బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..! | 7 Years old boy suffers from Muscles pains | Sakshi
Sakshi News home page

బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..!

Published Wed, Dec 11 2013 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..!

బాబుకు చిన్న వయసులోనే కండరాల నొప్పులు..!

మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు వాడి మాటలను బట్టి తెలుస్తోంది. వాడికి ఇతరత్రా ఎలాంటి అనారోగ్యమూ కనిపించడం లేదు. డాక్టర్‌గారికి చూపిస్తే విటమిన్-డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్-డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్-డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి.
 - సునంద, హైదరాబాద్

 
 మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకు తీవ్రంగా ఎముకల నొప్పులతో పాటు కండరాల నొప్పులు కూడా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం.
 
 సాంప్రదాయికంగా ఇప్పటివరకూ బాగా చల్లగా ఉండి, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది. అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్-డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం.
 
 విటమిన్-డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్‌పోజ్ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్-డి  లోపం వల్ల,  శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్-డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్-డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది.
 
 విటమిన్-డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్ కనిపించవచ్చు.
 
 దాంతోపాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్ స్క్లిరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్-డి లోపం ఒక కారణమని తెలుస్తోంది.
 
 మీ అబ్బాయి విషయంలో విటమిన్-డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల  కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్-డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్-డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్యపరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది.
 
 ఈ లోపం తొలగడానికి విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే... సూర్యుడికి తగినంత ఎక్స్‌పోజ్ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్-డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్-డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement