బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి? | My son often loses consciousness, what should do? | Sakshi
Sakshi News home page

బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి?

Published Wed, Oct 30 2013 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి?

బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి?

మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల రెండుసార్లు కళ్లు తిరిగిపడిపోయాడు. ఒకసారి స్కూల్లో, మరోసారి ఇంటివద్ద ఆడుకుంటున్నప్పుడు ఇలా జరిగింది. అయితే రెండుసార్లు కూడా వాడంతట వాడే తేరుకున్నాడు. వాడికి ఇప్పటివరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్వాలేదు. పిల్లల్లో ఇది సాధారణంగా ఉండే సమస్యే’ అన్నారు. ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందా? మా బాబు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించండి.
 - స్రవంతి, ఏలూరు

 
 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను ‘సింకోప్’ అని చెప్పవచ్చు. అంటే అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోవడం. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. యుక్తవయసులోపు దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో ఇది కనిపిస్తుంది. సాధారణంగా ఈ సమస్య అంత ప్రాణాపాయకరం కానప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది ప్రాణాపాయకరమైన వ్యాధులకు సూచికగా చెప్పవచ్చు.
 
 మనం తరచూ పిల్లల్లో ఉదయం వేళ స్కూల్ అసెంబ్లీలో లేదా క్లాసులో పడిపోవడం వంటి సందర్భాలను చూస్తుంటాం. అందుకు ఆర్థోస్టాటిక్ / పొజిషనల్ వేరియేషన్స్ లను కారణంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు వ్యాసోవేగల్ స్టిమ్యులేషన్స్ అంటే... ఉదాహరణకు తీవ్రమైన నొప్పితో కూడుకున్న మూత్రవిసర్జన, మలవిసర్జన, గాయం కావడం, ఒక్కోసారి గట్టిగా తలదువ్వడం  వంటి సందర్భాల్లో కూడా సింకోప్‌ను చూస్తుంటాం. అలాగే గుండెజబ్బులు...  ఉదాహరణకు అరిథ్మియా, అయోర్టిక్ స్టెనోసిస్, సైనోటిక్ గుండె సమస్యలు, కార్డియోమయోపతి ఉన్న కండిషన్లలో; అలాగే మైగ్రేన్ ఉన్న పిల్లల్లో కూడా సింకోప్ కనిపించవచ్చు.

ఇక ఫిట్స్ / సీజర్స్ ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఏవైనా విషవాయువులు, మందులకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా సింకోప్‌ను గమనించవచ్చు. ఇలా పైన పేర్కొన్న అన్ని కండిషన్‌లలోనూ పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇక కొన్నిసార్లు అతి సాధారణమైన కారణాలైన ఆహారం సరిగా తీసుకోకపోవడం, రక్తంలో చక్కెర పాళ్లు తగ్గే హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్‌లో కూడా కళ్లు తిరిగిపడిపోవచ్చు. పిల్లల్లో సింకోప్ కనిపించినప్పుడు ఎంత వ్యవధి పాటు అలా స్పృహలో లేకుండా  ఉండిపోయారు అన్న విషయంతో పాటు ఆ సమయంలో అతడిలో కనిపించిన లక్షణాలు (అసోసియేటెడ్ సింప్టమ్స్) అంటే ఉదాహరణకు గుండె స్పందనలు తగ్గడం, నీలంగా అయిపోవడం, దీర్ఘకాలం పాటు అలా అపస్మారకంలో ఉండటం కూడా కనిపిస్తే అది కొంచెం తీవ్రమైన జబ్బుకు సూచన కావచ్చేమోనని అనుమానించాలి.

పిల్లల్లో పదే పదే సింకోప్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు (కార్డియాక్ ఇవాల్యుషన్)తో పాటు అవసరమైనప్పుడు న్యూరలాజికల్ ఇవాల్యూయేషన్ కూడా చేయించాలి. ముఖ్యంగా ఈసీజీ, హోల్టర్, ఈఈజీ వంటి పరీక్షల ద్వారా అది తీవ్రమైన జబ్బులకు సూచనా, కాదా అన్న విషయం తప్పనిసరిగా తెలుస్తుంది. ఇక పిల్లలు కూర్చున్నప్పుడు కూడా కళ్లు తిరిగిపడిపోవడం వంటి సంఘటనలు జరిగితే వాళ్లకు తక్షణమే తప్పనిసరిగా తగు పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవడం అవసరం.
 
 ఇక మీ బాబు విషయంలో ఇది ఆర్థోస్టాటిక్ సింకోప్‌గా అనిపిస్తోంది. ఇది ముఖ్యంగా నిలబడి ఉన్నప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందని సందర్భాల్లో కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల విషయంలో వాళ్లను కాసేపు ఫ్లాట్‌గా పడుకోబెడితే వాళ్లంతట వాళ్లే తేరుకుంటారు. ఇలాంటి పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండటం, వాళ్లు ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌లోకి మారుతున్నప్పుడు నింపాదిగా చేయడం లేదా కొద్దిగా సమయం తీసుకోవడం అవసరం. ఉదాహరణకు మంచం మీద పడుకుని ఉన్నవారు అకస్మాత్తుగా కూర్చొని, ఆ వెంటనే పరుగెత్తడం వంటివి చేయకూడదు. అలాగే నిలబడి ఉన్నప్పుడు కాళ్లు కాస్తంత కదుపుతూ ఉండటం వంటివి చేస్తే ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం తక్కువ.
 
 మీ అబ్బాయికి మళ్లీ ఇవే లక్షణాలు కనిపిస్తే పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ, ఒకసారి కార్డియాలజిస్టుకు తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉంది.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement