ఆడుతూ.. పాడుతూ.. | Saraswati Rama chit chat with srikanth shushila | Sakshi
Sakshi News home page

ఆడుతూ.. పాడుతూ..

Published Fri, Jan 23 2015 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

ఆడుతూ.. పాడుతూ..

ఆడుతూ.. పాడుతూ..

నువ్వు నేను : శ్రీకాంత్,సుశీల
In all the world there is heart for me like yours.. In all the world there is no love for you like mine.. అని మాయా ఏంజిలో చెప్పినట్టే ఉంటుందీ జంట! ఆమె.. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్! అతను.. డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ ఫిజీషియన్! ఇద్దరూ డాక్టర్లే అనే సారూప్యతే కాక మరో ప్రత్యేకతా ఉంది.. ఆలుమొగలిద్దరూ కళాకారులు. ఆయన స్వరం కర్ణాటక సంగీతంతో శృతి కలిపితే.. ఆమె అడుగులు కూచిపూడి లయను ఒలికిస్తాయి! వైద్యవృత్తి ఇరువురినీ ఏడడుగులు నడిపిస్తే.. కళ.. ఆ బంధాన్ని అందమైన అనుబంధంగా మలుస్తోంది!
- సరస్వతి రమ
 
శ్రీకాంత్‌ది కళాకారుల కుటుంబం. నాన్న ఉషాకాంత్ పేరున్న సంగీతకారులు. అమ్మా గాయినే. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం సుశీలది. వావిలాల గోపాలకృష్ణ తమ్ముడి కూతురు ఆమె. ఈ భిన్న నేపథ్యాల కలయిక అటు వ్యాధుల మీద సమరం ప్రకటిస్తూ .. ఇటు సంసారంలో సరిగమలు పలికిస్తోంది!
 
ఎలా కలిశారు?
‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. డాక్టరమ్మాయే కావాలని అనుకోలేదు. బాగా చదువుకున్న అమ్మాయైతే బాగుండు అనుకున్న. అయితే మా అమ్మకు మాత్రం డాక్టర్ కోడలు కావాలని ఉండేది’ అని శ్రీకాంత్ చెప్తే.. ‘మా అమ్మ కూడా డాక్టర్ అల్లుడు వస్తే బాగుండు అనుకుంది’ వాళ్లింటి ముచ్చట చెప్పారు సుశీల. అల్లుడు పాటగాడని ఇటువైపు, కోడలు నర్తకి అని అటువైపూ ఎప్పుడు తెలిసింది అని అడిగితే.. ‘సుశీల మంచి డ్యాన్సరని పెళ్లిచూపులకంటే ముందే తెలుసు!’ అంటూ శ్రీకాంత్ విషయాన్ని పరిచయం చేస్తే.. ‘మాది గుంటూరు.

అక్కడే మెడిసిన్ చేశా. ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పెర్‌ఫార్మ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఆ ప్రోగ్రామ్‌కి అత్తయ్య, మామయ్య కూడా వచ్చారు. నన్ను మెచ్చారు’ అంటూ వివరించారు సుశీల. ‘మామూలుగా మెచ్చుకోవడం కాదు.. అమ్మ అయితే తను చాలా మంచి డ్యాన్సర్‌రా.. అంటూ ఒకటే ప్రశంసలు’ మురిపెంగా ఆ ముచ్చట ముగించారు శ్రీకాంత్! ‘నేనూ పెళ్లికి ముందే తన పాటలు విన్నాను’ అని సుశీల కొసమెరుపు.
 
పెళ్లి.. పాట.. ఆట..
‘పెళ్లి చూపుల్లో మా కళల గురించి ఏమీ మాట్లాడుకోలేదు కానీ.. చదువు గురించి మాట్లాడుకున్నాం’ సుశీల. ‘తను అప్పటికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. నాదేమో పీజీ అయిపోయింది. పెళ్లయ్యాక తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. చెప్పాను కూడా’ శ్రీకాంత్. ‘అన్నట్టుగానే చదివించారు. ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేశారు..’ చెప్పారు సుశీల. మరి ఆట, పాట ఒకే వేదిక మీద వినిపించింది, కనిపించింది.. ఎప్పుడూ అని అడిగితే.. ‘పెళ్లిలో’ అంటారిద్దరూ. ‘పెళ్లప్పుడు జయదేవుడి గీతగోవిందం ఆయన పాడితే రాధగా నేను డ్యాన్స్ చేశాను’ అంటూ ఆ తీపి జ్ఞాపకాన్ని సుశీల గుర్తుచేసుకుంటే నవ్వుతో ఆస్వాదించారు శ్రీకాంత్.
 
మల్టీటాస్క్‌లో అపశృతులు..?
‘అస్సలు లేవ్’ ముక్త కంఠంతో సమాధానం వచ్చింది. ‘ప్రొఫెషన్ అయినా, హాబీ అయినా ప్లాన్డ్‌గా ఉంటాం’ అంటారు శ్రీకాంత్. ‘ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలనే ఆలోచన మా ఇద్దరికీ లేకపోవడం ప్లస్ అయింది. ఇద్దరికీ టీచింగ్ మీదే ఇంట్రెస్ట్. దాని ప్రకారమే ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇది నల్లేరుపై నడకేం కాదు. రోజుకి 18 గంటలు పనిచేసిన సందర్భాలూ ఉన్నాయ్’ అని సుశీల పనితీరును వివరిస్తే.. ‘గెస్ట్ లెక్చర్స్‌తో టూర్స్‌లాంటి షెడ్యూల్స్‌తో ఒకరం బిజీగా ఉంటే మిగిలిన బాధ్యతలను ఇంకొకరం చూసుకుంటాం’ అంటారు శ్రీకాంత్. ‘నేను ఇంటి విషయాలంతగా పట్టించుకోను. అవన్నీ ఆయనే చూసుకుంటారు’ సుశీల. ‘తను టెక్నికల్ ఎక్స్‌పర్ట్. అందుకే నా వర్క్‌లోని టెక్నికల్ పార్ట్ తనే చేసి పెడుతుంది’ కితాబిస్తారు శ్రీకాంత్. ‘నా స్పెషలైజేషన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ ఆయన చెప్తుంటారు’ అంటూ సుశీల తమ పరస్పర సహకారాన్ని వివరించారు.
 
కళాసహకారం?
‘అదీ అంతే. ఒకేసారి ఇద్దరం ప్రోగ్రామ్స్ పెట్టుకోం’ అంటారు సుశీల. ‘నా ప్రోగామ్ ఉన్నప్పుడు ప్లానింగ్ నుంచి ఇన్విటేషన్, బ్యాక్‌స్టేజ్ అరేంజ్‌మెంట్స్ దాకా అన్నీ తను చూసుకుంటుంది. తన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ పనులన్నీ నేను చూసుకుంటాను’ శ్రీకాంత్. సూచనలు, సలహాలు.. ఉంటాయ్. ఏదైనా ఇద్దరం కలిసే డిస్కస్ చేసుకుంటాం. మాది జాయింట్ ఫ్యామిలీ. ముందు నాన్నతో, తర్వాత సుశీలతో.. అన్నీ చర్చించాకే అడుగు వేస్తాం’ అంటారు శ్రీకాంత్. ప్రశంసలు, విమర్శలు.. ‘ఉంటాయ్. కించపర్చుకునేలా కాదు.. ఒకరికొకరు గైడ్ చేసుకునేలా’ సుశీల స్పందన.
 
జెలసీ..
‘ఆ మాటకు చోటే లేదు’ శ్రీకాంత్ దృఢస్వరం. ‘నీది, నాది అనుకున్నప్పుడు అవన్నీ ఉంటాయ్. మనది అనుకున్నప్పుడు అసూయ అన్న మాటే రాదు’ సుశీల. ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా భార్య స్పెషల్ వన్‌గా ఉండాలనేది నా కోరిక’ శ్రీకాంత్ ముక్తాయింపు. మరి కోపాలు.. ‘మనుషులమే కదా.. వస్తాయ్. కాస్త అరుస్తాను.. తగ్గుతాను. అంతేకాని ఆర్గ్యుమెంట్స్ చేసుకోం’ శ్రీకాంత్. ‘ఇంట్లో మామయ్య స్ట్రిక్ట్ వార్నింగ్.. డిస్కషన్సే కాని ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు అని. అయితే ఆయన కోపం పాలమీద పొంగే కానీ నాదే న్యాగింగ్‌గా ఉంటుంది’ తన బలహీనతను తెలిపారు సుశీల. ‘కోపం త్వరగా రాదు వస్తే త్వరగా పోదు. ఆ న్యాగింగ్ అంటేనే కాస్త ఇబ్బంది’ అని మైనస్‌ను కోట్ చేస్తూనే ‘అలాగే తను చాలా స్ట్రాంగ్, ఎనర్జిటిక్.

తెల్లవారుజాము వరకు పనిచేసినా అలసిపోదు. అంతే ఫ్రెష్‌గా తిరిగి రోజును మొదలుపెడుతుంది. ఎలాంటి టాస్క్‌నైనా అవలీలగా చేసేస్తుంది’ అంటూ భార్యలోని ప్లస్‌నూ ప్రశంసించారు. ‘నా వృత్తి నేర్పిన నైపుణ్యం అది. నా ప్రొఫెషనంతా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడమే కదా. అయితే తనకున్నంత ఓపిక నాకులేదు’ అంటూ భర్తలోని ప్లస్‌కూ ప్లేస్ ఇచ్చారు సుశీల. ‘నన్ను భరించువాడు, మంచివాడు’ అని ఆమె, ‘మై స్పెషల్‌వన్’ అంటూ అతనూ ఒక్క మాటలో బెటర్ హాఫ్‌కు పరిపూర్ణ అర్థమిచ్చారు.
 
మ్యూజిక్ ఫర్ హీలింగ్
డెబ్బైరెండు మేళకర్త రాగాల అనుసంధానం.. నాలుగేళ్ల శోధన.. ఈ శ్రమ ఫలితమే మ్యూజిక్ ఫర్ హీలింగ్! వైద్యం, సంగీతం కలిసి, కలిపి చేస్తున్న ట్రీట్‌మెంట్.. నాదతనుమనిశమ్! ఇది డాక్టర్ జె. శ్రీకాంత్ కృషి ఫలితం. ఈ రోజు రవీంద్రభారతిలో సాయంత్రం ఆరుగంటలకు ఆవిష్కరణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement