రక్షణ గోడ లేని కేసీ కెనాల్
♦ కర్నూలులో 6 కి.మీ మేర కేసీ కాలువ
♦ కంచె ఏర్పాటులో శాఖల మధ్య సమన్వయ లోపం
♦ ఏటా ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రజాప్రతినిధులు
♦ వారంలో ముగ్గురు చిన్నారుల గల్లంతు
♦ కన్నపేగు కన్నీరు తుడిచే వారేరి?
కర్నూలు సిటీ:
నగరం నడి మధ్యలో వెళుతూ నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే కేసీ కాలువ అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా చిన్నారుల ప్రాణాలు తోడేస్తోంది. ఏటా కాలువలో చిన్నారుల గల్లంతవుతున్నా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిండుకుండలా..
ఇటీవల తుంగభద్ర నది జిల్లా సరిహద్దులో కురిసిన వర్షాల వల్ల భారీగా వరద నీరు రావడంతో రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కేసీ కాలువ నిండు కుండలా ప్రవహిస్తోంది. నీటి ఉధతి ఎక్కువగా ఉండడంతో కాలువ గట్టుకు సమీపంలోని నివాసాలకు చెందిన వారు తమ పిల్లలను అటు వైపు పోకుండా కాపలాగా ఉంటున్నారు. కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివిధ పార్టీల నాయకులు ప్రతి సందర్భంలోనూ చెబుతూ వస్తున్నా ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో చిన్నారుల ప్రాణాలు కాలువలో కలిసిపోతున్నాయి.
అంచనాల్లోనే జాప్యం..
నగరంలో సుమారు 6 కి.మీ కేసీ కాలువ ప్రయాణిస్తుంది. స్టాంటన్‌పురం దగ్గర మొదలై, ఇందిరమ్మ కాలనీ వరకు ఉన్న కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు గత ప్రభుత్వం హయాంలో 1.75 కోట్లతో కాలువకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి బంగారుపేట వరకు నేటికీ కంచె ఏర్పాటు చేయలేదు. కాలువకు కుడి వైపున కంచె లేకపోవడంతోనే గురువారం కాలేబు అనే విద్యార్థి కాలువలోకి దిగి కొట్టుకుపోయాడు. కాలువకు ఇరువైపులా 3 కి.మీ కంచె ఏర్పాటుకు రూ.71 లక్షలతో కేసీ ఇంజనీర్లు అంచనాలు వేశారు. అయితే అంచనాల్లో తప్పులు దొర్లడం, వాటిని సరిదిద్దడంలోనే కాలం కరిగిపోతోంది. జూలైలోనే ఈ పనులు కొలిక్కి వచ్చుంటే గత నెల నాటికే పూర్తయ్యేవి. వీరి నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు హేతువుగా నిలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫెన్సింగ్ ఏర్పాటు చేయండిజిల్లాకలెక్టర్‌తో చర్చించినఎంపీ బుట్టా రేణుక
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీకెనాల్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. శుక్రవారం సాయంత్రం ఎంపీ జిల్లాకలెక్టర్ సత్యనారాయణను ఆయన ఛాంబరులో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీకాలువ నగరంలోని జనావాస ప్రాంతాల గుండా వెళుతుందని, చిన్నపిల్లలు తెలిసీ తెలియక వెళితే ప్రమాదకరమని తెలిపారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపీ వెంట వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.కె.రాజశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా ఉన్నారు.
కంచె ఏర్పాటు చేయండి
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ డిమాండ్
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : కేసీ కాలువకు కంచె ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. పిల్లలు కేసీ కాలువలో గల్లంతైన సంఘటనకు నిరసనగా శుక్రవారం జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 200 కోట్లతో నగరాన్ని అభివద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్న నాయకులకు కేసీ కెనాల్‌కు కంచె వేయాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాలువకు కంచె లేకపోవడంతో పొరుగున ఉండే కాలనీలకు చెందిన ఎంతోమంది పిల్లలు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
వెంటనే కంచె ఏర్పాటు చేయకపోతే ఆందోళనలు చేపడతామని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య హెచ్చరించారు. పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సలోమి, ట్రేడ్ యూనియన్ నగరాధ్యక్షుడు కటారి సురేశ్, నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సాంబశివారెడ్డి, ధనుంజయాచారి, చంద్రశేఖర్‌గౌడ్, జీవరత్నం, అశోక్, అశోక్‌కుమార్, సంజు, ఫైజాన్, మంగమ్మ, ఉమాబాయి పాల్గొన్నారు.