Star Hospital
-
ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి
-
బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం
తిరుపతి మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు. తిరుపతి గాంధీపురంలో నివాసం ఉండే పెద్దపాపమ్మకు కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) ఉన్నాడు. అవివాహితుడైన చిరంజీవి తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన జ్వరంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఈనెల 27న స్విమ్స్‌లో చేర్చారు. అత్యవసర విభాగం నుంచి ఆర్‌ఐసియు విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న చిరంజీవికి శనివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో చిరంజీవి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్టు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వచ్చారు. స్విమ్స్ అధికారులు, జీవన్‌దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా శస్త్ర చికిత్సలు చేసి నాలుగు అవయవాలను తీసుకున్నారు. అందులో గుండెను హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు విమానం ద్వారా తీసుకెళ్లారు. లివర్‌ను విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌కు విమానం ద్వారా తరలించారు. రెండు కిడ్నీల్లో ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌కు, మరొకటి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి అమర్చారు. మరణించినా తన అవయవాలను మరో నలుగురికి దానం చేసిన చిరంజీవి మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, దాత కుటుంబ సభ్యులకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డెరైక్టర్లు ఆదిక్రిష్ణ, డాక్టర్ వెంకటరామరెడ్డి,అవయవ దాన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి, జయశ్రీ,సుదర్శన్, ప్రకాష్‌లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
15 రోజుల్లో 19 కేజీల బరువు తగ్గింపు
హిమాయత్‌నగర్ వాసికి ‘స్టార్’లో సర్జరీ.. ఎంపీ బూర వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తికి 15 రోజుల్లోనే 19 కేజీల బరువును విజయవంతంగా తగ్గించారు నగరంలోని స్టార్ ఆస్పత్రి వైద్యులు. బెరియాట్రిక్ సర్జరీ ద్వారా ఆ వ్యక్తి బరువును 205 కేజీల నుంచి 186 కేజీలకు తగ్గించారు. ఈ మేరకు బుధవారం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ, ప్రముఖ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ శస్త్రచికిత్స వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి ఊబకాయంతో బాధపడుతున్న హిమాయత్‌నగర్‌కు చెందిన సంయోద్దీన్(49) బూర నర్సయ్యగౌడ్‌ను ఆశ్రయించారు. వైద్యులు ఆయనకు ఈ నెల 6న బెరియాట్రిక్ సర్జరీ చేశారు. శరీరం నుంచి గ్రాము కొవ్వు కూడా బయటికి తీయలేదు. జీర్ణాశయ పేగు సైజు తగ్గించడం వల్ల ఆహారం, నీరు ఎక్కువ తీసుకోలేరు. తద్వారా పొట్ట, నడుం, ఇతర భాగాల్లో పేరుకపోయిన కొవ్వు కరిగి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇలా నెలకు సగటున ఆరు నుంచి ఏడు కేజీల చొప్పున బరువు తగ్గే అవకాశం ఉంది. ‘ప్రస్తుత జనాభాలో 10 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు పరోక్షంగా మధుమేహం, హైపర్ టెన్షన్, శ్వాసకోశ సమస్యలు, ప్యాటీ లివర్, హృద్రోగ సమస్యలకు కారణమవుతోంది. వీరి పాలిట బెరియాట్రిక్ సర్జరీ ఓ వరం లాంటిది. బెరియాట్రిక్ చికిత్సలపై ప్రజల్లో ఇప్పటికీ కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే ఇది చాలా సేఫ్ సర్జరీ’ అని డాక్టర్ నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
హైదరాబాద్:నగరంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. శుక్రవారం ప్రాణంతాక స్వైన్ ఫ్లూ వైరస్ తో మరో మహిళ మృతి చెందిన ఘటన ఉస్మానియా ఆస్పత్రిలో వెలుగుచూసింది.కొన్ని రోజుల క్రిత స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆ మహిళ మృత్యువుతూ పోరాడి ఈరో్జు ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే హైదరాబాద్ లో పలు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. గత పది రోజుల్లో స్వైన్ ఫ్లూ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. ఇదిలా ఉండగా గురువారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌కు చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుడు ఒకరు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైఎస్సార్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం వీరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్దారించలేదు. -
మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గురువారం మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్‌కు చెందిన స్వైన్‌ఫ్లూ బాధితుడు ఒకరు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైఎస్సార్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం వీరికి స్వైన్‌ఫ్లూ వచ్చినట్లు ఇంకా నిర్ధారించలేదు. -
స్పృహలోనే పేషెంట్.. ఆపరేషన్ సక్సెస్!
-
బాబు కళ్లుతిరిగి పడిపోతున్నాడు... ఏం చేయాలి?
మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల రెండుసార్లు కళ్లు తిరిగిపడిపోయాడు. ఒకసారి స్కూల్లో, మరోసారి ఇంటివద్ద ఆడుకుంటున్నప్పుడు ఇలా జరిగింది. అయితే రెండుసార్లు కూడా వాడంతట వాడే తేరుకున్నాడు. వాడికి ఇప్పటివరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. డాక్టర్‌కు చూపిస్తే ‘పర్వాలేదు. పిల్లల్లో ఇది సాధారణంగా ఉండే సమస్యే’ అన్నారు. ఇది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందా? మా బాబు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించండి. - స్రవంతి, ఏలూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను ‘సింకోప్’ అని చెప్పవచ్చు. అంటే అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోవడం. ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. యుక్తవయసులోపు దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఏదో ఒక సమయంలో ఇది కనిపిస్తుంది. సాధారణంగా ఈ సమస్య అంత ప్రాణాపాయకరం కానప్పటికీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది ప్రాణాపాయకరమైన వ్యాధులకు సూచికగా చెప్పవచ్చు. మనం తరచూ పిల్లల్లో ఉదయం వేళ స్కూల్ అసెంబ్లీలో లేదా క్లాసులో పడిపోవడం వంటి సందర్భాలను చూస్తుంటాం. అందుకు ఆర్థోస్టాటిక్ / పొజిషనల్ వేరియేషన్స్ లను కారణంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు వ్యాసోవేగల్ స్టిమ్యులేషన్స్ అంటే... ఉదాహరణకు తీవ్రమైన నొప్పితో కూడుకున్న మూత్రవిసర్జన, మలవిసర్జన, గాయం కావడం, ఒక్కోసారి గట్టిగా తలదువ్వడం వంటి సందర్భాల్లో కూడా సింకోప్‌ను చూస్తుంటాం. అలాగే గుండెజబ్బులు... ఉదాహరణకు అరిథ్మియా, అయోర్టిక్ స్టెనోసిస్, సైనోటిక్ గుండె సమస్యలు, కార్డియోమయోపతి ఉన్న కండిషన్లలో; అలాగే మైగ్రేన్ ఉన్న పిల్లల్లో కూడా సింకోప్ కనిపించవచ్చు. ఇక ఫిట్స్ / సీజర్స్ ఉన్న పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఏవైనా విషవాయువులు, మందులకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా సింకోప్‌ను గమనించవచ్చు. ఇలా పైన పేర్కొన్న అన్ని కండిషన్లలోనూ పిల్లలు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇక కొన్నిసార్లు అతి సాధారణమైన కారణాలైన ఆహారం సరిగా తీసుకోకపోవడం, రక్తంలో చక్కెర పాళ్లు తగ్గే హైపోగ్లైసీమియా ఎపిసోడ్స్‌లో కూడా కళ్లు తిరిగిపడిపోవచ్చు. పిల్లల్లో సింకోప్ కనిపించినప్పుడు ఎంత వ్యవధి పాటు అలా స్పృహలో లేకుండా ఉండిపోయారు అన్న విషయంతో పాటు ఆ సమయంలో అతడిలో కనిపించిన లక్షణాలు (అసోసియేటెడ్ సింప్టమ్స్) అంటే ఉదాహరణకు గుండె స్పందనలు తగ్గడం, నీలంగా అయిపోవడం, దీర్ఘకాలం పాటు అలా అపస్మారకంలో ఉండటం కూడా కనిపిస్తే అది కొంచెం తీవ్రమైన జబ్బుకు సూచన కావచ్చేమోనని అనుమానించాలి. పిల్లల్లో పదే పదే సింకోప్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు (కార్డియాక్ ఇవాల్యుషన్)తో పాటు అవసరమైనప్పుడు న్యూరలాజికల్ ఇవాల్యూయేషన్ కూడా చేయించాలి. ముఖ్యంగా ఈసీజీ, హోల్టర్, ఈఈజీ వంటి పరీక్షల ద్వారా అది తీవ్రమైన జబ్బులకు సూచనా, కాదా అన్న విషయం తప్పనిసరిగా తెలుస్తుంది. ఇక పిల్లలు కూర్చున్నప్పుడు కూడా కళ్లు తిరిగిపడిపోవడం వంటి సంఘటనలు జరిగితే వాళ్లకు తక్షణమే తప్పనిసరిగా తగు పరీక్షలు చేయించి, కారణాలు తెలుసుకోవడం అవసరం. ఇక మీ బాబు విషయంలో ఇది ఆర్థోస్టాటిక్ సింకోప్గా అనిపిస్తోంది. ఇది ముఖ్యంగా నిలబడి ఉన్నప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందని సందర్భాల్లో కనిపిస్తుంది. ఇలాంటి పిల్లల విషయంలో వాళ్లను కాసేపు ఫ్లాట్‌గా పడుకోబెడితే వాళ్లంతట వాళ్లే తేరుకుంటారు. ఇలాంటి పిల్లలకు నీళ్లు ఎక్కువగా తాగిస్తూ ఉండటం, వాళ్లు ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్లోకి మారుతున్నప్పుడు నింపాదిగా చేయడం లేదా కొద్దిగా సమయం తీసుకోవడం అవసరం. ఉదాహరణకు మంచం మీద పడుకుని ఉన్నవారు అకస్మాత్తుగా కూర్చొని, ఆ వెంటనే పరుగెత్తడం వంటివి చేయకూడదు. అలాగే నిలబడి ఉన్నప్పుడు కాళ్లు కాస్తంత కదుపుతూ ఉండటం వంటివి చేస్తే ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం తక్కువ. మీ అబ్బాయికి మళ్లీ ఇవే లక్షణాలు కనిపిస్తే పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ, ఒకసారి కార్డియాలజిస్టుకు తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
బాబుకు కాళ్లు, చేతుల మీద ర్యాష్... ఏం చేయాలి?
మా బాబుకు మూడేళ్లు. వాడికి ఇటీవల కాళ్లు, చేతుల మీద నీటిపొక్కుల్లా వచ్చాయి. ఇదే ర్యాష్ మా ఏడాదిన్నర పాపకు కూడా వచ్చింది. ఇది చికెన్‌పాక్స్ అని చికిత్స చేశారు. అయితే మా వాడికి పోయిన ఏడాది కూడా ఇలాగే ర్యాష్ వచ్చి తగ్గిపోయింది. అలాగే వాడికి చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇలా మళ్లీ మళ్లీ ఎందుకు ర్యాష్ వస్తోంది? అసలిది చికెన్పాక్సేనా? - కేశవనాయుడు, చిత్తూరు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ బాబుకు జ్వరంతో కలిసి కొద్దిపాటి పాపిలో వెసైకిల్ ర్యాష్ వచ్చినట్లు తెలుస్తోంది. పిల్లల్లో జ్వరంతో పాటు కలిసి ర్యాష్ వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మీజిల్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్, డెంగ్యూ, హెర్పిస్ సింప్లెక్స్, కాక్సాకీ వంటి వైరల్ జబ్బులు, అలాగే స్టాత్ ఆర్ఎస్, స్టెఫాలోకాకస్, రికెట్షియల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని కొల్లాజెన్ డిసీజెస్ వల్ల కూడా శరీరం మీద ఇలా ర్యాష్ వస్తుండవచ్చు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి, మీ అమ్మాయికి కూడా ర్యాష్ రావడం వంటి అంశాన్ని బట్టి, మీరు వివరించిన విస్తృతిని బట్టి చూస్తుంటే మీ పిల్లలకు ఈసారి వచ్చింది చికెన్‌పాక్స్ కాదు. వారిద్దరికీ వచ్చిన జబ్బు ‘హ్యాండ్ ఫుట్ మౌత్ సిండ్రోమ్’లా అనిపిస్తోంది. ఇది కాక్సాకీ వైరస్, ఎంటిరో వైరస్ అనే తరహా వైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. దీన్ని చిన్నపిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల నుంచి ఆరేళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఈ పిల్లల్లో నొప్పితో కూడిన ఎర్రటి ర్యాష్ వేళ్ల మీద, కాళ్ల మీద వస్తుంటాయి. నోటిలోపలి భాగంలో అల్సర్స్ రూపంలో కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ర్యాష్‌తో పాటు చాలా కొద్దిశాతం మంది పిల్లల్లో గుండె ఇన్వాల్వ్మెంట్ (మయోకార్డయిటిస్), లంగ్ ఇన్వాల్వ్మెంట్ (నిమోనియా), బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ (ఎన్కెఫలైటిస్) వంటి తీవ్రమైన అంశాలతో పాటు, చాలామందిలో శ్వాసకోశ (రెస్పిరేటరీ) ఇన్ఫెక్షన్లు, చెవినొప్పి వంటి కొద్దిపాటి లక్షణాలు కూడా కనపడుతుండవచ్చు. తీవ్రతను బట్టి ఈ జబ్బు మూడు నుంచి ఐదురోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. వాడినా ప్రయోజనం ఉండదు. కానీ నొప్పి, దురద నుంచి ఉపశమనం పొందడానికి మందులు వాడాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్నప్పుడు లేదా దాని కాంప్లికేషన్లు పెరుగుతున్నప్పుడు యాంటీవైరల్ మందుల వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. గత కొద్ది నెలలుగా ఈ లక్షణాలున్న పిల్లలను చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి లక్షణాలు నెలల పిల్లల్లో వచ్చినప్పుడు సెప్సిస్ వంటి కారణాలను రూల్ అవుట్ చేయడం చాలా ముఖ్యం. ఇక మీరు చెబుతున్న చికెన్‌పాక్స్ విషయానికి వస్తే... దానికోసం వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ అది మళ్లీ రావచ్చు. కానీ అప్పుడు దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యాధి నివారణ, తీవ్రత తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి మీరు మీ బాబు, పాప విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్