మాకు ఊపిరి పోస్తారా..? | Neem Trees Infected With Virus In Wanaparthy | Sakshi
Sakshi News home page

మాకు ఊపిరి పోస్తారా..?

Published Mon, Feb 24 2020 10:53 AM | Last Updated on Mon, Feb 24 2020 10:53 AM

Neem Trees Infected With Virus In Wanaparthy - Sakshi

సాక్షి, వనపర్తి : వేపచెట్లను బతికించుకోవడంపై అధికారుల్లో ఇంకా చలనం రావడం లేదు.. ‘ఔషధ గనికి ముప్పు’ శీర్షికన వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలం కంభాళాపురంలో వేపచెట్లు మాత్రమే ఎండిపోతున్నాయని ‘సాక్షి’లో జనవరి 5న ప్రచురించిన కథనానికి కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం శాస్త్రవేత్తలు స్పందించారు. మరునాడే గ్రామాన్ని సందర్శించి వేపచెట్లకు సోకిన వైరస్‌ను తెలుసుకునేందుకు కొమ్మలు, ఆకులు, కాండం బెరడు సేకరించి ల్యాబ్‌ పంపించారు. అదేరోజు తెగులును అదుపు చేసేందుకు కార్బన్‌ డజిం అనే ఫెస్టిసైడ్‌ మందు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. సర్పంచ్‌ రాజవర్ధన్‌రెడ్డి గ్రామస్తులతో సమాలోచన చేసి కొన్ని చెట్లకు పిచికారీ చేయగా.. అవి మళ్లీ పచ్చని ఆకులను చిగురిస్తోంది. పత్రికల్లో వార్త వచ్చిన నాలుగైదురోజులు హడావుడి చేసిన స్థానిక పాలకులు, అధికారులు తర్వాత మళ్లీ చెట్ల విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

విషయం తెలుసుకుని ఎంతో దూరం నుంచి పనివదులుకు వచ్చిన శాస్త్రవేత్తలు చేసిన సూచనలు, సలహాలు పాటించి ఉంటే ఎండినట్లు గుర్తించిన సుమారు 2 వేల చెట్లు ఇప్పటికే మళ్లీ చిగురించేవి. కానీ, స్థానిక అధికారులు, పాలకులు నామమాత్రపు చర్యలతో మమా అనిపించడంతో కొన్ని చెట్లు మాత్రమే పూర్వవైభవాన్ని సంతరించుకుని పచ్చని ఆకులను చిగురిస్తున్నట్లు తెలుస్తోంది. హరితహారంపై ఉన్న ధ్యాస.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులిచ్చే అధికారులు, పాలకులు దశాబ్దాల నాటి వేలాది చెట్లను రక్షించుకునే విషయంలో ఎందుకు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే గ్రామంలో సుమారు రెండు వేల చెట్లు ఎండిపోతున్నాయి, శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలు పాటిస్తే వాటన్నింటినీ బతికించుకోవచ్చు. ఈ విషయమై కలెక్టర్‌ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

డిప్లోడియా ఫంగస్‌గా గుర్తింపు కంభాళాపురంలో వేపచెట్లకు వచ్చిన వైరస్‌ డిప్లోడియా ఫంగస్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. పలుమార్లు గ్రామాన్ని సందర్శించి చెట్లకు పిచికారీ చేసే మందుల పేర్లు, ఎక్కడ లభిస్తుంది.. ఎలా వాడాలనే విషయంపై సూచనలు చేశారు. సకాలంలో స్పందించనందుకే.. సకాలంలో స్పందించి మందు పిచికారీ చేసినందుకే.. కొన్ని వేపచెట్లు మళ్లీ చిగురించాయి. లేదంటే వైరస్‌ పక్కనున్న గ్రామాలకు పాకేది. ఎండిన చెట్లలో కొన్ని వందల ఏళ్ల క్రితం నాటివి కూడా ఉన్నాయి. వాటికి ప్రాణం పోసిన తృప్తి చాలా ఆనందాన్ని ఇస్తోంది. – రాజేంద్రకుమార్‌రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త 13 చెట్లకు పిచికారీ చేశాం గ్రామానికి శాస్త్రవేత్తలు వచ్చి పరీక్షలు చేసి మందు నీటిలో కలిపి పిచికారీ చేయమన్నారు. ఆలయం వద్ద, ప్రధాన కూడళ్లలో ఉన్న 13 చెట్లకు కార్బన్‌డజిం మందును నీటిలో కలిపి పిచికారీ చేయడంతో అవన్నీ మళ్లీ చిగురించాయి. మిగతా వాటికి పిచికారీ చేయలేదు. వాటంతట అవే బతికే అవకాశం ఉంది. – రాజవర్ధన్‌రెడ్డి, సర్పంచ్, కంభాళాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement