వ్యాధుల పాలిట కవచం... టీకా | Diseases polycarbonate shield ... Vaccine | Sakshi
Sakshi News home page

వ్యాధుల పాలిట కవచం... టీకా

Published Sun, Nov 10 2013 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

Diseases polycarbonate shield ... Vaccine

 పెట్టని గోడ, తొడగని కవచం... వీటిని ఎప్పటికీ చూడలేం. మామూలుగానైతే ఇలాంటి మాటలు చమత్కారాల కోసమే. ఆపద నుంచి రక్షించే వాటిని ఉద్దేశించి ఈ మాటలు అంటాం. కానీ చమత్కారం కాస్తా సాకారం అయ్యేది... టీకాల విషయంలోనే. పుట్టిన నాటి నుంచి ఇవ్వాల్సినన్ని సార్లు, ఇవ్వాల్సిన వేళల్లో (అలాగే కొన్ని ఒకసారి) ఇప్పిస్తే దాదాపు జీవితాంతం అనుక్షణం కాపాడుతుంటాయి. శరీరంలో అంతర్గతంగా ఉంటూ ఏయే జబ్బులకోసం వేయించామో ఆయా జబ్బులనుంచి రక్షిస్తుంటాయవి. నేడు వ్యాక్సినేషన్ డే సందర్భంగా వ్యాక్సిన్ల గురించి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.  
 
 ఏ మాత్రం ప్రమాదకరం కాని రీతిలో ఉండే ఒక జీవసంబంధమైన అంశాన్ని తీసుకుని టీకాను తయారు చేస్తారు. ఒక రోగ కారక సూక్ష్మజీవిని పూర్తిగా బలహీనంగా చేసిగాని, లేదా హాని చేయని మృత సూక్ష్మజీవినిగాని లేదా  సూక్ష్మజీవిలోని జన్యుపరమైన అంశాలను ప్రమాదరహితంగా మార్చిగాని  శరీరంలోకి పంపిగాని టీకా రూపంలో ఇస్తారు. దాంతో మన శరీరంలోని రోగనిరోధక శక్తి వాటితో పోరాడటం ప్రారంభించే క్రమంలో కొన్ని యాంటీబాడీస్‌ను తయారు చేసుకుంటుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మళ్లీ ఆ రోగ కారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని శరీరం (ఇమ్యూనలాజికల్ మెమరీ) గుర్తించి, దాంతో పోరాడి, దాని కారణంగా వచ్చే జబ్బును  నివారిస్తుంది. ఇలా టీకా మనకు రక్షణ కల్పిస్తుందన్నమాట.
 
 పుట్టిన నాటి నుంచి ఏయే వేళల ఇవ్వాల్సిన టీకాలు ఆయా వేళల ఇప్పించడం ద్వారా పోలియో, డిఫ్తీరియా, మంప్స్, ధనుర్వాతం (టెటనస్), పొంగు వంటి అనేక జబ్బులను రాకుండా నివారించుకోవచ్చు. మన దేశంలో సైంటిఫిక్ కమిటీల సిఫార్సుల మేరకు నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌తో పాటు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏయే టీకాలు, ఏయే సమయాల్లో వేయాలో సిఫార్సు చేస్తారు.
 
 ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ తాజాగా (2012లో) సూచించిన వ్యాక్సిన్లు....
 వ్యాక్సిన్ వేశాక కనిపించే కొన్ని ప్రభావాలకు కారణాలు :

 వ్యాధితో పోలిస్తే వ్యాక్సిన్ వల్ల వచ్చే దుష్ర్పభావాలు చాలా అరుదు లేదా చాలా తక్కువ. అయితే అరుదుగా వ్యాక్సిన్ ఇచ్చాక కొన్నిసార్లు కొన్ని దుష్ర్పభావాలు కనిపించవచ్చు. దానికి అనేక కారణాలుంటాయి. అనేక వ్యాక్సిన్లను కలిపి ఇచ్చే కాంబినేషన్‌లలో ఏది ఎంత మోతాదులో కలవాలో అది జరగకపోవడం; వ్యాక్సిన్ తయారీ సమయంలోనే తప్పు దొర్లడం; వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ప్రదేశాలు శరీరంలో నిర్దిష్టంగా ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో కాకుండా వేరే ప్రదేశాల్లో ఇవ్వడం; స్టెరిలైజేషన్ పద్ధతులను అనుసరించకపోవడం; వ్యాక్సిన్‌ను సరిగా నిల్వ చేయకపోవడం... ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్ విఫలం కావచ్చు. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో తప్పులు దొర్లకుండా ఉండాలంటేపైన పేర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటినీ నిరోధించాలి. అంతేగాని ఏవైనా  పొరబాట్ల వల్ల జరిగిన పరిణామాలను వ్యాక్సిన్‌కు ఆపాదించకూడదు. వ్యాక్సిన్ల పట్ల ప్రజల్లో నమ్మకం తొలగించే ఎలాంటి చర్యలకూ పాల్పడకూడదు.
 
 ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలి:

 వ్యాక్సిన్లలో అనేక కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫలానావి మంచివనీ, కొన్ని కావని కొందరు అంటుంటారు. దాంతో సాధారణ ప్రజల్లో ఏవి మంచివి, ఏవి కావనే విషయంలో అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం ఉన్న ఏ వ్యాక్సిన్‌ను అయినా నిరభ్యంతరంగా వాడవచ్చు.
 
 ఇక కొందరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే కొన్ని వ్యాక్సిన్లపై సందేహం ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే వ్యాక్సిన్లు కూడా చాలా  నాణ్యమైనవే. అయితే కొన్ని నిర్దిష్టమైన (ఆప్షనల్/స్పెషల్) వ్యాక్సిన్లను ప్రభుత్వం ఇంకా అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అవి కూడా క్రమక్రమంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే అందరికీ అందుబాటులోకి  వచ్చే అవకాశాలున్నాయి.
 నిర్వహణ: యాసీన్
 
 భవిష్యత్తులో రాబోయే కొత్త వ్యాక్సిన్లలో కొన్ని...

 ఆర్‌ఎస్‌వీ వైరస్  
 హెచ్‌ఐవీ వైరస్
 ఈ-కొలై  
 కలరా  
 డెంగ్యూ
 మలేరియా  
 చికెన్‌గున్యా
 హెపటైటిస్ సి, హెపటైటిస్-ఈ స్ట్రెప్టోకోకస్, స్టెఫాలోకాకల్  వంటి కొన్ని సూక్ష్మజీవులకు సంబంధించిన వ్యాక్సిన్లు ఇప్పటికే వేర్వేరు ప్రయోగ దశల్లో ఉన్నాయి. త్వరలోనే అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
 
 కొంతమంది హైరిస్క్ పిల్లలకు ఇవ్వాల్సిన కొన్ని  వ్యాక్సిన్లు: ఇన్‌ఫ్లుయెంజా, మెనింగోకోకల్, జాపనీస్ ఎన్‌కెఫలైటిస్, కలరా, రేబీస్, ఎల్లో ఫీవర్,  పీపీఎస్‌వీ.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి,
 పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement