–హైడ్రేట్‌ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
ఉప్పు/మసాలాలు వీలైనంత తక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం మంచిది. ఆహారంలో ఎలాంటి పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు.
రోగి అన్నం నమలలేకపోతుంటే, దాన్ని ద్రవరూపంలోకి మార్చి ఇవ్వడం మేలు. అంతే సూప్‌లు తాగించడం మంచిది.

చికెన్‌పాక్స్‌తో రిస్క్‌ ఎప్పుడు?
చికెన్‌పాక్స్‌ చాలా చిన్న వ్యాధి. అంతగా బెంగపడాల్సిన అవసరం లేదు. అదే వచ్చి, దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొన్నిసార్లు మాత్రం తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. దీనివల్ల వచ్చే అనర్థాలలో ముఖ్యమైనది పెద్దల్లో కనిపించే నిమోనియా. చికెన్‌పాక్స్‌ వల్ల వచ్చే ఈ దుష్ప్రభావాన్ని (కాంప్లికేషన్‌ను) వారిసెల్లా నిమోనియా అంటారు.

ఒకసారి వచ్చినవారిలో మళ్లీ మళ్లీ వస్తుందా?
 ఈ జబ్బుకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండటం వల్ల ఇటీవల ఇది చాలా తక్కువమందిలోనే కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినా దీని లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఒక డోస్‌ వ్యాక్సిన్‌ వల్ల 85 శాతం సందర్భాల్లో మళ్లీ చికెన్‌పాక్స్‌ వచ్చే అవకాశం తక్కువ. అలాగే ఒకవేళ వచ్చినా 97 శాతం మందిలో దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్‌ అన్నది సాధ్యమైనంత వరకు రాకుండా నివారించడంతో పాటు, చాలావరకు తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్నంత మాత్రాన పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇటీవల నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు రెండో డోసు కూడా ఇవ్వడం జరుగుతోంది.

నివారణ ఎలా?
చికెన్‌పాక్స్‌ను నివారించడం చాలా తేలిక. ఇప్పుడు దీన్ని నివారించే వ్యాక్సిన్‌ (టీకా మందు) అన్నిచోట్లా లభ్యమవుతోంది. దీన్ని రెండు డోసులలో ఇస్తారు. పిల్లలకు దీన్ని 12 – 18 నెలల వయసులో మొదటి మోతాదు ఇస్తారు. అలాగే 4 – 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రెండో డోస్‌ ఇస్తారు. ఇక పెద్ద పిల్లల్లోనూ, పెద్దల్లోనూ దీన్ని రెండు మోతాదుల్లో ఇస్తారు. మొదటి మోతాదు ఇచ్చిన నాలుగు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో రెండో మోతాదు ఇస్తే సరిపోతుంది. ఈ వ్యాక్సిన్‌ (వార్‌నాక్స్‌) తీసుకోని వారు, గతంలో చికెన్‌పాక్స్‌ రాని వారు... ఇది సోకిన వారి నుంచి దూరంగా ఉండాలి.

ఇక చికెన్‌పాక్స్‌ వల్ల చాలావరకు దీర్ఘకాలంలో సంభవించే దుష్పరిణామాలన్నవి చాలా చాలా తక్కువ. కొద్దిశాతం మందిలో మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే అక్యూట్‌ దశలో నిమోనియా, రక్తం గడ్డకట్టడంలో మార్పులు, మెదడుకు సంబంధించిన సమస్యలు చూడటం జరుగుతుంటుంది. కానీ వ్యాక్సిన్‌ అస్సలు తీసుకోని పిల్లల్లో లేదా మరీ చిన్న పిల్లల్లో (నియోనేటల్‌), పుట్టుకతోనే వ్యాధినిరోధకశక్తి లోపాలు ఉన్న పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్‌ గాని, లేదా చికెన్‌పాక్స్‌ మళ్లీ మళ్లీ తిరగబెట్టడం గాని చూస్తుంటాం.

గర్భవతులకు చికెన్‌పాక్స్‌ సోకితే... !
గర్భవతులకు చికెన్‌పాక్స్‌ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనలివి:
సాధారణంగా నెలలు ఇంకా పూర్తిగా నిండని గర్భవతులకు (అర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నవారికి) ఒకవేళ చికెన్‌పాక్స్‌ సోకినా దాని కారణంగా గర్భస్రావం కావడం చాలా అరుదు.

గర్భవతులకు చికెన్‌పాక్స్‌ సోకినట్లయితే వారి ప్రెగ్నెన్సీలోని 16వ వారం, 20వ వారం, 24వ వారాల్లో నిపుణుల చేత, వారు సూచించిన విధంగా పరీక్ష చేయించుకుని, బిడ్డపై ఎలాంటి ప్రభావాలు లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు.

నాలుగో నెల గర్భంతో ఉన్నవారికి చికెన్‌పాక్స్‌ సోకితే దాని ప్రభావం కడుపులోని బిడ్డపైనా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. చికెన్‌పాక్స్‌ కారణంగా బిడ్డలో కళ్లు, కాళ్లు, భుజాలు, మెదడు, బ్లాడర్, పెద్దపేగు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అయితే ఇలాంటి అవకాశం చాలా అరుదు. దాదాపు నూరు కేసుల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది.

ఒకవేళ గర్భవతికి తన 7వ నెల నుంచి 9వ నెల మధ్యకాలంలో చికెన్‌పాక్స్‌ సోకితే అప్పుడు పుట్టబోయే బిడ్డలో కూడా చికెన్‌పాక్స్‌ వైరస్‌ ఉంటుంది. కానీ ఆ వైరస్‌ తాలూకు ఎలాంటి ప్రభావాలూ బిడ్డపై పడవు. కాకపోతే బిడ్డ కాస్త బరువు తక్కువగా పుట్టవచ్చు.

ఇక 36 వారాల ప్రెగ్నెన్సీలో (అంటే... 9 నెలలు నిండాక) గర్భవతికి చికెన్‌పాక్స్‌ సోకితే కడుపులోని బిడ్డకు కూడా అది సోకిందేమో చూడాలి. అంటే తల్లికి ఒంటిపై రాష్‌ వచ్చినట్లుగానే బిడ్డకూ సోకిందేమో పరిశీలించాలి. ఒకవేళ సోకి ఉంటే పుట్టిన వెంటనే ఆ బిడ్డకు కూడా చికెన్‌పాక్స్‌ చికిత్స అందించాలి. ఒకవేళ నెలలన్నీ నిండాక ప్రసవం సమయంలో బిడ్డకు చికెన్‌పాక్స్‌ సోకితే వారిద్దరికీ చికిత్స అందిస్తారు. తల్లికి జ్వరం, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో తల్లికి యాంటీవైరల్‌ మందులను ఇస్తారు. ఇక తల్లికీ, బిడ్డకూ చికెన్‌పాక్స్‌ వచ్చినా రాకున్నా బిడ్డకు తల్లిపాలు పట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. పాలు యథావిధిగా పట్టించాల్సిందే.

అయితే చికెన్‌పాక్స్‌ అన్నది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సంక్రమించే వ్యాధి కాబట్టి ఒకవేళ ఇది సోకినప్పుడు మనమే స్వచ్ఛందంగా గర్భవతులు, బిడ్డ తల్లుల వంటి వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం అన్నది సామాజిక బాధ్యతగా మనందరం నిర్వర్తించే మంచి పని అన్నమాట.

ఇక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... చికెన్‌పాక్స్‌ లక్షణాలు గర్భిణీ స్త్రీలలో వచ్చినప్పుడు ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపై కూడా చూపించే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణులలో చికెన్‌పాక్స్‌ వస్తే తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించి, తగిన చికిత్స చేయించాలి. పిల్లలు, పెద్దల్లో కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.

డాక్టర్‌ టి.జి. కిరణ్‌ బాబు
సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్, మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement