అమ్మానాన్నలకు ఆయుష్షు | His parents felt that something broke down between himself and me | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలకు ఆయుష్షు

Published Thu, May 23 2019 12:14 AM | Last Updated on Thu, May 23 2019 12:14 AM

His parents felt that something broke down between himself and me - Sakshi

చెట్టుకు నీరందితే..పండుటాకు కూడా పడకుండా ఆగుతుందేమో! పిల్లల ప్రేమ ఆయుష్షుపోసే అమృతం! పిల్లల కోసం కన్న కలలన్నీ ఇచ్చేశాక తల్లిదండ్రులకు నిద్రా ఉండదు.. కలా మిగలదు! కంటికి కనపడితే చాలు.. అప్పటిదాకా మూగగా ఉన్న కన్నీరు ఆనందబాష్పాలుగా రాలుతాయి!!

ఆత్మీయత చెదరకుండా ఉంటే దూరాలదో లెక్క కాదు అంటారు.పాశం గాఢంగా ఉంటే ఎవరు ఎక్కడ ఉంటే ఏం అని కూడా అంటారు.మేం ఇక్కడ ఉన్నాం కానీ మా మనసంతా అక్కడే అని పిల్లలు అంటే మీరు బాగుంటే చాల్రా మాదేముంది ఎక్కడైనా బతికేస్తాం అని పెద్దలు అంటారు.తప్పు. మాటలు చాలా తప్పు.సడన్‌గా అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది సప్త సముద్రాల అవతల పిల్లలు ఉంటే ఎంత బాధో, ఇంటినుంచి ఫోన్‌ వస్తే అరగంటలో వాలిపోని దూరంలో ఉంటే పిల్లలకు ఎంత క్షోభో.తెలుగు నేల నుంచి అమెరికాకు ఎగురుతున్న విమానాలు ఎన్ని కథలను తమ రెక్కల మీద మౌనంగా మోస్తున్నాయో కదా.

అట్లాంటా కూడా దాదాపు సౌత్‌ ఇండియాలానే ఉంటుందని అంటారు. ఇలాంటి ఎండే. ఇలాంటి వానే. ఇలాంటి సముద్రమే. ఇరవై ఏళ్లయిపోయింది సునీల్‌ అక్కడకు వచ్చి. భార్యతో కలిసి జీవితం అక్కడే మొదలెట్టాడు. పిలల్ని కనే సమయంలో భార్య ఇండియాకు వెళ్లక్కర్లేదని ఇక్కడే డెలివరీ అయ్యే ఏర్పాటు చేశాడు. ఒకమ్మాయి ఒకబ్బాయి. ఇద్దరూ కొంచెం గబుక్కున చూస్తే అచ్చు అమెరికన్లలా ఉంటారు ఎర్రగా బుర్రగా అలాంటి బట్టల్లో. ఇరవై ఏళ్లలో సంపాదించింది సునీల్‌కు సంతృప్తిగా ఉంది. చేసిన సేవింగ్స్‌... ఏర్పాటు చేసుకున్న ప్రాపర్టీస్‌ అతడు ఇక పని చేయకపోయినా కాపాడుతాయి. భార్య కూడా వచ్చిపోయే బంధువులు, పెత్తనాలు చేసే అనుబంధాలు, ఆరా తీసే చుట్టపు చూపులు లేకపోవడం వల్ల ఇదే మంచి జీవితం అని నమ్ముతూ ఉంది. అంతా బాగున్నట్టే కాని కొన్నాళ్లుగా సునీల్‌ ఇంతకు మునుపులా లేడు.

పనికి సక్రమంగా వెళ్లడం లేదు. హుషారుగా జోకులు వేయడం లేదు. నవ్వడం లేదు. పరధ్యానంగా ఉంటున్నాడు. ఫ్రెండ్స్‌ను కూడా కలవడం లేదు.‘నేనేం అపకారం చేశానని ఇంతలా మూగమొద్దు అయ్యారు’ అని భార్య ఒకరోజు నిలదీసింది.పిల్లలు కూడా ‘ఏమైంది నాన్నా’ అని ఇంగ్లిష్‌లో అడిగారు.కాని సునీల్‌ ఏమని చెప్తాడు?బహుశా అమెరికాలో ఉన్న చాలామంది చేరే దశకే అతడు చేరినట్టు ఉన్నాడు.సునీల్‌ తండ్రి రాఘవయ్య పోస్ట్‌మాస్టర్‌గా పని చేసేవాడు. ఒకప్పుడు అత్యంత ఎక్కువ పని, అతి తక్కువ జీతం ఉండే శాఖ పోస్టల్‌ శాఖ అని చాలామందికి తెలియదు. రాఘవయ్య ఏ రోజూ తీరిగ్గా ఇంట్లో ఉండేవాడు కాదు. ఎప్పుడూ కుటుంబంతో సంతోషంగా గడిపేవాడు కాదు. ‘మనబ్బాయి బాగా చదువుకోవాలి. అందుకు నేను కష్టపడాలి’ అని భార్యతో చెప్పేవాడు. ప్రతిపైసా సునీల్‌ కోసమే.

స్థోమత లేకపోయినా మంచి స్కూళ్లలో చేర్పించాడు. మంచి కోచింగ్‌లో చేర్పించాడు. బి.టెక్‌ మంచి కాలేజీలో చదివించాడు. అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అమెరికా వెళితే సంతోషపడ్డాడు. సునీల్‌ తన సేవింగ్స్‌లో నుంచి ఊళ్లో పాత ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టించాడు. పాత స్కూటర్‌ మీద తిరగొద్దని కొత్త కారు కొనిపెట్టాడు. ఏ అవసరం ఎలా ఉంటుందో అని తల్లి పేర్న, తండ్రి పేర్న డబ్బు అకౌంట్‌లో వేసి పెట్టాడు. అంతేనా... సంవత్సరానికి ఒకసారి కుటుంబంతో సహా వచ్చి నెలరోజులు ఉండేసి పోయేవాడు. కాని రాను రాను పద్ధతి మారింది. పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఇండియాకు రమ్మంటే వారి ఆసక్తి పోయింది. పైగా కాలేజీ చదువులనీ స్పెషల్‌ క్లాసులనీ ఇంకేవో పనులనీ రెండు మూడేళ్లుగా ఇండియా రావడం మానేశారు. సునీల్‌ ఆరునెలలకు ఓసారి వెళ్లి వస్తున్నా కుటుంబం లేని మనిషిగా వెళుతున్నాడు.

క్రమంగా తన తల్లిదండ్రులకు తనకూ మధ్య ఏదో తెగిపోయిందనే భావన వచ్చింది.అదే కాదు–తల్లిదండ్రులు కూడా వయసులో పెద్దవారయ్యాక ‘వద్దులేరా... నీ దగ్గరకు వచ్చి జరగరానిది జరిగితే దేశం కాని దేశంలో మా కట్టె కాలడం ఇష్టం లేదు’ అని చెప్పేశారు.కాకుంటే ఇప్పుడు వాళ్లకు మనిషి లేడు. ఉండాల్సిన మనిషి అమెరికాలో ఉన్నాడు. అదీ సమస్య.‘మీ కుటుంబంలో మొత్తం ముగ్గురు డిప్రెషన్‌తో బాధ పడుతున్నారు’ అంది సైకియాట్రిస్ట్‌ సునీల్‌తో. భార్య బలవంతం చేస్తే గాలి మార్పు ఉంటుందని అంటే పిల్లలను అక్కడే వదిలి భార్యతో కలిసి ఇండియాకు వచ్చిన సునీల్‌ సైకియాట్రిస్టు దగ్గరకు వచ్చాడు.‘అవునా?’ అన్నాడు సునీల్‌.‘అవును. మీ తల్లిదండ్రులకు కూడా డిప్రెషన్‌ ఉంటుంది మీరు గమనించి చూసినట్టయితే. అలాంటి చాలామంది తల్లిదండ్రులను నేను ట్రీట్‌ చేశాను.

ఒక్కడే కొడుకు. అల్లారు ముద్దుగా పెంచి దేశం కాని దేశం పంపించారు. కాని చివరి రోజుల్లో కూడా ఆ కొడుకు అంతే దూరంలో ఉంటాడంటే ఎవరికైనా మనసులో శూన్యం వచ్చేస్తుంది. కనీసం వారిది గిల్ట్‌ లేని డిప్రెషన్‌. మీది గిల్ట్‌ ఉన్న డిప్రెషన్‌. ఇంత కష్టపడిన తల్లిదండ్రులకు దగ్గరుండి ఏమీ చేయలేకపోతున్నానే అనే సమస్య మీది’ అంది సైకియాట్రిస్ట్‌.‘అవును డాక్టర్‌. పూర్తిగా చక్రబంధంలో ఇరుక్కుపోయాను. ఇండియాకు షిఫ్ట్‌ అవ్వాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్లను తీసుకువెళ్లాలన్నా సమస్యలు. నాన్నకు ఆస్తమా ఉంది. అటాక్‌ వచ్చినప్పుడు తనకు సాయానికి దిక్కూమొక్కూ లేదు అని అనుకుంటే నాకెంత నొప్పి. నేను అక్కడా ఉండలేకా ఇక్కడా ఉండలేక బాధ పడుతున్నాను’ అన్నాడు సునీల్‌.సైకియాట్రిస్ట్‌ సునీల్‌ భార్య వైపు చూసింది.‘నాదేం లేదు డాక్టర్‌.

ఈయన మళ్లీ మామూలు మనిషైతే చాలు. నేను అన్ని విధాల సపోర్ట్‌ చేయడానికి రెడీగా ఉన్నాను’ అంది.‘అయితే ఒక పని చేయండి. మీరు సీన్‌ రివర్స్‌ చేయండి’ అంది సైకియాట్రిస్ట్‌.’అంటే?’ అన్నాడు సునీల్‌.‘మీ పిల్లలు ఇప్పుడు కాలేజీ వయసులో ఉన్నారు కదా. వాళ్లను అక్కడే ఉంచి ఒక రెండేళ్లు మీరిక్కడకు షిఫ్ట్‌ అవ్వండి. మూడు నెలలకో ఆరు నెలలకో ఒకసారి వెళ్లి ఎవరో ఒకరు పిల్లలను చూసి వస్తుండండి. ఇది గొప్ప సొల్యూషన్‌ కాకపోవచ్చుగానీ ఇప్పుడున్న పరిస్థితిలో బెటర్‌ సొల్యూషన్‌’ అంది సైకియాట్రిస్ట్‌.ఇది సునీల్‌కు, సునీల్‌ భార్యకు నచ్చింది.ఇద్దరు పిల్లలూ యూనివర్సిటీలలో అడ్మిషన్స్‌ తీసుకున్నాక వాళ్లు ఇక్కడకు వచ్చి సునీల్‌ తల్లిదండ్రులతో ఉండటం మొదలెట్టారు. తల్లిదండ్రులకు ఇది ఎంతో ఓదార్పుగా అనిపించింది.

సునీల్‌కు కూడా తాను తల్లిదండ్రులను చూసుకుంటున్నాను అనే భావన ఆరోగ్యాన్ని ఇచ్చింది.ఇందుకు బదులుగా సునీల్‌ తన కెరీర్‌ను పక్కన పెట్టాడు.ఒకటి పొందాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిందేనని అర్థమైంది.సునీల్‌ చేసిన పని కూడా చేయలేని చాలామంది నడి వయసు తెలుగువాళ్లు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వృద్ధాప్యంలో చివరి రోజులు లెక్కపెట్టుకుంటున్న వారి తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. ఇరు వర్గాలకు ఆర్థిక లేమి లేదు మానసిక ఆనంద లేమి తప్ప.వలస లేని మానవజాతి లేదు.కాని వలస వల్ల జరుగుతున్న అనుబంధాల నష్టాన్ని మాత్రం ఏ లెక్కలూ తేల్చడం లేదు.ఇక్కడి అరుగుల మీద కుర్చున్న వృద్ధులు, అక్కడ మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న కొడుకులు నవ్వుతున్నారు కానీ నిజంగా సంతోషంగా ఉన్నారా అనేది ప్రశ్న.
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement