ఇంకా నత్తి నత్తిగా మాటలు వస్తున్నాయి!
మా పాపకు తొమ్మిదేళ్లు. స్కూల్లో చాలా బాగా చదువుతుంది. అయితే ఇప్పటికీ ఫ్రీగా నాలుక మాత్రం తిరగడం లేదు. మాట్లాడుతుంటే కొంచెం నత్తిగా వస్తుంటుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు చక్కగానే వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా కావచ్చు అంటున్నారు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి చక్కగా మాట్లాడాలంటే మేమేం చేయాలో సలహా ఇవ్వండి.
- సుఫల, కొత్తగూడెం
ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు.
మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించ డం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు సమస్య చాలావరకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్ కలిసి తగు చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,
హెదరాబాద్
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
Published Fri, Jul 17 2015 10:39 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement