లవ్ Heart | Sundar and Karuna love story | Sakshi
Sakshi News home page

లవ్ Heart

Published Sat, Dec 13 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

సుందర్, కరుణ

సుందర్, కరుణ

సుందర్, కరుణ
నువ్వు-నేను
YOU AND I
 
 Every woman deserves a man who loves and respects her. And every man deserves a woman who appreciates his efforts.
 అంటారు.  వెల్‌నోన్ ఆర్టిస్ట్‌లు సుక్క కరుణ, సుక్క సుందర్ కూడా అలాంటి జంటే! అతను ఆమెను ఎంత ఇష్టపడతాడో అంతగా గౌరవిస్తాడు. ఆమె.. అతని విజయం కన్నా ప్రయత్నాన్ని విశ్వసిస్తుంది.. ప్రశంసిస్తుంది! ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం! వీళ్ల లవ్.. ఫస్ట్ సైట్‌లో స్టార్ట్ కాలేదు.. మరెప్పుడు? ఎలా? అసలు మీ కథ చెప్పండి అని అడిగితే.. ఇలా మొదలైంది వాళ్ల సంభాషణ..

 ..:: సరస్వతి రమ
 
‘తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్‌ఏ క్లాస్‌మేట్స్‌మి. మొదటి రెండేళ్లు మా మధ్య ఇంటరాక్షనే లేదు. ఫస్ట్ ఐ యూస్డ్ టు హేట్ హిమ్. చదువు పక్కన పెట్టి సోషల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేవాడు. అందుకే నచ్చేది కాదు. అదీగాక నేను చాలా రిజిడ్‌గా ఉండేదాన్ని.  దేనికోసం యూనివర్సిటీకి వచ్చామో అది చూసుకొని పోయేదాన్ని’ చెప్పింది కరుణ. ‘ఆమెకు క్వయిట్ అపోజిట్ నేను. అందరితో కలివిడిగా ఉండేవాడిని. మా క్లాస్‌లో అమ్మాయిలు ఉన్నదే ఏడుగురు. కరుణ తప్ప ఆరుగురూ నాతో క్లోజ్‌గా మాట్లాడేవారు. తను ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి నేనూ దూరంగానే ఉండేవాడిని. కాకపోతే గమనించే వాన్ని’ తన వెర్షన్ చెప్పాడు సుందర్.
 
ఎన్నో సైట్‌కి లవ్ ఏర్పడింది మరి?

‘థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు భోపాల్‌లో ప్రింట్ బైనాలే ఎగ్జిబిషన్‌కి వెళ్లాం అందరం. అక్కడ మిగిలిన వాళ్లంతా అసలు ఎగ్జిబిషన్ వదిలిపెట్టి మిగిలిన ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. నేను, సుందర్ ఇద్దరమే చాలా సీరియస్‌గా ఎగ్జిబిషన్ అంతా తిరిగాం. ఆ టైమ్‌లో ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడే సుందర్‌ను దగ్గరగా గమనించే, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడే అతని లీడర్‌షిప్ క్వాలిటీస్‌పై రెస్పెక్ట్ పెరిగింది. తెలుగు యూనివర్సిటీ ఓ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈయన ఇనీషియేషన్ తీసుకున్న తీరు, సమస్యను సాల్వ్ చేసిన వైనమూ గుర్తొచ్చింది. అప్పటి నుంచి సుందర్‌ను చూసే నా దృష్టి మారింది.

అలా స్లో అండ్ స్టడీగా సాగిన మా ఫ్రెండ్‌షిప్ లైఫ్ లాంగే కాదు ఎవర్ చార్మ్ కూడా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది కరుణ. ‘బీఎఫ్‌ఏ తర్వాత ఎమ్‌ఎఫ్‌ఏ కూడా కలిసి చదివాం. ఎమ్‌ఎఫ్‌ఏ తర్వాత తను బరోడా వెళ్లింది. నేను ఇక్కడే చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో జాయిన్ అయ్యాను’ సుందర్ అంటుంటే ‘నేను బరోడా వెళ్లడం వల్లే సుందర్‌ను మ్యారేజ్ చేసుకోగలిగాను. అంతకంటే ముందు సుందర్ వాళ్లన్నయ్య పెళ్లికని వాళ్లూరు వెళ్లాను. అక్కడ సుందర్ వాళ్ల ఫ్యామిలీ, సిట్యుయేషన్ చూసినప్పుడు అనిపించింది.. సుందర్‌కి నా తోడు తప్పకుండా కావాలని. బహుశా అప్పుడే అతని మీద ప్రేమ మొదలై ఉండాలి.

బరోడా వెళ్లాక అక్కడి ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవడం, వాళ్ల కంపానియన్‌షిప్ చూశాక నేనూ ఆర్టిస్ట్‌నే పెళ్లిచేసుకుంటే కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండూ డిస్టర్బ్ కాకుండా ఉంటాయనిపించింది. ఆ నిర్ణయానికి రాగానే సుందరే గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ప్రేమ విషయాన్ని, పెళ్లి ప్రపోజల్‌ని కూడా’ కరుణ. ‘కానీ నేనిప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు తనకు’ పక్కనుంచి సుందర్. ‘అదే నా కంప్లయింట్’ చిరుకోపంతో కరుణ. ‘నిజానికి నేనే ముందు ప్రేమలో పడ్డాను తనతో. చెప్పడానికి నేను భయపడ్డాను. తను చెప్పి బయటపడింది. అలా 2009లో మా ప్రేమకు పెళ్లి రూపమిచ్చింది’ అన్నాడు కరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ!
 
కెరీర్‌లో సహకారం.. కుటుంబంలో సగం బాధ్యత

‘కరుణది థియరిటికల్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్.  ఈ రెండిటినీ కలిపి కలిసి పనిచేస్తాం’ అని సుందర్ అంటుంటే ‘సుందర్‌కి కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. నా ఐడియాను తనతో షేర్ చేస్తే తను దానికి కలర్ కాంబినేషన్ చెప్తాడు’ భర్తకి కరుణ కితాబు. ‘తను హైదరాబాదీ.  పెద్ద ఆర్టిస్ట్ (శ్రీహరి భోలేకర్) కూతురు. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంది. ఆమెకున్న ఈ ప్లస్‌లన్నీ నాలో మైనస్‌లు. పల్లెటూరి నేపథ్యం. వానాకాలం చదువు. ఇంగ్లిష్‌కి దూరం. ఇంగ్లిష్‌లో ఉన్న ఆర్ట్ బుక్స్ బాగా చదువుతుంది. అవన్నీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది.

ఇంగ్లిష్ మీద నేను పట్టు సాధించేందుకు హెల్ప్ చేస్తుంది’అంటూ భార్య సహచర్యం తన మైనస్‌లు ప్లస్ అయిన తీరును వివరించాడు సుందర్.  ‘నేను ఇంటి పనుల్లో పూర్. మాకు రెండున్నరేళ్ల కూతురుంది. నా పీహెచ్‌డీ, ఆర్ట్ వర్క్ ఇవన్నిటితో పాపను చూసుకోవడం కుదరదు. ఆ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ సుందర్ బలవంతం వల్లే పీహెచ్‌డీ చేస్తున్నాను’అంటూ కుటుంబ నిర్వహణలో భర్త మోస్తున్న సగం బాధ్యతను చెప్పింది కరుణ. ‘చాలామంది  ‘నువ్వూ పీహెచ్‌డీ చేయొచ్చుకదా..’ అని సలహాలిచ్చారు.

ఎవరు ఎందులో పర్‌ఫెక్టో వాళ్లు ఆ పనిచేస్తే బాగుంటుంది. తనకు పీహెచ్‌డీ అంటే ఇంట్రెస్ట్ అందుకే ప్రోత్సహించాను. ఆమె అందులో బిజీ కాబట్టి ఇల్లు, పాప బాధ్యతను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. నేను హౌజ్ హజ్బెండ్‌నని గర్వంగా చెప్తాను’ అన్నాడు సహచరుడు అన్న పదానికి అసలైన నిర్వచనంలా!
 
పెళ్లాయ్యాక ఒకరికోసం ఒకరు మార్చుకున్న పద్ధతులు?

‘ఆయన సోషల్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకున్నాడు. నా పట్ల హెల్పింగ్ నేచర్ పెరిగింది. నాకేం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేదాకా నిద్రపోడు. నాకేమాత్రం ఇన్‌కన్వీనియెంట్ లేకుండా చూసుకుంటాడు’ మురిపెంగా కరుణ. ‘పెళ్లికి ముందు రిజిడ్‌గా, సెల్ఫిష్‌గా ఉండేదా.. ఇప్పుడు చాలా కలివిడిగా... లిబరల్‌గా మారింది. తనలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు తన ఫెలోషిప్ డబ్బులే మాకు ఆధారం. ఇంత కో ఆపరేట్ చేస్తుందని అనుకోలేదు’ సంబంరంగా చెప్పాడు సుందర్.

‘క్రెడిట్ అంతా తనదే’ కరుణ. ‘వర్క్ విషయంలో నా బెస్ట్ క్రిటిక్ తనే. నేను, నువ్వు అనే భావన ఉండదు మనమనే ఫీలే. అందుకే ఎవరికి బయటి నుంచి అప్రిసియేషన్స్ వచ్చినా ఇద్దరం హ్యాపీగా ఫీలవుతాం. నో జెలసీ’ సుందర్. ‘తను ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేస్తాడు. ఇండివిడ్యువల్ సక్సెస్‌కన్నా మా ఇద్దరి సక్సెస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు’ కరుణ. ‘అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమైన ప్రతిభ చూపలేరు.  

ఒకరు విజయం కోసం పోరాడుతున్నప్పుడు ఇంకొకరు అండగా నిలబడాలి’ అని సుందర్  అంటుంటే ‘మేం అదే ఫాలో అవుతున్నాం. ఒకరి ఎబిలిటీని ఇంకొకరం నిజాయితీ ఒప్పుకుంటాం. గౌరవిస్తాం. నమ్ముతాం’ అంటూ చెప్పింది కరుణ.
 
ప్రేమలో పడడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటారు. అలా తమ ప్రేమను నిలబెట్టుకుందీ జంట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement