వ్యాక్సిన్ ఇప్పించాక కూడా చికెన్‌పాక్స్..!
మా బాబుకు ఆరేళ్లు. వాడికి ఇటీవలే చికెన్ పాక్స్ వచ్చింది. అది కాస్త తీవ్రంగా వచ్చి, మందులు వాడాక తగ్గింది. అంతకుమునుపే మా బాబుకు వ్యాక్సిన్ ఇప్పించాం. అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిన చికెన్‌పాక్స్ భవిష్యత్తులో ఏవైనా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? అలాగే నేను బాబుకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నాక్కూడా చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉందా?
- సీతామహాలక్ష్మి, రాజమండ్రి
మీరు చెప్పిన వివరాలను బట్టి మీ బాబుకు చికెన్‌పాక్స్ చాలా తీవ్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. చికెన్‌పాక్స్ అన్నది అన్ని ఆర్థిక, సామాజిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. ఇది రెండు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ జబ్బుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల ఇటీవల ఇది చాలా తక్కువమందిలోనే కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినా దీని లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వల్ల 85 శాతం సందర్భాల్లో మళ్లీ చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం తక్కువ.
అలాగే ఒకవేళ వచ్చినా 97 శాతం మందిలో దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అన్నది సాధ్యమైనంత వరకు రాకుండా నివారించడంతో పాటు, చాలావరకు తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రన పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇటీవల నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు రెండో డోసు కూడా ఇవ్వడం జరుగుతోంది.
ఇక చికెన్‌పాక్స్ వల్ల చాలావరకు దీర్ఘకాలంలో సంభవించే దుష్పరిణామాలన్నవి చాలా చాలా తక్కువ. కొద్దిశాతం మందిలో మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే అక్యూట్‌దశలో నిమోనియా, రక్తం గడ్డకట్టడంలో మార్పులు, మెదడుకు సంబంధించిన సమస్యలు చూడటం జరుగుతుంటుంది. కానీ ఇది వ్యాక్సిన్ అస్సలు తీసుకోని పిల్లల్లో లేదా మరీ చిన్న పిల్లల్లో (నియోనేటల్), పుట్టుకతోనే వ్యాధినిరోధకశక్తి లోపాలు ఉన్న పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ గాని, లేదా చికెన్‌పాక్స్ మళ్లీ మళ్లీ తిరగబెట్టడం గాని చూస్తుంటాం.
ఇక మీ పిల్లాడికి దగ్గరగా ఉండటం వల్ల మీకు కూడా సోకే విషయానికి వస్తే... థియరిటికల్‌గా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినప్పటికీ, మీకు ఇదివరకే చికెన్‌పాక్స్ వచ్చి ఉన్నా లేదా ఆ లక్షణాలు కనిపించి ఉన్నా మళ్లీ మీకు తీవ్రమైన చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే ఇటువంటి లక్షణాలు గర్భిణీ స్త్రీలలో వచ్చినప్పుడు ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపై కూడా చూపించే అవకాశం ఉంటుంది.
ఇక చివరగా... మీ బాబుకు చికెన్‌పాక్స్ తిరగబెడుతుందా అన్న విషయంలో మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అవి వచ్చి తగ్గిపోయాయి కాబట్టి ఇకపై మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్