Dr. Dasari Ramesbabu
-
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
ఇంకా నత్తి నత్తిగా మాటలు వస్తున్నాయి! మా పాపకు తొమ్మిదేళ్లు. స్కూల్లో చాలా బాగా చదువుతుంది. అయితే ఇప్పటికీ ఫ్రీగా నాలుక మాత్రం తిరగడం లేదు. మాట్లాడుతుంటే కొంచెం నత్తిగా వస్తుంటుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు చక్కగానే వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా కావచ్చు అంటున్నారు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి చక్కగా మాట్లాడాలంటే మేమేం చేయాలో సలహా ఇవ్వండి. - సుఫల, కొత్తగూడెం ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించ డం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు సమస్య చాలావరకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్ కలిసి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్ -
పాపకు తలలో మాటిమాటికీ ర్యాష్!
మా పాపకు నాలుగు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్గారికి చూపించి వైద్యం చేయిస్తే తగ్గింది. అది మళ్లీ పునరావృతమవుతోంది. అలాగే పాపకు తలలోని కొన్ని భాగాలలో జుట్టు సరిగా రావడం లేదు. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి? ఇది ఏవైనా ఇతర అనారోగ్యాలకు సూచనా? భవిష్యత్తులో పాపకు చుండ్రు లేదా జుట్టుకు సంబంధించిన ఇతరత్రా సమస్యలు వస్తాయా? - రాజ్యలక్ష్మి, సామర్లకోట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్యతో ప్రభావితమైన భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇంత చిన్న వయసులో ఇలా రావడం వల్ల భవిష్యత్తుల్లో పాపకు చుండ్రు (డాండ్రఫ్), ఇతరత్రా చర్మసమస్యలు వస్తాయని చెప్పడానికి లేదు. మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ, మరోసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
పాపకు ఒంటిపై పులిపిరుల వంటి కాయలు...?
మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమెకు ముఖంతో పాటు ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి కనిపిస్తున్నాయి. మేం గమనించిన దాని ప్రకారం అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. అవి జీవితాంతం వస్తూనే ఉంటాయని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - ధరణి, నరసరావుపేట మీరు చెప్పిన కొద్దిపాటి వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు : చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి. మా పాప వయస్సు ఆరేళ్లు. కొన్నాళ్ల క్రితం బాగా జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందని ఆయన చెప్పారు. జలుబు తగ్గిపోయింది గానీ... ఇప్పుడు మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మా పాపకు ఎందుకిలా జరుగుతోంది? - సురేఖ, కొత్తగూడెం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. టాన్సిల్స్‌కు వచ్చినట్లే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. ఇలాంటప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో మాత్రం చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఇంకా అలవాటు తప్పలేదు... ఏం చేయాలి?
మా అమ్మాయికి పదేళ్లు. చాలా కాలం నుంచి నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. కానీ పాప యుక్తవయసుకు చేరుకుంటున్నా ఇదే సమస్య కనిపిస్తుండటంతో ఆందోళనగా ఉంది. చలికాలం వస్తే సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనలక్ష్మీ, పొన్నూరు మీ అమ్మాయికి ఉన్న సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్‌పై కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. అయితే ఒక శాతం మందిలో మాత్రం ఈ సమస్యను పెద్దయ్యాక కూడా చూస్తుంటాం. సాధారణంగా ఇది అబ్బాయిల్లో ఎక్కువ. యాభైశాతం మందిలో ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉండటం చూస్తుంటాం. ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు , కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే ఆమెను కించపరచడం, శిక్షించడం వంటి పనులు అస్సలు చేయకండి. సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వండి. నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు ఇవ్వకూడదు. ఇక పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయిస్తుంటే... దాదాపు ఈ సమస్య లేనట్లుగానే ఉంటుంది. దాంతో మీ అమ్మాయిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది క్రమంగా ఆమె అలవాటును తప్పించడానికీ మానసికంగానూ దోహదపడే అంశం. చికిత్స : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు, స్ప్రేలతో ఫంక్షన్స్ వంటి సోషల్ గ్యాదరింగ్స్ సమయంలో ఆమెను నిర్భయంగా బయటకు తీసుకెళ్లవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరగడం కూడా ఒక అనుకూలమైన అంశమవుతుంది. ఒకవేళ హార్మోన్లోపాలు ఉన్న సమయంలో 3-6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. అయితే మిగతావారిలో మందులు వాడకకూడా సమస్య అదుపులోకి రాకపోవడం లేదా మందులు మానేశాక మళ్లీ సమస్య తిరగబెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు మందు మోతాదును పెంచి ఇవ్వడంతోపాటు కాంబినేషన్స్ ఇస్తుంటారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందేలా మోటివేట్ చేస్తుంటారు. మీరు మీ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాబుకు తరచూ జ్వరం...
మా బాబుకు మూడు నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సావిత్రి, తుని మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ మాటిమాటికీ (రికరెంట్గా) వస్తున్నట్లు చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణంగా వస్తుంటాయి. అమ్మాయిల్లో ఇవి 3 నుంచి 5 శాతం ఉండగా, అబ్బాయిల్లో 1 నుంచి 2 శాతం కనిపిస్తుంటాయి. పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్లలో శ్వాసకోశవ్యాధుల తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లదే అతి పెద్ద స్ధానం. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడం ఒకింత కష్టమే. ఎందుకంటే వీటి లక్షణాలు నిర్దిష్టంగా ఉండక వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఇతర జబ్బులను పోలి ఉండవచ్చు. అయినప్పటికీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..!
మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు వాడి మాటలను బట్టి తెలుస్తోంది. వాడికి ఇతరత్రా ఎలాంటి అనారోగ్యమూ కనిపించడం లేదు. డాక్టర్గారికి చూపిస్తే విటమిన్-డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్-డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్-డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి. - సునంద, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు తీవ్రంగా ఎముకల నొప్పులతో పాటు కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాంప్రదాయికంగా ఇప్పటివరకూ బాగా చల్లగా ఉండి, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది. అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్-డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. విటమిన్-డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి లోపం వల్ల, శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్-డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్-డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది. విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్ కనిపించవచ్చు. దాంతోపాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్ స్క్లిరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్-డి లోపం ఒక కారణమని తెలుస్తోంది. మీ అబ్బాయి విషయంలో విటమిన్-డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్-డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్-డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్యపరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది. ఈ లోపం తొలగడానికి విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే... సూర్యుడికి తగినంత ఎక్స్పోజ్ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్-డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్-డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే...?
మా పాప వయసు మూడు నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. డాక్టర్గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, మరేం భయం లేదు’ అని కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - ఎస్. దిల్షాద్ బేగం, కర్నూలు పిల్లలు ఇలా అదేపనిగా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎలాంటి ప్రమాదం లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలు అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలు: ఆకలి వేయడం, భయపడటం, దాహం, మూత్ర విసర్జన తర్వాత డయాపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (దీపావళి లేదా ఏదైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాల్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, పొగ వస్తూ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా పరిణమించడం, వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్ఫెక్షన్లు ఉండటం, కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) రావడం, జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారానే తెలియచేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేక పోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), కొద్దిసేపటి కోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు పదే పదే విరేచనాలు...!
మా బాబుకు పదమూడు నెలలు. రెండు నెలల క్రితం వాడికి విపరీతంగా విరేచనాలు అయ్యాయి. దాంతో హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా మాటిమాటికీ తిరగబెడుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గడం, వెంటనే మళ్లీ పెరగడం జరుగుతోంది. ఇది మినహా వాడికి ఇతరత్రా ఏ సమస్యలూ లేవు. అంటే... ఆడుకోవడం, ఆహారం తీసుకోవడం, పెరుగుదల ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి. మా వాడికి ఉన్న సమస్య ఏమిటి? వాడి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి. - శైలజ, చెన్నై మీరు వివరించిన లక్షణాలను బట్టి, మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. అంటే... ఏ సందర్భంలోనైనా విరేచనాలు రెండు వారాల కంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. సాధారణంగా మన దేశంలోని పరిసరాలను పరిగణనలోకి తీసుకుంటే దీర్ఘకాలిక డయేరియాకు ప్రధానంగా ఇన్ఫెక్షన్స్ను కారణంగా చెప్పవచ్చు. అదే ఆర్థికంగా బలమైన దేశాలను తీసుకంటే అక్కడ వివిధ వయసుల వారిలో వచ్చే క్రానిక్ డయేరియాలను బట్టి అనేక కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు గల కారణాలను పరిశీలిస్తే వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ, ఎంజైమ్‌లలో మార్పులు, ఆహారం అరుగుదలలో మార్పులు... అంటే ఇందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా కారణం కావచ్చు. వీటితోపాటు ఇమ్యునలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్ట్రక్చరల్ లోపాలు, మొటిలిటీలో మార్పులు కారణం కావచ్చు. వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యునలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టైనల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యునలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాలకు అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకున్నట్లుగా విశ్లేషించవచ్చు. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ వంటి వాటికి అతడి కడుపు సెన్సిటివ్‌గా మారడం లేదా ఇంకోరకం బ్యాక్టీరియా వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ రావడం జరిగి ఉండవచ్చు. అలాగే ఈ వయసు పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావచ్చు. దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్-ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఇక ఎలాంటి సందర్భాల్లోనైనా డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను అన్వేషించి, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీ బాబు విషయంలో పెరుగుదల, ఆడుకోవడం అంతా నార్మల్‌గా ఉందంటున్నారు కాబట్టి పైన పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
చిన్నపిల్లల్లోనూ మూత్రపిండాలలో రాళ్లు..?
మీరు చెప్పిన లక్షణాలను, సమాచారాన్ని బట్టి మీ అబ్బాయికి కిడ్నీలో రాళ్లు (నెఫ్రోలిథియాసిస్) ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దవాళ్లతో పోలిస్తే ఈ కండిషన్ చిన్నపిల్లల్లో అంత సాధారణం కానప్పటికీ, ఇది అరుదైన విషయం మాత్రం కాదు. పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారుకావడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్ని జన్యుపరమైన అంశాలు ఇందుకు దోహదపడుతుంటాయి. పిల్లలు తీసుకునే ఆహారం, వాతావరణం, ఆర్థిక-సామాజిక పరిస్థితులు, ఎండోక్రైనల్ సమస్యల వంటివి కూడా ఇందుకు కారణాలే. ఇక పదహారేళ్లలోపు పిల్లల్లో 5 నుంచి 6 శాతం మందిలో కిడ్నీలో రాళ్లు కనిపిస్తుంటాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక పిల్లల్లో తరచూ మూత్రసంబంధ (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ వస్తున్న సందర్భాల్లో... మూత్రపిండాల్లో రాళ్లకు అది ఒక ప్రధాన కారణమవుతుంది. పిల్లల కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కడుపునొప్పి, మూత్రంలో రక్తం, కొన్నిసార్లు జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. ఈ రాళ్లలోనూ క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ స్టోన్, సిస్టీన్ వంటి అనేక రకాలుంటాయి. పిల్లల కిడ్నీలో రాళ్లు కనిపించినప్పుడు వారిలో ఏవైనా జీవక్రియలకు సంబంధించిన లోపాల (మెటబాలిక్ డిజార్డర్స్) వంటివి ఉన్నాయా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కండిషన్‌ను నిర్ధారణ చేయడానికి రొటీన్ మూత్రపరీక్షలు, రీనల్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ స్కాన్‌తో పాటు కొన్ని మెటబాలిక్ పరీక్షలు చేయించడం అవసరం. రీనల్ స్కాన్, మెటబాలిక్ పరీక్షల ద్వారా రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దానిపైనే ఆ తదుపరి చికిత్స ఆధారపడి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ రాయి పరిమాణం చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఇలాంటి పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం, పొటాషియం పాళ్లు ఎక్కువగా ఉండే ద్రవాహారాలు తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే కీటోజెనిక్ ఆహారానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వారిలో మూత్రసంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే చికిత్స చేయించడం, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం గా తీసుకోవడం, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటించాలి. ఇక ఉప్పు తక్కువగా తీసుకోవడం అవసరం. అలాగే ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్ వంటి ఆహారాలను బాగా తగ్గించాలి. మీ అబ్బాయి విషయానికి వస్తే... అది ఎలాంటి రాయి అన్నది మనకు తెలియదు కాబట్టి దాని రసాయన స్వభావాన్ని తెలుసుకోవడం కోసం అవసరమైన పరీక్ష చేయించాలి. అలాగే ఎవరిలోనైనా రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, అది దేనికైనా అడ్డుపడటం వల్ల కనిపించే లక్షణాలను కనబరుస్తుంటే దాన్ని శస్త్రచికిత్స లేదా షార్ట్వేవ్ లిథోట్రిప్సీ ప్రక్రియ ద్వారా తొలగింపజేసుకోవాలి. మీరు పైన పేర్కొన్న వివరాలను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ మళ్లీ కనిపిస్తుంటే మాత్రం తప్పనిసరిగా దాని రసాయన స్వభావాన్ని అధ్యయనం చేయించి, అలాంటి రాయి పెరుగుదలను ప్రేరేపించే ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందుగా పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటూ నెఫ్రాలజిస్ట్‌ను గాని యూరాలజిస్ట్‌ను గాని సంప్రదించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వ్యాధుల పాలిట కవచం... టీకా
పెట్టని గోడ, తొడగని కవచం... వీటిని ఎప్పటికీ చూడలేం. మామూలుగానైతే ఇలాంటి మాటలు చమత్కారాల కోసమే. ఆపద నుంచి రక్షించే వాటిని ఉద్దేశించి ఈ మాటలు అంటాం. కానీ చమత్కారం కాస్తా సాకారం అయ్యేది... టీకాల విషయంలోనే. పుట్టిన నాటి నుంచి ఇవ్వాల్సినన్ని సార్లు, ఇవ్వాల్సిన వేళల్లో (అలాగే కొన్ని ఒకసారి) ఇప్పిస్తే దాదాపు జీవితాంతం అనుక్షణం కాపాడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా ఉంటూ ఏయే జబ్బులకోసం వేయించామో ఆయా జబ్బులనుంచి రక్షిస్తుంటాయవి. నేడు వ్యాక్సినేషన్ డే సందర్భంగా వ్యాక్సిన్ల గురించి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. ఏ మాత్రం ప్రమాదకరం కాని రీతిలో ఉండే ఒక జీవసంబంధమైన అంశాన్ని తీసుకుని టీకాను తయారు చేస్తారు. ఒక రోగ కారక సూక్ష్మజీవిని పూర్తిగా బలహీనంగా చేసిగాని, లేదా హాని చేయని మృత సూక్ష్మజీవినిగాని లేదా సూక్ష్మజీవిలోని జన్యుపరమైన అంశాలను ప్రమాదరహితంగా మార్చిగాని శరీరంలోకి పంపిగాని టీకా రూపంలో ఇస్తారు. దాంతో మన శరీరంలోని రోగనిరోధక శక్తి వాటితో పోరాడటం ప్రారంభించే క్రమంలో కొన్ని యాంటీబాడీస్‌ను తయారు చేసుకుంటుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మళ్లీ ఆ రోగ కారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని శరీరం (ఇమ్యూనలాజికల్ మెమరీ) గుర్తించి, దాంతో పోరాడి, దాని కారణంగా వచ్చే జబ్బును నివారిస్తుంది. ఇలా టీకా మనకు రక్షణ కల్పిస్తుందన్నమాట. పుట్టిన నాటి నుంచి ఏయే వేళల ఇవ్వాల్సిన టీకాలు ఆయా వేళల ఇప్పించడం ద్వారా పోలియో, డిఫ్తీరియా, మంప్స్, ధనుర్వాతం (టెటనస్), పొంగు వంటి అనేక జబ్బులను రాకుండా నివారించుకోవచ్చు. మన దేశంలో సైంటిఫిక్ కమిటీల సిఫార్సుల మేరకు నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌తో పాటు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏయే టీకాలు, ఏయే సమయాల్లో వేయాలో సిఫార్సు చేస్తారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ తాజాగా (2012లో) సూచించిన వ్యాక్సిన్లు.... వ్యాక్సిన్ వేశాక కనిపించే కొన్ని ప్రభావాలకు కారణాలు : వ్యాధితో పోలిస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చే దుష్ర్పభావాలు చాలా అరుదు లేదా చాలా తక్కువ. అయితే అరుదుగా వ్యాక్సిన్ ఇచ్చాక కొన్నిసార్లు కొన్ని దుష్ర్పభావాలు కనిపించవచ్చు. దానికి అనేక కారణాలుంటాయి. అనేక వ్యాక్సిన్లను కలిపి ఇచ్చే కాంబినేషన్లలో ఏది ఎంత మోతాదులో కలవాలో అది జరగకపోవడం; వ్యాక్సిన్ తయారీ సమయంలోనే తప్పు దొర్లడం; వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ప్రదేశాలు శరీరంలో నిర్దిష్టంగా ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో కాకుండా వేరే ప్రదేశాల్లో ఇవ్వడం; స్టెరిలైజేషన్ పద్ధతులను అనుసరించకపోవడం; వ్యాక్సిన్‌ను సరిగా నిల్వ చేయకపోవడం... ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్ విఫలం కావచ్చు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో తప్పులు దొర్లకుండా ఉండాలంటేపైన పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటినీ నిరోధించాలి. అంతేగాని ఏవైనా పొరబాట్ల వల్ల జరిగిన పరిణామాలను వ్యాక్సిన్‌కు ఆపాదించకూడదు. వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో నమ్మకం తొలగించే ఎలాంటి చర్యలకూ పాల్పడకూడదు. ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలి: వ్యాక్సిన్లలో అనేక కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫలానావి మంచివనీ, కొన్ని కావని కొందరు అంటుంటారు. దాంతో సాధారణ ప్రజల్లో ఏవి మంచివి, ఏవి కావనే విషయంలో అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం ఉన్న ఏ వ్యాక్సిన్‌ను అయినా నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇక కొందరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే కొన్ని వ్యాక్సిన్లపై సందేహం ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే వ్యాక్సిన్లు కూడా చాలా నాణ్యమైనవే. అయితే కొన్ని నిర్దిష్టమైన (ఆప్షనల్/స్పెషల్) వ్యాక్సిన్లను ప్రభుత్వం ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అవి కూడా క్రమక్రమంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిర్వహణ: యాసీన్ భవిష్యత్తులో రాబోయే కొత్త వ్యాక్సిన్లలో కొన్ని... ఆర్ఎస్వీ వైరస్ హెచ్ఐవీ వైరస్ ఈ-కొలై కలరా డెంగ్యూ మలేరియా చికెన్‌గున్యా హెపటైటిస్ సి, హెపటైటిస్-ఈ స్ట్రెప్టోకోకస్, స్టెఫాలోకాకల్ వంటి కొన్ని సూక్ష్మజీవులకు సంబంధించిన వ్యాక్సిన్లు ఇప్పటికే వేర్వేరు ప్రయోగ దశల్లో ఉన్నాయి. త్వరలోనే అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది హైరిస్క్ పిల్లలకు ఇవ్వాల్సిన కొన్ని వ్యాక్సిన్లు: ఇన్ఫ్లుయెంజా, మెనింగోకోకల్, జాపనీస్ ఎన్కెఫలైటిస్, కలరా, రేబీస్, ఎల్లో ఫీవర్, పీపీఎస్వీ. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
పాపకు పదే పదే జ్వరం... ఏం చేయాలి?
మా పాపకు రెండేళ్లు. ఇటీవల తనకు పదే పదే జ్వరం వస్తోంది. మా డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుతున్నాం. పాపకు ఇతర సమస్యలేమీ ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మా డాక్టర్‌గారు కూడా అంటున్నారు. అయితే పాపకు తరచూ ఇలా జ్వరం ఎందుకు వస్తోంది? ఇదేమైనా తీవ్రమైన వ్యాధులకు సూచికా? ఆమె ఏమైనా ప్రత్యేకమైన పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందా? మాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్వామల, కత్తిపూడి మీరు చెప్పిన సమాచారం, లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు మాటిమాటికీ జ్వరం వస్తున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రత్యేకమైన కారణం ఇదీ అని చెప్పలేకపోయినప్పటికీ, ఇదంత తీవ్రమైన జబ్బుకు నిదర్శనంగా చెప్పే అవకాశం తక్కువే. ఎందుకంటే... పిల్లల్లో జ్వరంతో పాటు ఇతర లక్షణాలు... అంటే ముఖ్యంగా లింఫ్‌గ్రంథులు వాచడం (గడ్డలు), చర్మంలో మార్పులు, కీళ్లనొప్పులు (జాయింట్ పెయిన్స్), కంటిపొరలో మార్పులు, బరువు పెరగకపోవడం, రక్తహీనత ఉండటం, ఎడతెరిపిలేకుండా దగ్గు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కూడా ఉంటే తప్పనిసరిగా ఈ జ్వరం ఏదైనా తీవ్రమైన వ్యాధికి సూచికగా చెప్పవచ్చు. అలాగే పిల్లల్లో జ్వరంతో పాటు తీవ్ర అస్వస్థత... అంటే ముఖ్యంగా నీరసంగా ఉండటం లేదా మగతగా ఉండటం లేదా కొంతమంది పిల్లలు చికాకుగా (ఇరిటబుల్గా) ఉండటం వంటి లక్షణాలను కనబరుస్తుంటే అది తీవ్రమైన వ్యాధికి సూచనగా చెప్పవచ్చు. అయితే చాలా మంది పిల్లల్లో జ్వరం అనేది నిర్దిష్టమైన కారణం లేకుండానే కనిపిస్తుంటుంది. వారికి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు చేయించడం ద్వారా ఆ జ్వరానికి కారణం తెలుసుకోవచ్చు. ఇక ఈ వయసులోని ఆడపిల్లల్లో జ్వరం వస్తుందంటే వారికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమోనని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే... ఇలా పదే పదే జ్వరం కనిపించిన సందర్భాల్లో దాదాపు 50 శాతం మందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండటానికి అవకాశం ఎక్కువ. ఇక కొన్నిసార్లు హెచ్ఎల్హెచ్ సిస్టమ్ అసోసియేటెడ్ కండిషన్స్‌లో కూడా దీర్ఘకాలిక జ్వరాలు రావచ్చు. అయితే వాళ్లలో కనిపించే లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీ పాప విషయంలో జ్వరానికి కారణం నిర్ధారణ చేయడం కోసం రక్తానికి చెందిన బ్లడ్ పిక్చర్, బ్లడ్ కల్చర్ పరీక్షలతో పాటు ఛాతీ ఎక్స్‌రే, డిటెయిల్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి సాధారణ పరీక్షలతో పాటు అవసరమైనప్పుడు ఇమ్యునోగ్లోబ్యులిన్ లెవెల్స్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవడం కోసం రొటీన్ యూరినరీ పరీక్షలు, యూరిన్ కల్చర్ పరీక్షతో పాటు అవసరమైతే యూరినరీ ట్రాక్ట్‌లో ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం... అంటే ముఖ్యంగా వెసైకో యూరినరీ రిఫ్లక్స్ (వీయూఆర్) ఉందేమో అని తెలుసుకోవడం కోసం ఎమ్సీయూజీ అనే పరీక్ష కూడా చాలా అవసరం. మీ పాప విషయంలో యూరినరీ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడితో చర్చించి, తగు వైద్య పరీక్షలు చేయించుకొని, దాన్ని బట్టి అవసరమైన చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి?
మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల రెండుసార్లు కళ్లు తిరిగిపడిపోయాడు. ఒకసారి స్కూల్లో, మరోసారి ఇంటివద్ద ఆడుకుంటున్నప్పుడు ఇలా జరిగింది. అయితే రెండుసార్లు కూడా వాడంతట వాడే తేరుకున్నాడు. వాడికి ఇప్పటివరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్వాలేదు. పిల్లల్లో ఇది సాధారణంగా ఉండే సమస్యే’ అన్నారు. ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందా? మా బాబు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించండి. - స్రవంతి, ఏలూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను ‘సింకోప్’ అని చెప్పవచ్చు. అంటే అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోవడం. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. యుక్తవయసులోపు దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో ఇది కనిపిస్తుంది. సాధారణంగా ఈ సమస్య అంత ప్రాణాపాయకరం కానప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది ప్రాణాపాయకరమైన వ్యాధులకు సూచికగా చెప్పవచ్చు. మనం తరచూ పిల్లల్లో ఉదయం వేళ స్కూల్ అసెంబ్లీలో లేదా క్లాసులో పడిపోవడం వంటి సందర్భాలను చూస్తుంటాం. అందుకు ఆర్థోస్టాటిక్ / పొజిషనల్ వేరియేషన్స్ లను కారణంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు వ్యాసోవేగల్ స్టిమ్యులేషన్స్ అంటే... ఉదాహరణకు తీవ్రమైన నొప్పితో కూడుకున్న మూత్రవిసర్జన, మలవిసర్జన, గాయం కావడం, ఒక్కోసారి గట్టిగా తలదువ్వడం వంటి సందర్భాల్లో కూడా సింకోప్‌ను చూస్తుంటాం. అలాగే గుండెజబ్బులు... ఉదాహరణకు అరిథ్మియా, అయోర్టిక్ స్టెనోసిస్, సైనోటిక్ గుండె సమస్యలు, కార్డియోమయోపతి ఉన్న కండిషన్లలో; అలాగే మైగ్రేన్ ఉన్న పిల్లల్లో కూడా సింకోప్ కనిపించవచ్చు. ఇక ఫిట్స్ / సీజర్స్ ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఏవైనా విషవాయువులు, మందులకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా సింకోప్‌ను గమనించవచ్చు. ఇలా పైన పేర్కొన్న అన్ని కండిషన్లలోనూ పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇక కొన్నిసార్లు అతి సాధారణమైన కారణాలైన ఆహారం సరిగా తీసుకోకపోవడం, రక్తంలో చక్కెర పాళ్లు తగ్గే హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్‌లో కూడా కళ్లు తిరిగిపడిపోవచ్చు. పిల్లల్లో సింకోప్ కనిపించినప్పుడు ఎంత వ్యవధి పాటు అలా స్పృహలో లేకుండా ఉండిపోయారు అన్న విషయంతో పాటు ఆ సమయంలో అతడిలో కనిపించిన లక్షణాలు (అసోసియేటెడ్ సింప్టమ్స్) అంటే ఉదాహరణకు గుండె స్పందనలు తగ్గడం, నీలంగా అయిపోవడం, దీర్ఘకాలం పాటు అలా అపస్మారకంలో ఉండటం కూడా కనిపిస్తే అది కొంచెం తీవ్రమైన జబ్బుకు సూచన కావచ్చేమోనని అనుమానించాలి. పిల్లల్లో పదే పదే సింకోప్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు (కార్డియాక్ ఇవాల్యుషన్)తో పాటు అవసరమైనప్పుడు న్యూరలాజికల్ ఇవాల్యూయేషన్ కూడా చేయించాలి. ముఖ్యంగా ఈసీజీ, హోల్టర్, ఈఈజీ వంటి పరీక్షల ద్వారా అది తీవ్రమైన జబ్బులకు సూచనా, కాదా అన్న విషయం తప్పనిసరిగా తెలుస్తుంది. ఇక పిల్లలు కూర్చున్నప్పుడు కూడా కళ్లు తిరిగిపడిపోవడం వంటి సంఘటనలు జరిగితే వాళ్లకు తక్షణమే తప్పనిసరిగా తగు పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవడం అవసరం. ఇక మీ బాబు విషయంలో ఇది ఆర్థోస్టాటిక్ సింకోప్గా అనిపిస్తోంది. ఇది ముఖ్యంగా నిలబడి ఉన్నప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందని సందర్భాల్లో కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల విషయంలో వాళ్లను కాసేపు ఫ్లాట్‌గా పడుకోబెడితే వాళ్లంతట వాళ్లే తేరుకుంటారు. ఇలాంటి పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండటం, వాళ్లు ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్లోకి మారుతున్నప్పుడు నింపాదిగా చేయడం లేదా కొద్దిగా సమయం తీసుకోవడం అవసరం. ఉదాహరణకు మంచం మీద పడుకుని ఉన్నవారు అకస్మాత్తుగా కూర్చొని, ఆ వెంటనే పరుగెత్తడం వంటివి చేయకూడదు. అలాగే నిలబడి ఉన్నప్పుడు కాళ్లు కాస్తంత కదుపుతూ ఉండటం వంటివి చేస్తే ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం తక్కువ. మీ అబ్బాయికి మళ్లీ ఇవే లక్షణాలు కనిపిస్తే పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ, ఒకసారి కార్డియాలజిస్టుకు తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు కాళ్లు, చేతుల మీద ర్యాష్... ఏం చేయాలి?
మా బాబుకు మూడేళ్లు. వాడికి ఇటీవల కాళ్లు, చేతుల మీద నీటిపొక్కుల్లా వచ్చాయి. ఇదే ర్యాష్ మా ఏడాదిన్నర పాపకు కూడా వచ్చింది. ఇది చికెన్‌పాక్స్ అని చికిత్స చేశారు. అయితే మా వాడికి పోయిన ఏడాది కూడా ఇలాగే ర్యాష్ వచ్చి తగ్గిపోయింది. అలాగే వాడికి చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు ర్యాష్ వస్తోంది? అసలిది చికెన్పాక్సేనా? - కేశవనాయుడు, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబుకు జ్వరంతో కలిసి కొద్దిపాటి పాపిలో వెసైకిల్ ర్యాష్ వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లల్లో జ్వరంతో పాటు కలిసి ర్యాష్ వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మీజిల్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్, డెంగ్యూ, హెర్పిస్ సింప్లెక్స్, కాక్సాకీ వంటి వైరల్ జబ్బులు, అలాగే స్టాత్ ఆర్ఎస్, స్టెఫాలోకాకస్, రికెట్షియల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని కొల్లాజెన్ డిసీజెస్ వల్ల కూడా శరీరం మీద ఇలా ర్యాష్ వస్తుండవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ అమ్మాయికి కూడా ర్యాష్ రావడం వంటి అంశాన్ని బట్టి, మీరు వివరించిన విస్తృతిని బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఈసారి వచ్చింది చికెన్‌పాక్స్ కాదు. వారిద్దరికీ వచ్చిన జబ్బు ‘హ్యాండ్ ఫుట్ మౌత్ సిండ్రోమ్’లా అనిపిస్తోంది. ఇది కాక్సాకీ వైరస్, ఎంటిరో వైరస్ అనే తరహా వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీన్ని చిన్నపిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల నుంచి ఆరేళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ పిల్లల్లో నొప్పితో కూడిన ఎర్రటి ర్యాష్ వేళ్ల మీద, కాళ్ల మీద వస్తుంటాయి. నోటిలోపలి భాగంలో అల్సర్స్ రూపంలో కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ర్యాష్‌తో పాటు చాలా కొద్దిశాతం మంది పిల్లల్లో గుండె ఇన్వాల్వ్మెంట్ (మయోకార్డయిటిస్), లంగ్ ఇన్వాల్వ్మెంట్ (నిమోనియా), బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ (ఎన్కెఫలైటిస్) వంటి తీవ్రమైన అంశాలతో పాటు, చాలామందిలో శ్వాసకోశ (రెస్పిరేటరీ) ఇన్ఫెక్షన్లు, చెవినొప్పి వంటి కొద్దిపాటి లక్షణాలు కూడా కనపడుతుండవచ్చు. తీవ్రతను బట్టి ఈ జబ్బు మూడు నుంచి ఐదురోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. వాడినా ప్రయోజనం ఉండదు. కానీ నొప్పి, దురద నుంచి ఉపశమనం పొందడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్నప్పుడు లేదా దాని కాంప్లికేషన్లు పెరుగుతున్నప్పుడు యాంటీవైరల్ మందుల వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. గత కొద్ది నెలలుగా ఈ లక్షణాలున్న పిల్లలను చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి లక్షణాలు నెలల పిల్లల్లో వచ్చినప్పుడు సెప్సిస్ వంటి కారణాలను రూల్ అవుట్ చేయడం చాలా ముఖ్యం. ఇక మీరు చెబుతున్న చికెన్‌పాక్స్ విషయానికి వస్తే... దానికోసం వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ అది మళ్లీ రావచ్చు. కానీ అప్పుడు దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యాధి నివారణ, తీవ్రత తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి మీరు మీ బాబు, పాప విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబు గుండెలో రంధ్రాలు... ఏం చేయాలి?
మాకు ఇటీవలే బాబు పుట్టాడు. నెల రోజుల తర్వాత బాగా జలుబు చేసినట్లుగా, నెమ్ము చేరినట్లుగా అనిపిస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. కొన్ని పరీక్షలు చేసి గుండెలో రంధ్రాలు ఉన్నాయని పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్లి చూపిస్తే గుండెలోపల రెండు రంధ్రాలు ఉన్నాయనీ, బాబుది చిన్నవయసే కాబట్టి అతడు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే పూడుకుంటాయన్నారు. మాకు చాలా దిగులుగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్రీధర్, షాద్‌నగర్ బాబు గుండెలో రంధ్రాలున్నాయంటూ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ... అంటే గుండె పైగదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉన్నప్పటికీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా ఉన్నప్పుడు తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. ఐతే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది... ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి, ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్రా సమస్యల (అసోసియేటెడ్ కార్డియాక్ డిఫెక్ట్స్) పై ఆధారపడి ఉంటుంది. గుండె పైగదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 నుంచి 40 శాతం మందిలోనూ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స ఎంతైనా అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకూ ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుండె గదుల గోడలపై రంధ్రాలున్న పిల్లలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యచికిత్స సహాయంతో - శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే ఇంట్రావెన్షన్ ద్వారా దాదాపు 95 శాతం పైగా సక్సెస్ రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు తరచూ తలనొప్పి... ఏం చేయాలి?
మా బాబు వయసు ఎనిమిదేళ్లు. తరచూ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. - ప్రభాకర్ నాయుడు, చిత్తూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్‌తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి మీ బాబుది మైగ్రేన్ వల్ల తలనొప్పి అని భావించవచ్చు. ఈ మైగ్రేన్‌లోనూ చాలారకాలు ఉన్నాయి. ఆహారంలో నైట్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం, అలసట, నిద్రలేమి... వంటి కారణాల వల్ల ఇది మరింత పెరుగుతుంది. కొద్దిమంది పిల్లల్లో వెలుతురు చూడటానికి ఇష్టపడకపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది తీవ్రంగా ఉండే కొంతమంది లో దీనివల్ల శరీరంలోని కొన్ని అవయవాలు బలహీనంగా మారడం కూడా కనిపించవచ్చు. చికిత్స చాలా ప్రశాంతంగా ఉండే వెలుతురు లేని గదిలో విశ్రాంతి తీసుకోవడం నుదుటిపై చల్లటి నీటితో అద్దడం నొప్పి తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మందులు (ఉదాహరణకు ఆస్పిరిన్ లేదా ఎన్ఎస్ఏఐడీ గ్రూప్ మందులు) వాడటం నీళ్లు ఎక్కువగా తాగించడం ఆందోళన, టెన్షన్, మానసిక ఒత్తిడిని నివారించడం పైన పేర్కొన్న జాగ్రత్తలతో మైగ్రేన్ కారణంగా తరచూ వచ్చే తలనొప్పి ఎటాక్స్‌ను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఇది తరచూ వస్తుంటే మాత్రం ప్రొఫిలాక్టిక్ చికిత్సగా మూడు నుంచి ఆరు నెలల పాటు డాక్టర్ సలహా మేరకు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు మరొకసారి మీ న్యూరోఫిజీషియన్ లేదా మీ ఫ్యామిలీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోవడం ప్రధానం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది...
మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా సాగడం లేదంటూ చెబుతోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం తాత్కాలికంగానే ఉంటోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - విశాలాక్షి, అమరావతి మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండాను, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటిగాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమో షనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునో గ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్ తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు తరచూ కడుపునొప్పి... ఏం చేయాలి?
మా అబ్బాయి వయసు ఆరేళ్లు. కొన్ని నెలలుగా వాడికి తరచు కడుపు నొప్పి వస్తోంది. డాక్టర్లకు చూపించాం. కొన్ని పరీక్షలు చేసి అన్నీ నార్మల్‌గానే ఉన్నాయంటున్నారు. అయితే స్కాన్‌లో కొన్ని లింఫ్‌గ్రంథులు పెద్దవి అయినట్లుగా రిపోర్టులో వచ్చిందని చెప్పారు. మా బాబు విషయంలో ఆందోళనగా ఉంది. వాడికి ఉన్న సమస్య ఏమిటి? మాకు సరైన సలహా ఇవ్వండి. - రాజ్యలక్ష్మి, తుని మీ బాబు రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో తీవ్రమైన కడుపునొప్పి తరచూ వస్తూండటానికి చాలా కారణాలు ఉంటాయి. కడుపుకు సంబంధించిన రుగ్మతలు, లివర్‌కు సంబంధించిన రుగ్మతలు, మూత్ర విసర్జన వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషాలు శరీరంలో వ్యాపించడం (పాయిజనింగ్), శారీరక జీవవిధులు (మెటబాలిక్ ఫంక్షన్స్), మానసిక సమస్యల వల్ల కడుపునొప్పి రావచ్చు. మీ బాబు విషయంలో పరీక్షలు చేసి, అవన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి పైన పేర్కొన్న అంశాలు అతడి కడుపునొప్పికి కారణం కాకపోవచ్చు. ఇక రిపోర్ట్స్‌లో లింఫ్‌నోడ్స్ పెరిగినట్లుగా రాశారు. కాబట్టి అతడి సమస్యను మిసెంట్రిక్ లింఫెడినైటిస్‌గా చెప్పవచ్చు. కడుపులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ (అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్) వచ్చినప్పుడు, అక్కడి కణజాలం ఏదైనా ఇన్ఫెక్షన్తో పోరాడుతున్నప్పుడు ఇలా గ్రంథుల సైజ్ పెరుగుతుంది. అంతేకాదు... గొంతు, కడుపు, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అపెండిసైటిస్‌లో కూడా లింఫ్ గ్రంథుల సైజ్ పెరుగుతుంది. ఈ పరిస్థితి రెండు నుంచి పదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యమధ్యన ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఉండటం, మందులు వాడగానే నొప్పి తగ్గడం వంటివి చూస్తుంటే దీన్ని నాన్-స్పెసిఫిక్ లింఫెడినోపతిగా చెప్పవచ్చు. అంటే ఇది అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. అయితే చాలా అరుదుగా ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు కూడా గ్రంథులు పెద్దవి కావచ్చు. అయితే అలాంటి పిల్లల్లో దీనితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. మీ అబ్బాయికి మరికొన్ని రోజులు ఆగి మరోసారి స్కాన్ తీసి చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీ అబ్బాయి సమస్య తీవ్రతను అంచనా వేయడం మంచిది. దాదాపు 80 శాతం నుంచి 90 శాతం పిల్లల్లో ఆ గ్రంథుల సైజ్ దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే సీటీ స్కాన్, అవసరమైన సందర్భాల్లో వాటి బయాప్సీ చేసి వాటి పెరుగుదలకు కారణం ఏమిటో చూడవచ్చు. ఈలోపు మీ బాబుకు మీ డాక్టర్ సలహా మేరకు నొప్పినివారణ మందులు వాడితే సరిపోతుంది. అయితే ఎవరికైనా సరే... నొప్పి లేకుండా గ్రంథుల పరిమాణం 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువైతే మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. అలాంటప్పుడు మరింత తీవ్రమైన, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు మీ పిడియాట్రీషియన్ ఆధ్వర్యంలో మీ బాబుకు తగిన చికిత్స చేయించుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వ్యాక్సిన్ ఇప్పించాక కూడా చికెన్‌పాక్స్..!
మా బాబుకు ఆరేళ్లు. వాడికి ఇటీవలే చికెన్ పాక్స్ వచ్చింది. అది కాస్త తీవ్రంగా వచ్చి, మందులు వాడాక తగ్గింది. అంతకుమునుపే మా బాబుకు వ్యాక్సిన్ ఇప్పించాం. అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిన చికెన్‌పాక్స్ భవిష్యత్తులో ఏవైనా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? అలాగే నేను బాబుకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నాక్కూడా చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉందా? - సీతామహాలక్ష్మి, రాజమండ్రి మీరు చెప్పిన వివరాలను బట్టి మీ బాబుకు చికెన్‌పాక్స్ చాలా తీవ్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. చికెన్‌పాక్స్ అన్నది అన్ని ఆర్థిక, సామాజిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. ఇది రెండు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ జబ్బుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల ఇటీవల ఇది చాలా తక్కువమందిలోనే కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినా దీని లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వల్ల 85 శాతం సందర్భాల్లో మళ్లీ చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అలాగే ఒకవేళ వచ్చినా 97 శాతం మందిలో దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అన్నది సాధ్యమైనంత వరకు రాకుండా నివారించడంతో పాటు, చాలావరకు తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రన పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇటీవల నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు రెండో డోసు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక చికెన్‌పాక్స్ వల్ల చాలావరకు దీర్ఘకాలంలో సంభవించే దుష్పరిణామాలన్నవి చాలా చాలా తక్కువ. కొద్దిశాతం మందిలో మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే అక్యూట్దశలో నిమోనియా, రక్తం గడ్డకట్టడంలో మార్పులు, మెదడుకు సంబంధించిన సమస్యలు చూడటం జరుగుతుంటుంది. కానీ ఇది వ్యాక్సిన్ అస్సలు తీసుకోని పిల్లల్లో లేదా మరీ చిన్న పిల్లల్లో (నియోనేటల్), పుట్టుకతోనే వ్యాధినిరోధకశక్తి లోపాలు ఉన్న పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ గాని, లేదా చికెన్‌పాక్స్ మళ్లీ మళ్లీ తిరగబెట్టడం గాని చూస్తుంటాం. ఇక మీ పిల్లాడికి దగ్గరగా ఉండటం వల్ల మీకు కూడా సోకే విషయానికి వస్తే... థియరిటికల్‌గా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినప్పటికీ, మీకు ఇదివరకే చికెన్‌పాక్స్ వచ్చి ఉన్నా లేదా ఆ లక్షణాలు కనిపించి ఉన్నా మళ్లీ మీకు తీవ్రమైన చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే ఇటువంటి లక్షణాలు గర్భిణీ స్త్రీలలో వచ్చినప్పుడు ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపై కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇక చివరగా... మీ బాబుకు చికెన్‌పాక్స్ తిరగబెడుతుందా అన్న విషయంలో మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అవి వచ్చి తగ్గిపోయాయి కాబట్టి ఇకపై మీరు నిశ్చింతగా ఉండవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
స్కోలియోసిస్ అంటే ఏమిటి?
మా అబ్బాయికి ఆరేళ్లు. వాడికి వెన్ను కాస్త వంకరగా ఉందేమో అనిపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. డాక్టర్‌గారు మావాడిని చూసి, కొద్దిపాటి సమస్య ఉందని, దాని పేరు స్కోలియోసిస్ అని నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి చికిత్స ఏమీ అవసరం లేదని అన్నారు. వాడికి ఇతరత్రా సమస్యలు ఏమీ లేవు. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? అది మున్ముందు ఏమైనా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందా? - మాణిక్యప్రసాద్, చిత్తూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి స్కోలియోసిస్ అనే సమస్య ఉన్నట్లు చెప్పవచ్చు. ఇది వెన్నెముకకు సంబంధించిన ఒక సంక్లిష్టమైన సమస్య (స్పైనల్ డిఫార్మిటీ). ఇది వెన్ను మొత్తంలో ఎక్కడైనా రావచ్చు. ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చే సమస్యలు... ముఖ్యంగా వెన్నుపూసల అమరికలో తేడాలు ఉన్నప్పుడు, నరాలతోపాటు కండరాల సమస్య ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కండరాల సమస్యలు ఉన్నప్పుడు, వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు, అలాగే రెండు కాళ్ల పొడవులో తేడాలు ఉండటం వల్ల, పుట్టుకతో వచ్చే (కంజెనిటల్) కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపించవచ్చు. మరికొందరిలో ఇది కొన్ని జన్యుపరమైన సమస్యలతో అనుబంధంగా కూడా ఉండవచ్చు. లేదా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా (ఇడియోపథిక్గా) కూడా ఈ సమస్య కనిపించవచ్చు. ఇలాంటి రోగుల్లో ఇది నడకలో మార్పులు, ఛాతీ అమరికలో తేడాలు (ఛెస్ట్ డిఫార్మిటీ), నిల్చునే పద్ధతిలో మార్పుల వంటి చిన్నపాటి సమస్యలతో బయటపడుతుంది. ఎక్స్-రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా దీని తీవ్రతను పూర్తిగా నిర్ధారణ చేయవచ్చు. చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్య కనిపించినప్పుడు విపులమైన నరాలకు సంబంధించిన పరీక్షలు (డీటెయిల్డ్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్) చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది బయటకు కనిపించకుండా ఉన్న కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలకు సూచిక అయి ఉండవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే దీనికి కారణాలు తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం చేయడం ముఖ్యం. ఈ పిల్లలకు చికిత్స అన్నది వారి వయసుపైనా, వెన్ను వంకరలోని తీవ్రత (డిగ్రీ ఆఫ్ కర్వేచర్) మీద ఆధారపడి ఉంటుంది. బ్రేసింగ్, శస్త్రచికిత్స ప్రక్రిల ద్వారా ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా, ఇతరత్రా కాంప్లికేషన్లకు దారితీయకుండా కాపాడవచ్చు. ఈ సమస్య వల్ల చిన్నపిల్లల్లో వారి వారి దైనందిన చర్యలకు ఇబ్బంది కలుగుతుంటే బ్రేసింగ్ వల్ల, అది మరింత పెరగకుండా ఆపడంతో పాటు, ఉపశమనం కూడా కలిగించవచ్చు. అయితే వెన్ను వంకర మరింత తీవ్రమవుతూ పోతుంటే (డిగ్రీ ఆఫ్ యాంగులేషన్ ఎక్కువగా ఉంటే) తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇక చాలా తీవ్రమైన స్కోలియోసిస్ ఉన్నప్పుడు అది ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. అలాగే కొన్నిసార్లు గుండె పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు. మీ అబ్బాయికి ఇడియోపథిక్ జువెనైల్ స్కోలియోసిస్ అనే కండిషన్ ఉండవచ్చు. అయితే ఈ కండిషన్లో ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు ఏమీ లేవని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి పిల్లలు తప్పనిసరిగా ఆర్థోపెడిక్ లేదా స్పైన్ సర్జన్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఫాలో-అప్‌లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే వాళ్లలో రుగ్మత తీవ్రత పెరుగుతూ పోతుందేమో అని పరిశీలిస్తూ, దాన్ని బట్టి సరైన సమయంలో సరైన చికిత్సకు నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీరు ఒకసారి మీకు దగ్గర్లోని స్పైన్ సర్జన్‌తో పాటు పీడియాట్రీషియన్‌ను సంప్రదించి, వారి ఫాలోఅప్‌లో ఉండటం తప్పనిసరి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్