బాబు గుండెలో రంధ్రాలు... ఏం చేయాలి?
మాకు ఇటీవలే బాబు పుట్టాడు. నెల రోజుల తర్వాత బాగా జలుబు చేసినట్లుగా, నెమ్ము చేరినట్లుగా అనిపిస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. కొన్ని పరీక్షలు చేసి గుండెలో రంధ్రాలు ఉన్నాయని పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్లి చూపిస్తే గుండెలోపల రెండు రంధ్రాలు ఉన్నాయనీ, బాబుది చిన్నవయసే కాబట్టి అతడు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే పూడుకుంటాయన్నారు. మాకు చాలా దిగులుగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు.
- శ్రీధర్, షాద్‌నగర్
బాబు గుండెలో రంధ్రాలున్నాయంటూ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్‌డీ... అంటే గుండె పైగదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్‌డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు.
ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉన్నప్పటికీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా ఉన్నప్పుడు తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. ఐతే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది... ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి, ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్రా సమస్యల (అసోసియేటెడ్ కార్డియాక్ డిఫెక్ట్స్) పై ఆధారపడి ఉంటుంది.
గుండె పైగదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 నుంచి 40 శాతం మందిలోనూ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం.
ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స ఎంతైనా అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకూ ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి.
ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుండె గదుల గోడలపై రంధ్రాలున్న పిల్లలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యచికిత్స సహాయంతో - శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే ఇంట్రావెన్షన్ ద్వారా దాదాపు 95 శాతం పైగా సక్సెస్ రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్