Star Hospitals
-
చిరు సహాయంతో అభిమానికి ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి అనే మహిళకు ఆపరేషన్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగింది. చిరంజీవి సహాయంతో ఆమెకు ఈ ఆపరేషన్ స్టార్ ఆస్పత్రి సీఎండీ ఎం. గోపిచంద్ ఆధ్వర్యంలో జరిగింది. చిరంజీవి ఆమె గుండె ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. గుంటూరుకు చెందిన నాగలక్ష్మి చిరంజీవి అభిమాని. ఆపరేషన్ పూర్తికాగానే గోపిచంద్ చిరంజీవికి ఫోన్ చేసి విజయవంతమైందని తెలియజేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామినాయుడు ఆమెకు హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు చేసి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను ఒప్పించి ఆస్పత్రికి చేర్పించినందుకు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
బాబు గుండెలో రంధ్రాలు... ఏం చేయాలి?
మాకు ఇటీవలే బాబు పుట్టాడు. నెల రోజుల తర్వాత బాగా జలుబు చేసినట్లుగా, నెమ్ము చేరినట్లుగా అనిపిస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. కొన్ని పరీక్షలు చేసి గుండెలో రంధ్రాలు ఉన్నాయని పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్లి చూపిస్తే గుండెలోపల రెండు రంధ్రాలు ఉన్నాయనీ, బాబుది చిన్నవయసే కాబట్టి అతడు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే పూడుకుంటాయన్నారు. మాకు చాలా దిగులుగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్రీధర్, షాద్‌నగర్ బాబు గుండెలో రంధ్రాలున్నాయంటూ మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ బాబుకు ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ... అంటే గుండె పైగదుల్లోని గోడలో రంధ్రాలు)గాని, వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ... అంటే గుండె కింది గదుల్లోని గోడలో రంధ్రాలు) గాని ఉండవచ్చు. ఇలా గుండె గదుల్లోని గోడలపై రంధ్రాలు ఉన్న సమస్యతో పిల్లలు నీలంగా మారిపోతూ (సైనోసిస్) ఉంటే అలాంటప్పుడు పిల్లలకు తక్షణం శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో గుండె గదుల గోడలకు రంధ్రాలు ఉన్నప్పటికీ, పిల్లలు నీలంగా మారనప్పుడు, శ్వాసకోశానికి సంబంధించిన ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా ఉన్నప్పుడు తక్షణం శస్త్రచికిత్స అవసరం ఉండకపోవచ్చు. ఐతే అలాంటి పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి చికిత్స అవసరమన్నది... ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానం మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయా లేదా అన్నది కూడా ఆ రంధ్రాల పరిమాణం, అవి ఉన్న స్థానాలను బట్టి, ఆ రంధ్రాలు ఉండటం వల్ల వచ్చే ఇతరత్రా సమస్యల (అసోసియేటెడ్ కార్డియాక్ డిఫెక్ట్స్) పై ఆధారపడి ఉంటుంది. గుండె పైగదుల మధ్య ఉన్న గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 60 నుంచి 70 శాతం మందిలో ఆ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోతాయి. గుండె కింది గదుల్లోని గోడకు రంధ్రం ఉన్న పిల్లలకు దాదాపు 30 నుంచి 40 శాతం మందిలోనూ రంధ్రాలు వాటంతట అవే మూసుకుపోవచ్చు. అలాగని గుండె గోడలకు ఉన్న రంధ్రాలన్నీ వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పలేం. ఇలా గుండె గదుల మధ్య గోడకు రంధ్రాలు ఉన్న పిల్లలకు తరచూ నెమ్ము రావడం చూస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలకు తక్షణ చికిత్స ఎంతైనా అవసరం. మీరు మీ అబ్బాయిని కనీసం ప్రతి ఆర్నెలకూ ఒకసారి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌కు చూపించాలి. ఒకవేళ గుండె గదుల మధ్యనున్న రంధ్రాలు వాటంతట అవే మూసుకోకపోయినా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుండె గదుల గోడలపై రంధ్రాలున్న పిల్లలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యచికిత్స సహాయంతో - శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండానే ఇంట్రావెన్షన్ ద్వారా దాదాపు 95 శాతం పైగా సక్సెస్ రేట్‌తో సమర్థంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది...
మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా సాగడం లేదంటూ చెబుతోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం తాత్కాలికంగానే ఉంటోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - విశాలాక్షి, అమరావతి మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కుదిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండాను, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటిగాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమో షనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునో గ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీ హిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్ తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్ము ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వ్యాక్సిన్ ఇప్పించాక కూడా చికెన్‌పాక్స్..!
మా బాబుకు ఆరేళ్లు. వాడికి ఇటీవలే చికెన్ పాక్స్ వచ్చింది. అది కాస్త తీవ్రంగా వచ్చి, మందులు వాడాక తగ్గింది. అంతకుమునుపే మా బాబుకు వ్యాక్సిన్ ఇప్పించాం. అయినా ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిన చికెన్‌పాక్స్ భవిష్యత్తులో ఏవైనా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? అలాగే నేను బాబుకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నాక్కూడా చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉందా? - సీతామహాలక్ష్మి, రాజమండ్రి మీరు చెప్పిన వివరాలను బట్టి మీ బాబుకు చికెన్‌పాక్స్ చాలా తీవ్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. చికెన్‌పాక్స్ అన్నది అన్ని ఆర్థిక, సామాజిక వర్గాల్లో చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. ఇది రెండు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ జబ్బుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల ఇటీవల ఇది చాలా తక్కువమందిలోనే కనిపిస్తోంది. ఒకవేళ కనిపించినా దీని లక్షణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఒక డోస్ వ్యాక్సిన్ వల్ల 85 శాతం సందర్భాల్లో మళ్లీ చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అలాగే ఒకవేళ వచ్చినా 97 శాతం మందిలో దీని తీవ్రత చాలా స్వల్పంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అన్నది సాధ్యమైనంత వరకు రాకుండా నివారించడంతో పాటు, చాలావరకు తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రన పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇది మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఇటీవల నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు పిల్లలకు రెండో డోసు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇక చికెన్‌పాక్స్ వల్ల చాలావరకు దీర్ఘకాలంలో సంభవించే దుష్పరిణామాలన్నవి చాలా చాలా తక్కువ. కొద్దిశాతం మందిలో మాత్రం మొదటిసారి వచ్చినప్పుడే అక్యూట్దశలో నిమోనియా, రక్తం గడ్డకట్టడంలో మార్పులు, మెదడుకు సంబంధించిన సమస్యలు చూడటం జరుగుతుంటుంది. కానీ ఇది వ్యాక్సిన్ అస్సలు తీసుకోని పిల్లల్లో లేదా మరీ చిన్న పిల్లల్లో (నియోనేటల్), పుట్టుకతోనే వ్యాధినిరోధకశక్తి లోపాలు ఉన్న పిల్లల్లో ఈ కాంప్లికేషన్స్ గాని, లేదా చికెన్‌పాక్స్ మళ్లీ మళ్లీ తిరగబెట్టడం గాని చూస్తుంటాం. ఇక మీ పిల్లాడికి దగ్గరగా ఉండటం వల్ల మీకు కూడా సోకే విషయానికి వస్తే... థియరిటికల్‌గా ఈ విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినప్పటికీ, మీకు ఇదివరకే చికెన్‌పాక్స్ వచ్చి ఉన్నా లేదా ఆ లక్షణాలు కనిపించి ఉన్నా మళ్లీ మీకు తీవ్రమైన చికెన్‌పాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే ఇటువంటి లక్షణాలు గర్భిణీ స్త్రీలలో వచ్చినప్పుడు ఆ ప్రభావం తల్లితో పాటు కడుపులోని బిడ్డపై కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇక చివరగా... మీ బాబుకు చికెన్‌పాక్స్ తిరగబెడుతుందా అన్న విషయంలో మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు. అవి వచ్చి తగ్గిపోయాయి కాబట్టి ఇకపై మీరు నిశ్చింతగా ఉండవచ్చు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
స్కోలియోసిస్ అంటే ఏమిటి?
మా అబ్బాయికి ఆరేళ్లు. వాడికి వెన్ను కాస్త వంకరగా ఉందేమో అనిపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. డాక్టర్‌గారు మావాడిని చూసి, కొద్దిపాటి సమస్య ఉందని, దాని పేరు స్కోలియోసిస్ అని నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి చికిత్స ఏమీ అవసరం లేదని అన్నారు. వాడికి ఇతరత్రా సమస్యలు ఏమీ లేవు. మా బాబుకు ఉన్న సమస్య ఏమిటి? అది మున్ముందు ఏమైనా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందా? - మాణిక్యప్రసాద్, చిత్తూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి స్కోలియోసిస్ అనే సమస్య ఉన్నట్లు చెప్పవచ్చు. ఇది వెన్నెముకకు సంబంధించిన ఒక సంక్లిష్టమైన సమస్య (స్పైనల్ డిఫార్మిటీ). ఇది వెన్ను మొత్తంలో ఎక్కడైనా రావచ్చు. ఏ వయసులోనైనా కనిపించవచ్చు. కొన్నిసార్లు పుట్టుకతో వచ్చే సమస్యలు... ముఖ్యంగా వెన్నుపూసల అమరికలో తేడాలు ఉన్నప్పుడు, నరాలతోపాటు కండరాల సమస్య ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో కండరాల సమస్యలు ఉన్నప్పుడు, వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు, అలాగే రెండు కాళ్ల పొడవులో తేడాలు ఉండటం వల్ల, పుట్టుకతో వచ్చే (కంజెనిటల్) కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. కొందరిలో ఇది వంశపారంపర్యంగా కనిపించవచ్చు. మరికొందరిలో ఇది కొన్ని జన్యుపరమైన సమస్యలతో అనుబంధంగా కూడా ఉండవచ్చు. లేదా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా (ఇడియోపథిక్గా) కూడా ఈ సమస్య కనిపించవచ్చు. ఇలాంటి రోగుల్లో ఇది నడకలో మార్పులు, ఛాతీ అమరికలో తేడాలు (ఛెస్ట్ డిఫార్మిటీ), నిల్చునే పద్ధతిలో మార్పుల వంటి చిన్నపాటి సమస్యలతో బయటపడుతుంది. ఎక్స్-రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా దీని తీవ్రతను పూర్తిగా నిర్ధారణ చేయవచ్చు. చిన్నపిల్లల్లో ఇలాంటి సమస్య కనిపించినప్పుడు విపులమైన నరాలకు సంబంధించిన పరీక్షలు (డీటెయిల్డ్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్) చేయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది బయటకు కనిపించకుండా ఉన్న కొన్ని నరాలకు సంబంధించిన సమస్యలకు సూచిక అయి ఉండవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే దీనికి కారణాలు తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం చేయడం ముఖ్యం. ఈ పిల్లలకు చికిత్స అన్నది వారి వయసుపైనా, వెన్ను వంకరలోని తీవ్రత (డిగ్రీ ఆఫ్ కర్వేచర్) మీద ఆధారపడి ఉంటుంది. బ్రేసింగ్, శస్త్రచికిత్స ప్రక్రిల ద్వారా ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా, ఇతరత్రా కాంప్లికేషన్లకు దారితీయకుండా కాపాడవచ్చు. ఈ సమస్య వల్ల చిన్నపిల్లల్లో వారి వారి దైనందిన చర్యలకు ఇబ్బంది కలుగుతుంటే బ్రేసింగ్ వల్ల, అది మరింత పెరగకుండా ఆపడంతో పాటు, ఉపశమనం కూడా కలిగించవచ్చు. అయితే వెన్ను వంకర మరింత తీవ్రమవుతూ పోతుంటే (డిగ్రీ ఆఫ్ యాంగులేషన్ ఎక్కువగా ఉంటే) తప్పనిసరిగా శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఇక చాలా తీవ్రమైన స్కోలియోసిస్ ఉన్నప్పుడు అది ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. అలాగే కొన్నిసార్లు గుండె పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చు. మీ అబ్బాయికి ఇడియోపథిక్ జువెనైల్ స్కోలియోసిస్ అనే కండిషన్ ఉండవచ్చు. అయితే ఈ కండిషన్లో ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు ఏమీ లేవని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి పిల్లలు తప్పనిసరిగా ఆర్థోపెడిక్ లేదా స్పైన్ సర్జన్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఫాలో-అప్‌లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే వాళ్లలో రుగ్మత తీవ్రత పెరుగుతూ పోతుందేమో అని పరిశీలిస్తూ, దాన్ని బట్టి సరైన సమయంలో సరైన చికిత్సకు నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీరు ఒకసారి మీకు దగ్గర్లోని స్పైన్ సర్జన్‌తో పాటు పీడియాట్రీషియన్‌ను సంప్రదించి, వారి ఫాలోఅప్‌లో ఉండటం తప్పనిసరి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్