virus issues
-
యాపిల్ ఉద్యోగులకు ఊరట..మెయిల్లో ఏం చెప్పిందంటే!
ఉద్యోగులకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఊరట కల్పించింది. కరోనా కేసులు అదుపులోకి రావడంతో చాలా కంపెనీలు ఉద్యోగులు కార్యాలయాల్ని మాస్క్‌ను ధరించే అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఉద్యోగులు ఆఫీస్‌లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని యాపిల్ తన ఉద్యోగులకు మెయిల్ చేసింది. ఉద్యోగులు మాస్క్ ధరించాలన్న కఠిన నిబంధనల్ని యాపిల్ సడలించింది. మాస్క్ ధరిస్తే సురక్షితం అనుకుంటే ధరించండి. ఆ విషయంలో ఏమాత్రం వెనకాడొద్దు. అలాగే ప్రతి వ్యక్తి మాస్క్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని గౌరవించండి అంటూ మెయిల్లో పేర్కొంది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తెచ్చిన ఈ కొత్త నిబంధన కొన్ని స్థానాల్లో వర్తించదని తెలిపింది.“ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, చాలా ప్రదేశాలలో ఇకపై ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే వర్క్ విషయంలో సహచర ఉద్యోగులతో మాట్లాడడం లేదంటే వారి క్యాబిన్లలోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని యాపిల్ తన ఉద్యోగులకు పెట్టిన మెయిల్లో పేర్కొందని ది వెర్జ్ హైలెట్ చేసింది. పెరిగిపోతున్న బీఏ.5 వేరియంట్ కేసులు ఇటీవల కోవిడ్-19లోని బీఏ.5 వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో యాపిల్ తన ఉద్యోగులకు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని చెప్పడం.. అదే సమయంలో సురక్షితం అనుకుంటే మాస్క్‌లు ధరించమని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఒక వారం ముందు, బే ఏరియా ట్రాన్సిట్ సిస్టమ్ ఏరియా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులు మాస్క్ తప్పని సరి చేశారు. బే ఏరియాతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పని సరి చేశారు స్థానిక అధికారులు. -
వెన్నులో వైరస్ల వణుకు.. ఒకటి పోతే మరొకటి!
వానాకాలం రాకుండానే రకరకాల వైరస్ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్ కేసులు దడపుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంకీ పాక్స్ అనుమానిత కేసు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు కరోనా వైరస్ మరోసారి విజృంభించి ఫోర్త్ వేవ్ ఉధృతమవుతుందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కరోనా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతోంది. రోజువారి పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పైగా నమోదైంది. గత 24 గంటల్లో 4,270 కేసులు నమోదయ్యాయి. క్రియా కేసుల సంఖ్య 24 వేలు దాటేసింది. ప్రముఖులు చాలా మంది కరోనా బరిన పడతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీకి కరోనా సోకగా, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ –19 నిబంధనల్ని పాటిస్తూ ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు మహారాష్ట్ర మాస్కులు ధరించాలని కోరుతుండగా కేంద్రం అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని, టీకా సాయంతోనే దేశం కరోనా నుంచి గట్టెక్కుతోందని అంటోంది. వెస్ట్ నైల్ రకరకాల వైరస్‌లకు పుట్టినిల్లు అయిన కేరళలో వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి త్రిశూర్‌కు చెందిన 47 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. వైస్ట్ నైల్ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ వ్యాధి తీవ్రంగా సోకితే ప్రాణాలు పోవడం ఖాయం. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం కాస్త తక్కువగా ఉంటుంది. 150 మందిలో ఒకరికి ఈ వైరస్ అత్యంత తీవ్రమైన వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రమైతే జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దవడల దగ్గర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కూడా వచ్చిన వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వైరస్ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. కేరళలో టమాటా వైరస్, నిఫా వైరస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చి ఆందోళనని పెంచుతున్నాయి. మంకీపాక్స్ ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ సోకిందన్న అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పట్నా నుంచి ఘజియాబాద్‌కు వచ్చిన ఆ అమ్మాయి శరీరం మీద దద్దుర్లు చూసి వైద్యులకు మంకీ పాక్స్ సోకిందేమోనన్న అనుమానం వచ్చింది. అందుకే శాంపిల్స్‌ను పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపి ఆ అమ్మాయిని క్వారంటైన్లో ఉంచినట్టుగా ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ బిపి త్యాగి వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ మాదిరిగానే మంకీ పాక్స్ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. స్మాల్ పాక్స్‌కు ఇచ్చే టీకాలు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెప్పారు. చికెన్‌పాక్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చికెన్‌పాక్స్ వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఛత్తర్పూర్, చింద్వారా, దాటియా, నీమచ్, భోపాల్, ధార్, ఖండ్వా జిల్లాల్లో 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి అత్యత వేగంగా అంటుకునే లక్షణం కలిగిన వ్యాధి కావడంతో చిన్నారులు, గర్భిణులు, టీనేజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్ సర్కార్ అన్ని జిల్లా కేంద్రాలను అప్రమత్తం చేసింది. కరోనా హాట్‌స్పాట్‌గా కరణ్ బర్త్‌డే ? బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మే 25న తన 50వ పుట్టిన రోజు వేడుకల్ని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఘనంగా చేశారు. ఈ పార్టీకి షారూక్‌ఖాన్ దగ్గర్నుంచి జాన్వికపూర్ వరకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కోవిడ్–19 బారిన పడ్డారన్న వార్తలు బీ టౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని వెల్లడించారు. హీరోయిన్లు కత్రినా కైఫ్, అదితి రాయ్‌లు కూడా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. పార్టీకి హాజరైన వారిలో చాలా మంది తమకు కరోనా సోకినట్టు బహిరంగంగా వెల్లడిం చలేదని, కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ కోవిడ్ –19 సూపర్ స్ప్రెడర్గా మారిందని బాలీవుడ్ హంగా మా ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అయితే కరణ్ జోహార్ టీమ్ ఈ విషయాన్ని ఖండిస్తోంది. ముం బైలో కేసులు పెరుగుతూ ఉండడంతో వారందరికీ కరోనా సోకి ఉండవచ్చునని వాదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యాక్సిన్ పేరు చెప్పి మిమ్మల్ని ముంచేస్తారు జాగ్రత్త
దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం సూచించిన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని సంబంధిత వ్యక్తిగత వివరాల్ని అప్ డేట్ చేస్తే మనకు కన్ఫాం ఓటీపీ వస్తుంది. అయితే అదే సమయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను క్యాష్ చేసుకునేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. మాల్వార్ సాయంతో ఓ లింక్ ను తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పొరపాటు ఎవరైనా ఆ లింక్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బు మటుమాయం అవుతుంది. మాల్వేర్ రిసెర్చ్ సంస్థ స్టెఫాంకో ప్రకారం.. భారత్ కు చెందిన వినియోగదారుల్ని లక్ష్యంగా చేస్తూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ అవ్వండి అంటూ ఓ టెక్ట్స్ రూపంలో మెసేజ్ వస్తుంది. ఆ టెక్ట్స్ కింద ఓ మాల్వేర్ లింక్ ఉంటుంది. అంటే బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేలా తయారు చేశారు. ఆ లింక్ ను ఒక్కసారి క్లిక్ చేస్తే అకౌంట్లలో ఎన్నికోట్లున్నా క్షణాల్లో మాయమవుతాయని మాల్వేర్ రీసెర్చ్ సంస్థ స్టెఫాంకో ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇలాంటి మాల్వేర్ల సురక్షితంగా ఉండాలంటే కేంద్ర అధికారిక వెబ్ సైట్, కోవిన్ యాప్ లను మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని కోవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఆ లింక్స్ సంబంధిత ఫ్లాట్ ఫామ్ లలో లాగిన్ అవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఎందుకంటే రిజిస్ట్రేషన్‌కు ఓటీపీ అవసరమని, ఆ ఓటీపీ కోవిన్ లింక్ ద్వారా మాత్రమే వస్తుందని అన్నారు. కాబట్టి కోవిడ్-12 రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నారు. -
మాకు ఊపిరి పోస్తారా..?
సాక్షి, వనపర్తి : వేపచెట్లను బతికించుకోవడంపై అధికారుల్లో ఇంకా చలనం రావడం లేదు.. ‘ఔషధ గనికి ముప్పు’ శీర్షికన వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలో వేపచెట్లు మాత్రమే ఎండిపోతున్నాయని ‘సాక్షి’లో జనవరి 5న ప్రచురించిన కథనానికి కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం శాస్త్రవేత్తలు స్పందించారు. మరునాడే గ్రామాన్ని సందర్శించి వేపచెట్లకు సోకిన వైరస్‌ను తెలుసుకునేందుకు కొమ్మలు, ఆకులు, కాండం బెరడు సేకరించి ల్యాబ్ పంపించారు. అదేరోజు తెగులును అదుపు చేసేందుకు కార్బన్ డజిం అనే ఫెస్టిసైడ్ మందు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. సర్పంచ్ రాజవర్ధన్‌రెడ్డి గ్రామస్తులతో సమాలోచన చేసి కొన్ని చెట్లకు పిచికారీ చేయగా.. అవి మళ్లీ పచ్చని ఆకులను చిగురిస్తోంది. పత్రికల్లో వార్త వచ్చిన నాలుగైదురోజులు హడావుడి చేసిన స్థానిక పాలకులు, అధికారులు తర్వాత మళ్లీ చెట్ల విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకుని ఎంతో దూరం నుంచి పనివదులుకు వచ్చిన శాస్త్రవేత్తలు చేసిన సూచనలు, సలహాలు పాటించి ఉంటే ఎండినట్లు గుర్తించిన సుమారు 2 వేల చెట్లు ఇప్పటికే మళ్లీ చిగురించేవి. కానీ, స్థానిక అధికారులు, పాలకులు నామమాత్రపు చర్యలతో మమా అనిపించడంతో కొన్ని చెట్లు మాత్రమే పూర్వవైభవాన్ని సంతరించుకుని పచ్చని ఆకులను చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. హరితహారంపై ఉన్న ధ్యాస.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు, పాలకులు దశాబ్దాల నాటి వేలాది చెట్లను రక్షించుకునే విషయంలో ఎందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే గ్రామంలో సుమారు రెండు వేల చెట్లు ఎండిపోతున్నాయి, శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు పాటిస్తే వాటన్నింటినీ బతికించుకోవచ్చు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డిప్లోడియా ఫంగస్‌గా గుర్తింపు కంభాళాపురంలో వేపచెట్లకు వచ్చిన వైరస్ డిప్లోడియా ఫంగస్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. పలుమార్లు గ్రామాన్ని సందర్శించి చెట్లకు పిచికారీ చేసే మందుల పేర్లు, ఎక్కడ లభిస్తుంది.. ఎలా వాడాలనే విషయంపై సూచనలు చేశారు. సకాలంలో స్పందించనందుకే.. సకాలంలో స్పందించి మందు పిచికారీ చేసినందుకే.. కొన్ని వేపచెట్లు మళ్లీ చిగురించాయి. లేదంటే వైరస్ పక్కనున్న గ్రామాలకు పాకేది. ఎండిన చెట్లలో కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివి కూడా ఉన్నాయి. వాటికి ప్రాణం పోసిన తృప్తి చాలా ఆనందాన్ని ఇస్తోంది. – రాజేంద్రకుమార్‌రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త 13 చెట్లకు పిచికారీ చేశాం గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షలు చేసి మందు నీటిలో కలిపి పిచికారీ చేయమన్నారు. ఆలయం వద్ద, ప్రధాన కూడళ్లలో ఉన్న 13 చెట్లకు కార్బన్‌డజిం మందును నీటిలో కలిపి పిచికారీ చేయడంతో అవన్నీ మళ్లీ చిగురించాయి. మిగతా వాటికి పిచికారీ చేయలేదు. వాటంతట అవే బతికే అవకాశం ఉంది. – రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచ్, కంభాళాపురం -
‘వారం రోజులు నాన్ వెజ్‌కు హాలీడే’
సాక్షి, పశ్చిమ గోదావరి : తణుకు నియోజకవర్గంలో ఓ వైరస్ కారణంగా ఫారాల్లోని కోళ్లన్నీ విపరీతంగా చనిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. చనిపోయిన వైరస్ కోళ్లను కాలువల్లో, రొడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందిని అలర్ట్ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా తణుకు నియోజకవర్గంలో రేపటి నుంచి వారం రోజులు చికెన్, మటన్ అమ్మకాలు నిలిపి వేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి వారం రోజులు నాన్ వెజ్ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. -
యూజర్లకు గూగుల్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మెసెజింగ్ సర్వీస్ జీమెయిల్ యూజర్లకు సెర్చింగ్ దిగ్గజం గూగుల్ కొన్ని సూచనలు చేసింది. వచ్చే ఫిబ్రవరి 13 నుంచి జీమెయిల్ యూజర్లు జావా స్ర్కిప్ట్ ఫైళ్లను రిస్ట్రిక్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. కొన్ని రకాల వైరస్ ల కారణంగా జీమెయిల్ యూజర్లను ఇందుకు సంబంధించిన ఫైళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఫిబ్రవరి 13 తర్వాత నుంచి జావా స్క్రిప్ట్ ఫైళ్లను సెండ్ చేస్తే మెస్సేజ్ ఈజ్ బ్లాక్డ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ అని డైలాగ్ బాక్స్ వస్తుందని సంస్థ తెలిపింది. యూజర్లకు సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని, వైరస్ల నుంచి ఇన్‌బాక్స్, సెంట్ మెయిల్స్, ఇతరత్రా డాటాను సెక్యూర్ చేయడానికి ఈ చర్యను తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం జీమెయిల్ నుంచి .exe, .msc, and .bat ఫైళ్లను, వీటికి సంబధించిన ఫైల్ అటాచ్‌మెంట్స్‌ను పంపడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో .జేఎస్ (జావా స్క్రిప్ట్) ఫైళ్లను వేరే యూజర్లను పంపాల్సి వస్తే అందుకు గూగుట్ డ్రైవ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇతర స్టోరేజ్ సౌకర్యం ఉన్న సర్వీసు నుంచి నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చునని గూగుల్ వివరించింది. జీమెయిల్ సర్వీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.