ఆ నాలుగు చతుర్ముఖ పారాయణమే...
దక్షిణాదిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు పెద్దగా ప్రాచుర్యం లేదు. హైదరాబాద్‌లో మాత్రం గుజరాతీల ఇళ్లలో ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. నాలుగు రోజులూ వారు సరదాగా, సందడిగా గడుపుతారు. జన్మాష్టమి రోజున ఉట్టెకొట్టడం, కోలాటాలు వంటి వేడుకలు గుజరాతీలకు, మన తెలుగువారికీ మామూలే. అయితే, షష్టి నుంచి నవమి వరకు సాగే వేడుకల్లో నాలుగు రోజులూ చతుర్ముఖ పారాయణం సాగించడం గుజరాతీల ప్రత్యేకత.
జూదాన్ని సప్తవ్యసనాల్లో ఒకటిగా పరిగణిస్తాం. కానీ ఆ నాలుగు రోజులూ వారు చతుర్ముఖ పారాయణంలోనే పొద్దుపుచ్చుతారు. గుజరాతీల జన్మాష్టమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ ఇదే. మామూలు రోజుల్లో పిల్లలు పేక ముట్టుకుంటేనే మండిపడే పెద్దలు సైతం, జన్మాష్టామి వేడుకలు జరిగే నాలుగు రోజులూ పిల్లలతో కలసి పేకాడతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పేకాడాలనే సనాతన ఆచారమేదీ లేకపోయినా, గుజరాతీలకు చాలాకాలంగా అదో ఆనవాయితీగా మారింది. ఆ నాలుగు రోజుల పేకాటల్లో కనీసం ఒకసారైనా గెలిస్తే, ఆ ఏడాదంతా వ్యాపారం వృద్ధి చెందుతుందని వారు విశ్వసిస్తారు. దక్షిణాదిన శ్రీకృష్ణ జన్మాష్టమికి పెద్దగా ప్రాచుర్యం లేదు. అయినా, హైదరాబాద్ నగరంలోని గుజరాతీల లోగిళ్లు జన్మాష్టమి వేడుకల్లో అంగరంగ వైభవంగా వెలిగిపోతుంటాయి. సంప్రదాయాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే గుజరాతీల జన్మాష్టమి నాలుగు రోజుల పాటు సందడిగా జరుగుతాయి.
షష్టి నుంచే సందడి మొదలు...
నిత్యం వ్యాపార లావాదేవీల్లో తలమునకలుగా ఉండే గుజరాతీలు ఈ వేడుకలను అష్టమికి ముందుగా షష్టి నుంచే మొదలు పెడతారు. షష్టి రోజును ‘రాన్‌దన్ ఛట్’గా వ్యవహరిస్తారు. అది వంటలకు ప్రత్యేకించిన రోజు. రాన్‌దన్ అంటే వంట అని అర్థం. అష్టమికి ముందురోజైన సప్తమిని ‘శిత్లా సాతన్’గా వ్యవహరిస్తారు. ఆ రోజు వారు ఇంట్లో వంట చేయరు. ముందురోజు సిద్ధం చేసుకున్న పదార్థాలనే ఆరగిస్తారు. సప్తమి రోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, పొయ్యినే సుఖాసనంగా చేసుకుని కొలువుదీరుతుందని నమ్ముతారు. సప్తమి రోజున దేవాలయానికి వెళ్లి, వేపచెట్టును పూజిస్తారు. శ్రీకృష్ణుడిని తలచుకుని, వేపాకును తాకితే ఆటలమ్మ (చికెన్‌పాక్స్) సోకదని నమ్ముతారు. మూడోరోజు శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. నవమిని ‘నోమ్’గా జరుపుకుంటారు.
- గౌరీభట్ల నరసింహమూర్తి