యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాబుకు తరచూ జ్వరం... | Urinary tract infection, fever, local staff often ... | Sakshi
Sakshi News home page

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాబుకు తరచూ జ్వరం...

Published Wed, Dec 18 2013 11:57 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాబుకు తరచూ జ్వరం... - Sakshi

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాబుకు తరచూ జ్వరం...

మా బాబుకు మూడు నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
 - సావిత్రి, తుని

 
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ మాటిమాటికీ (రికరెంట్‌గా) వస్తున్నట్లు చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణంగా వస్తుంటాయి. అమ్మాయిల్లో ఇవి 3 నుంచి 5 శాతం ఉండగా, అబ్బాయిల్లో 1 నుంచి 2 శాతం కనిపిస్తుంటాయి. పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్లలో  శ్వాసకోశవ్యాధుల తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లదే అతి పెద్ద స్ధానం. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
 
చిన్న పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి  అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్‌ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక  కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
 
లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడం ఒకింత కష్టమే. ఎందుకంటే వీటి లక్షణాలు నిర్దిష్టంగా ఉండక వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఇతర జబ్బులను పోలి ఉండవచ్చు. అయినప్పటికీ  యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు.
 
పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థకు సంబంధించి  ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్‌నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి  న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్‌నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే...  వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది.

ఇక ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం.
 
మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement