
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి అనే మహిళకు ఆపరేషన్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగింది. చిరంజీవి సహాయంతో ఆమెకు ఈ ఆపరేషన్ స్టార్ ఆస్పత్రి సీఎండీ ఎం. గోపిచంద్ ఆధ్వర్యంలో జరిగింది. చిరంజీవి ఆమె గుండె ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. గుంటూరుకు చెందిన నాగలక్ష్మి చిరంజీవి అభిమాని. ఆపరేషన్ పూర్తికాగానే గోపిచంద్ చిరంజీవికి ఫోన్ చేసి విజయవంతమైందని తెలియజేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామినాయుడు ఆమెకు హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు చేసి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులను ఒప్పించి ఆస్పత్రికి చేర్పించినందుకు చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.