మరో రూప కథ | Need a Life Partner to support achievements | Sakshi
Sakshi News home page

మరో రూప కథ

Published Mon, Jun 3 2019 12:08 AM | Last Updated on Mon, Jun 3 2019 12:08 AM

Need a Life Partner to support achievements - Sakshi

చాలా సందర్భాల్లో... చాలా కుటుంబాల్లోసంబంధం కలుపుకునే ప్రహసనం... సహనం చచ్చేలా ఉంటుంది.అత్తామామల ఆంక్షలు పాము బుసల్లా వినిపిస్తుంటాయి.రూల్‌ నంబర్‌ వన్‌... ‘ఇకపై నువ్వు ఉల్లి, వెల్లుల్లి తినకూడదు!’తాను తినడం తినకపోవడం వేరే సంగతి. కానీ...ఒక విషయాన్ని ఆంక్షలాగా భరించాల్సి వస్తే  ఆ మాటలు వెల్లుల్లి కంటే ఘాటుగా ఉంటాయి. ‘పవిట ఎప్పుడూ తలమీదే ఉండాలి.

రూల్‌ నెంబర్‌ రెండుతో  అతి పల్చటి ఆ కొంగు టన్నులకొద్దీ బరువనిపించవచ్చు. కొంగు బంగారమైతే ఓకేగానీ... భారమైతే ఎలా?విషయం ఏంటంటే... ‘పెళ్లికాగానే ఉద్యోగం మానేయాలి’... అనే‘మంచి కాఫీలాంటి ఓ సినిమా’లోని సంఘటనేఅచ్చంగా ఆ అమ్మాయి జీవితంలోనూ చోటుచేసుకుంది.సినిమాలోని ‘మంచి కాఫీ’ రుచి నిజ జీవితంలో ‘చేదు’గా పరిణమించినఓ యువతి నిజమైన కథ ఇది.

‘ఆనంద్‌’.. మంచి కాఫీలాంటి సినిమా.. గుర్తుండే ఉంటుంది. అందులో కథానాయిక.. రూపను ఎప్పటికీ మర్చిపోలేం. ఆత్మగౌరవం, సొంత వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడపిల్లా మరిచిపోదు. రూప.. కునాల్‌ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కునాల్‌ కూడా అంతే ప్రేమిస్తాడు రూపని. ఆమె బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంటుంది ఓ కార్‌ యాక్సిడెంట్‌లో. కునాల్‌కు అమ్మ ఉంటుంది. అమ్మకు రూప గురించి చెప్తాడు. వాళ్లిద్దరి పెళ్లికి ఆమె ఒప్పుకుంటుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.రూప ఇండివిడ్యువాలిటీ ఉన్న అమ్మాయి. ఇండిపెండెంట్‌. పెళ్లికి ముందు నుంచే అత్తగారు ఆమె మీద పెత్తనం చేయడం మొదలుపెడ్తుంది. ‘‘నాకే కాదు.. మా బంధువులకూ కాళ్లు మొక్కాలి... ఎర్ర చీరే కట్టుకోవాలి.. నెమ్మదిగా మాట్లాడాలి.. తల వంచుకునే ఉండాలి.. భర్తకే కాదు.. పెద్దవాళ్లెవరికీ ఎదురు చెప్పకూడదు.. మేము తినే వంటలే వండాలి.. రాకపోతే నేర్చుకోవాలి.. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయకూడదు..’’ వంటి అత్తగారి ఉత్తర్వుల జాబితా పెద్దగానే ఉంటుంది.

అన్నిటికీ కునాల్‌ వంక చూస్తుంది రూప. ‘సర్దుకుపో’ అన్నట్టు చూడ్డమే కాదు.. చెప్తాడు కూడా! హతాశురాలవుతుంది రూప. వాళ్లమ్మ ఇన్‌వాల్వ్‌ కాకముందు వరకు తన అభిప్రాయాలకు విలువ ఇచ్చిన మనిషి, తన వ్యక్తిత్వాన్ని గౌరవించిన మనిషి.. తన మనిషి... ఇప్పుడు ఇలా అమ్మ మాటకు వంత పాడడం ఆమెకు వింతగా అనిపించింది. ఆత్మగౌరవానికి ఇబ్బందిలేని చాలా విషయాల్లో సర్దుకుపోవాలనే ప్రయత్నిస్తుంది.. కాని తనకు ఆత్మగౌరవమే ఉండకూడదు అన్న అత్తగారి అభిప్రాయం, ప్రవర్తనతో రాజీ పడకూడదు అని నిర్ణయించుకుంటుంది. ఆ విషయంలో కునాల్‌ సపోర్ట్‌ చేస్తాడనీ ఆశిస్తుంది. కాని అతనూ అమ్మ మాటే వినాలి అనేసరికి కునాలే తనకు సరైనవాడు కాదని అతనితో పెళ్లి వద్దనుకుంటుంది.తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ అప్రస్తుతం.. అందుకే ఈ కథను ఇక్కడ ఆపేసి.. దీన్ని పోలిన ఓ నిజ జీవిత గాథను చెప్పుకుందాం.

ఫేస్‌బుక్‌లోని ‘‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’’ పేజీలో రూపలాంటి అమ్మాయే (అందులో ఆమె తన పేరును ప్రస్తావించలేదు) తన రియల్‌ లైఫ్‌ స్టోరీని షేర్‌ చేసింది. ఆమె మాటల్లోనే..‘‘ఒక మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా అనుభవ్‌ను చూశాను.అతని చదువు, ఉద్యోగం, బ్యాక్‌గ్రౌండ్‌ అన్నీ నచ్చాయి. అతనికీ నా చదువు, ఉద్యోగం. బ్యాక్‌గ్రౌండ్‌ అన్నీ నచ్చాయి. అతను ఢిల్లీ బేస్డ్‌.. కాని ఉద్యోగం మాత్రం బాంబేలోనే. అతను పనిచేసే ఆఫీస్, మా ఆఫీస్‌కు దగ్గర్లోనే. కలిసిమాట్లాడాలనుకున్నాం. కలిశాం.. దాదాపు ఆరు గంటలు మాట్లాడుకున్నాం. మా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న మొదటి అమ్మాయిని నేనే. కష్టపడి ఈ స్థాయికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతాను. గర్వంగా కూడా ఉంటుంది. సో.. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలి.. చేస్తాను. ఈ మాటను అనుభవ్‌తోనూ చెప్పాను.

‘‘వై నాట్‌..’’ అన్నాడు. నా ఇండిపెండెన్స్‌ను, నా వ్యక్తిత్వానికి సంబంధించి ఇంకా చాలా విషయాలను గౌరవించాడు. పెళ్లి తర్వాతా నేను నాలాగే ఉండొచ్చు అన్నాడు. నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికాడని సంతోషడ్డా. మా పెళ్లికి మా ఇద్దరికీ వేరే ఆబ్జెక్షన్స్‌ ఏవీ కనిపించలేదు. మా ఇద్దరి పేరెంట్స్‌ మీటింగ్‌నీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అనుభవ్‌ తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి రావడం కష్టమవడంతో మా పేరెంట్స్‌నే ఢిల్లీ తీసుకెళ్లా. వాళ్లను కలిసిన మరుక్షణం నుంచే.. అనుభవ్‌ వాళ్ల నాన్న చెప్పడం మొదలుపెట్టాడు.. పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో! తమింటి కోడలు ఫలానా విధంగా ఉండాలని ఆయనకు కొన్ని అభిప్రాయాలున్నాయట.పెళ్లయిన తర్వాత ఉల్లి, వెల్లుల్లి తినడం మానేయాలని, ఉద్యోగం మానేసి ఢిల్లీలో అత్తామామలతోనే ఉండాలని, ఎట్టి పరిస్థితిలో రాత్రి ఎనిమిదింటికి వాళ్లతో కలిసి నేను డిన్నర్‌ చేయాలనీ, యేడాదిలోపు బిడ్డను కనాలని.. ఇలాంటి చాంతాడంత లిస్ట్‌ చదివాడు. నేను కాదు.. మా పేరెంట్సూ షాక్‌ అయ్యారు. ఎంగేజ్‌మెంట్‌ కాలేదు.

రెండు కుటుంబాల మధ్య క్లోజ్‌నెస్‌ పెరగలేదు.. కనీసం పరిచయమూ పాతబడలేదు.. నేను ఆ ఇంటి బానిసనైపోయినట్టు ఆర్డర్లు వేస్తూనే ఉన్నాడు. చివరకు మేం ఆ గదిలోంచి బయటకు వచ్చేశాం అనుభవ్‌తో కూలంకషంగా చర్చించాలని. దాంతో అనుభవ్‌నూ బయటకు పిలిచాం. మేం ఏం చెప్పబోతున్నామో అతనికి అర్థమై .. వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడాడు. నన్ను లోపలికి పిలిచాడు. కాబోయే భార్యాభర్తలుగా పెళ్లి తర్వాత మేం ఎలా ఉండాలో మమ్మల్ని డిసైడ్‌ చేసుకోనివ్వండి.. ఆ స్పేస్‌ ఇవ్వండి అని అనుభవ్‌ వాళ్ల అమ్మను రిక్వెస్ట్‌ చేశా. అది ఆమెకు ధిక్కారంగా.. అమర్యాదగా అనిపించిందట. నచ్చలేదట. తెల్లవారి మేం ముంబై ప్రయాణమయ్యాం.

వారం తర్వాత..!
అనుభవ్‌ ముంబై వచ్చాడు. కలిశాను. జరిగినదాని మీద చర్చించుకున్నాం. విస్తుపోయాను ఆయన మాటలు విని. మ్యాట్రిమోనియల్‌లో చూసి.. కలిసి.. మాట్లాడింది ఇతనితోనేనా? ఇతనేనా పెళ్లి తర్వాత కూడా నేను నేనులాగే ఉండొచ్చు అని చెప్పింది.. ఇతనేనా నా స్వతంత్య్ర వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్తున్నాను.. గౌరవిస్తున్నాను అని చెప్పింది? ఇతనేనా నన్ను సపోర్ట్‌ చేసిన వ్యక్తి అని అనిపించింది. ముంబై వచ్చాక అతను చెప్పిన మొదటి మాట.. ‘‘పెళ్లయ్యాక నువ్‌ జాబ్‌ మానేయాలి’’ అని. తర్వాత చెప్పిన నిజాలు.. ‘‘నాకు మా పేరెంట్స్‌తో కలిసి ఉండడం ఇష్టం. పెళ్లయ్యాక మనం ఢిల్లీలోనే ఉంటాం. నీకన్నా నా సంపాదనే ఎక్కువ కాబట్టి.. నీ కెరీర్‌ మీద కాంసంట్రేట్‌ చేయాల్సిన పనిలేదు నీకు.

అదీగాక.. త్వరలోనే నేను బిజినెస్‌ స్టార్ట్‌ చేయబోతున్నా.. అందుకని.. నీకు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ లేదు. హాయిగా మా పేరెంట్స్‌ని, ఇంటిని చూసుకో చాలు. ఇక ఉల్లి, వెల్లుల్లి మానేయడం పెద్ద ఇష్యూ కాదు. అవి లేకుండా కూడా భోజనం చాలా రుచిగా ఉంటుంది’’ అన్నాడు. నిజమే ఉల్లి, వెల్లుల్లి మానేయడం ఏమంత బిగ్‌ డీల్‌ కాకపోవచ్చు. కాని ఆ ఇంట్లో వాళ్ల మెదళ్లలో ఈ డోంట్స్‌.. ఉల్లివెల్లుల్లితోనే ఆగిపోలేదు.. ఆగిపోవు కూడా!‘‘నేను అతనితో పెళ్లికి నో చెప్పా! నా వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి నాకు కావాలి.. జీవితంలో మోర్‌ అచీవ్‌మెంట్స్‌కి సపోర్ట్‌ ఇచ్చే లైఫ్‌ పార్టనర్‌ కావాలి కాని.. కిందకు తోసే భర్తకాదు. పెళ్లి లేదా కెరీర్‌ అని ఎంచుకునే చాయిస్‌ అమ్మాయిలకే ఎందుకు? ఇదేం న్యాయం?’’ అంటూ ప్రశ్నిస్తోంది ఆ అమ్మాయి!

పెళ్లి లేదా కెరీర్‌.. ఏదో ఒకటే!
నిజమే అమ్మాయిలకే ఎందుకు ఇలా చాయిస్‌ పెడ్తారు? పెళ్లి తర్వాతా అబ్బాయి కెరీర్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటుంది కదా.. అలాగే అమ్మాయి విషయంలోనూ ఎందుకు ఆలోచించరు? అబ్బాయికి సపోర్ట్‌గా నిలిచినట్టే అమ్మాయికి ఎందుకు నిలబడరు?ఒక మాట్రిమోనియల్‌ యాడ్‌లో.. కొడుకు, కోడలిని చూడ్డానికి వస్తారు తల్లిదండ్రులు. పొద్దున్నే కోడలు ఆఫీస్‌కు వెళ్లిపోతోంది ఆదరాబాదరాగా. సాధ్యమైనంత వరకు పెద్దవాళ్లతో అబ్బాయే గడుపుతుంటాడు. ఇది చూసి ఆ అబ్బాయి తండ్రి ‘‘ఒరేయ్‌.. నువ్వు బాగానే సంపాదిస్తున్నావ్‌ కదరా.. ఇంకా అమ్మాయి ఉద్యోగం చేయడం అవసరమా?’’అని అడుగుతాడు.

‘‘అవసరం కాదు నాన్నా.. ఆమె ఆసక్తి’’ అని వాళ్ల నాన్నకు చెప్తాడు.మాట్రిమోనియల్‌ ద్వారా వాళ్ల సంబంధం కుదిరినప్పుడు ఆమె .. అతనితో అంటుంది.. పెళ్లయ్యాక కూడా నేను ఉద్యోగం చేస్తాను.. అని. దానికి ఆయన సరే అంటాడు. అనడమే కాదు పెళ్లయ్యాక ఆ మాటను నిలబెట్టుకుని భార్యను గౌరవిస్తాడు.. తద్వారా తనను తాను గౌరవించుకుంటుంటాడు! ఇది సదరు మాట్రిమోనీ గిరాకీని పెంచే ఒక ప్రకటన మాత్రమే కాదు.. ఈ తరం అబ్బాయిలు.. వాళ్ల తల్లిదండ్రులు మారాలని చెప్పే సూచన కూడా!
– సరస్వతి రమ


►కాబోయే భార్యాభర్తలుగా పెళ్లి తర్వాత మేం ఎలా ఉండాలో మమ్మల్ని డిసైడ్‌ చేసుకోనివ్వండి.. ఆ స్పేస్‌ ఇవ్వండి అని అనుభవ్‌ వాళ్ల అమ్మను రిక్వెస్ట్‌ చేశా. అది ఆమెకు ధిక్కారంగా.. అమర్యాదగాఅనిపించిందట.

►నా  వ్యక్తిత్వాన్ని గౌరవించే వ్యక్తి నాకు కావాలి.. జీవితంలో మోర్‌ అచీవ్‌మెంట్స్‌కి సపోర్ట్‌ ఇచ్చే లైఫ్‌ పార్టనర్‌ కావాలి కాని.. కిందకు తోసే భర్తకాదు. పెళ్లి లేదా  కెరీర్‌ అని ఎంచుకునే చాయిస్‌ అమ్మాయిలకే ఎందుకు? ఇదేం న్యాయం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement