మా అమ్మాయికి పదేళ్లు. చాలా కాలం నుంచి నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. కానీ పాప యుక్తవయసుకు చేరుకుంటున్నా ఇదే సమస్య కనిపిస్తుండటంతో ఆందోళనగా ఉంది. చలికాలం వస్తే సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
- ధనలక్ష్మీ, పొన్నూరు
మీ అమ్మాయికి ఉన్న సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్‌పై కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. అయితే ఒక శాతం మందిలో మాత్రం ఈ సమస్యను పెద్దయ్యాక కూడా చూస్తుంటాం. సాధారణంగా ఇది అబ్బాయిల్లో ఎక్కువ. యాభైశాతం మందిలో ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉండటం చూస్తుంటాం.
ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్‌నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు , కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు.
ఇక జాగ్రత్తల విషయానికి వస్తే ఆమెను కించపరచడం, శిక్షించడం వంటి పనులు అస్సలు చేయకండి. సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వండి. నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు ఇవ్వకూడదు. ఇక పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయిస్తుంటే... దాదాపు ఈ సమస్య లేనట్లుగానే ఉంటుంది. దాంతో మీ అమ్మాయిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది క్రమంగా ఆమె అలవాటును తప్పించడానికీ మానసికంగానూ దోహదపడే అంశం.
చికిత్స : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు, స్ప్రేలతో ఫంక్షన్స్ వంటి సోషల్ గ్యాదరింగ్స్ సమయంలో ఆమెను నిర్భయంగా బయటకు తీసుకెళ్లవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరగడం కూడా ఒక అనుకూలమైన అంశమవుతుంది. ఒకవేళ హార్మోన్‌లోపాలు ఉన్న సమయంలో 3-6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. అయితే మిగతావారిలో మందులు వాడకకూడా సమస్య అదుపులోకి రాకపోవడం లేదా మందులు మానేశాక మళ్లీ సమస్య తిరగబెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు మందు మోతాదును పెంచి ఇవ్వడంతోపాటు కాంబినేషన్స్ ఇస్తుంటారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందేలా మోటివేట్ చేస్తుంటారు. మీరు మీ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఇంకా అలవాటు తప్పలేదు... ఏం చేయాలి?
Published Wed, Dec 25 2013 11:04 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM
Advertisement