పీడ ఫీలింగ్‌ | The nature of child sexual abuse | Sakshi
Sakshi News home page

పీడ ఫీలింగ్‌

Published Tue, Mar 14 2017 10:51 PM | Last Updated on Sat, Oct 20 2018 4:38 PM

పీడ ఫీలింగ్‌ - Sakshi

పీడ ఫీలింగ్‌

పడుతుంటే పట్టుకోవాల్సిన పిల్లలను పడతొక్కేవాళ్లుంటారా?
పీడకలలొస్తే లాలించే పెద్దలే ఓ పీడకలవుతారా?
ఇక పిల్లల్ని ఎవరి అండకు వదలాలి?
ఇక పిల్లల్ని ఏ భరోసాకి అప్పజెప్పాలి?
చీదర పుడుతోంది... కాదు కాదు కంపరం పుడుతోంది... పట్టలేనంత కోపం వస్తోంది!
గొంతు పట్టుకోవాలన్నంత ఆవేశం పొంగుతోంది!!
కాని... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.  
వీళ్లను మనం కొట్టకూడదు... చట్టమే తాట తీస్తుంది!!
పెడోఫీలియా... పిల్లలను లైంగికంగా వేధించే
ఉన్మాద ప్రవర్తన!!
ఈ పీడ ఫీలింగ్‌ నుంచి సమాజాన్ని కడిగేయాలనే ఈ ప్రయత్నం!!
పేరెంట్స్‌ నీడ్‌ టు నో!
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
పిల్లలను ‘పెద్దలకు ’ అప్పజెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్లీజ్‌ బి కేర్‌ఫుల్‌!!


చిన్నపిల్లలను లైంగికంగా వేధించే ప్రవృత్తిని ఒక మానసిక స్థితిగా కాకుండా దాన్నొక రాక్షస చర్యగా పరిగణించాలి.

‘హలో.. సరిత గారూ... నిహారిక క్లాస్‌ టీచర్‌ని మాట్లాడుతున్నానండీ..!’‘హలో.. చెప్పండి మామ్‌!’‘మీ పాపకు జ్వరం. ఒళ్లు కాలిపోతోంది. వచ్చి తీసుకెళ్తారా...’‘అయ్యో.. ఉదయం స్కూల్‌కి పంపేప్పుడు బాగానే ఉంది కదా..’ కంగారుగా బదులిచ్చింది సరిత.‘ఏమోనండీ మరీ.. అసెంబ్లీకి కూడా అటెండ్‌ అవకుండా క్లాస్‌ రూమ్‌లోనే పడుకుని ఉండిపోయింది. అటెండెన్స్‌ తీసుకుంటుంటే తన పక్కన ఉండే పిల్లలు చెప్పారు... నిహారికకు జ్వరమని. వెళ్లి చూస్తే ఒళ్లు కాలిపోతోంది. అందుకే వెంటనే కాల్‌ చేస్తున్నాను’ వివరించింది క్లాస్‌ టీచర్‌.

‘వచ్చేస్తున్నానండీ’.. ఇందాకటి కంగారే కంటిన్యూ అయింది సరిత గొంతులో. ‘సరిత గారూ.. ఇంకో విషయమండీ... రెండు రోజుల కిందటే మీకు ఫోన్‌ చేద్దామనుకున్నాను. ఎందుకో ఈ మధ్య నిహారిక చాలా డల్‌గా కనపడుతోంది. పిల్లలతో కలవట్లేదు. లంచ్‌ కూడా సరిగ్గా తినట్లేదల్లే ఉంది. ఏమైందో కనుక్కోవడానికి యాజ్‌ ఏ టీచర్‌ నా ప్రయత్నం నేను చేశాను. గమ్మున ఉంటోంది తప్ప పెదవి విప్పట్లేదు.  మీరూ వర్కింగ్‌కదా.. బహుశా మిమ్మల్ని మిస్‌ అవుతుందేమో... చూడండి...’ అని టీచర్‌ సజెస్ట్‌ చేసింది.

కూతురు కళ్లల్లో భయం
ఫోన్‌ కాల్‌ కట్‌ అయ్యాక ఆఫీస్‌కి సగం దూరంలో ఉన్న సరిత స్కూల్‌కి రూట్‌ మార్చుకుంది. దారంతా నిహారిక గురించిన ఆలోచనలే చుట్టుముట్టాయి ఆమెను. నిజమే.. తనూ గమనిస్తోంది! తను సాయంకాలం ఇంటికి రాగానే గట్టిగా వాటేసుకుంటోంది. తన వెన్నంటే తిరుగుతోంది. రాత్రి స్నానానికి వెళితే కూడా బాత్రూమ్‌ డోర్‌ దగ్గరే నిలబడి ఉంటోంది. ఆరేళ్ల పిల్ల అంతలా అంటిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాపకు ఊహ తెలిసినప్పటి నుంచే తను, ప్రకాష్‌ ఇద్దరూ నిహారికను ప్రిపేర్‌చేశారు... వర్కింగ్‌ పేరెంట్స్‌ చైల్డ్‌గా ఎలా ఉండాలో... తన పని తాను ఎలా చేసుకోవాలో... ఇంట్లో ఎవరూ లేకపోతే భయపడకుండా ఎలా ఉండాలో...  ఫోన్‌లో ఎలా మాట్లాడాలో... తన వివరాలు ఎలా చెప్పాలో... అన్నీ నేర్పించారు. సహజంగానే చురుకుదనం ఉన్న పిల్ల. ఇన్ని రోజులుగా దేనికీ భయపడలేదు. ఇప్పుడీ సడెన్‌ ఛేంజ్‌ ఏంటీ? నిజంగానే అమ్మానాన్న తనతో గడపట్లేదని దిగులు పడుతోందా? స్కూల్లో ఏమన్నా స్ట్రెస్‌ ఫీలవుతోందా? అన్నీ ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఒక్కర్ని కంటేనే చక్కగా పెంచగలమని నిహారిక ఒక్కతే చాలనుకున్నారు. బహుశా తనకు తోడులేక ఏమన్నా ఒంటరితనం ఫీలవుతోందా? విషయాన్ని ప్రకాశ్‌కి చెప్పి పాప దిగులు, భయం, డల్‌నెస్‌ వెనక కారణం కనుక్కోవాల్సిందే అని నిర్ణయించుకుంది సరిత. ఆ ఆలోచనలకు, తన ప్రయాణానికి బ్రేక్‌ వేసింది స్కూల్‌ రావడంతో!

నానమ్మకు కబురు
‘ప్రకాశ్‌... దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. సంభాళించడం నా వల్ల కాదు. మీ అమ్మను పిలువ్‌ ప్లీజ్‌’.. ఎంతో కష్టమ్మీద కూతుర్ని నిద్రపుచ్చి మంచం మీదే కూర్చున్న ప్రకాశ్‌ భుజమ్మీద తలవాల్చింది సరిత బేలగా. ‘ఏమయిందంటావ్‌?’ ఓ చేత్తో సరితను పొదివి పట్టుకుంటూ మరో చేత్తో కూతురి తల నిమురుతూ అన్నాడు ప్రకాశ్‌. ‘తెలియట్లేదు. ఎంత అడిగినా నోరు విప్పదు. చూస్తున్నావ్‌గా రెండు రోజుల్నుంచి నా ఒళ్లు దిగలేదు. గట్టిగా హత్తుకుని ఉంటోంది. ఏమైందమ్మా అంటే చెప్పదు. దాన్ని మామూలు పిల్లను ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్యను పిలిపించు ప్రకాశ్‌’ అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది సరిత.

కథలు... గోరుముద్దలు
కొడుకు, కోడలి నుంచి ఫోన్‌ రాగానే హుటాహుటిన బయలుదేరింది వసంత. అత్తను చూడగానే బోరుమంది కోడలు. మనవరాలి మొహం చాటంతయింది. కూతురి మొహంలోని చిరునవ్వును చూసి అమ్మను పిలిపించడం మంచి పనే అయింది అనుకున్నాడు ప్రకాశ్‌. తెల్లవారి నుంచే ఆఫీస్‌లకు హాజరవ్వడం మొదలుపెట్టారు ఆ ఆలుమగలు. పాపకు ఇంకో వారం సెలవు పొడిగించారు. చక్కటి కథలతో కమ్మటి గోరుముద్దలు తినిపించసాగింది వసంత. ఆట, పాటతో రెండు రోజుల్లోనే మనవరాలి మనసులో బెరుకు పోగొట్టింది. ఆ పసిదాని భయానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచించసాగింది. ఆమె దృష్టి ముందుగా నిహారిక స్కూల్‌కి వెళ్లే ట్రాన్స్‌పోర్టేషన్‌ మీద పడింది. స్కూల్‌ బస్‌లో వెళ్తుంది. 30 మంది పిల్లల మధ్య వెళ్తుంది.

కొలిక్కిరాని ఆలోచనలు
‘ఏమ్మా..! స్కూల్‌ బస్‌లో వెళ్తుంటే పిల్లలతో నువ్వేమైనా గొడవ పడ్డావా?’ అడిగింది ఒకరోజు రాత్రి అన్నం తినిపిస్తూ! ‘ఉహూ’ చెప్పింది నిహారిక. ‘మరి స్కూల్లో టీచర్లు, నీ ఫ్రెండ్స్‌ ఏమన్నా అంటున్నారా?’ ప్రశ్నించింది. దానికి తల అడ్డంగా ఊపింది అమ్మాయి. అన్నం తినిపించడం అయిపోయాక మనవరాలి మూతి కడిగి పడుకోబెడుతూ ఇంటి పరిసరాల మీదకు తన ధ్యాసను మళ్లించింది నానమ్మ. ఇండిపెండెంట్‌ హౌజ్‌. కొడుకు, కోడలు, మనవరాలు, ఆ ఇంటిని ఇరవైనాలుగ్గంటలూ కాపలాకాసే వాచ్‌మన్‌. అతని వయసు యాభై ఏళ్లు. నమ్మకస్తుడే. ‘ఇంట్లోకి దోమను కూడా దూరనివ్వడు. పిల్లను కంటికి రెప్పలా కాచుకుంటాడు’ అని చెప్పారు కొడుకు, కోడలు. ఇక పనిమనిషి. ఈ పిల్ల వెళ్లిపోయాక వస్తుంది. దీన్ని బెదిరించి, భయపెట్టే ఆస్కారమే లేదు. ఆమె ఈ ఆలోచనల్లో సీరియస్‌గా ఉన్నప్పుడే... నిహారిక మూలుగు వినిపించింది. బాత్రూమ్‌లోంచి. ఎప్పుడు వెళ్లిందో బాత్రూమ్‌లోకి... ఆ మూలుగుతో ఈ లోకంలోకి వచ్చింది వసంత. గభాల్న బాత్రూమ్‌లోకి పరిగెత్తింది.

వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి
‘నానమ్మా... నొప్పి’ అంటూ విలవిల్లాడసాగింది పిల్ల. ‘అయ్యో.. తల్లీ.. ఎక్కడే. కడుపునొప్పా?’ అంటూ పొట్ట చూసింది. ‘కాదు నానమ్మా.. ’ అంటూ నొప్పి ఎక్కడో చూపించింది. తొడల దగ్గర ఏ చీమ అయినా  కుట్టిందేమో అంటూ కలవర పడింది వసంత. ‘నానమ్మా.. పాస్‌కి వెళ్లినప్పుడల్లా నొప్పెడుతోంది’ అంటూ కన్నీళ్లతో చెప్పింది నిహారిక. ఏమీ అర్థంకాక అయోమయంలో పడింది వసంత. చూద్దామని పరీక్షించి గాభరా పడిపోయింది. తొడల దగ్గర ప్రాంతం కందిపోయింది. వెనక భాగమంతా గాట్లు! వసంతకు వణుకు వచ్చేసింది. తను వచ్చిన దగ్గర్నుంచీ చూస్తోంది. బాత్రూమ్‌కి వెళ్లి వచ్చినప్పుడల్లా పిల్ల మొహం పాలిపోయి ఉంటోంది. కళ్లల్లో ఏదో బాధ. ఇప్పుడర్థమైంది. బెడ్‌రూమ్‌లోకి వచ్చి పాపను ఒళ్లోకి తీసుకొని హత్తుకుంది. ‘ఏమైంది నాన్నా.. ’ అంటూ అనునయించింది. అంతే ఆ పాప గట్టిగా నానమ్మను వాటేసుకొని వెక్కివెక్కి ఏడ్చింది. విషయమంతా చెప్పింది. ‘నేను వచ్చేసాను కదా.. నీకింకేం భయంలేదు. ఇంక అలా జరగదు’ అంటూ ఆ పిల్లకు అభయమిచ్చి పడుకోబెట్టింది.

నిశ్చేష్టులైన తల్లిదండ్రులు!
కొడుకు, కోడలి గది తలుపు కొట్టింది. సరిత తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అత్తగారిని చూసి... ‘ఏమైందత్తయ్యా... పాప మళ్లీ ఏమైనా భయపడుతోందా?’ అడిగింది కంగారుగా. ‘కాదు, భయమేస్తోంది అంటూ... లోపలికి వెళ్లి మనవరాలు చెప్పిన విషయాన్ని వాళ్ల చెవిన వేసింది. హతాశులయ్యారు భార్య, భర్త. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు ప్రకాశ్‌. ఆవేశంగా వాకిట్లోకి నడిచాడు. వాచ్‌మన్‌ గదిలోకి వెళ్లి వాచ్‌మన్‌ను బరబరా బయటకు లాక్కొచ్చాడు. ‘రాస్కెల్‌ మా సొంత మనిషివని నమ్మి  స్కూల్‌ నుంచి రాగానే పాప బాధ్యతను నీకు అప్పగిస్తే నువ్‌ చేసేది ఇదా?’ అంటూ కొట్టబోయాడు. వసంత అడ్డుకుంది. దుఃఖంతో కుంగిపోయాడు ప్రకాశ్‌. తేరుకొని పోలీస్‌కంప్లయింట్‌ ఇవ్వడానికి వెళ్లాడు.

పెడోఫిలియా అంటే?
అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పరిచితుల వికృతచేష్టలకు పిల్లలు బలికావడం ఎక్కువైంది. మన ఇంట్లో సొంత వ్యక్తులు మొదలు... బాగా తెలిసినవారు, ఇంట్లోకి చొరవగా చొచ్చుకుపోయేవారు, తరచుగా వచ్చే స్నేహితుల వరకు... ఎవరో ఒకరి నుంచి పిల్లలు లైగింక వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. కాబట్టి అపరిచితులనే కాదు, పరిచితులను కూడా బాగా గమనించాలి. వాళ్లలో కొంతమంది ‘పెడోఫిలియా’ అనే మానసిక రుగ్మతను కలిగి ఉండొచ్చు. అలాంటి వాళ్లు పసిపిల్లలను హింసిస్తూ లైంగికానందాన్ని పొందుతారు. పై కేస్‌లో వాచ్‌మన్‌ చేసింది ఇదే. ఇలాంటి హింస వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని వాళ్ల ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది. అందుకే ఈ నేరాల నుంచి పిల్లలను సంరక్షించేందుకు 2012లో పోక్సో యాక్ట్‌ (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ  చట్టం) తెచ్చారు. దీని ప్రకారం నేరస్తుడికి ఏడేళ్లు జైలు శిక్ష, కొన్నిసార్లు యావజ్జీవ కారాగారశిక్ష పడుతుంది. ఇంకొన్నిసార్లు ఈ శిక్షలతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.
– ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, parvathiadvocate2015@ gmail.com
– సరస్వతి రమ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement