తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలు చూస్తూ.. చిన్న పిల్లలు అందులో తాను ఎందుకు లేను అని ఎంతో అమాయకంగా అడుగుతుంటారు.. కొందరేమో ఏడుస్తుంటారు.. అప్పుడు చాలా సంబరంగా ఉంటుంది. పెద్దయ్యక కూడా ‘నువ్వు ఇలా అడిగేదానివి’అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటారు. అయితే చిన్నప్పుడు అడిగితే బాగానే ఉంటుంది.. కానీ పెద్ద పెరిగాక కూడా అలా అడగగలుగుతామా..? లేదు కదా.. అయితే ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన తల్లిదండ్రులపై దావా వేయనున్నాడు. ఎందుకంటే తన పర్మిషన్ అడగకుండా తనను కన్నందుకు కేసు వేయాలని చూస్తున్నాడట. అతడి పేరు రఫేల్ సామ్యూయేల్. వయసు 27 సంవత్సరాలు.
జనాభా పెరుగుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు. ఇంతవరకు బాగానే ఉంది. తన లాంటి తెలివైన వారిని అనుమతి లేకుండా జన్మనివ్వడం నైతికతకు విరుద్ధమని వాదిస్తుంటాడు. రఫేల్‌కు పిల్లలపై, జీవితంపై ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ పిల్లల అనుమతి తీసుకోకుండా వారిని కనడమే పాపం అంటుంటాడు. ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి వారిని ఈ కష్టాల సాగరంలో ఈదేలా చేస్తున్నారని, అది కూడా వారి అనుమతి తీసుకోకుండా చేస్తున్నారని, వారిని బాధితులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. తన తల్లిదండ్రులు అంటే తనకు చాలా ఇష్టమని, తమ మధ్య మంచి బంధం ఉందని చెబుతూనే.. తన అనుమతి తీసుకోకుండా ఎలా ఈ ప్రపంచంలోకి తీసుకొస్తారంటూ వారిని కోర్టుకు ఈడుస్తాడట. మరి చూద్దాం కోర్టు ఏం చెబుతుందో.
Comments
Please login to add a commentAdd a comment