పాపకు తలలో మాటిమాటికీ ర్యాష్! | Ryas girl repeatedly in the head! | Sakshi
Sakshi News home page

పాపకు తలలో మాటిమాటికీ ర్యాష్!

Published Thu, Jan 9 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

పాపకు తలలో మాటిమాటికీ ర్యాష్!

పాపకు తలలో మాటిమాటికీ ర్యాష్!

మా పాపకు నాలుగు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్‌గారికి చూపించి వైద్యం చేయిస్తే తగ్గింది. అది మళ్లీ పునరావృతమవుతోంది. అలాగే పాపకు తలలోని కొన్ని భాగాలలో జుట్టు సరిగా రావడం లేదు. మా పాపకు ఉన్న సమస్య ఏమిటి? ఇది ఏవైనా ఇతర అనారోగ్యాలకు సూచనా? భవిష్యత్తులో పాపకు చుండ్రు లేదా జుట్టుకు సంబంధించిన ఇతరత్రా సమస్యలు వస్తాయా?
 - రాజ్యలక్ష్మి, సామర్లకోట

 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో చూస్తుంటాం.

ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్.పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం.

కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనక భాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు.
 
 ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్యతో ప్రభావితమైన భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం.
 
 ఇంత చిన్న వయసులో ఇలా రావడం వల్ల భవిష్యత్తుల్లో పాపకు చుండ్రు (డాండ్రఫ్), ఇతరత్రా చర్మసమస్యలు వస్తాయని చెప్పడానికి లేదు. మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ, మరోసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement