Rama Saraswati
-
పీడ ఫీలింగ్
పడుతుంటే పట్టుకోవాల్సిన పిల్లలను పడతొక్కేవాళ్లుంటారా? పీడకలలొస్తే లాలించే పెద్దలే ఓ పీడకలవుతారా? ఇక పిల్లల్ని ఎవరి అండకు వదలాలి? ఇక పిల్లల్ని ఏ భరోసాకి అప్పజెప్పాలి? చీదర పుడుతోంది... కాదు కాదు కంపరం పుడుతోంది... పట్టలేనంత కోపం వస్తోంది! గొంతు పట్టుకోవాలన్నంత ఆవేశం పొంగుతోంది!! కాని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. వీళ్లను మనం కొట్టకూడదు... చట్టమే తాట తీస్తుంది!! పెడోఫీలియా... పిల్లలను లైంగికంగా వేధించే ఉన్మాద ప్రవర్తన!! ఈ పీడ ఫీలింగ్ నుంచి సమాజాన్ని కడిగేయాలనే ఈ ప్రయత్నం!! పేరెంట్స్ నీడ్ టు నో! తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ‘పెద్దలకు ’ అప్పజెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ బి కేర్‌ఫుల్!! చిన్నపిల్లలను లైంగికంగా వేధించే ప్రవృత్తిని ఒక మానసిక స్థితిగా కాకుండా దాన్నొక రాక్షస చర్యగా పరిగణించాలి. ‘హలో.. సరిత గారూ... నిహారిక క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండీ..!’‘హలో.. చెప్పండి మామ్!’‘మీ పాపకు జ్వరం. ఒళ్లు కాలిపోతోంది. వచ్చి తీసుకెళ్తారా...’‘అయ్యో.. ఉదయం స్కూల్‌కి పంపేప్పుడు బాగానే ఉంది కదా..’ కంగారుగా బదులిచ్చింది సరిత.‘ఏమోనండీ మరీ.. అసెంబ్లీకి కూడా అటెండ్ అవకుండా క్లాస్ రూమ్‌లోనే పడుకుని ఉండిపోయింది. అటెండెన్స్ తీసుకుంటుంటే తన పక్కన ఉండే పిల్లలు చెప్పారు... నిహారికకు జ్వరమని. వెళ్లి చూస్తే ఒళ్లు కాలిపోతోంది. అందుకే వెంటనే కాల్ చేస్తున్నాను’ వివరించింది క్లాస్ టీచర్. ‘వచ్చేస్తున్నానండీ’.. ఇందాకటి కంగారే కంటిన్యూ అయింది సరిత గొంతులో. ‘సరిత గారూ.. ఇంకో విషయమండీ... రెండు రోజుల కిందటే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఎందుకో ఈ మధ్య నిహారిక చాలా డల్‌గా కనపడుతోంది. పిల్లలతో కలవట్లేదు. లంచ్ కూడా సరిగ్గా తినట్లేదల్లే ఉంది. ఏమైందో కనుక్కోవడానికి యాజ్ ఏ టీచర్ నా ప్రయత్నం నేను చేశాను. గమ్మున ఉంటోంది తప్ప పెదవి విప్పట్లేదు. మీరూ వర్కింగ్కదా.. బహుశా మిమ్మల్ని మిస్ అవుతుందేమో... చూడండి...’ అని టీచర్ సజెస్ట్ చేసింది. కూతురు కళ్లల్లో భయం ఫోన్ కాల్ కట్ అయ్యాక ఆఫీస్‌కి సగం దూరంలో ఉన్న సరిత స్కూల్‌కి రూట్ మార్చుకుంది. దారంతా నిహారిక గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి ఆమెను. నిజమే.. తనూ గమనిస్తోంది! తను సాయంకాలం ఇంటికి రాగానే గట్టిగా వాటేసుకుంటోంది. తన వెన్నంటే తిరుగుతోంది. రాత్రి స్నానానికి వెళితే కూడా బాత్రూమ్ డోర్ దగ్గరే నిలబడి ఉంటోంది. ఆరేళ్ల పిల్ల అంతలా అంటిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపకు ఊహ తెలిసినప్పటి నుంచే తను, ప్రకాష్ ఇద్దరూ నిహారికను ప్రిపేర్చేశారు... వర్కింగ్ పేరెంట్స్ చైల్డ్‌గా ఎలా ఉండాలో... తన పని తాను ఎలా చేసుకోవాలో... ఇంట్లో ఎవరూ లేకపోతే భయపడకుండా ఎలా ఉండాలో... ఫోన్లో ఎలా మాట్లాడాలో... తన వివరాలు ఎలా చెప్పాలో... అన్నీ నేర్పించారు. సహజంగానే చురుకుదనం ఉన్న పిల్ల. ఇన్ని రోజులుగా దేనికీ భయపడలేదు. ఇప్పుడీ సడెన్ ఛేంజ్ ఏంటీ? నిజంగానే అమ్మానాన్న తనతో గడపట్లేదని దిగులు పడుతోందా? స్కూల్లో ఏమన్నా స్ట్రెస్ ఫీలవుతోందా? అన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఒక్కర్ని కంటేనే చక్కగా పెంచగలమని నిహారిక ఒక్కతే చాలనుకున్నారు. బహుశా తనకు తోడులేక ఏమన్నా ఒంటరితనం ఫీలవుతోందా? విషయాన్ని ప్రకాశ్‌కి చెప్పి పాప దిగులు, భయం, డల్‌నెస్ వెనక కారణం కనుక్కోవాల్సిందే అని నిర్ణయించుకుంది సరిత. ఆ ఆలోచనలకు, తన ప్రయాణానికి బ్రేక్ వేసింది స్కూల్ రావడంతో! నానమ్మకు కబురు ‘ప్రకాశ్... దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. సంభాళించడం నా వల్ల కాదు. మీ అమ్మను పిలువ్ ప్లీజ్’.. ఎంతో కష్టమ్మీద కూతుర్ని నిద్రపుచ్చి మంచం మీదే కూర్చున్న ప్రకాశ్ భుజమ్మీద తలవాల్చింది సరిత బేలగా. ‘ఏమయిందంటావ్?’ ఓ చేత్తో సరితను పొదివి పట్టుకుంటూ మరో చేత్తో కూతురి తల నిమురుతూ అన్నాడు ప్రకాశ్. ‘తెలియట్లేదు. ఎంత అడిగినా నోరు విప్పదు. చూస్తున్నావ్‌గా రెండు రోజుల్నుంచి నా ఒళ్లు దిగలేదు. గట్టిగా హత్తుకుని ఉంటోంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. దాన్ని మామూలు పిల్లను ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్యను పిలిపించు ప్రకాశ్’ అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది సరిత. కథలు... గోరుముద్దలు కొడుకు, కోడలి నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన బయలుదేరింది వసంత. అత్తను చూడగానే బోరుమంది కోడలు. మనవరాలి మొహం చాటంతయింది. కూతురి మొహంలోని చిరునవ్వును చూసి అమ్మను పిలిపించడం మంచి పనే అయింది అనుకున్నాడు ప్రకాశ్. తెల్లవారి నుంచే ఆఫీస్‌లకు హాజరవ్వడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు. పాపకు ఇంకో వారం సెలవు పొడిగించారు. చక్కటి కథలతో కమ్మటి గోరుముద్దలు తినిపించసాగింది వసంత. ఆట, పాటతో రెండు రోజుల్లోనే మనవరాలి మనసులో బెరుకు పోగొట్టింది. ఆ పసిదాని భయానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచించసాగింది. ఆమె దృష్టి ముందుగా నిహారిక స్కూల్‌కి వెళ్లే ట్రాన్స్‌పోర్టేషన్ మీద పడింది. స్కూల్ బస్‌లో వెళ్తుంది. 30 మంది పిల్లల మధ్య వెళ్తుంది. కొలిక్కిరాని ఆలోచనలు ‘ఏమ్మా..! స్కూల్ బస్‌లో వెళ్తుంటే పిల్లలతో నువ్వేమైనా గొడవ పడ్డావా?’ అడిగింది ఒకరోజు రాత్రి అన్నం తినిపిస్తూ! ‘ఉహూ’ చెప్పింది నిహారిక. ‘మరి స్కూల్లో టీచర్లు, నీ ఫ్రెండ్స్ ఏమన్నా అంటున్నారా?’ ప్రశ్నించింది. దానికి తల అడ్డంగా ఊపింది అమ్మాయి. అన్నం తినిపించడం అయిపోయాక మనవరాలి మూతి కడిగి పడుకోబెడుతూ ఇంటి పరిసరాల మీదకు తన ధ్యాసను మళ్లించింది నానమ్మ. ఇండిపెండెంట్ హౌజ్. కొడుకు, కోడలు, మనవరాలు, ఆ ఇంటిని ఇరవైనాలుగ్గంటలూ కాపలాకాసే వాచ్‌మన్. అతని వయసు యాభై ఏళ్లు. నమ్మకస్తుడే. ‘ఇంట్లోకి దోమను కూడా దూరనివ్వడు. పిల్లను కంటికి రెప్పలా కాచుకుంటాడు’ అని చెప్పారు కొడుకు, కోడలు. ఇక పనిమనిషి. ఈ పిల్ల వెళ్లిపోయాక వస్తుంది. దీన్ని బెదిరించి, భయపెట్టే ఆస్కారమే లేదు. ఆమె ఈ ఆలోచనల్లో సీరియస్‌గా ఉన్నప్పుడే... నిహారిక మూలుగు వినిపించింది. బాత్రూమ్లోంచి. ఎప్పుడు వెళ్లిందో బాత్రూమ్లోకి... ఆ మూలుగుతో ఈ లోకంలోకి వచ్చింది వసంత. గభాల్న బాత్రూమ్లోకి పరిగెత్తింది. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి ‘నానమ్మా... నొప్పి’ అంటూ విలవిల్లాడసాగింది పిల్ల. ‘అయ్యో.. తల్లీ.. ఎక్కడే. కడుపునొప్పా?’ అంటూ పొట్ట చూసింది. ‘కాదు నానమ్మా.. ’ అంటూ నొప్పి ఎక్కడో చూపించింది. తొడల దగ్గర ఏ చీమ అయినా కుట్టిందేమో అంటూ కలవర పడింది వసంత. ‘నానమ్మా.. పాస్‌కి వెళ్లినప్పుడల్లా నొప్పెడుతోంది’ అంటూ కన్నీళ్లతో చెప్పింది నిహారిక. ఏమీ అర్థంకాక అయోమయంలో పడింది వసంత. చూద్దామని పరీక్షించి గాభరా పడిపోయింది. తొడల దగ్గర ప్రాంతం కందిపోయింది. వెనక భాగమంతా గాట్లు! వసంతకు వణుకు వచ్చేసింది. తను వచ్చిన దగ్గర్నుంచీ చూస్తోంది. బాత్రూమ్కి వెళ్లి వచ్చినప్పుడల్లా పిల్ల మొహం పాలిపోయి ఉంటోంది. కళ్లల్లో ఏదో బాధ. ఇప్పుడర్థమైంది. బెడ్రూమ్లోకి వచ్చి పాపను ఒళ్లోకి తీసుకొని హత్తుకుంది. ‘ఏమైంది నాన్నా.. ’ అంటూ అనునయించింది. అంతే ఆ పాప గట్టిగా నానమ్మను వాటేసుకొని వెక్కివెక్కి ఏడ్చింది. విషయమంతా చెప్పింది. ‘నేను వచ్చేసాను కదా.. నీకింకేం భయంలేదు. ఇంక అలా జరగదు’ అంటూ ఆ పిల్లకు అభయమిచ్చి పడుకోబెట్టింది. నిశ్చేష్టులైన తల్లిదండ్రులు! కొడుకు, కోడలి గది తలుపు కొట్టింది. సరిత తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి... ‘ఏమైందత్తయ్యా... పాప మళ్లీ ఏమైనా భయపడుతోందా?’ అడిగింది కంగారుగా. ‘కాదు, భయమేస్తోంది అంటూ... లోపలికి వెళ్లి మనవరాలు చెప్పిన విషయాన్ని వాళ్ల చెవిన వేసింది. హతాశులయ్యారు భార్య, భర్త. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ప్రకాశ్. ఆవేశంగా వాకిట్లోకి నడిచాడు. వాచ్‌మన్ గదిలోకి వెళ్లి వాచ్‌మన్‌ను బరబరా బయటకు లాక్కొచ్చాడు. ‘రాస్కెల్ మా సొంత మనిషివని నమ్మి స్కూల్ నుంచి రాగానే పాప బాధ్యతను నీకు అప్పగిస్తే నువ్ చేసేది ఇదా?’ అంటూ కొట్టబోయాడు. వసంత అడ్డుకుంది. దుఃఖంతో కుంగిపోయాడు ప్రకాశ్. తేరుకొని పోలీస్కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్లాడు. పెడోఫిలియా అంటే? అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పరిచితుల వికృతచేష్టలకు పిల్లలు బలికావడం ఎక్కువైంది. మన ఇంట్లో సొంత వ్యక్తులు మొదలు... బాగా తెలిసినవారు, ఇంట్లోకి చొరవగా చొచ్చుకుపోయేవారు, తరచుగా వచ్చే స్నేహితుల వరకు... ఎవరో ఒకరి నుంచి పిల్లలు లైగింక వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. కాబట్టి అపరిచితులనే కాదు, పరిచితులను కూడా బాగా గమనించాలి. వాళ్లలో కొంతమంది ‘పెడోఫిలియా’ అనే మానసిక రుగ్మతను కలిగి ఉండొచ్చు. అలాంటి వాళ్లు పసిపిల్లలను హింసిస్తూ లైంగికానందాన్ని పొందుతారు. పై కేస్‌లో వాచ్‌మన్ చేసింది ఇదే. ఇలాంటి హింస వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వాళ్ల ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది. అందుకే ఈ నేరాల నుంచి పిల్లలను సంరక్షించేందుకు 2012లో పోక్సో యాక్ట్ (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం) తెచ్చారు. దీని ప్రకారం నేరస్తుడికి ఏడేళ్లు జైలు శిక్ష, కొన్నిసార్లు యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది. ఇంకొన్నిసార్లు ఈ శిక్షలతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. – ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
ఆడుతూ.. పాడుతూ..
నువ్వు నేను : శ్రీకాంత్,సుశీల In all the world there is heart for me like yours.. In all the world there is no love for you like mine.. అని మాయా ఏంజిలో చెప్పినట్టే ఉంటుందీ జంట! ఆమె.. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్! అతను.. డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ ఫిజీషియన్! ఇద్దరూ డాక్టర్లే అనే సారూప్యతే కాక మరో ప్రత్యేకతా ఉంది.. ఆలుమొగలిద్దరూ కళాకారులు. ఆయన స్వరం కర్ణాటక సంగీతంతో శృతి కలిపితే.. ఆమె అడుగులు కూచిపూడి లయను ఒలికిస్తాయి! వైద్యవృత్తి ఇరువురినీ ఏడడుగులు నడిపిస్తే.. కళ.. ఆ బంధాన్ని అందమైన అనుబంధంగా మలుస్తోంది! - సరస్వతి రమ శ్రీకాంత్‌ది కళాకారుల కుటుంబం. నాన్న ఉషాకాంత్ పేరున్న సంగీతకారులు. అమ్మా గాయినే. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం సుశీలది. వావిలాల గోపాలకృష్ణ తమ్ముడి కూతురు ఆమె. ఈ భిన్న నేపథ్యాల కలయిక అటు వ్యాధుల మీద సమరం ప్రకటిస్తూ .. ఇటు సంసారంలో సరిగమలు పలికిస్తోంది! ఎలా కలిశారు? ‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. డాక్టరమ్మాయే కావాలని అనుకోలేదు. బాగా చదువుకున్న అమ్మాయైతే బాగుండు అనుకున్న. అయితే మా అమ్మకు మాత్రం డాక్టర్ కోడలు కావాలని ఉండేది’ అని శ్రీకాంత్ చెప్తే.. ‘మా అమ్మ కూడా డాక్టర్ అల్లుడు వస్తే బాగుండు అనుకుంది’ వాళ్లింటి ముచ్చట చెప్పారు సుశీల. అల్లుడు పాటగాడని ఇటువైపు, కోడలు నర్తకి అని అటువైపూ ఎప్పుడు తెలిసింది అని అడిగితే.. ‘సుశీల మంచి డ్యాన్సరని పెళ్లిచూపులకంటే ముందే తెలుసు!’ అంటూ శ్రీకాంత్ విషయాన్ని పరిచయం చేస్తే.. ‘మాది గుంటూరు. అక్కడే మెడిసిన్ చేశా. ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పెర్ఫార్మ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఆ ప్రోగ్రామ్‌కి అత్తయ్య, మామయ్య కూడా వచ్చారు. నన్ను మెచ్చారు’ అంటూ వివరించారు సుశీల. ‘మామూలుగా మెచ్చుకోవడం కాదు.. అమ్మ అయితే తను చాలా మంచి డ్యాన్సర్రా.. అంటూ ఒకటే ప్రశంసలు’ మురిపెంగా ఆ ముచ్చట ముగించారు శ్రీకాంత్! ‘నేనూ పెళ్లికి ముందే తన పాటలు విన్నాను’ అని సుశీల కొసమెరుపు. పెళ్లి.. పాట.. ఆట.. ‘పెళ్లి చూపుల్లో మా కళల గురించి ఏమీ మాట్లాడుకోలేదు కానీ.. చదువు గురించి మాట్లాడుకున్నాం’ సుశీల. ‘తను అప్పటికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. నాదేమో పీజీ అయిపోయింది. పెళ్లయ్యాక తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. చెప్పాను కూడా’ శ్రీకాంత్. ‘అన్నట్టుగానే చదివించారు. ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేశారు..’ చెప్పారు సుశీల. మరి ఆట, పాట ఒకే వేదిక మీద వినిపించింది, కనిపించింది.. ఎప్పుడూ అని అడిగితే.. ‘పెళ్లిలో’ అంటారిద్దరూ. ‘పెళ్లప్పుడు జయదేవుడి గీతగోవిందం ఆయన పాడితే రాధగా నేను డ్యాన్స్ చేశాను’ అంటూ ఆ తీపి జ్ఞాపకాన్ని సుశీల గుర్తుచేసుకుంటే నవ్వుతో ఆస్వాదించారు శ్రీకాంత్. మల్టీటాస్క్లో అపశృతులు..? ‘అస్సలు లేవ్’ ముక్త కంఠంతో సమాధానం వచ్చింది. ‘ప్రొఫెషన్ అయినా, హాబీ అయినా ప్లాన్డ్గా ఉంటాం’ అంటారు శ్రీకాంత్. ‘ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలనే ఆలోచన మా ఇద్దరికీ లేకపోవడం ప్లస్ అయింది. ఇద్దరికీ టీచింగ్ మీదే ఇంట్రెస్ట్. దాని ప్రకారమే ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇది నల్లేరుపై నడకేం కాదు. రోజుకి 18 గంటలు పనిచేసిన సందర్భాలూ ఉన్నాయ్’ అని సుశీల పనితీరును వివరిస్తే.. ‘గెస్ట్ లెక్చర్స్‌తో టూర్స్లాంటి షెడ్యూల్స్‌తో ఒకరం బిజీగా ఉంటే మిగిలిన బాధ్యతలను ఇంకొకరం చూసుకుంటాం’ అంటారు శ్రీకాంత్. ‘నేను ఇంటి విషయాలంతగా పట్టించుకోను. అవన్నీ ఆయనే చూసుకుంటారు’ సుశీల. ‘తను టెక్నికల్ ఎక్స్పర్ట్. అందుకే నా వర్క్‌లోని టెక్నికల్ పార్ట్ తనే చేసి పెడుతుంది’ కితాబిస్తారు శ్రీకాంత్. ‘నా స్పెషలైజేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆయన చెప్తుంటారు’ అంటూ సుశీల తమ పరస్పర సహకారాన్ని వివరించారు. కళాసహకారం? ‘అదీ అంతే. ఒకేసారి ఇద్దరం ప్రోగ్రామ్స్ పెట్టుకోం’ అంటారు సుశీల. ‘నా ప్రోగామ్ ఉన్నప్పుడు ప్లానింగ్ నుంచి ఇన్విటేషన్, బ్యాక్‌స్టేజ్ అరేంజ్మెంట్స్ దాకా అన్నీ తను చూసుకుంటుంది. తన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ పనులన్నీ నేను చూసుకుంటాను’ శ్రీకాంత్. సూచనలు, సలహాలు.. ఉంటాయ్. ఏదైనా ఇద్దరం కలిసే డిస్కస్ చేసుకుంటాం. మాది జాయింట్ ఫ్యామిలీ. ముందు నాన్నతో, తర్వాత సుశీలతో.. అన్నీ చర్చించాకే అడుగు వేస్తాం’ అంటారు శ్రీకాంత్. ప్రశంసలు, విమర్శలు.. ‘ఉంటాయ్. కించపర్చుకునేలా కాదు.. ఒకరికొకరు గైడ్ చేసుకునేలా’ సుశీల స్పందన. జెలసీ.. ‘ఆ మాటకు చోటే లేదు’ శ్రీకాంత్ దృఢస్వరం. ‘నీది, నాది అనుకున్నప్పుడు అవన్నీ ఉంటాయ్. మనది అనుకున్నప్పుడు అసూయ అన్న మాటే రాదు’ సుశీల. ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా భార్య స్పెషల్ వన్‌గా ఉండాలనేది నా కోరిక’ శ్రీకాంత్ ముక్తాయింపు. మరి కోపాలు.. ‘మనుషులమే కదా.. వస్తాయ్. కాస్త అరుస్తాను.. తగ్గుతాను. అంతేకాని ఆర్గ్యుమెంట్స్ చేసుకోం’ శ్రీకాంత్. ‘ఇంట్లో మామయ్య స్ట్రిక్ట్ వార్నింగ్.. డిస్కషన్సే కాని ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు అని. అయితే ఆయన కోపం పాలమీద పొంగే కానీ నాదే న్యాగింగ్గా ఉంటుంది’ తన బలహీనతను తెలిపారు సుశీల. ‘కోపం త్వరగా రాదు వస్తే త్వరగా పోదు. ఆ న్యాగింగ్ అంటేనే కాస్త ఇబ్బంది’ అని మైనస్‌ను కోట్ చేస్తూనే ‘అలాగే తను చాలా స్ట్రాంగ్, ఎనర్జిటిక్. తెల్లవారుజాము వరకు పనిచేసినా అలసిపోదు. అంతే ఫ్రెష్‌గా తిరిగి రోజును మొదలుపెడుతుంది. ఎలాంటి టాస్క్‌నైనా అవలీలగా చేసేస్తుంది’ అంటూ భార్యలోని ప్లస్‌నూ ప్రశంసించారు. ‘నా వృత్తి నేర్పిన నైపుణ్యం అది. నా ప్రొఫెషనంతా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడమే కదా. అయితే తనకున్నంత ఓపిక నాకులేదు’ అంటూ భర్తలోని ప్లస్కూ ప్లేస్ ఇచ్చారు సుశీల. ‘నన్ను భరించువాడు, మంచివాడు’ అని ఆమె, ‘మై స్పెషల్వన్’ అంటూ అతనూ ఒక్క మాటలో బెటర్ హాఫ్‌కు పరిపూర్ణ అర్థమిచ్చారు. మ్యూజిక్ ఫర్ హీలింగ్ డెబ్బైరెండు మేళకర్త రాగాల అనుసంధానం.. నాలుగేళ్ల శోధన.. ఈ శ్రమ ఫలితమే మ్యూజిక్ ఫర్ హీలింగ్! వైద్యం, సంగీతం కలిసి, కలిపి చేస్తున్న ట్రీట్మెంట్.. నాదతనుమనిశమ్! ఇది డాక్టర్ జె. శ్రీకాంత్ కృషి ఫలితం. ఈ రోజు రవీంద్రభారతిలో సాయంత్రం ఆరుగంటలకు ఆవిష్కరణ! -
లవ్ Heart
సుందర్, కరుణ నువ్వు-నేను YOU AND I Every woman deserves a man who loves and respects her. And every man deserves a woman who appreciates his efforts. అంటారు. వెల్‌నోన్ ఆర్టిస్ట్‌లు సుక్క కరుణ, సుక్క సుందర్ కూడా అలాంటి జంటే! అతను ఆమెను ఎంత ఇష్టపడతాడో అంతగా గౌరవిస్తాడు. ఆమె.. అతని విజయం కన్నా ప్రయత్నాన్ని విశ్వసిస్తుంది.. ప్రశంసిస్తుంది! ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం! వీళ్ల లవ్.. ఫస్ట్ సైట్లో స్టార్ట్ కాలేదు.. మరెప్పుడు? ఎలా? అసలు మీ కథ చెప్పండి అని అడిగితే.. ఇలా మొదలైంది వాళ్ల సంభాషణ.. ..:: సరస్వతి రమ ‘తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్ఏ క్లాస్‌మేట్స్‌మి. మొదటి రెండేళ్లు మా మధ్య ఇంటరాక్షనే లేదు. ఫస్ట్ ఐ యూస్డ్ టు హేట్ హిమ్. చదువు పక్కన పెట్టి సోషల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేవాడు. అందుకే నచ్చేది కాదు. అదీగాక నేను చాలా రిజిడ్‌గా ఉండేదాన్ని. దేనికోసం యూనివర్సిటీకి వచ్చామో అది చూసుకొని పోయేదాన్ని’ చెప్పింది కరుణ. ‘ఆమెకు క్వయిట్ అపోజిట్ నేను. అందరితో కలివిడిగా ఉండేవాడిని. మా క్లాస్‌లో అమ్మాయిలు ఉన్నదే ఏడుగురు. కరుణ తప్ప ఆరుగురూ నాతో క్లోజ్‌గా మాట్లాడేవారు. తను ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి నేనూ దూరంగానే ఉండేవాడిని. కాకపోతే గమనించే వాన్ని’ తన వెర్షన్ చెప్పాడు సుందర్. ఎన్నో సైట్‌కి లవ్ ఏర్పడింది మరి? ‘థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు భోపాల్‌లో ప్రింట్ బైనాలే ఎగ్జిబిషన్‌కి వెళ్లాం అందరం. అక్కడ మిగిలిన వాళ్లంతా అసలు ఎగ్జిబిషన్ వదిలిపెట్టి మిగిలిన ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. నేను, సుందర్ ఇద్దరమే చాలా సీరియస్‌గా ఎగ్జిబిషన్ అంతా తిరిగాం. ఆ టైమ్‌లో ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడే సుందర్‌ను దగ్గరగా గమనించే, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడే అతని లీడర్షిప్ క్వాలిటీస్‌పై రెస్పెక్ట్ పెరిగింది. తెలుగు యూనివర్సిటీ ఓ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈయన ఇనీషియేషన్ తీసుకున్న తీరు, సమస్యను సాల్వ్ చేసిన వైనమూ గుర్తొచ్చింది. అప్పటి నుంచి సుందర్‌ను చూసే నా దృష్టి మారింది. అలా స్లో అండ్ స్టడీగా సాగిన మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగే కాదు ఎవర్ చార్మ్ కూడా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది కరుణ. ‘బీఎఫ్ఏ తర్వాత ఎమ్ఎఫ్ఏ కూడా కలిసి చదివాం. ఎమ్ఎఫ్ఏ తర్వాత తను బరోడా వెళ్లింది. నేను ఇక్కడే చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో జాయిన్ అయ్యాను’ సుందర్ అంటుంటే ‘నేను బరోడా వెళ్లడం వల్లే సుందర్‌ను మ్యారేజ్ చేసుకోగలిగాను. అంతకంటే ముందు సుందర్ వాళ్లన్నయ్య పెళ్లికని వాళ్లూరు వెళ్లాను. అక్కడ సుందర్ వాళ్ల ఫ్యామిలీ, సిట్యుయేషన్ చూసినప్పుడు అనిపించింది.. సుందర్‌కి నా తోడు తప్పకుండా కావాలని. బహుశా అప్పుడే అతని మీద ప్రేమ మొదలై ఉండాలి. బరోడా వెళ్లాక అక్కడి ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవడం, వాళ్ల కంపానియన్‌షిప్ చూశాక నేనూ ఆర్టిస్ట్‌నే పెళ్లిచేసుకుంటే కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండూ డిస్టర్బ్ కాకుండా ఉంటాయనిపించింది. ఆ నిర్ణయానికి రాగానే సుందరే గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ప్రేమ విషయాన్ని, పెళ్లి ప్రపోజల్‌ని కూడా’ కరుణ. ‘కానీ నేనిప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు తనకు’ పక్కనుంచి సుందర్. ‘అదే నా కంప్లయింట్’ చిరుకోపంతో కరుణ. ‘నిజానికి నేనే ముందు ప్రేమలో పడ్డాను తనతో. చెప్పడానికి నేను భయపడ్డాను. తను చెప్పి బయటపడింది. అలా 2009లో మా ప్రేమకు పెళ్లి రూపమిచ్చింది’ అన్నాడు కరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ! కెరీర్లో సహకారం.. కుటుంబంలో సగం బాధ్యత ‘కరుణది థియరిటికల్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ రెండిటినీ కలిపి కలిసి పనిచేస్తాం’ అని సుందర్ అంటుంటే ‘సుందర్‌కి కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. నా ఐడియాను తనతో షేర్ చేస్తే తను దానికి కలర్ కాంబినేషన్ చెప్తాడు’ భర్తకి కరుణ కితాబు. ‘తను హైదరాబాదీ. పెద్ద ఆర్టిస్ట్ (శ్రీహరి భోలేకర్) కూతురు. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంది. ఆమెకున్న ఈ ప్లస్లన్నీ నాలో మైనస్‌లు. పల్లెటూరి నేపథ్యం. వానాకాలం చదువు. ఇంగ్లిష్‌కి దూరం. ఇంగ్లిష్‌లో ఉన్న ఆర్ట్ బుక్స్ బాగా చదువుతుంది. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంగ్లిష్ మీద నేను పట్టు సాధించేందుకు హెల్ప్ చేస్తుంది’అంటూ భార్య సహచర్యం తన మైనస్‌లు ప్లస్ అయిన తీరును వివరించాడు సుందర్. ‘నేను ఇంటి పనుల్లో పూర్. మాకు రెండున్నరేళ్ల కూతురుంది. నా పీహెచ్డీ, ఆర్ట్ వర్క్ ఇవన్నిటితో పాపను చూసుకోవడం కుదరదు. ఆ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ సుందర్ బలవంతం వల్లే పీహెచ్డీ చేస్తున్నాను’అంటూ కుటుంబ నిర్వహణలో భర్త మోస్తున్న సగం బాధ్యతను చెప్పింది కరుణ. ‘చాలామంది ‘నువ్వూ పీహెచ్డీ చేయొచ్చుకదా..’ అని సలహాలిచ్చారు. ఎవరు ఎందులో పర్ఫెక్టో వాళ్లు ఆ పనిచేస్తే బాగుంటుంది. తనకు పీహెచ్డీ అంటే ఇంట్రెస్ట్ అందుకే ప్రోత్సహించాను. ఆమె అందులో బిజీ కాబట్టి ఇల్లు, పాప బాధ్యతను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. నేను హౌజ్ హజ్బెండ్‌నని గర్వంగా చెప్తాను’ అన్నాడు సహచరుడు అన్న పదానికి అసలైన నిర్వచనంలా! పెళ్లాయ్యాక ఒకరికోసం ఒకరు మార్చుకున్న పద్ధతులు? ‘ఆయన సోషల్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకున్నాడు. నా పట్ల హెల్పింగ్ నేచర్ పెరిగింది. నాకేం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేదాకా నిద్రపోడు. నాకేమాత్రం ఇన్‌కన్వీనియెంట్ లేకుండా చూసుకుంటాడు’ మురిపెంగా కరుణ. ‘పెళ్లికి ముందు రిజిడ్‌గా, సెల్ఫిష్‌గా ఉండేదా.. ఇప్పుడు చాలా కలివిడిగా... లిబరల్గా మారింది. తనలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు తన ఫెలోషిప్ డబ్బులే మాకు ఆధారం. ఇంత కో ఆపరేట్ చేస్తుందని అనుకోలేదు’ సంబంరంగా చెప్పాడు సుందర్. ‘క్రెడిట్ అంతా తనదే’ కరుణ. ‘వర్క్ విషయంలో నా బెస్ట్ క్రిటిక్ తనే. నేను, నువ్వు అనే భావన ఉండదు మనమనే ఫీలే. అందుకే ఎవరికి బయటి నుంచి అప్రిసియేషన్స్ వచ్చినా ఇద్దరం హ్యాపీగా ఫీలవుతాం. నో జెలసీ’ సుందర్. ‘తను ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేస్తాడు. ఇండివిడ్యువల్ సక్సెస్కన్నా మా ఇద్దరి సక్సెస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు’ కరుణ. ‘అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమైన ప్రతిభ చూపలేరు. ఒకరు విజయం కోసం పోరాడుతున్నప్పుడు ఇంకొకరు అండగా నిలబడాలి’ అని సుందర్ అంటుంటే ‘మేం అదే ఫాలో అవుతున్నాం. ఒకరి ఎబిలిటీని ఇంకొకరం నిజాయితీ ఒప్పుకుంటాం. గౌరవిస్తాం. నమ్ముతాం’ అంటూ చెప్పింది కరుణ. ప్రేమలో పడడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటారు. అలా తమ ప్రేమను నిలబెట్టుకుందీ జంట!