you and i
-
ఆడుతూ.. పాడుతూ..
నువ్వు నేను : శ్రీకాంత్,సుశీల In all the world there is heart for me like yours.. In all the world there is no love for you like mine.. అని మాయా ఏంజిలో చెప్పినట్టే ఉంటుందీ జంట! ఆమె.. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్! అతను.. డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ ఫిజీషియన్! ఇద్దరూ డాక్టర్లే అనే సారూప్యతే కాక మరో ప్రత్యేకతా ఉంది.. ఆలుమొగలిద్దరూ కళాకారులు. ఆయన స్వరం కర్ణాటక సంగీతంతో శృతి కలిపితే.. ఆమె అడుగులు కూచిపూడి లయను ఒలికిస్తాయి! వైద్యవృత్తి ఇరువురినీ ఏడడుగులు నడిపిస్తే.. కళ.. ఆ బంధాన్ని అందమైన అనుబంధంగా మలుస్తోంది! - సరస్వతి రమ శ్రీకాంత్‌ది కళాకారుల కుటుంబం. నాన్న ఉషాకాంత్ పేరున్న సంగీతకారులు. అమ్మా గాయినే. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం సుశీలది. వావిలాల గోపాలకృష్ణ తమ్ముడి కూతురు ఆమె. ఈ భిన్న నేపథ్యాల కలయిక అటు వ్యాధుల మీద సమరం ప్రకటిస్తూ .. ఇటు సంసారంలో సరిగమలు పలికిస్తోంది! ఎలా కలిశారు? ‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. డాక్టరమ్మాయే కావాలని అనుకోలేదు. బాగా చదువుకున్న అమ్మాయైతే బాగుండు అనుకున్న. అయితే మా అమ్మకు మాత్రం డాక్టర్ కోడలు కావాలని ఉండేది’ అని శ్రీకాంత్ చెప్తే.. ‘మా అమ్మ కూడా డాక్టర్ అల్లుడు వస్తే బాగుండు అనుకుంది’ వాళ్లింటి ముచ్చట చెప్పారు సుశీల. అల్లుడు పాటగాడని ఇటువైపు, కోడలు నర్తకి అని అటువైపూ ఎప్పుడు తెలిసింది అని అడిగితే.. ‘సుశీల మంచి డ్యాన్సరని పెళ్లిచూపులకంటే ముందే తెలుసు!’ అంటూ శ్రీకాంత్ విషయాన్ని పరిచయం చేస్తే.. ‘మాది గుంటూరు. అక్కడే మెడిసిన్ చేశా. ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పెర్ఫార్మ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఆ ప్రోగ్రామ్‌కి అత్తయ్య, మామయ్య కూడా వచ్చారు. నన్ను మెచ్చారు’ అంటూ వివరించారు సుశీల. ‘మామూలుగా మెచ్చుకోవడం కాదు.. అమ్మ అయితే తను చాలా మంచి డ్యాన్సర్రా.. అంటూ ఒకటే ప్రశంసలు’ మురిపెంగా ఆ ముచ్చట ముగించారు శ్రీకాంత్! ‘నేనూ పెళ్లికి ముందే తన పాటలు విన్నాను’ అని సుశీల కొసమెరుపు. పెళ్లి.. పాట.. ఆట.. ‘పెళ్లి చూపుల్లో మా కళల గురించి ఏమీ మాట్లాడుకోలేదు కానీ.. చదువు గురించి మాట్లాడుకున్నాం’ సుశీల. ‘తను అప్పటికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. నాదేమో పీజీ అయిపోయింది. పెళ్లయ్యాక తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. చెప్పాను కూడా’ శ్రీకాంత్. ‘అన్నట్టుగానే చదివించారు. ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేశారు..’ చెప్పారు సుశీల. మరి ఆట, పాట ఒకే వేదిక మీద వినిపించింది, కనిపించింది.. ఎప్పుడూ అని అడిగితే.. ‘పెళ్లిలో’ అంటారిద్దరూ. ‘పెళ్లప్పుడు జయదేవుడి గీతగోవిందం ఆయన పాడితే రాధగా నేను డ్యాన్స్ చేశాను’ అంటూ ఆ తీపి జ్ఞాపకాన్ని సుశీల గుర్తుచేసుకుంటే నవ్వుతో ఆస్వాదించారు శ్రీకాంత్. మల్టీటాస్క్లో అపశృతులు..? ‘అస్సలు లేవ్’ ముక్త కంఠంతో సమాధానం వచ్చింది. ‘ప్రొఫెషన్ అయినా, హాబీ అయినా ప్లాన్డ్గా ఉంటాం’ అంటారు శ్రీకాంత్. ‘ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలనే ఆలోచన మా ఇద్దరికీ లేకపోవడం ప్లస్ అయింది. ఇద్దరికీ టీచింగ్ మీదే ఇంట్రెస్ట్. దాని ప్రకారమే ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇది నల్లేరుపై నడకేం కాదు. రోజుకి 18 గంటలు పనిచేసిన సందర్భాలూ ఉన్నాయ్’ అని సుశీల పనితీరును వివరిస్తే.. ‘గెస్ట్ లెక్చర్స్‌తో టూర్స్లాంటి షెడ్యూల్స్‌తో ఒకరం బిజీగా ఉంటే మిగిలిన బాధ్యతలను ఇంకొకరం చూసుకుంటాం’ అంటారు శ్రీకాంత్. ‘నేను ఇంటి విషయాలంతగా పట్టించుకోను. అవన్నీ ఆయనే చూసుకుంటారు’ సుశీల. ‘తను టెక్నికల్ ఎక్స్పర్ట్. అందుకే నా వర్క్‌లోని టెక్నికల్ పార్ట్ తనే చేసి పెడుతుంది’ కితాబిస్తారు శ్రీకాంత్. ‘నా స్పెషలైజేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆయన చెప్తుంటారు’ అంటూ సుశీల తమ పరస్పర సహకారాన్ని వివరించారు. కళాసహకారం? ‘అదీ అంతే. ఒకేసారి ఇద్దరం ప్రోగ్రామ్స్ పెట్టుకోం’ అంటారు సుశీల. ‘నా ప్రోగామ్ ఉన్నప్పుడు ప్లానింగ్ నుంచి ఇన్విటేషన్, బ్యాక్‌స్టేజ్ అరేంజ్మెంట్స్ దాకా అన్నీ తను చూసుకుంటుంది. తన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ పనులన్నీ నేను చూసుకుంటాను’ శ్రీకాంత్. సూచనలు, సలహాలు.. ఉంటాయ్. ఏదైనా ఇద్దరం కలిసే డిస్కస్ చేసుకుంటాం. మాది జాయింట్ ఫ్యామిలీ. ముందు నాన్నతో, తర్వాత సుశీలతో.. అన్నీ చర్చించాకే అడుగు వేస్తాం’ అంటారు శ్రీకాంత్. ప్రశంసలు, విమర్శలు.. ‘ఉంటాయ్. కించపర్చుకునేలా కాదు.. ఒకరికొకరు గైడ్ చేసుకునేలా’ సుశీల స్పందన. జెలసీ.. ‘ఆ మాటకు చోటే లేదు’ శ్రీకాంత్ దృఢస్వరం. ‘నీది, నాది అనుకున్నప్పుడు అవన్నీ ఉంటాయ్. మనది అనుకున్నప్పుడు అసూయ అన్న మాటే రాదు’ సుశీల. ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా భార్య స్పెషల్ వన్‌గా ఉండాలనేది నా కోరిక’ శ్రీకాంత్ ముక్తాయింపు. మరి కోపాలు.. ‘మనుషులమే కదా.. వస్తాయ్. కాస్త అరుస్తాను.. తగ్గుతాను. అంతేకాని ఆర్గ్యుమెంట్స్ చేసుకోం’ శ్రీకాంత్. ‘ఇంట్లో మామయ్య స్ట్రిక్ట్ వార్నింగ్.. డిస్కషన్సే కాని ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు అని. అయితే ఆయన కోపం పాలమీద పొంగే కానీ నాదే న్యాగింగ్గా ఉంటుంది’ తన బలహీనతను తెలిపారు సుశీల. ‘కోపం త్వరగా రాదు వస్తే త్వరగా పోదు. ఆ న్యాగింగ్ అంటేనే కాస్త ఇబ్బంది’ అని మైనస్‌ను కోట్ చేస్తూనే ‘అలాగే తను చాలా స్ట్రాంగ్, ఎనర్జిటిక్. తెల్లవారుజాము వరకు పనిచేసినా అలసిపోదు. అంతే ఫ్రెష్‌గా తిరిగి రోజును మొదలుపెడుతుంది. ఎలాంటి టాస్క్‌నైనా అవలీలగా చేసేస్తుంది’ అంటూ భార్యలోని ప్లస్‌నూ ప్రశంసించారు. ‘నా వృత్తి నేర్పిన నైపుణ్యం అది. నా ప్రొఫెషనంతా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడమే కదా. అయితే తనకున్నంత ఓపిక నాకులేదు’ అంటూ భర్తలోని ప్లస్కూ ప్లేస్ ఇచ్చారు సుశీల. ‘నన్ను భరించువాడు, మంచివాడు’ అని ఆమె, ‘మై స్పెషల్వన్’ అంటూ అతనూ ఒక్క మాటలో బెటర్ హాఫ్‌కు పరిపూర్ణ అర్థమిచ్చారు. మ్యూజిక్ ఫర్ హీలింగ్ డెబ్బైరెండు మేళకర్త రాగాల అనుసంధానం.. నాలుగేళ్ల శోధన.. ఈ శ్రమ ఫలితమే మ్యూజిక్ ఫర్ హీలింగ్! వైద్యం, సంగీతం కలిసి, కలిపి చేస్తున్న ట్రీట్మెంట్.. నాదతనుమనిశమ్! ఇది డాక్టర్ జె. శ్రీకాంత్ కృషి ఫలితం. ఈ రోజు రవీంద్రభారతిలో సాయంత్రం ఆరుగంటలకు ఆవిష్కరణ! -
మనసు చేసిన మోసం
యాకూబ్, శిలాలోలిత - నువ్వు-నేను The goal of marriage is not to think alike, but to think together.. అంటాడు రాబర్ట్ డాడ్స్! కవి యాకూబ్, కవయిత్రి శిలాలోలిత అలాంటి జంటే! ఇద్దరి కుటుంబ నేపథ్యాల నుంచి వాళ్ల ఆలోచనా విధానం దాకా అన్నిట్లో వ్యత్యాసమే! అయినా అన్యోన్యత అనే లక్షణాన్ని వీడలేదు వాళ్ల కాపురం! ..:: సరస్వతి రమ కాంచ్ కభీ ఝూట్ నహీ బోల్తా.. ఔర్ పర్ఛాయా కభీ సాథ్ నహీ ఛోడ్తీ అన్నట్టుగా అంతరాలను సరిదిద్దుకునేటప్పుడు ఈ ఇద్దరు ఒకరికొకరు ప్రతిబింబంలా ఉంటారు. క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు నీడలా తోడవుతారు! వాళ్ల పాతికేళ్ల పెళ్లి ప్రయాణంలో ఆ ఆలుమొగల మధ్య ఏర్పడిన అవగాహన అది. మూడుముళ్లు, ఏడు అడుగుల ఈ కథ ఎలా మొదలైందంటే.. మసాబ్‌ట్యాంక్ తెలుగు పండిత్ ట్రైనింగ్ క్లాసెస్‌లో.. ‘మా క్లాస్‌లో అరవై మంది అమ్మాయిల్లో.. లక్ష్మే.. అంటే ఎవరో కాదు ఈమే. హుందాగా, గంభీరంగా ఉండేది. లెక్చరర్స్ కూడా తనని లక్ష్మిగారూ.. అని పిలిచేవారు. నేనూ గౌరవంగా చూసేవాడిని’ అని తన ప్రేమ పరిచయాన్ని యాకూబ్ ప్రస్తావించారు. ‘నాకూ యాకూబ్ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. చక్కగా పాటలు పాడేవాడు. ఎంత బాధ ఉన్నా మనసులోనే పెట్టుకొని అందరితో సరదాగా ఉండేవాడు’ శిలాలోలిత అంటుంటే ‘తను బాధ అంది కదా.. అది ఆకలి బాధ.. తన కోసం తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ని నాకు ఇచ్చేది’ పూర్తి చేశారు ఆయన. చిరునవ్వుతో సరిపెట్టారు ఆమె. ‘తనతో పాటు అప్పుడప్పుడు సాందీప్ అనే నాలుగేళ్ల పిల్లాడిని కాలేజ్‌కి తెస్తుండేది. వాడితో కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఎంతలా అంటే వాడి కోసమే ఈమెతో మాటలు కలిపేంతగా’ చెప్పారు యాకూబ్. ప్రేమను బయటపెట్టుకున్నదెప్పుడు? ‘కొన్నాళ్లు పాటలు ఇచ్చి లంచ్‌బాక్స్‌లు పుచ్చుకునే వ్యవహారం నడుస్తుండగా.. ఒకరోజు ‘మీతో ఒక విషయం మాట్లాడాలి రేపు చాచానెహ్రూ పార్క్‌కి రండి’ అని చెప్పి వెళ్లిపోయింది. మనసులో నాకు ఒకటే గుబులు. నాకు తెలిసీ నేనేం అనలేదు. మర్యాదగా ప్రవర్తించాను. ఏం మాట్లాడుతుందో ఏమో సరే వెళ్లనయితే వెళ్దాం’ అని డిసైడ్ అయిపోయా’ చెప్పారు యాకూబ్. మనసు చేసిన మోసం ‘తెల్లవారి పార్క్‌లో కలుసుకున్నాం’ యాకూబ్. ఏం చెప్పారు అన్న ప్రశ్నకు ‘నా మనసులో ఉన్నదంతా చెప్పాను’ ముక్తసరిగానే అన్నారు శిలాలోలిత. మనసులో ఏం ఉండింది అని రెట్టిస్తే ‘నన్ను మీరు ఇష్టపడుతున్నారల్లే ఉంది. కానీ అది కుదరదు. నాకు పదకొండో ఏటే పెళ్లయింది. ఓ బాబు పుట్టాక విడాకులు కూడా అయ్యాయి. అప్పుడప్పుడూ నా వెంట వచ్చే సాందీప్ నా కొడుకే. కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాంటి ఆలోచన ఉంటే మరచిపోండి’ అని చెప్పాను. ‘ఆ మాటలు విని ముందు ఆశ్చర్యపోయా. తన గతం విని కాదు. తనకు నాపై అలాంటి అపోహ ఏర్పడ్డందుకు. లక్ష్మిగారు.. మీపై నాకలాంటి ఉద్దేశం లేదు. మీకలా అనిపిస్తే సారీ’ అన్నాను’’ యాకూబ్ చెప్తుంటే ‘అందుకే దాన్ని మనసు చేసిన మోసం అంటాను’ అన్నారు శిలాలోలిత. ‘కానీ ఆ రోజు నుంచి లక్ష్మి మీద మరింత గౌరవం పెరిగింది. తను నాకన్నా ఆరేళ్లు పెద్ద. ఆమె వ్యక్తిత్వం ముందు ఆ బేధాలన్నీ బలాదూరయ్యాయి. సాందీప్‌కి నాకూ మధ్య అనుబంధమూ బలపడటం మొదలైంది. బహుశా అది ప్రేమ కావచ్చు’ యాకూబ్. ‘కానీ, టీపీటీ ట్రైనింగ్ అయిపోయే వరకూ బయటపడలేదు. ఎంఫిల్కి ఇద్దరం రాజమండ్రి వెళ్లాం. అక్కడ గోదావరి తీరం, సాహిత్య పరిచయాలు, కవి సమ్మేళనాలు.. మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి తెచ్చాయ్’ శిలాలోలిత. పెళ్లికి పెద్దల అంగీకారం? ‘నేను కేఎల్, దుర్గమ్మ దంపతులకు ఒకరకంగా దత్తపుత్రుడిని. నా మంచిచెడ్డలన్నీ వాళ్లే చూశారు. ఈమెతో పెళ్లికూడా దుర్గమ్మ గారి అంగీకారంతోనే జరిగింది’ అని యాకూబ్ చెప్తుంటే ‘తను ముస్లిం అని మా నాన్న అభ్యంతరపెట్టారు. ‘మొదటి పెళ్లి మీ ఇష్టప్రకారం చేశారు. ఏమైంది? అందుకే ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని చేసుకోనివ్వండి’ అని కాస్త కఠినంగానే చెప్పాను. ఒప్పుకున్నారు’ అని గతం గుర్తుచేసుకున్నారు ఆమె. ‘పెళ్లయ్యాక కాపురానికి వస్తుంటే వీళ్ల నాన్న సాందీప్ మాతోనే ఉంటాడు’ అన్నాడు. వీల్లేదు. మాతో ఉండాల్సిందే’ అన్నాను. నిజానికి నేను ఈవిడను పెళ్లాడింది వాడికోసమే’ చెప్పారు యాకూబ్. మరి పెళ్లితర్వాత గొడవలు, అలకలు..? ‘మాదంతా బాధ్యతల పంపకమే. గొడవలు, అలకలు అంతగా లేవు’యాకూబ్. సాందీప్ విషయంలో ఆయన కర్తవ్యాన్ని ఎలా మరిచిపోలేదో.. యాకూబ్ వాళ్లింటి విషయంలో నా బాధ్యతనూ నేను మరచిపోలేదు. చాన్నాళ్లు ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలే. నాలుగు నాలుగు కాలేజీల్లో పాఠాలు చెప్పేవాళ్లం. ఇంట్లో మాతోపాటు ఆరుగురు పిల్లలు (వాళ్లన్నయ్య పిల్లల్నీ ఇక్కడకు తెచ్చేసుకున్నాం చదువుల కోసం).. మా శక్తికి మించి బాధ్యతలను మోసినా నేనెప్పుడూ మానసిక వ్యథను అనుభవించలేదు. యాకూబ్ నా పక్కనున్నాడన్న ధైర్యం నాది’ అని ఆమె, ‘లక్ష్మి నాకు తోడుందన్న గర్వం నాకుండేది’ ముగించారు యాకూబ్. కల్చరల్ డిఫరెన్సెస్.. ‘మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు’ అంటారిద్దరూ. ‘యాకూబ్‌కి ఇల్లు నీట్‌గా ఉండడం ఇష్టం’ అని ఆమె అంటుంటే ‘హౌస్ కీపింగ్‌లో ఆమె వీక్. నేను స్ట్రాంగ్’ అని ఆయన. ‘యాకూబ్ అందరినీ ఇట్టే నమ్మేస్తాడు’ అని అతని బలహీనత చెప్పారామె. ‘అర్హులకే సహాయం చేయాలంటుంది ఆమె’ అంటూ తన బలహీనతను సర్దిచెప్పుకున్నారు ఆయన. కవిత్వంలో విమర్శలు.. ‘పెద్ద వ్యాక్యాలు రాస్తుంది’ అని ఆయన, ‘అది నా శైలి’ అని ఆమె.. ‘సరిదిద్దితే.. నా రాతనే మార్చేశాక ఇది నాది ఎందుకవుతుంది నీదే’ అంటూ పడేసి వెళ్లిపోతుంది. వ్యాసాలు బాగా రాస్తుంది’ అని ఆయన ప్రశంస, ‘పాటలు అద్భుతంగా పాడ్తాడు’ అని ఆమె ప్రశంస. ‘నా తీరని కోరిక తనతో సారీ చెప్పించుకోవాలని’ అని ఆయన.. ‘నా తప్పులేంది సారీ అస్సలు చెప్పను ’ అని ఆమె.. మొత్తానికి ఇద్దరి మధ్యకు వచ్చే ఏ వాదనైనా చివరకు వాళ్ల అన్యోన్యతను చూసి తప్పుకొనైనా వెళ్తుంది లేదంటే ఇద్దరూ ఒకే మాటమీదకు వచ్చే అద్భుతమైన కన్క్లూజనైనా ఇస్తుంది! ఇదీ కుల మత వయసులకతీతమైన యాకూబ్, శిలాలోలితల ప్రేమబంధం! -
ఆ ఉత్తరాలకు జవాబిచ్చేదాన్ని కాదు
ఒకరు శ్రుతి.. వేరొకరు లయ..ఒకరు తన్యావర్తనం..మరొకరు మధుర వీణానాదం. అందుకే వారి సంసారమే సరాగాల సారం. మృదంగనాదమే జీవన వేదమైన వంకాయల వారి వారసుడు, మార్దంగిక విద్వన్మణి వెంకటరమణ.. ఆయన సతీమణి, వీణాగాన విశారద మీనా కుమారి ఈ వారం యూ అండ్ ఐ. ‘ఇద్దరి అభిరుచీ సంగీతమే.. కుటుంబ నేపథ్యాలు వేరు. మా ఇద్దరి మధ్య కుదిరిన సమన్వయం సంతోషదాయకం. నేపథ్యం వేరుగా ఉన్నా, ఆలోచనలు ఒకే విధంగా ఉండడం అరుదు. అలాటి జంటల్లో మేమూ ఒకరం.. అలా అనుకున్నందుకు, అలా ఉన్నందుకు ఆనందంగా ఉంటుంది.’ అన్నారు మృదంగ విద్వాంసుడు వంకాయల వెంకట రమణమూర్తి, ఆయన భార్య, వీణ విద్వాంసురాలు మీనా కుమారి. తమ మధ్య ఉన్న ఆ సారూప్యతకు తామే ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయని చెప్పారు. వివాహానికి ముందే పరిచయమున్నా తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనంటూ ఆ జ్ఞాపకాలు ఇలా గుర్తు చేసుకున్నారు. రమణ: మాది విజయనగరం. నాలుగు తరాల సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం మాది. నాన్నగారు ప్రముఖ మృదంగ విద్వాంసుడు వంకాయల నరసింహం. ఆయన ఆలిండియా రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్. నేను 8వ తరగతి చదువుతుండగా వైజాగ్ వచ్చేశాం. నేను నాన్నగారి దగ్గరే మృదంగం నేర్చుకున్నాను. 1989లో రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా చేరాను. మీనా రేడియో ఆడిషన్‌కి వచ్చినప్పుడు తొలిసారి చూశాను. పొందికగా ఉన్న ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. మీనా : నాన్నగారు రైల్వేలో చేయడంతో చిన్నప్పుడు కలకత్తాలో ఉండేవాళ్లం. తర్వాత విజయనగరం వచ్చాం. అమ్మకు వీణ వచ్చు. తన ప్రోత్సాహంతో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వీణ నేర్చుకున్నాను. రమణ: తర్వాత విజయనగరం సంగీత కళాశాలలోఉత్సవాలు జరిగినప్పుడూ కనబడేది. మీనాకు వీణ నేర్పిన గురువు మండ మాణిక్యంగారు ఈ సంబంధం తీసుకువచ్చారు. నాకు నచ్చిన అమ్మాయి కావడంతో వెంటనే అంగీకరించాను. 1991 అక్టోబర్‌లో మా నిశ్చితార్థం జరిగింది. మీనా : అప్పుడు నేను మీరజ్ యూనివర్సిటీలోని గాంధర్వ మహా విద్యాలయలో ఎంఏ మ్యూజిక్ చేస్తున్నాను. పెళ్లి నిశ్చయమయ్యాక ఈయన ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలో కవిత్వం బోలెడు ఉండేది. నేను జవాబిచ్చేదాన్ని కాదు. 1992 ఫిబ్రవరి 21న మా పెళ్లయింది. రమణ : అప్పటికి మాది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు, అన్నయ్య, మేము అంతా కలిసే ఉండేవాళ్లం. మీనా అందరిలో బాగా కలిసిపోయింది. పెళ్లయిన కొత్తలో నా జీవిత పయనం గురించి మీనాతో ప్రస్తావించాను. మాది విలువలకు కట్టుబడి ఉన్న కుటుంబం. స్తోమత కోసం విలువలను పక్కన పెట్టాలా? లేక ఆత్మ సంతృప్తి కోసం వాటికి కట్టుబడి ఉండాలా? అని.. నాకు నచ్చినట్టే ఉండమని, తను నా వెన్నంటి ఉంటానని చెప్పింది. అలాగే ఈరోజు వరకూ ఉంది. అందుకే ఈరోజున సంతోషంగా, తృప్తిగా ఉన్నాను. మీనా : విలువల్లేని జీవితానికి అర్థం లేదు. ఆయన ఆనందంగా ఉండటం కంటే నాకు కావలసింది ఏమీ లేదు. నా అభిప్రాయాన్ని గౌరవించబట్టే కదా ఆయన నన్నలా అడిగారనిపించింది. అందుకే అలా చెప్పాను. రమణ : మీనా నా కోసం కెరీర్‌నే త్యాగం చేసింది. తను చాలా టాలెంటెడ్. కుటుంబమే ప్రపంచంగా గడిపింది. మాకు ఇద్దరు పిల్లలు. పాప,బాబు. పిల్లలు చిన్నప్పుడు కూడా తనే మేనేజ్ చేసుకునేది. మ్యుజిషియన్స్కు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి.. అప్పుడే కార్యక్రమం రక్తి కడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లానంటే మళ్లీ వచ్చేవరకు ఆ ధ్యాస లేకుండా మొత్తం తనే చూసుకుంటుంది. మీనా : ఆయన కూడా కళాకారుడు కావడంతో నన్ను అర్థం చేసుకున్నారు. పిల్లల చిన్నతనంలో వాళ్ల దగ్గర ఎవరో ఉండాలి కదా.. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రేడియోలో ఏటా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుండేదాన్ని. ఆయ న ప్రోత్సాహం వల్లే రేడియోలో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్‌ను కాగలిగాను. పిల్ల లు పెద్దవాళ్లవడంతో ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాను. రమణ : పిల్లలను క్రమశిక్షణతో పెంచింది. చిన్నతనంలో నీతి కథలు, రామాయణ, మహా భారతాలు చెప్పేది. వాళ్ల చదువు తనే చూసుకునేది. మీనా : పాప పేరు శ్రుతి సారణి. వీణలో మొదటి తీగన్నమాట. తనిప్పుడు బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. తను గాయని.. రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్. వయొలిన్ నేర్చుకుంటోంది. బాబు శ్రీ సుధాకృష్ణ. శ్రీ రాగం పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాం. బీ టెక్ ఫస్టియర్.. ఆయన దగ్గరే మృదంగం నేర్చుకున్నాడు. రేడియో ఆడిషన్‌కు వెళ్తున్నాడు. రమణ : మేము ‘మూడు తరాల మృదంగం’ అనే కార్యక్రమం ఒకటి చేశాం. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో మా నాన్నగారు, నేను, మా అన్నయ్యగారి అబ్బాయి, మా అబ్బాయి పాల్గొన్నాం. మీనా : నేనూ, ఆయనా కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేశాం. చెన్నైలో నిర్వహించిన వీణోత్సవం ‘ముద్ర’ వీటిలో ఒకటి. రమణ : మా ఇద్దరివీ అభిప్రాయాలు చాలా బాగా కలుస్తాయి. ఒక్కోసారి మేమే ఆశ్చర్యపోతాం. అలాగే కోపం కూడా ఇద్దరికీ ఒకేలా వస్తుంది. ఒక స్థాయికి వెళ్లాక తను తగ్గుతుంది. కాసేపటికి నేనే వెళ్లి సారీ చెప్తాను. అదొక్కటీ అనుకుంటాను... ఒక్కసారైనా తను సారీ చెప్పచ్చు కదా అని. మీనా : ఆయన మృదంగంలో ప్రవీణులు. చిన్న వయసులోనే రేడియోలో టాప్‌గ్రేడ్ ఆర్టిస్టు అయ్యారు. ఆకాశవాణి జాతీయ సంగీతోత్సవాల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలే కాదు.. జాజ్, వెస్టర్న్, సింఫనీస్ సైతం పెర్ఫార్మ్ చేయగలరు. బాలమురళి, ఎల్. సుబ్రహ్మణ్యం, శశాంక్, జస్రాజ్, హరిప్రసాద్ చౌరాసియా వంటి ఉద్దండులతో కలిసి ప్రోగ్రామ్స్ చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్ సమక్షంలో 80 దేశాల ప్రతినిధుల మధ్య పద్మభూషణ్ ఎల్.సుబ్రహ్మణ్యంగారితో కలిసి ప్రోగ్రామ్ చేశారు. మృదంగరత్న, నాదోపాసక లాంటి అవార్డులు ఎన్నో.. ఇదంతా నాకు గర్వ కారణం. రమణ : ఇది మీనా సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఓపిక ఎక్కువ. సింపుల్ లివింగ్ ఇష్టపడుతుంది. పద్ధతిగా మా కుటుంబాన్ని నడిపింది. ఇప్పటికీ రోజూ వీణ ప్రాక్టీస్ చేస్తుంది. మీనా : ఎక్కడికైనా నలుగురం వెళ్తాం. షాపింగ్‌కు, సినిమాకు అంతెందుకు మాలో ఎవరికి జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్లాలన్నా నలుగురం ఉండాల్సిందే. ఏదైనా నలుగురం షేర్ చేసుకుంటాం. రమణ : జన్మనిచ్చిన అమ్మ, విద్యనిచ్చిన మా నాన్నగారు ఎంత ముఖ్యమో చక్కని జీవితాన్నిచ్చిన మీనా నాకు అంతే ముఖ్యం. -
కళ్ల జోడు అమ్మాయి వద్దనుకున్నా..
వివాహం అంటే వేద మంత్రాలు, ఏడడుగులు, ప్రమాణాలు మాత్రమే కాదు.. మూడు ముళ్లో, ఉంగరాలు మార్చుకోవడాలో ఒక్కటే కాదు. రెండు జీవితాలను ఒకటి చేసే వైవాహిక బంధం రెండు మనసుల్ని ఒకటి చేయాలి. ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలను మాత్రమే కాదు.. గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంపు చేయాలి. ఒకరి లక్ష్యాన్ని, అందుకు దీక్షను వేరొకరు గుర్తించగలగాలి. ఆశయసాధనకు పడే తపనను గౌరవించాలి. అందుకు సహకరించాలి. ప్రోత్సహించాలి. నిరాశపడితే నవ్వించాలి. గమ్యం చేరిన ఆనందాన్ని పంచుకోవాలి. అటువంటి అనుబంధాన్ని అనునిత్యం షేర్ చేసుకుంటున్నారు విశాఖ యాడ్ ఏజెన్సీ అధినేత పారుకొండ లక్ష్మీ కోదండమూర్తి, బెంగళూరులో సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా చేస్తున్న సుమిదా దేవి .. ఒకరికొకరు తోడునీడగా జీవిత పయనం సాగిస్తున్న వాళ్లిద్దరే ఈ వారం యూ అండ్ ఐ ఉన్నత లక్ష్యాలు సాధించాలన్న ఆరాటం ఒకరిది. అందుకు అన్ని విధాలా అండగా నిలబడే ఆత్మీయత ఒకరిది. అవాంతరాలను అధిగమించి లక్ష్యం అందుకోవాలన్న దీక్ష ఒకరిది.. అందుకు అన్ని విధాలా సహకరించే సహృదయత ఒకరిది. అందుకే వారి జీవితం ఆనందమయమైంది. అనుకున్నది చేతికందిన ఆనందం ఒకరిది కాక ఇద్దరిదైంది. భార్య సామర్ధ్యంపై విశ్వాసంతో భర్త ఆమెను ప్రోత్సహిస్తే ఆ కుటుంబం విజయానికి ప్రతిరూపమవుతుందని మరోసారి రుజువైంది. భార్యకు చదువంటే ఉన్న ఆసక్తిని, అందుకోసం ఆమె పడే తపనను చూసి సెక్యూర్డ్ జాబ్‌కు రిజైన్ చేయించి సివిల్స్ చదివేందుకు ఆమెను ప్రోత్సహించారు మూర్తి. ఆ నమ్మకానికి తగ్గట్టు లక్ష్యాన్ని సాధించారు సుమిద. తమ వివాహం, తర్వాత జీవితం, లక్ష్యాల సాధనకు చేసిన ప్రయత్నాల గురించి వాళ్లిద్దరూ ఇలా వివరించారు. మూర్తి : మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. మాది అలమండ దగ్గర మామిడిపల్లి. నేను ఎంజేఎంసీ చేశాక, ఎంఏ చేశాను. విశాఖలో యాడ్ ఏజెన్సీ పెట్టాను. అక్కయ్యపాలెంలో ఉంటున్న మా ఇంటి యజమాని ఈ సంబంధం తీసుకువచ్చారు. ముందు కళ్లజోడు ఉన్న అమ్మాయా ..వద్దు అనుకున్నాను. కానీ తనను నేరుగా చూసిన తర్వాత చాలా నచ్చింది. సుమిద : మా నాన్నగారు ఇంజినీర్. మాది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి అయినా నాన్నగారి ఉద్యోగరీత్యా నా టెన్త్ క్లాస్ అయ్యేవరకు అసోంలో ఉన్నాం. తర్వాత వైజాగ్‌లో ఇంటర్, డిగ్రీ చేశాను. డిగ్రీ ఫైనలియర్లో ఉండగా ఎల్ఐసీలో అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే మా వివాహం నిశ్చయమైంది. 1994 మే 25న వైజాగ్‌లో మా వివాహం జరిగింది. మూర్తి : పెళ్లయిన తర్వాత కూడా తను ఎల్ఐసీలో ఐదేళ్లు చేసింది. తనకు సివిల్స్‌పై ఆసక్తి ఉన్న విషయం ముందే తెలిసినా ఆర్థిక పరిస్థితి కూడా సహకరించాలని కొన్నేళ్లు ఆగాం. ఈలోగా మా యాడ్ ఏజెన్సీకి ఐఎన్ఎస్ అక్రిడిటేషన్ వచ్చింది. అలా నిలదొక్కుకున్నాను. సుమిద : నా చదువు గురించి తెలియకపోయినా, పెళ్లి తర్వాత ఎంబీఏ సెట్లో 72వ ర్యాంక్ రావడంతో ఆయనకు నమ్మకం కుదిరింది. దాంతో ఎల్ఐసీకి రిజైన్ చేయమన్నారు. సెక్యూర్డ్ జాబ్ వదులుకోవాలంటే తటపటాయించాను. మా వారు మాత్రం చేసేయమన్నారు. ఏయూలో ఎంబీఏ చదువుతూ యూపీఎస్సీ అటెంప్ట్ చేశాను. మొదటిసారి మెయిన్స్‌కు వెళ్లాను.. రెండు మార్కుల తేడాలో క్వాలిఫై కాలేకపోయాను. రెండోసారి అప్లై చేశాను గానీ అటెంప్ట్ చేయలేకపోయాను. మూడోసారి రాయాలంటే చాలా నిరుత్సాహం వచ్చింది. ఆ సమయంలో ఈయన బాగా ఎంకరేజ్ చేశారు. నిరుత్సాహం వద్దని ధైర్యం చెప్పారు. ఆయన ప్రోత్సాహమే ఐఆర్ఎస్కు ఎంపికయ్యేలా చేసింది. మూర్తి : అప్పటికే మాకు ఒక పాప ఉంది. తనను చూసుకుంటూనే చదివేది. యూపీఎస్సీ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు తను మళ్లీ ప్రెగ్నెంట్. అయినా పట్టుదలతో చదివింది. చివరికి అనుకున్నది సాధించింది. తను ముస్సోరి ట్రైనింగ్‌కు వెళ్లేసరికి బాబుకు 8 నెలలు. సుమిద : నేను ట్రైనింగ్‌కు వెళ్లిన సమయంలో పిల్లలిద్దరిని అమ్మ, అత్తగారు చూసుకున్నారు. వాళ్ల సహకారంతోనే నా ట్రైనింగ్ పూర్తయింది. 2006లో హైదరాబాద్‌లో సెంట్రల్ ఎక్సైజ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పోస్టింగ్ వచ్చింది. పిల్లలను హైదరాబాద్ తీసుకుని వెళ్లాను. 2009 వరకు అక్కడే ఉన్నాను. మూర్తి : 2009లో తనకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఆగస్ట్ వరకు ఇక్కడే జాబ్ చేసేది. ఆగస్ట్‌లో ప్రమోషన్‌పై తనను బెంగళూరు ట్రాన్స్ఫర్ చేశారు. పాప, బాబుతో తను అక్కడే ఉంటోంది. పాప శ్రీప్రియ ఇప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ సెకండియర్ చేస్తోంది. బాబు సిద్ధార్థ బెంగళూరులోని సెంట్రల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. సుమిద : ఈయనకు నేను చేసే కాఫీ చాలా ఇష్టం. ముసోరిలో ఉండగా నీ కాఫీ మిస్ అవుతున్నానని ఫోన్ చేసేవారు. అలాగే నేను చేసే పలావ్ చాలా ఇష్టం. పెళ్లయ్యాకే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలు కోరిన వెరైటీలన్నీ దాదాపు నేనే స్వయంగా చేస్తాను. వీకెండ్స్‌లో పిల్లలు, నేను షాపింగ్‌కు వెళ్లి మాకు కావలసిన ప్రొవిజన్స్ తెచ్చుకుంటాం. మూర్తి : సుమిదకు పనిపై అంకితభావం ఎక్కువ. హార్డ్ వర్కింగ్... సుమిద : ఈయన ఏదీ మనసులో పెట్టుకుని బాధపడటం ఉండదు. వాదించుకున్నా వెంటనే మర్చిపోతారు. సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. మూర్తి : సుమిద ద్వారా పిల్లలకు రీడింగ్ హేబిట్ వచ్చింది. పిల్లలిద్దరూ పుస్తకాలు బాగా చదువుతారు. సుమిద : అన్ని విషయాల్లోనూ మా ఇద్దరిదీ ఒకే మాట. ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నా మా మనసులొకటే. అదే మా ఆనందంలో రహస్యం. -
లవ్లీ జర్నీ
ప్రశాంత్ లహోటి, రేఖ లహోటి YOU AND I "Success in marriage does not come merely through finding the right mate, but through being the right mate" అన్నాడు బార్నెట్ ఆర్ బ్రిక్నర్. ఆర్టిస్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ రేఖ లహోటి, ఇంజనీర్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ లహోటి.. ఈ ఇద్దరూ అంతే! ఒకరికొకరు సరి జోడు అనుకొని జతకూడలేదు. జంట ప్రయాణంలో ఒకరికొకరు తగిన తోడుగా తమనుతాము మలచుకుంటున్నారు. ఆ సర్దుబాటు, దిద్దుబాటే వాళ్ల వైవాహిక బంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతోంది! ఆ దంపతుల ముచ్చట్లు... ..:: సరస్వతి రమ ‘జాతకాలు కుదిర్చిన పెళ్లి మాది’ అని మొదలుపెట్టారు ఇద్దరూ! సంభాషణకు ముందు రెండు కుటుంబ నేపథ్యాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ బెంగాలీ అయినా పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడే. ఆ మాటకొస్తే 150 ఏళ్ల కిందటే వాళ్ల పూర్వీకులు ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. అందుకే ‘నేను పక్కా హైదరాబాదీ’ అంటాడాయన. రేఖ పుట్టిపెరిగిందంతా కోల్‌కతాలోనే. ప్రశాంత్‌తో కొంగుముడివేసుకున్నాకే హైదరాబాద్ ఆమెకు పరిచయమైంది. వ్యక్తిత్వాలు,నేపథ్యాలు కన్నా.. ‘నేను చిన్నప్పటి నుంచి బబ్లీ టైప్. పదిహేనోయేట నుంచే డ్రైవింగ్ చేసేదాన్ని. కలివిడితనం ఎక్కువ. దాంతో మా ఇంట్లో వాళ్లంతా నేను లవ్ మ్యారేజే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను మాత్రం భిన్నంగా ఆలోచించాను. పుట్టిపెరిగిన కోల్‌కతాలోనే స్థిరపడాలని అనుకోలేదు. బయటి ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాను. కాబట్టి పెద్దలు చూసిన సంబంధానికి ఓకే అన్నాను’ అంటారు రేఖ. ‘మా బంధువుల ద్వారా ఈ సంబంధం ఖాయం అయింది. మా వ్యక్తిత్వాలు, మా నేపథ్యాల కన్నా మా జాతకాలే ముందు మమ్మల్ని కలిపాయి’ అంటూ పెళ్లయిన తీరు చెప్పారు ప్రశాంత్. పూర్తి విరుద్ధం.. ‘స్వభావరీత్యా మేమిద్దరం పూర్తి విరుద్ధం’ అని ఆమె అంటుంటే ‘అందుకే మా రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంది’ అని పూరించారు ఆయన. ‘నాకు కోపమెక్కువ’ అని రేఖ, ‘నాకు ఓపిక ఎక్కువ’ అని ప్రశాంత్, ‘తను చాలా ఉదారంగా ఉంటారు’ అని ఆమె, ‘రేఖ తన మేనేజ్మెంట్ స్కిల్స్‌తో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది’ అని ఆయన, ‘ప్రశాంత్ ఇంట్రావర్ట్. ఆయనకెప్పుడైనా కోపమొస్తే ఎక్స్‌ప్రెస్సే చేయడు. ఆయన అలక తీర్చే చాన్సే ఇవ్వడు’ అని ఆమె, ‘రేఖ వెరీ ఎక్స్‌ప్రెసివ్’ అని ఆయన.. ఇలా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలకు కంప్లయింట్స్ అండ్ కాంప్లిమెంట్స్ రూపమిచ్చారు. కళాకృతి.. ‘మా ఇద్దరి బిడ్డ’ అంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నిజానికి రేఖ మంచి ఆర్టిస్ట్’ అని ప్రశాంత్ కితాబిచ్చేలోపే ‘ఎనిమిదో ఏటనుంచే బొమ్మలు గీసేదాన్ని. డిగ్రీ తర్వాత ఫైనార్ట్స్ కూడా చేశాను. పెళ్ల్లయ్యాక నా మనసు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది. మా అత్తమామల ఎంకరేజ్‌మెంట్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ చేశా. నేను బొమ్మలేయడం కంటే ఎక్కువగా ప్రశాంత్ ఆర్ట్‌ని ఇష్టపడతాడు. ఆయన ఈస్తటిక్సెన్స్కి నిలువెత్తు నిదర్శనమే కళాకృతి ఆర్ట్ గ్యాలరీ’ అని భర్త కళాభిరుచిని వివరించారు రేఖ. ‘దాదాపు 20 ఏళ్ల కింద కళాకృతిని ఏర్పాటు చేశాం. ఆ ఆలోచన వచ్చిన వెంటనే రేఖతో షేర్ చేసుకున్నాను. తనకూ నచ్చింది. అయితే ఆ రోజే అనుకున్నాం.. మా గ్యాలరీ ప్యూర్ ఆర్ట్‌కి డయాస్లాగా ఉండాలి తప్ప కమర్షియల్ ప్రాఫిట్‌కి చానల్‌లా కాదు అని. ఇప్పటికీ ఆ విషయంలో రాజీ లేదు’ అని చెప్తారు ప్రశాంత్. ‘కళాకృతి..ఆలోచన ఆయనది. అనుసరణ నాది. కళాకృతి కాకుండా మా ఇద్దరికీ సపరేట్ కెరీర్ ఉంది. ఆయన బిల్డర్. నాకు బొటిక్ ఉంది. అయినా కళాకృతి మా ఇద్దరి గారాలపట్టి. ఎంత బిజీగా ఉన్నా ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఏ అంశాన్నీ అలక్ష్యం చేయం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ సరికొత్త వర్క్ కొలువుదీరేలా ప్రయత్నిస్తుంటాం. అలా త్వరలోనే చక్కటి కాఫీ తాగుతూ నచ్చిన పెయింటింగ్‌ను ఆస్వాదించే కాఫీడేనూ స్టార్ట్ చేయబోతున్నాం’ అని భవిష్యత్ కార్యాచరణను తెలిపారు రేఖ. స్మార్ట్ థింకింగ్ అండ్ హార్డ్‌వర్కింగ్ మీ ఇద్దరి ప్రొఫెషనల్ జర్నీని ఒక వాక్యంలో వర్ణించండి అంటే ‘ఆయనది స్మార్ట్ థింకింగ్ నాది హార్ట్వర్కింగ్’ అని చెప్పారు రేఖ. ‘కళాకృతికి సంబంధించిన విషయం తప్ప మా ఇద్దరి కెరీర్లో ఒకరికొకరం జోక్యం చేసుకోం’ అంటారు ప్రశాంత్. ‘ఆయన అద్భుతమైన ఐడియాలిస్తారు’ అని రేఖ అంటుంటే ‘తను వాటిని అంతకన్నా అద్భుతంగా చేసి చూపిస్తుంది’ అంటారు ప్రశాంత్. ‘మా అమ్మాయికి ఆయన పోలికే. అబ్బాయికి నా పోలిక.వాళ్లిద్దరూ కూర్చున్నచోట అలా ఐడియాలిస్తుంటే మేమిద్దరం కష్టపడుతుంటాం’ అంటారు రేఖ నవ్వుతూ. వ్యత్యాసాలు ఒక్కటయ్యేదెప్పుడు? ‘పిల్లల విషయంలో’ ఏకకంఠంతో ఇద్దరూ. ‘పిల్లల పెంపకంలో మా ఇద్దరి ఆలోచనలు, అనుసరణలు ఒకేరకంగా ఉంటాయి. వాళ్లతో గడిపే సమయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వం’ అంటారిద్దరూ. ప్రశాంత్, రేఖ.. పేజ్ త్రీ కపుల్. ‘ఫ్రెండ్ సర్కిల్‌కి సంబంధించీ ఇద్దరం ఒకేలా ఉంటాం. తొందరగా కొత్తవాళ్లతో క్లోజ్ అయిపోం.నచ్చినవాళ్లు తక్కువమందే. వాళ్లతోనే చాలా సన్నిహితంగా ఉంటాం. గెట్ టు గెదర్స్ కూడా మాకు చాలా వాల్యుబుల్. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం’ అని చెప్తారు ప్రశాంత్. లవ్లీ జర్నీ.. ‘తప్పొప్పులు, భిన్నాభిప్రాయాలు ఏ జంటకైనా సాధారణం. అయితే అవి ఆర్గ్యుమెంట్స్‌గా కాక డిస్కషన్స్గా ఉంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మా మధ్య డిస్కషన్సే ఎక్కువ’ అని రేఖ అంటారు. ‘తప్పయినప్పుడు సారీ చెప్పడాలు ఉండవ్. ఆ తప్పును సరిదిద్దుకొని ఇంకోసారి అలాంటిది రిపీట్ చేయకుండా చూసుకుంటాం. అంతే!’ ప్రశాంత్ మాట.‘సరిదిద్దుకున్నామంటేనే ఈ తప్పును అడ్మిట్ చేసుకున్నట్టే కదా’ రేఖ సమర్థింపు. ‘కాలం గడుస్తున్నాకొద్దీ ఇండివిడ్యువల్‌గా ఇద్దరం పరిణతి చెందుతూనే ఉంటాం కదా. ఒకరి మెచ్యూరిటీ ఒకరికి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది’ ఉభయుల కామెంట్. ‘ఏమైనా ఇట్స్ ఎ లవ్లీ జర్నీ’ అంటూ ఈ సంభాషణకు అందమైన ముగింపునిచ్చారు ఇద్దరూ!. -
లవ్ Heart
సుందర్, కరుణ నువ్వు-నేను YOU AND I Every woman deserves a man who loves and respects her. And every man deserves a woman who appreciates his efforts. అంటారు. వెల్‌నోన్ ఆర్టిస్ట్‌లు సుక్క కరుణ, సుక్క సుందర్ కూడా అలాంటి జంటే! అతను ఆమెను ఎంత ఇష్టపడతాడో అంతగా గౌరవిస్తాడు. ఆమె.. అతని విజయం కన్నా ప్రయత్నాన్ని విశ్వసిస్తుంది.. ప్రశంసిస్తుంది! ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం! వీళ్ల లవ్.. ఫస్ట్ సైట్లో స్టార్ట్ కాలేదు.. మరెప్పుడు? ఎలా? అసలు మీ కథ చెప్పండి అని అడిగితే.. ఇలా మొదలైంది వాళ్ల సంభాషణ.. ..:: సరస్వతి రమ ‘తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్ఏ క్లాస్‌మేట్స్‌మి. మొదటి రెండేళ్లు మా మధ్య ఇంటరాక్షనే లేదు. ఫస్ట్ ఐ యూస్డ్ టు హేట్ హిమ్. చదువు పక్కన పెట్టి సోషల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేవాడు. అందుకే నచ్చేది కాదు. అదీగాక నేను చాలా రిజిడ్‌గా ఉండేదాన్ని. దేనికోసం యూనివర్సిటీకి వచ్చామో అది చూసుకొని పోయేదాన్ని’ చెప్పింది కరుణ. ‘ఆమెకు క్వయిట్ అపోజిట్ నేను. అందరితో కలివిడిగా ఉండేవాడిని. మా క్లాస్‌లో అమ్మాయిలు ఉన్నదే ఏడుగురు. కరుణ తప్ప ఆరుగురూ నాతో క్లోజ్‌గా మాట్లాడేవారు. తను ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి నేనూ దూరంగానే ఉండేవాడిని. కాకపోతే గమనించే వాన్ని’ తన వెర్షన్ చెప్పాడు సుందర్. ఎన్నో సైట్‌కి లవ్ ఏర్పడింది మరి? ‘థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు భోపాల్‌లో ప్రింట్ బైనాలే ఎగ్జిబిషన్‌కి వెళ్లాం అందరం. అక్కడ మిగిలిన వాళ్లంతా అసలు ఎగ్జిబిషన్ వదిలిపెట్టి మిగిలిన ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. నేను, సుందర్ ఇద్దరమే చాలా సీరియస్‌గా ఎగ్జిబిషన్ అంతా తిరిగాం. ఆ టైమ్‌లో ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడే సుందర్‌ను దగ్గరగా గమనించే, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడే అతని లీడర్షిప్ క్వాలిటీస్‌పై రెస్పెక్ట్ పెరిగింది. తెలుగు యూనివర్సిటీ ఓ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈయన ఇనీషియేషన్ తీసుకున్న తీరు, సమస్యను సాల్వ్ చేసిన వైనమూ గుర్తొచ్చింది. అప్పటి నుంచి సుందర్‌ను చూసే నా దృష్టి మారింది. అలా స్లో అండ్ స్టడీగా సాగిన మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగే కాదు ఎవర్ చార్మ్ కూడా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది కరుణ. ‘బీఎఫ్ఏ తర్వాత ఎమ్ఎఫ్ఏ కూడా కలిసి చదివాం. ఎమ్ఎఫ్ఏ తర్వాత తను బరోడా వెళ్లింది. నేను ఇక్కడే చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో జాయిన్ అయ్యాను’ సుందర్ అంటుంటే ‘నేను బరోడా వెళ్లడం వల్లే సుందర్‌ను మ్యారేజ్ చేసుకోగలిగాను. అంతకంటే ముందు సుందర్ వాళ్లన్నయ్య పెళ్లికని వాళ్లూరు వెళ్లాను. అక్కడ సుందర్ వాళ్ల ఫ్యామిలీ, సిట్యుయేషన్ చూసినప్పుడు అనిపించింది.. సుందర్‌కి నా తోడు తప్పకుండా కావాలని. బహుశా అప్పుడే అతని మీద ప్రేమ మొదలై ఉండాలి. బరోడా వెళ్లాక అక్కడి ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవడం, వాళ్ల కంపానియన్‌షిప్ చూశాక నేనూ ఆర్టిస్ట్‌నే పెళ్లిచేసుకుంటే కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండూ డిస్టర్బ్ కాకుండా ఉంటాయనిపించింది. ఆ నిర్ణయానికి రాగానే సుందరే గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ప్రేమ విషయాన్ని, పెళ్లి ప్రపోజల్‌ని కూడా’ కరుణ. ‘కానీ నేనిప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు తనకు’ పక్కనుంచి సుందర్. ‘అదే నా కంప్లయింట్’ చిరుకోపంతో కరుణ. ‘నిజానికి నేనే ముందు ప్రేమలో పడ్డాను తనతో. చెప్పడానికి నేను భయపడ్డాను. తను చెప్పి బయటపడింది. అలా 2009లో మా ప్రేమకు పెళ్లి రూపమిచ్చింది’ అన్నాడు కరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ! కెరీర్లో సహకారం.. కుటుంబంలో సగం బాధ్యత ‘కరుణది థియరిటికల్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ రెండిటినీ కలిపి కలిసి పనిచేస్తాం’ అని సుందర్ అంటుంటే ‘సుందర్‌కి కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. నా ఐడియాను తనతో షేర్ చేస్తే తను దానికి కలర్ కాంబినేషన్ చెప్తాడు’ భర్తకి కరుణ కితాబు. ‘తను హైదరాబాదీ. పెద్ద ఆర్టిస్ట్ (శ్రీహరి భోలేకర్) కూతురు. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంది. ఆమెకున్న ఈ ప్లస్లన్నీ నాలో మైనస్‌లు. పల్లెటూరి నేపథ్యం. వానాకాలం చదువు. ఇంగ్లిష్‌కి దూరం. ఇంగ్లిష్‌లో ఉన్న ఆర్ట్ బుక్స్ బాగా చదువుతుంది. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంగ్లిష్ మీద నేను పట్టు సాధించేందుకు హెల్ప్ చేస్తుంది’అంటూ భార్య సహచర్యం తన మైనస్‌లు ప్లస్ అయిన తీరును వివరించాడు సుందర్. ‘నేను ఇంటి పనుల్లో పూర్. మాకు రెండున్నరేళ్ల కూతురుంది. నా పీహెచ్డీ, ఆర్ట్ వర్క్ ఇవన్నిటితో పాపను చూసుకోవడం కుదరదు. ఆ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ సుందర్ బలవంతం వల్లే పీహెచ్డీ చేస్తున్నాను’అంటూ కుటుంబ నిర్వహణలో భర్త మోస్తున్న సగం బాధ్యతను చెప్పింది కరుణ. ‘చాలామంది ‘నువ్వూ పీహెచ్డీ చేయొచ్చుకదా..’ అని సలహాలిచ్చారు. ఎవరు ఎందులో పర్ఫెక్టో వాళ్లు ఆ పనిచేస్తే బాగుంటుంది. తనకు పీహెచ్డీ అంటే ఇంట్రెస్ట్ అందుకే ప్రోత్సహించాను. ఆమె అందులో బిజీ కాబట్టి ఇల్లు, పాప బాధ్యతను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. నేను హౌజ్ హజ్బెండ్‌నని గర్వంగా చెప్తాను’ అన్నాడు సహచరుడు అన్న పదానికి అసలైన నిర్వచనంలా! పెళ్లాయ్యాక ఒకరికోసం ఒకరు మార్చుకున్న పద్ధతులు? ‘ఆయన సోషల్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకున్నాడు. నా పట్ల హెల్పింగ్ నేచర్ పెరిగింది. నాకేం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేదాకా నిద్రపోడు. నాకేమాత్రం ఇన్‌కన్వీనియెంట్ లేకుండా చూసుకుంటాడు’ మురిపెంగా కరుణ. ‘పెళ్లికి ముందు రిజిడ్‌గా, సెల్ఫిష్‌గా ఉండేదా.. ఇప్పుడు చాలా కలివిడిగా... లిబరల్గా మారింది. తనలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు తన ఫెలోషిప్ డబ్బులే మాకు ఆధారం. ఇంత కో ఆపరేట్ చేస్తుందని అనుకోలేదు’ సంబంరంగా చెప్పాడు సుందర్. ‘క్రెడిట్ అంతా తనదే’ కరుణ. ‘వర్క్ విషయంలో నా బెస్ట్ క్రిటిక్ తనే. నేను, నువ్వు అనే భావన ఉండదు మనమనే ఫీలే. అందుకే ఎవరికి బయటి నుంచి అప్రిసియేషన్స్ వచ్చినా ఇద్దరం హ్యాపీగా ఫీలవుతాం. నో జెలసీ’ సుందర్. ‘తను ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేస్తాడు. ఇండివిడ్యువల్ సక్సెస్కన్నా మా ఇద్దరి సక్సెస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు’ కరుణ. ‘అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమైన ప్రతిభ చూపలేరు. ఒకరు విజయం కోసం పోరాడుతున్నప్పుడు ఇంకొకరు అండగా నిలబడాలి’ అని సుందర్ అంటుంటే ‘మేం అదే ఫాలో అవుతున్నాం. ఒకరి ఎబిలిటీని ఇంకొకరం నిజాయితీ ఒప్పుకుంటాం. గౌరవిస్తాం. నమ్ముతాం’ అంటూ చెప్పింది కరుణ. ప్రేమలో పడడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటారు. అలా తమ ప్రేమను నిలబెట్టుకుందీ జంట! -
లవ్ కిచిడి
నువ్వు-నేను - శైలేష్ నారాయణ్, సూర్య అగర్వాల్ YOU AND I "I believe that marriage is not between a man and woman... but between love and love' అంటాడు ఫ్రాంక్ ఓషన్. ‘సోషల్ కిచిడి’ అనే మార్కెటింగ్ సంస్థను నడిపిస్తున్న .. శైలేష్ నారాయణ్, సూర్య అగర్వాల్‌ల పెళ్లి కూడా అలాంటిది. రెండు ప్రేమలు సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో మూడేళ్ల వీళ్ల వైవాహిక జీవితమూ అలాగే ఉంటుంది! శైలేష్‌ది ఉద్యోగ కుటుంబం.. సూర్య వాళ్లది వ్యాపార కుటుంబం. శైలేష్ ఎంబీఏ చేస్తే.. ఆమె మాస్ కమ్యూనికేషన్ చదివింది. ఆయన పక్కా హైదరాబాదీ. సూర్య.. లక్నో వాసి. తొలుత ఆమె జర్నలిస్ట్ హిందుస్థాన్ టైమ్స్‌లో. శైలేష్ అడ్వర్టయిజింగ్ ఫీల్డ్‌లో ఉన్నాడు. ప్రేమ వివాహం. కలిసింది ఎక్కడ? ఉన్నత చదువుల కోసం ఇద్దరూ యూకే వెళ్లారు. ఒకటే యూనివర్సిటీ. అక్కడ ఇద్దరికీ పరిచయం. అది కాస్తా ప్రణయంగా.. ఆపై పరిణయంగా మారింది. ఆ వివరాలను చెప్తూ శైలేష్ ‘యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి అభిమానం. కలిసి జీవిస్తే బాగుంటుందనుకున్నాం. పీజీ అయిపోయాక తను లక్నో వెళ్లిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేశాను. అప్పుడే మా ఇద్దరికీ ఓ పొలిటికల్ ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం వచ్చింది. అదీ లక్నోలో’ అని ఆపాడు. ‘ఆ టైమ్‌లో మా ఇద్దరి మధ్య మరింత అండర్స్టాండింగ్ పెరిగింది. తర్వాత పెళ్లితో ఒకటయ్యాం’ పూర్తిచేసింది సూర్య. భేదాలే అద్భుతాలు సృష్టిస్తాయి.. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇద్దరివీ ఒకే రకమైన అభిరుచులైనా.. వృత్తిపరంగా బోలెడు వ్యత్యాసం ఉంది. ‘ఆ డిఫరెన్సే మా నుంచి బెస్ట్ ఔట్‌పుట్‌ని రాబడుతోంది. తను చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది. అడ్మిన్‌స్ట్రేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి’ అని భార్యకు కితాబిస్తూనే ‘కాని బయట మార్కెట్ ఎలా ఉన్నదన్న విషయాన్ని గమనించదు’అంటూ సూర్య చూడని యాంగిల్‌నూ చెప్తాడు. ‘నిజమే. శైలేష్ మార్కెటింగ్ స్కిల్స్ సూపర్బ్. నేను ఒకటే యాంగిల్లో ఆలోచిస్తుంటే ఆ అంశానికున్న మిగిలిన డెమైన్షన్స్నూ చూపిస్తాడు. కాబట్టే ‘సోషల్ కిచిడీ’ బ్రహ్మాండంగా రన్ అవుతోంది’ సూర్య. అభిప్రాయభేదాలు తారస్థాయికి చేరవా? ‘ఎందుకు చేరవు. ఒక్కోసారి చాలా సీరియస్‌గా ఉంటాయి’ అని అతను చెప్తుంటే ‘అయితే అవి డిస్కషన్స్గానే ఉంటాయి తప్ప ఆర్గ్యుమెంట్స్‌గా మారవు. చర్చించి ఇద్దరికీ కాస్త దగ్గరగా ఉన్న ఒక పాయింట్ కన్విన్స్ అయిపోతాం. ఆ కామన్ పాయింట్‌నే ఫోకస్ చేస్తాం. బ్రహ్మాండమైన రిజల్ట్స్నిస్తుంది. ఒకే అభిప్రాయంతో ఉంటే ఇలాంటి అద్భుతాలు రావేమో!’ అంది సూర్య. ‘అసలామాటకొస్తే భార్యాభర్తలైన మేమిద్దరం పార్ట్‌నర్స్‌గా ఉండడమే సోషల్ కిచిడీ సక్సెస్. మా ఇద్దరి మధ్య వచ్చిన బిజినెస్ డిఫరెన్సెస్ బయటి బిజినెస్ పార్ట్నర్తో వచ్చుంటే ఇది క్లోజ్ అయిపోయేదేమో’ అన్నాడు శైలేష్. ‘ఈ లెక్కన మా మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టే!’ అంది సూర్య నవ్వుతూ. బలము.. బలహీనత ‘అలా కచ్చితంగా పరిశీలించుకోలేదు మేం. పరిస్థితులకనుగుణంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించుకుంటాం. దానికి తగ్గ సర్దుబాటు ఉంటుంది’ అంటారు సూర్య. ‘మేమిద్దరం వేరనే భావన ఉండదు. ఒకరు ఒక విషయంలో వీక్ ఉంటే ఆటోమేటిగ్గా అవతలివాళ్లు దాన్ని స్ట్రెంతెన్ చేసేస్తారు. ఏ ప్రతికూల పరిస్థితినైనా మాకు అనుకూలంగా మలచుకునే శక్తి మా ఇద్దరికీ ఉంది’ అంటాడు శైలేష్. ‘కాకపోతే కోపం లాంటి ఎమోషన్స్ నాకే ఎక్కువ’ నిజాయితీగా ఒప్పుకుంది సూర్య. ‘ఆ టైంలో నేనూ అరిస్తే ప్రాబ్లం మరింత కాంప్లికేట్ అవుతుంది కదా. అందుకే ఓపికగా ఉంటాను. అయితే తన కోపం పాలమీది పొంగు. చప్పున చల్లారిపోతుంది’ అంటాడు. ‘అవును. అసలు అలిగే చాన్సే ఇవ్వడు. రెండు నిమిషాలకే నవ్విస్తాడు. ఏ విషయం మీద అలగాలనుకున్నానో, కోపం ఎందుకు వచ్చిందో కూడా మరచిపోతా’నని చెప్తుంది ఆమె. మూడేళ్లలో మొదటి అడుగు చూసుకుంటే.. ‘మూడేళ్ల పెళ్లి, అంతకుముందు ఏడాదిన్నర స్నేహం. మొత్తం నాలుగున్నరేళ్లు. డెఫినెట్‌గా లాట్ ఆఫ్ చెంజ్ ఉంది. పెళ్లి భార్యాభర్తలను కాలంతో పరిణతి చెందేలా చేస్తుంది. ఒకరితో ఒకరు సర్దుకుపోయేలా ఇద్దరినీ తీర్చిదిద్దుతుంది’ అని వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చెప్పాడు శైలేష్. ‘మేం పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ ఆర్నెల్లు, అరేంజ్డ్ మ్యారేజ్ ఏడాది సౌఖ్యంగా ఉంటుంది అని కామెంట్ చేశారు. మమ్మల్ని చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’ అంటుంది సూర్య. కుటుంబ వారసత్వానికి భిన్నంగా వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవాలనేది శైలేష్ ప్రయత్నం. అండగా నిలబడింది ఆమె. రాజకీయవేత్త కావాలనేది ఆమె కోరిక. నెరవేర్చే దిశలో ప్రయాణిస్తున్నాడు శైలేష్. అతడు ఆమె సైన్యం... ఆమె అతడి ధైర్యం! ఇదీ వాళ్ల అనుబంధం!. - సరస్వతి రమ -
ప్రేమ జీవన రాగం
నువ్వు-నేను - డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు, డాక్టర్ శశిప్రభ అనురాగం, ఆత్మీయత, ప్రేమల కలబోత ఆ కాపురం. భార్యాభర్తల అన్యోన్యతకు నిలువెత్తు నిదర్శనం ఆ సంసారం.. బిజీగా ఉండే వైద్య వృత్తిలోనే ఇద్దరూ ఉన్నా..జీవన రథాన్ని సేవాపథంలో నాలుగున్నర దశాబ్దాలుగా నడిపిస్తున్న ప్రేమైకమూర్తులు వారు. భేషజాలకు తావు లేని మమకారం, కష్ట సుఖాలలో ఒకే రకంగా స్పందించే స్థితప్రజ్ఞత. మనుషులు కాదు మనసులు కలవాలనే స్వచ్ఛమైన భావన.. ఇవన్నీ కలిస్తే డాక్టర్ దంపతులు సుంకర వెంకట ఆదినారాయణరావు, శశిప్రభ. వారి అనుబంధమే ఈ వారం యూ అండ్ ఐ .. ‘ఒక చేతికి ఉన్న వేళ్లు ఎలా కలిసి ఉండవో అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకుని సాగించే ప్రయాణమే దాంపత్యజీవనం’ అంటారు శశిప్రభ. ‘భార్యాభర్తలన్నాక కోపతాపాలు సహజం. పొద్దున్న పోట్లాడుకున్నా సాయంత్రానికి కలిసిపోయేలా ఉండాలి’ అంటారు ఆదినారాయణ. తమ 44 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవనంలో ఎన్నో మధుర స్మృతులున్నా తమ తొలిపరిచయం చెదిరిపోని జ్ఞాపకమన్నారు ఆదినారాయణ. ‘నేను అప్పట్లో ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తూండేవాడిని. శశిప్రభ మా జూనియర్. ఒకరోజు నా మిత్రులు శశిప్రభను, ఆమె స్నేహితురాలిని ర్యాగింగ్ చేస్తున్నారు. వారడిగిన అన్ని ప్రశ్నలకు శశిప్రభ చాలా పొలైట్‌గా సమాధానం చెప్పడంతో ఆమెను ఏమీ అనకుండా పంపించేశారు. ఆమె వెళ్లిన తరువాత నా స్నేహితుడు ‘నాకు అక్కచెల్లెళ్లు లేరు..నేను ఆమెను నా సిస్టర్లా భావిస్తున్నా’ అన్నాడు. ‘నాకు నలుగురు సిస్టర్స్ ఉన్నారు. ఆమె అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను’ అన్నాను. తర్వాత ఆ సంగతి మర్చిపోయాను. నా చదువైన తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో ఈ సంబంధం ప్రస్తావన వచ్చింది. అమ్మాయి పేరు శశిప్రభ అని చెప్పారు. ఆ శశిప్రభే ఈమె అని తెలియడంతో అంగీకరించాను’ అని చెప్పారు ఆదినారాయణ. ‘డాక్టర్ బాలపరమేశ్వరరావుగారు ఆదినారాయణగారి అన్నగారు. మా కాలేజ్‌లో ప్రొఫెసర్. అప్పట్లో అమ్మాయిలకు ఆయనంటే ఆరాధనాభావం ఉండేది. ఆయన సోదరుడే పెళ్లికొడుకని చెప్పడంతో నేను ఒప్పుకున్నాను. అలా 1970లో మా వివాహమైంది చెప్పారు శశిప్రభ. అప్పటికి నేను ఎండీ చేస్తున్నాను. అత్తగారు లేరు. మామగారు కూడా మా ఇంట్లో ఉండేవారు కాదు అందువల్ల నాకు అత్తగారిల్లనే భావం ప్రత్యేకంగా ఏమీ కలగలేదు. నా చదువుకు, తరువాత వృత్తికి ఆటంకం కలగకుండా మా అమ్మ పిల్లలను చూసుకునేవారు. వాళ్ల సహకారం వల్లే ఆర్థోపెడిక్ సర్జన్‌గా ఆయన, గైనకాలజిస్ట్‌గా నేను సక్సెస్ కాగలిగాం అన్నారు. ‘పిల్లల విషయం నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అప్పటికే నేను పోలియో క్యాంప్స్ పెట్టేవాడిని. పిల్లల చదువులు, ప్రోగ్రెస్, ఇంటి వ్యవహారాలు ఆమె చూసుకోవడం వల్లే నేను 3 లక్షల మంది పోలియో పేషెంట్స్‌కు 10 లక్షల ఆపరేషన్లు చేయగలిగాను అని చెప్పారు ఆదినారాయణ. అమ్మాయి శేష్‌కమల్ ఇన్ఫెర్టిలిటీలో సూపర్‌స్పెషాలిటీ చేసి లండన్‌లో స్థిరపడింది. అబ్బాయి శశికిరణ్కు మేనేజ్మెంట్లో ఇంట్రస్ట్ ఉండడంతో అహ్మదాబాద్ ఐఐఎంలో చదివాడు. తనిప్పుడు ముంబయి మెకన్సీ కంపెనీలో పార్టనర్ . ఇద్దరం కలిసే తినాలి ‘మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇప్పటివరకు రోజూ లంచ్ ఇద్దరం కలిసే చేస్తాం. రెండైనా, మూడైనా అంతే. ఒకరు అర్జెంట్ కేస్ అటెండ్ అయినా వచ్చేవరకూ ఉండి అప్పుడు తింటాం. ఇప్పటికీ అంతే. ఇంట్లో కూడా మా సంభాషణంతా చాలావరకు హాస్పిటల్, కేసుల చుట్టూనే తిరుగుతుంది. ప్రత్యేకమైన కేసుల గురించి, క్రిటికల్ కండిషన్లో తీసుకునే జాగ్రత్తల గురించి ఇద్దరం చర్చించుకుంటాం’ చెప్పారు శశిప్రభ. డాక్టరు వృత్తి అంటేనే బిజీ జీవితం. ఇద్దరం డాక్టర్లే కావడం వల్ల కొంత పర్సనల్ లైఫ్ మిస్ అవడం సహజమే. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకు వచ్చే గుర్తింపు, రోగులు మమ్మల్ని గుర్తుంచుకోవడం, ఫలానా బిడ్డ మీ చలవ వల్లే తిరగగలుగుతున్నాడని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. దానిముందు మేం కోల్పోయింది చాలా తక్కువ అనిపిస్తుంది’ అన్నారు ఆదినారాయణ. అవ్యాజమైన అనురాగం ఆయన అంతా సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. నలుగురికీ సహాయపడాలనే తత్వం. అది నాకు బాగా నచ్చుతుంది. డబ్బు ముఖ్యం కాదు నలుగురు మంచిగా చెప్పుకోవడం ప్రధానం. పదుగురికీ సేవ చేయడమే మనం చేయగలిగింది అంటారు. ఆయన తొందరగా అందరినీ నమ్మేస్తారు. అలా ఎన్నో సందర్భాల్లో మోసపోయారు. తర్వాత బాధపడీ ప్రయోజనం ఉండదు కదా అని ఆందోళన వ్యక్తం చేస్తారు శశిప్రభ. ‘అర్ధరాత్రి ఫోన్ వచ్చినా అంతే కమిట్మెంట్తో అటెండ్ అవుతుంది. చాలా సిస్టమేటిక్‌గా ఉంటుంది. నేను సంపాదించింది ఏమీ లేకపోయినా అన్ని విషయాల్లోనూ నాకు తోడూనీడగా ఉంది. తన సహకారం లేకపోతే మా ప్రయాణం ఇంత సాఫీగా నడిచేది కాదు అని తన శ్రీమతి గురించి చెబుతారు ఆదినారాయణ. రాణీ చంద్రమణీదేవి హాస్పిటల్లో సూపరింటెండెంట్‌గా రిటైరైన ఆదినారాయణరావు, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్‌గా రిటైరైన శశిప్రభ ఇప్పటికీ అదే ఉత్సాహంతో, సేవాభావంతో ఉన్నారు. శుభం ప్రేమ హాస్పిటల్ డెరైక్టర్ జనరల్‌గా ఆదినారాయణరావు, అదే ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా శశిప్రభ విధి నిర్వహణలో అంతే అంకితభావంతో చేస్తున్నారు. రాజేశ్వరి ఫొటో : శ్రీనివాస్ ఆకుల