Small children
-
గౌతమ్ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి
సంగం(నెల్లూరు జిల్లా): మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం. వారు అడిగితే ఎంతటి పనైనా చేస్తారని జనం ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇటీవల తరుణవాయి ఉన్నత పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రీడాస్థలం సక్రమంగా లేదని చెప్పగా రోజుల వ్యవధిలోనే చదును చేయించారు. తమ కోరికను తీర్చిన గౌతమ్ మామయ్య ఇక లేరా అంటూ ఆ చిన్నారులు కంటతడి పెట్టారు. చదవండి: హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్ ప్రముఖులతోనూ.. -
Covid-19: ‘చిన్నారుల్లో జలుబు’లా మారిపోతుంది
వాషింగ్టన్: రాబోయే రోజుల్లో కోవిడ్–19 చిన్న పిల్లల్లో వచ్చే సాధారణ జలుబులా మారిపోతుందని అమెరికా, నార్వే తాజాగా నిర్వహించిన ఒక సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సినేషన్ తీసుకోని చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం ఉంటుందని ఆ సర్వే తెలిపింది. ఇప్పటివరకు కోవిడ్–19 పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంతగా ప్రభావం లేదని పేర్కొన్న సర్వే, మిగిలిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ ముప్పు పెద్దలకి తప్పిపోతుందని అంచనా వేసింది. ‘రాబోయే కాలంలో పెద్దలందరికీ వైరస్ సోకడం లేదంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వస్తాయి. దీంతో ఈ వైరస్ తీవ్రత బాగా తగ్గిపోతుంది. వ్యాక్సిన్ తీసుకోని చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే ఓ చిన్నపాటి జలుబులా మారిపోతుంది’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఒట్టర్ బోర్నస్టడ్ చెప్పారు. ఈ అధ్యయనం వివరాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. ఒక్కసారి గత చరిత్ర చూస్తే ఎన్నో మహమ్మారులు తొలుత ఉగ్రరూపం దాల్చి ఆ తర్వాత పిల్లలకి వచ్చే సాధారణ వ్యాధుల్లా మారిపోయినవి ఉన్నాయని ఆయన చెప్పారు. ‘1889–1890లో పెచ్చరిల్లిన రష్యన్ ఫ్లూ 10 లక్షల మందిని పొట్టన పెట్టుకుందని, ఇప్పుడా వైరస్ 7–12 నెలల పిల్లలకి వచ్చే సాధారణ జలుబులా మారింది. ఏదైనా మహమ్మారి చివరి దశకి వచ్చేటప్పటికి దాని తీవ్రత తగ్గిపోతుందని కోవిడ్–19 కూడా అలాగే మారుతుంది’ అని ప్రొఫెసర్ బోర్నస్టడ్ వివరించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కంటే, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే అధికంగా యాంటీ బాడీలు వచ్చినట్టుగా తమ పరిశోధనల్లో వెల్లడైనట్టుగా ఆయన తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన చెప్పారు. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో కరోనా వైరస్ ఉధృతిని పరిశీలిస్తూ రియలిస్టిక్ ఏజ్ స్ట్రక్చర్డ్ (ఆర్ఏఎస్) మ్యాథమెటికల్ మోడ్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత ఎలా ఉంటుందో అధ్యయనం చేసినట్టుగా బోర్నస్టడ్ వివరించారు. -
రూ.16 కోట్ల ఇంజక్షన్.. గుండెల్ని పిండేసే కథ
చిత్రంలో పచ్చటి పచ్చికపై ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను చూస్తే ముచ్చటేస్తుంది కదా.! కానీ ఆ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే వ్యథ దాగి ఉంది. తప్పటడుగులు కూడా వేయలేని ఆ చిన్నారుల పరిస్థితిని తలుచుకుంటూ వారి తల్లిదండ్రులు మౌనంగా రోదిస్తున్నారు. ‘ఈ బాధ ఇంకెన్నాళ్లు.. అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం’ అని నిర్ణయించుకున్నారు. కానీ వారిలో ఎక్కడో ఓ ఆశ.. పిల్లలకు వైద్యం చేయించాలన్న తపన.. ఆత్మహత్య ఆలోచనను విరమించుకునేలా చేశాయి. సాక్షి, ఒంగోలు: ఒంగోలుకు చెందిన దండే వినయ్‌కుమార్ బిల్డర్, ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వేదవతితో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్ మకాం మార్చారు. అక్కడ వీరికి లాసిత్ అయ్యన్ జన్మించాడు. ఆరు నెలలు గడిచినా కదలిక లేదు. పెద్దల సూచనతో ఏడాది వరకు వేచి చూశారు. కనీసం పక్కకు కూడా పొర్లకపోతుండటంతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అయినా ఫలితం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో జెనెటిక్ పరీక్షలు చేయించగా స్పైనల్ మస్క్యులర్ ఏట్రోఫీ(ఎస్ఎంఏ)–టైప్ 2గా నిర్ధారణ అయింది. ప్రపంచంలో ఎక్కడా మందు లేదని వైద్యులు స్పష్టం చేశారు. బతికినన్నాళ్లు చూసుకోవడమే తప్ప మరో మార్గం లేదని చెప్పడంతో హతాశులయ్యారు. రెండో కుమారుడికీ అదే జబ్బు వినయ్, వేదవతి దంపతులకు మరో కుమారుడు మోక్షిత్ జన్మించగా ఆ చిన్నారికీ ఎస్ఎంఏ టైప్–2 సోకింది. మోక్షిత్ పరిస్థితి తన అన్న కంటే కొంత ఫర్వాలేదు. కొద్దిసేపు కూర్చోగలడు. ఈ చిన్నారులిద్దరూ ఆరోగ్యంగా కనిపిస్తారు కానీ ఏదైనా వస్తువు ఇస్తే చేయి చాచి అందుకోలేరు. కూర్చున్న కాసేపటికే నేలమీద వాలిపోతారు. అసలే బలహీనమైన కండరాలు.. రోజురోజుకూ శక్తి క్షీణిస్తుండటంతో ఆ పిల్లల వ్యధ వర్ణణాతీతం. బిడ్డల్ని బతికించుకోవాలన్న తాపత్రయంలో ఎస్ఎంఏపై వినయ్‌కుమార్ ఎంతో స్టడీ చేశాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న 400 మందితో ‘‘క్యూర్ ఎస్ఎంఏ ఇండియా’’ అనే సంస్థను స్థాపించి సమాచారం పంచుకుంటున్నారు. అన్నీ అమ్మే.. చిన్నారులిద్దరూ పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తల్లి వేదవతే విద్యాబుద్ధులు నేర్పుతోంది. వారి తెలివితేటలకు అబ్బురపడుతూ మానసిక క్షోభను మరిచిపోతోంది. ఆరు, ఏడేళ్ల వయసున్న వీరు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడడమే కాదు, జనరల్ నాలెడ్జ్‌పైనా పట్టు సాధించారు. వివిధ అంశాల గురించి వివరంగా చెప్పగల నేర్పు వీరి సొంతం. 2017లో మందులు అందుబాటులోకి.. 2017 డిసెంబర్లో అమెరికాకు చెందిన బయోజిన్ కంపెనీ స్పిన్రజా అనే మెడిసిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి ఏడాది ఐదు ఇంజక్షన్లకు అయ్యే ఖర్చు రూ.5 కోట్లు కాగా.. ఎస్ఎంఏ బాధితులు జీవించినంత కాలం ఇంజక్షన్లు వేసేందుకు మరో రూ.3 కోట్లు వెచ్చించాలి. కొద్దికాలం క్రితం రోచె అనే కంపెనీ రిస్డీ ప్లామ్ అనే ఓరల్ డ్రగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రోజు ఒక్కో సాచెట్ పిల్లవాడికి ఇవ్వాలి. దీని ఖరీదు రూ.80 వేలు. కానీ జీవితకాలం ఈ సాచెట్లు ఇస్తూనే ఉండాలి. ఇదిలా ఉండగా అవాక్సిస్ కంపెనీ జోల్జెన్ ఎస్ఎంఏ అనే ఇంజక్షన్ అందుబాటోకి తెచ్చింది. ఒక్కసారి ఈ ఇంజక్షన్ చేస్తే వ్యాధి నయమవుతుందని చెబుతున్నారు. దీని ఖరీదు ఏకంగా రూ.16 కోట్లు. అదృష్టవశాత్తు అమెరికాలోని డైరెక్ట్ రిలీఫ్ ఫండ్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎంఏ సోకిన 360 మందిని గుర్తించి జీవితాంతం ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది. అందులో మోక్షిత్ ఒకడు. దీంతో త్వరలోనే ఆ చిన్నారి కోలుకుంటాడనే నమ్మకం కలిగింది. సాయం చేసే దాతలు 7799373777, 8977274151ను సంప్రదించవచ్చు. లేదా ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్ నం.0738104000057169, ఒంగోలు బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఐబీకేఎల్ 0000738కు నగదు అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేసి ఆదుకోండి నా బిడ్డల ఆరోగ్యం బాగుండుంటే నేనే పది మందికి అండగా ఉండేవాడిని. కానీ ఇటువంటి అరుదైన జబ్బులకు వైద్యం చేయించాలంటే కష్టసాధ్యం. నా ఆస్తి మొత్తం అమ్ముకున్నా తొలి ఏడాది ఒక ఇంజెక్షన్ కూడా వేయించలేను. అందుకే ఇటీవల క్రౌడ్ ఫండింగ్‌కు సంబంధించి ఇంపాక్ట్ గురూలో యోగేష్ గుప్తాకు లభించిన ఆదరణ చూసి ఆన్లైన్లో అప్రోచ్ అయ్యాను. వారు పరిశీలించి ఫండింగ్ సేకరించడం మొదలుపెట్టారు. ఒంగోలుకు చెందిన ఆసిఫ్, అన్వేష్ స్మైల్ ఎగైన్ అనే సంస్థను స్థాపించి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే మేము ఒక సంస్థ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కలిశాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. – దండే వినయ్ కుమార్, వేదవతి చదవండి: విషాదం: రూ.16 కోట్ల ఇంజక్షన్.. ఆ పాప ఇక లేదు 62,400 మంది దాతలు.. రూ.16 కోట్లు.. బాలుడికి పునర్జన్మ -
పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?
ఆడపిల్లలైతే వారు ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. దీనికి మతాలూ, కులాలన్న తేడా లేదు. అలాగే కాస్తంత పెద్ద వయసు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. ఇటీవల అయితే కేవలం చెవి తమ్మెకు ఒక చోట మాత్రమే కాకుండా... ఇంకా రెండు మూడు రంధ్రాలు కూడా పెట్టి ఆభరణాలు ధరిస్తున్నారు. ఇలా చెవులు కుట్టించుకోవడంలో కాస్తంత సంప్రదాయంతో పాటు... బోల్డంత కాస్మటిక్ ప్రయోజనాలు కూడా చూస్తున్నారు ఈకాలం మహిళలు. గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి వైర్స్తో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుట్టించిన ముక్కు, చెవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. చెవులు ముక్కు కుట్టించడంలో సహజంగా తలెత్తే సమస్యలు ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. మచ్చ ఏర్పడటం : కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ►చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ►మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి. ►చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి. ►సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ.. ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్డ్ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది. ►చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. ►తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. -
చెప్పకుండా ఎందుకు కన్నారు?
తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలు చూస్తూ.. చిన్న పిల్లలు అందులో తాను ఎందుకు లేను అని ఎంతో అమాయకంగా అడుగుతుంటారు.. కొందరేమో ఏడుస్తుంటారు.. అప్పుడు చాలా సంబరంగా ఉంటుంది. పెద్దయ్యక కూడా ‘నువ్వు ఇలా అడిగేదానివి’అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటారు. అయితే చిన్నప్పుడు అడిగితే బాగానే ఉంటుంది.. కానీ పెద్ద పెరిగాక కూడా అలా అడగగలుగుతామా..? లేదు కదా.. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన తల్లిదండ్రులపై దావా వేయనున్నాడు. ఎందుకంటే తన పర్మిషన్ అడగకుండా తనను కన్నందుకు కేసు వేయాలని చూస్తున్నాడట. అతడి పేరు రఫేల్ సామ్యూయేల్. వయసు 27 సంవత్సరాలు. జనాభా పెరుగుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. తన లాంటి తెలివైన వారిని అనుమతి లేకుండా జన్మనివ్వడం నైతికతకు విరుద్ధమని వాదిస్తుంటాడు. రఫేల్‌కు పిల్లలపై, జీవితంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ పిల్లల అనుమతి తీసుకోకుండా వారిని కనడమే పాపం అంటుంటాడు. ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి వారిని ఈ కష్టాల సాగరంలో ఈదేలా చేస్తున్నారని, అది కూడా వారి అనుమతి తీసుకోకుండా చేస్తున్నారని, వారిని బాధితులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. తన తల్లిదండ్రులు అంటే తనకు చాలా ఇష్టమని, తమ మధ్య మంచి బంధం ఉందని చెబుతూనే.. తన అనుమతి తీసుకోకుండా ఎలా ఈ ప్రపంచంలోకి తీసుకొస్తారంటూ వారిని కోర్టుకు ఈడుస్తాడట. మరి చూద్దాం కోర్టు ఏం చెబుతుందో. -
కేసీ..ప్రాణాలు తోడేసి..!
♦ కర్నూలులో 6 కి.మీ మేర కేసీ కాలువ ♦ కంచె ఏర్పాటులో శాఖల మధ్య సమన్వయ లోపం ♦ ఏటా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు ♦ వారంలో ముగ్గురు చిన్నారుల గల్లంతు ♦ కన్నపేగు కన్నీరు తుడిచే వారేరి? కర్నూలు సిటీ: నగరం నడి మధ్యలో వెళుతూ నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే కేసీ కాలువ అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చిన్నారుల ప్రాణాలు తోడేస్తోంది. ఏటా కాలువలో చిన్నారుల గల్లంతవుతున్నా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిండుకుండలా.. ఇటీవల తుంగభద్ర నది జిల్లా సరిహద్దులో కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు రావడంతో రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కేసీ కాలువ నిండు కుండలా ప్రవహిస్తోంది. నీటి ఉధతి ఎక్కువగా ఉండడంతో కాలువ గట్టుకు సమీపంలోని నివాసాలకు చెందిన వారు తమ పిల్లలను అటు వైపు పోకుండా కాపలాగా ఉంటున్నారు. కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివిధ పార్టీల నాయకులు ప్రతి సందర్భంలోనూ చెబుతూ వస్తున్నా ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో చిన్నారుల ప్రాణాలు కాలువలో కలిసిపోతున్నాయి. అంచనాల్లోనే జాప్యం.. నగరంలో సుమారు 6 కి.మీ కేసీ కాలువ ప్రయాణిస్తుంది. స్టాంటన్‌పురం దగ్గర మొదలై, ఇందిరమ్మ కాలనీ వరకు ఉన్న కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు గత ప్రభుత్వం హయాంలో 1.75 కోట్లతో కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి బంగారుపేట వరకు నేటికీ కంచె ఏర్పాటు చేయలేదు. కాలువకు కుడి వైపున కంచె లేకపోవడంతోనే గురువారం కాలేబు అనే విద్యార్థి కాలువలోకి దిగి కొట్టుకుపోయాడు. కాలువకు ఇరువైపులా 3 కి.మీ కంచె ఏర్పాటుకు రూ.71 లక్షలతో కేసీ ఇంజనీర్లు అంచనాలు వేశారు. అయితే అంచనాల్లో తప్పులు దొర్లడం, వాటిని సరిదిద్దడంలోనే కాలం కరిగిపోతోంది. జూలైలోనే ఈ పనులు కొలిక్కి వచ్చుంటే గత నెల నాటికే పూర్తయ్యేవి. వీరి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు హేతువుగా నిలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫెన్సింగ్ ఏర్పాటు చేయండిజిల్లాకలెక్టర్తో చర్చించినఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీకెనాల్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. శుక్రవారం సాయంత్రం ఎంపీ జిల్లాకలెక్టర్ సత్యనారాయణను ఆయన ఛాంబరులో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీకాలువ నగరంలోని జనావాస ప్రాంతాల గుండా వెళుతుందని, చిన్నపిల్లలు తెలిసీ తెలియక వెళితే ప్రమాదకరమని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీ వెంట వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.కె.రాజశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. కంచె ఏర్పాటు చేయండి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ డిమాండ్ కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీ కాలువకు కంచె ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. పిల్లలు కేసీ కాలువలో గల్లంతైన సంఘటనకు నిరసనగా శుక్రవారం జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 200 కోట్లతో నగరాన్ని అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్న నాయకులకు కేసీ కెనాల్‌కు కంచె వేయాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాలువకు కంచె లేకపోవడంతో పొరుగున ఉండే కాలనీలకు చెందిన ఎంతోమంది పిల్లలు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వెంటనే కంచె ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు చేపడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య హెచ్చరించారు. పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సలోమి, ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షుడు కటారి సురేశ్, నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సాంబశివారెడ్డి, ధనుంజయాచారి, చంద్రశేఖర్‌గౌడ్, జీవరత్నం, అశోక్, అశోక్‌కుమార్, సంజు, ఫైజాన్, మంగమ్మ, ఉమాబాయి పాల్గొన్నారు. -
బాల్యం ‘తట్టు’కోవాలని!
రేపటి నుంచి ఎంఆర్ సార్వత్రిక టీకా - తెలంగాణలో 90 లక్షల మంది పిల్లలకు.. - ఆంధ్రప్రదేశ్‌లో 1.35 కోట్ల మందికి.. - 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ - ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అతి పెద్ద సవాలుగా మారుతున్న తట్టు(మీజిల్స్), రుబెల్లా వ్యాధుల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా వీటి అంతానికి ఎంఆర్ సార్వత్రిక టీకాను అమల్లోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఉచితంగా ఎంఆర్ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 9 నెలలు నిండిన పిల్లల నుంచి 15 ఏళ్ల లోపు వారందరికీ ఈ టీకా వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న 90,00,117 మంది పిల్లలకు టీకా వేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈ టీకా వేయనున్నారు. బడి బయట ఉండే పిల్లలకు కూడా ఈ టీకా వేసేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు గతంలో టీకాలు వేయించినా మరోసారి కూడా వేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇతర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, గతంలో తట్టు, రుబెల్లా నివారణకు టీకా వేయించిన సమయంలో అలర్జీకి గురైన వారు ఈ టీకా వేయించుకోవద్దని పేర్కొంది. ఏటా 1.14 లక్షల మంది మృతి.. తట్టు వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.14 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. మన దేశంలో ఏటా 49,200 మంది చనిపోతున్నారు. చిన్నారుల పాలిట ప్రమాదకరంగా మారుతున్న తట్టును 2020 లోపు మన దేశంలో పూర్తిగా నిర్మూలించాలని కేంద్రం నిర్ణయించింది. రుబెల్లాతో కలిపి తట్టును నిర్మూలించేందుకు ఎంఆర్ సార్వత్రిక టీకాను ప్రవేశపెట్టింది. 1985 నుంచే ప్రైవేట్ రంగంలో తట్టు, గవద బిల్లలు, రుబెల్లా (ఎంఎంఆర్) టీకాలను పిల్లలకు ఇస్తున్నారు. ఇప్పుడు ఉచితంగా ఎంఆర్ టీకా వేయనున్నారు. 2018 లోపు దేశంలోని 40 కోట్ల మంది (95 శాతం) చిన్నారులకు ఈ టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 దశల్లో అన్ని రాష్ట్రాల్లోనూ టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. 2017 ఫిబ్రవరి 6న మొదటి దశ ఎంఆర్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 25 వరకు నిర్వహిస్తున్న రెండో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, డయ్యూ–డామన్, దాద్రానగర్ హవేలీలోని 3.66 కోట్ల మంది పిల్లలకు ఎంఆర్ టీకా వేయనున్నారు. పుట్టే ప్రతి పిల్లలకు 12 నెలల వయసులో ఒకసారి, 24 నెలల వయసులో మరోసారి ఈ టీకా వేయించాల్సి ఉంటుంది. తట్టు లక్షణాలు.. ప్రమాదకరమైన అంటు వ్యాధి. వైరస్ ద్వారా సోకుతుంది. చిన్నారుల్లో వైకల్యాలకు, మరణాలకు కారణమవుతుంది. దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపర్లతో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అతిసారం, న్యుమోనియా, నోటి పూత, చెవి ఇన్ఫెక్షన్, కళ్లు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. రుబెల్లా లక్షణాలు.. గర్భంతో ఉన్నప్పుడు రుబెల్లా ఇన్ఫెక్షన్ సోకితే గర్భస్రావం జరుగుతుంది. మృత శిశువు జన్మించే అవకాశముంది. నవజాత శిశువుల్లో అంధత్వం, వినికిడిలోపం, గుండె వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. రుబెల్లా వచ్చిన వారికి ఒళ్లంతా దద్దుర్లు కనిపిస్తాయి. రుబెల్లాతో ఉన్న చిన్నారులతో సన్నిహితంగా ఉండే వయోజనులకూ ఇది సోకుతుంది. ఇది ముఖ్యమైన టీకా తట్టు, రుబెల్లా టీకా చాలా ముఖ్యమైనది. చిన్న పిల్లల తల్లి దండ్రులు దీన్ని ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలి. యూరప్‌లో ఇప్పుడు తట్టు ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎంఆర్ టీకాను రాష్ట్రంలో 90 లక్షల మంది పిల్లలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆగస్టు 17 నుంచి మొదలవుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నా. – వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
చిన్న పిల్లల బిస్కెట్లలో తవుడు కల్తీ ఆయిల్స్
విజయవాడ: కల్తీకి అదీ ఇదనే తేడా ఏమి లేదు. చివరకు చిన్నపిల్లలు తినే బిస్కెట్లలో సైతం తవుడు, కల్తీ ఆయిల్స్‌ని కలిపి డబ్బులు దండుకుంటున్నారు కల్తీరాయుళ్లు. నగరంలో ఆదివారం మరో కల్తీ భాగోతాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారు. స్థానిక గద్దెపూర్ణచంద్రరావు కాలనీలోని శంకర్ బిస్కెట్ కంపెనీలో జరుగుతున్న కల్తీ వ్యాపారం గుట్టు రట్టు చేశారు. చిన్న పిల్లలు తినే బిస్కెట్లు, సున్నుండలలో తవుడు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. పశువులకు వాడే దాణా, పుచ్చిపోయిన మినపపప్పు, కల్తీ ఆయిల్స్‌తో తినుబండారాలు తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇవి తింటే పిల్లలకు పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పెద్ద ఎత్తున కల్తీ బయటకు వచ్చినప్పటికి అసలు ఎవరు కల్తీకి కారణమనేది బయట పడటం లేదు. -
సిక్స్ హిడెన్ ట్రిక్స్...
ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు అందరి చేతుల్లో ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అందులో వాట్స్ యాప్ ఉండనే ఉంటుంది. అందరూ సులువుగా ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు.. కానీ చాలామంది యూజర్లకుతెలియని ఆరు విషయాలు... మెసేజ్ చూసిన టైమ్.. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెండు బ్లూ టిక్స్ కనిపిస్తే అవతలి వారు మనం పంపిన మెసేజ్‌ను చూసినట్టు లెక్క. కానీ వారు ఏ సమయానికి చూశారో తెలుసుకోవాలంటే పంపిన మెసేజ్‌ని లాంగ్ ప్రెస్ చేసి ‘జీ’ ఐకాన్‌ను ప్రెస్ చేస్తే ఏ టైమ్‌కు మెసేజ్ చూశారో తెలిసిపోతుంది. ఆర్చీవ్ చాట్స్.. ఇది మీ సంభాషణను హైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తితో కానీ గ్రూప్‌తో కానీ చాట్ చేసిన సంభాషణను దాచాలంటే ఎవరిదైతే హైడ్ చేయాలనుకుంటున్నారో వారి అకౌంట్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ ఆర్చివ్ చాట్ ఉంటుంది. గ్రూప్ మొత్తం అయితే చాట్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆర్చివ్ ఆల్ చాట్స్ అని ప్రెస్ చేయండి. అంతే! ఇక మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల మీ చాటింగ్ కన్వర్సేషన్ డిలీట్ అవ్వదు. మ్యూట్ గ్రూప్ చాట్స్.. గ్రూప్ చాట్స్‌లో ఎవరో ఎవరితోనో చాట్ చేసినా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటప్పుడు ఏ గ్రూప్ నోటిఫికేషన్లు ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రూప్ ఓపెన్ చేసి మెనూలోకి వెళ్లి మ్యూట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అక్కడ ఎంత టైమ్ వరకు నోటిఫికేషన్లు మ్యూట్‌లో పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ సీన్ై టెమ్ హైడ్.. ఈ యాప్‌లో ఎవరు ఏ టైమ్‌కు ఆఖరిగా వాట్స్‌యాప్ చూశారో తెలుస్తుంది. కానీ మీ లాస్ట్ సీన్ టైమ్ ఎవరికీ తెలియకూడదనుకుంటే సెట్టింగ్స్/అకౌంట్/ప్రైవసీ లోకి వెళ్లి లాస్ట్ సీన్ దగ్గరకు వెళ్లి నోబడీ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు. అలా చేస్తే వేరే వారి లాస్ట్ సీన్ మీకు కనిపించదు. హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్.. తరచూ మీరు ఒకే వ్యక్తితోనే ఎక్కువగా చాట్ చేస్తున్నారనుకోండి. వారు పంపిన మెసేజ్‌ను క్షణం ఆలస్యం కాకుండా చూడాలనుకుంటే షార్ట్‌కట్‌ను వాడుకోండి. ఎవరి అకౌంట్‌ను అలా చేయాలనుకుంటే వారి చాట్ మెనూలోకి లేదా గ్రూప్ పై లాంగ్ ప్రెస్‌చేసి యాడ్ చాట్ షార్ట్‌కట్ అని సెలెక్ట్ చేసుకోండి. అంతే! వారి అకౌంట్ మీ ఫోన్ స్క్రీన్‌పైకి వచ్చేస్తుంది. నెట్ డేటా సేవింగ్.. ఎక్కడెక్కడి ఫొటోలు, ఆడియోలు, వీడియోలు డౌన్లోడ్ అవుతూ, మీ డేటా స్వాహా కాకుండా ఉండాలంటే సెట్టింగ్స్/చాట్ సెట్టింగ్స్ /మీడియా ఆటో-డౌన్లోడ్లోకి వెళ్లి అక్కడ మొబైల్ డేటా, వైఫై, రోమింగ్... ఇలా మీకు ఎప్పుడు ఆటోడౌన్లోడ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిద్వారా డేటా సేవ్ చేసుకోవచ్చు. -
పిల్లాడితో చంపించిన ఐఎస్
వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆఖరికి చిన్నపిల్లలతో కూడా హత్యలు చేయిస్తోంది. తాజాగా ఈ సంస్థ మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఓ బాలుడు ఇజ్రాయెల్ పౌరుడిని చంపుతున్న దృశ్యాలున్నాయి. మృతుడిని ఇస్మాయిల్ ముసల్లం (19)గా గుర్తించారు. ముసల్లం మోకాళ్లపై నిల్చుని ఉన్నాడు. అతన్ని ఉగ్రవాది సూచనల మేరకు ఓ చిన్న పిల్లవాడు నుదిటిపై కాల్చి చంపినట్టు అందులో ఉంది. -
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాబుకు తరచూ జ్వరం...
మా బాబుకు మూడు నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - సావిత్రి, తుని మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ మాటిమాటికీ (రికరెంట్గా) వస్తున్నట్లు చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణంగా వస్తుంటాయి. అమ్మాయిల్లో ఇవి 3 నుంచి 5 శాతం ఉండగా, అబ్బాయిల్లో 1 నుంచి 2 శాతం కనిపిస్తుంటాయి. పిల్లలకు వచ్చే ఇన్ఫెక్షన్లలో శ్వాసకోశవ్యాధుల తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లదే అతి పెద్ద స్ధానం. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ (డయాగ్నోజ్) చేయడం ఒకింత కష్టమే. ఎందుకంటే వీటి లక్షణాలు నిర్దిష్టంగా ఉండక వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి ఇతర జబ్బులను పోలి ఉండవచ్చు. అయినప్పటికీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్