నటుడు సిద్ధార్థ్ తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీని వివాహం చేసుకున్నారు. వారు గతంలో చెప్పినట్లుగానే తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి పెళ్లి జరిగింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిపాటు బంధువుల సమక్షంలో వారి పెళ్లి వేడుక జరిగింది. వనపర్తి రంగనాథస్వామి ఆలయంతో అదితి రావు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అక్కడే చేసుకున్నారు. దీని వెనకున్న అసలు స్టోరీ ఇదే.
అదితి రావు మన తెలుగమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి పేరు ఎహసాన్ హైదరీ. తల్లి విద్యారావు. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌కు ప్రధానమంత్రిగా ఉన్న అక్బర్ హైదరీకి మనవడే అదితి తండ్రి అని తెలిసిందే. తల్లి విద్యా రావు ఏమో వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె. అలా వనపర్తి సంస్థానానికి వారసురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్‌కు కూడా అదితి హైదరి మనవరాలు అవుతుంది. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి రావు కజిన్ అవుతుందనే విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్)
ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ పెళ్లితో అదితి రావు తన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించింది. తమ కుటుంబంలో ఎలాంటి శుభకార్యక్రమైనా సరే శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో జరగాల్సిందే. అదీ వారికి వారసత్వంగా వస్తున్న సెంటిమెంట్. సుమారు 400 ఏళ్ల చరిత్ర అక్కడి ఆలయానికి ఉంది. ఈ వేడుకతో ఆమె తన రూట్స్‌ను గౌరవిస్తోందని చెప్పవచ్చు. అదితి రావు హైదరీ 2002లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు.
వనపర్తి రంగనాథస్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్నాటకలోని గుల్బర్గా, రాయచూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా నమ్మకంతో వస్తుంటారు. అక్కడ వివాహం జరిగితే వారి బంధం బలంగా ఉంటుందనేది అందరి నమ్మకం. దీంతో అక్కడ ప్రతి ఏడాది సుమారు 500కు పైగా వివాహాలు జరుగుతాయి. రాయలకాలంలో ఈ గుడిని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment