వానాకాలం రాకుండానే రకరకాల వైరస్‌ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్ కేసులు దడపుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంకీ పాక్స్ అనుమానిత కేసు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు కరోనా వైరస్ మరోసారి విజృంభించి ఫోర్త్ వేవ్ ఉధృతమవుతుందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి.
కరోనా
కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతోంది. రోజువారి పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పైగా నమోదైంది. గత 24 గంటల్లో 4,270 కేసులు నమోదయ్యాయి. క్రియా కేసుల సంఖ్య 24 వేలు దాటేసింది. ప్రముఖులు చాలా మంది కరోనా బరిన పడతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీకి కరోనా సోకగా, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ –19 నిబంధనల్ని పాటిస్తూ ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు మహారాష్ట్ర మాస్కులు ధరించాలని కోరుతుండగా కేంద్రం అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని, టీకా సాయంతోనే దేశం కరోనా నుంచి గట్టెక్కుతోందని అంటోంది.
వెస్ట్ నైల్
రకరకాల వైరస్‌లకు పుట్టినిల్లు అయిన కేరళలో వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి త్రిశూర్‌కు చెందిన 47 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. వైస్ట్ నైల్ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ వ్యాధి తీవ్రంగా సోకితే ప్రాణాలు పోవడం ఖాయం. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం కాస్త తక్కువగా ఉంటుంది.
150 మందిలో ఒకరికి ఈ వైరస్ అత్యంత తీవ్రమైన వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రమైతే జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దవడల దగ్గర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కూడా వచ్చిన వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వైరస్ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. కేరళలో టమాటా వైరస్, నిఫా వైరస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చి ఆందోళనని పెంచుతున్నాయి.
మంకీపాక్స్
ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ సోకిందన్న అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పట్నా నుంచి ఘజియాబాద్‌కు వచ్చిన ఆ అమ్మాయి శరీరం మీద దద్దుర్లు చూసి వైద్యులకు మంకీ పాక్స్ సోకిందేమోనన్న అనుమానం వచ్చింది.
అందుకే శాంపిల్స్‌ను పుణెలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపి ఆ అమ్మాయిని క్వారంటైన్‌లో ఉంచినట్టుగా ఇఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ బిపి త్యాగి వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ మాదిరిగానే మంకీ పాక్స్ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. స్మాల్ పాక్స్‌కు ఇచ్చే టీకాలు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెప్పారు.
చికెన్‌పాక్స్
మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చికెన్‌పాక్స్ వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఛత్తర్‌పూర్, చింద్వారా, దాటియా, నీమచ్, భోపాల్, ధార్, ఖండ్వా జిల్లాల్లో 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి అత్యత వేగంగా అంటుకునే లక్షణం కలిగిన వ్యాధి కావడంతో చిన్నారులు, గర్భిణులు, టీనేజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్ సర్కార్ అన్ని జిల్లా కేంద్రాలను అప్రమత్తం చేసింది.
కరోనా హాట్‌స్పాట్‌గా కరణ్ బర్త్‌డే ?
బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మే 25న తన 50వ పుట్టిన రోజు వేడుకల్ని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఘనంగా చేశారు. ఈ పార్టీకి షారూక్‌ఖాన్ దగ్గర్నుంచి జాన్వికపూర్ వరకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కోవిడ్–19 బారిన పడ్డారన్న వార్తలు బీ టౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆదివారం బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని వెల్లడించారు. హీరోయిన్లు కత్రినా కైఫ్, అదితి రాయ్‌లు కూడా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. పార్టీకి హాజరైన వారిలో చాలా మంది తమకు కరోనా సోకినట్టు బహిరంగంగా వెల్లడిం చలేదని, కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ కోవిడ్ –19 సూపర్ స్ప్రెడర్‌గా మారిందని బాలీవుడ్ హంగా మా ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అయితే కరణ్ జోహార్ టీమ్ ఈ విషయాన్ని ఖండిస్తోంది. ముం బైలో కేసులు పెరుగుతూ ఉండడంతో వారందరికీ కరోనా సోకి ఉండవచ్చునని వాదిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment