మనసు చేసిన మోసం
యాకూబ్, శిలాలోలిత - నువ్వు-నేను
The goal of marriage is not to think alike, but to think together.. అంటాడు రాబర్ట్ డాడ్స్! కవి యాకూబ్, కవయిత్రి శిలాలోలిత అలాంటి జంటే! ఇద్దరి కుటుంబ నేపథ్యాల నుంచి వాళ్ల ఆలోచనా విధానం దాకా అన్నిట్లో వ్యత్యాసమే! అయినా అన్యోన్యత అనే లక్షణాన్ని వీడలేదు వాళ్ల కాపురం!
..:: సరస్వతి రమ
కాంచ్ కభీ ఝూట్ నహీ బోల్తా.. ఔర్ పర్‌ఛాయా కభీ సాథ్ నహీ ఛోడ్తీ అన్నట్టుగా అంతరాలను సరిదిద్దుకునేటప్పుడు ఈ ఇద్దరు ఒకరికొకరు ప్రతిబింబంలా ఉంటారు. క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు నీడలా తోడవుతారు! వాళ్ల పాతికేళ్ల పెళ్లి ప్రయాణంలో ఆ ఆలుమొగల మధ్య ఏర్పడిన అవగాహన అది. మూడుముళ్లు, ఏడు అడుగుల ఈ కథ ఎలా మొదలైందంటే..
మసాబ్‌ట్యాంక్ తెలుగు పండిత్ ట్రైనింగ్ క్లాసెస్‌లో..
‘మా క్లాస్‌లో అరవై మంది అమ్మాయిల్లో.. లక్ష్మే.. అంటే ఎవరో కాదు ఈమే. హుందాగా, గంభీరంగా ఉండేది. లెక్చరర్స్ కూడా తనని లక్ష్మిగారూ.. అని పిలిచేవారు. నేనూ గౌరవంగా చూసేవాడిని’ అని తన ప్రేమ పరిచయాన్ని యాకూబ్ ప్రస్తావించారు. ‘నాకూ యాకూబ్ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. చక్కగా పాటలు పాడేవాడు. ఎంత బాధ ఉన్నా మనసులోనే పెట్టుకొని అందరితో సరదాగా ఉండేవాడు’ శిలాలోలిత అంటుంటే ‘తను బాధ అంది కదా.. అది ఆకలి బాధ.. తన కోసం తెచ్చుకున్న లంచ్ బాక్స్‌ని నాకు ఇచ్చేది’ పూర్తి చేశారు ఆయన. చిరునవ్వుతో సరిపెట్టారు ఆమె. ‘తనతో పాటు అప్పుడప్పుడు సాందీప్ అనే నాలుగేళ్ల పిల్లాడిని కాలేజ్‌కి తెస్తుండేది. వాడితో కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఎంతలా అంటే వాడి కోసమే ఈమెతో మాటలు కలిపేంతగా’ చెప్పారు యాకూబ్.
ప్రేమను బయటపెట్టుకున్నదెప్పుడు?
‘కొన్నాళ్లు పాటలు ఇచ్చి లంచ్‌బాక్స్‌లు పుచ్చుకునే వ్యవహారం నడుస్తుండగా.. ఒకరోజు ‘మీతో ఒక విషయం మాట్లాడాలి రేపు చాచానెహ్రూ పార్క్‌కి రండి’ అని చెప్పి వెళ్లిపోయింది. మనసులో నాకు ఒకటే గుబులు. నాకు తెలిసీ నేనేం అనలేదు. మర్యాదగా ప్రవర్తించాను. ఏం మాట్లాడుతుందో ఏమో సరే వెళ్లనయితే వెళ్దాం’ అని డిసైడ్ అయిపోయా’ చెప్పారు యాకూబ్.
మనసు చేసిన మోసం
‘తెల్లవారి పార్క్‌లో కలుసుకున్నాం’ యాకూబ్. ఏం చెప్పారు అన్న ప్రశ్నకు ‘నా మనసులో ఉన్నదంతా చెప్పాను’ ముక్తసరిగానే అన్నారు శిలాలోలిత. మనసులో ఏం ఉండింది అని రెట్టిస్తే ‘నన్ను మీరు ఇష్టపడుతున్నారల్లే ఉంది. కానీ అది కుదరదు. నాకు పదకొండో ఏటే పెళ్లయింది. ఓ బాబు పుట్టాక విడాకులు కూడా అయ్యాయి. అప్పుడప్పుడూ నా వెంట వచ్చే సాందీప్ నా కొడుకే. కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాంటి ఆలోచన ఉంటే మరచిపోండి’ అని చెప్పాను. ‘ఆ మాటలు విని ముందు ఆశ్చర్యపోయా. తన గతం విని కాదు. తనకు నాపై అలాంటి అపోహ ఏర్పడ్డందుకు. లక్ష్మిగారు.. మీపై నాకలాంటి ఉద్దేశం లేదు. మీకలా అనిపిస్తే సారీ’ అన్నాను’’ యాకూబ్ చెప్తుంటే ‘అందుకే దాన్ని మనసు చేసిన మోసం అంటాను’ అన్నారు శిలాలోలిత. ‘కానీ ఆ రోజు నుంచి లక్ష్మి మీద మరింత గౌరవం పెరిగింది. తను నాకన్నా ఆరేళ్లు పెద్ద. ఆమె వ్యక్తిత్వం ముందు ఆ బేధాలన్నీ బలాదూరయ్యాయి. సాందీప్‌కి నాకూ మధ్య అనుబంధమూ బలపడటం మొదలైంది. బహుశా అది ప్రేమ కావచ్చు’ యాకూబ్. ‘కానీ, టీపీటీ ట్రైనింగ్ అయిపోయే వరకూ బయటపడలేదు. ఎంఫిల్‌కి ఇద్దరం రాజమండ్రి వెళ్లాం. అక్కడ గోదావరి తీరం, సాహిత్య పరిచయాలు, కవి సమ్మేళనాలు.. మమ్మల్ని మరింత దగ్గర చేశాయి. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి తెచ్చాయ్’ శిలాలోలిత.
పెళ్లికి పెద్దల అంగీకారం?
‘నేను కేఎల్, దుర్గమ్మ దంపతులకు ఒకరకంగా దత్తపుత్రుడిని. నా మంచిచెడ్డలన్నీ వాళ్లే చూశారు. ఈమెతో పెళ్లికూడా దుర్గమ్మ గారి అంగీకారంతోనే జరిగింది’ అని యాకూబ్ చెప్తుంటే ‘తను ముస్లిం అని మా నాన్న అభ్యంతరపెట్టారు. ‘మొదటి పెళ్లి మీ ఇష్టప్రకారం చేశారు. ఏమైంది? అందుకే ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని చేసుకోనివ్వండి’ అని కాస్త కఠినంగానే చెప్పాను. ఒప్పుకున్నారు’ అని గతం గుర్తుచేసుకున్నారు ఆమె. ‘పెళ్లయ్యాక కాపురానికి వస్తుంటే వీళ్ల నాన్న సాందీప్ మాతోనే ఉంటాడు’ అన్నాడు. వీల్లేదు. మాతో ఉండాల్సిందే’ అన్నాను. నిజానికి నేను ఈవిడను పెళ్లాడింది వాడికోసమే’ చెప్పారు యాకూబ్.
మరి పెళ్లితర్వాత గొడవలు, అలకలు..?
‘మాదంతా బాధ్యతల పంపకమే. గొడవలు, అలకలు అంతగా లేవు’యాకూబ్. సాందీప్ విషయంలో ఆయన కర్తవ్యాన్ని ఎలా మరిచిపోలేదో.. యాకూబ్ వాళ్లింటి విషయంలో నా బాధ్యతనూ నేను మరచిపోలేదు. చాన్నాళ్లు ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలే. నాలుగు నాలుగు కాలేజీల్లో పాఠాలు చెప్పేవాళ్లం. ఇంట్లో మాతోపాటు ఆరుగురు పిల్లలు (వాళ్లన్నయ్య పిల్లల్నీ ఇక్కడకు తెచ్చేసుకున్నాం చదువుల కోసం).. మా శక్తికి మించి బాధ్యతలను మోసినా నేనెప్పుడూ మానసిక వ్యథను అనుభవించలేదు. యాకూబ్ నా పక్కనున్నాడన్న ధైర్యం నాది’ అని ఆమె, ‘లక్ష్మి నాకు తోడుందన్న గర్వం నాకుండేది’ ముగించారు యాకూబ్.
కల్చరల్ డిఫరెన్సెస్..
‘మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు’ అంటారిద్దరూ. ‘యాకూబ్‌కి ఇల్లు నీట్‌గా ఉండడం ఇష్టం’ అని ఆమె అంటుంటే ‘హౌస్ కీపింగ్‌లో ఆమె వీక్. నేను స్ట్రాంగ్’ అని ఆయన. ‘యాకూబ్ అందరినీ ఇట్టే నమ్మేస్తాడు’ అని అతని బలహీనత చెప్పారామె. ‘అర్హులకే సహాయం చేయాలంటుంది ఆమె’ అంటూ తన బలహీనతను సర్దిచెప్పుకున్నారు ఆయన.
కవిత్వంలో విమర్శలు..
‘పెద్ద వ్యాక్యాలు రాస్తుంది’ అని ఆయన, ‘అది నా శైలి’ అని ఆమె.. ‘సరిదిద్దితే.. నా రాతనే మార్చేశాక ఇది నాది ఎందుకవుతుంది నీదే’ అంటూ పడేసి వెళ్లిపోతుంది. వ్యాసాలు బాగా రాస్తుంది’ అని ఆయన ప్రశంస, ‘పాటలు అద్భుతంగా పాడ్తాడు’ అని ఆమె ప్రశంస. ‘నా తీరని కోరిక తనతో సారీ చెప్పించుకోవాలని’ అని ఆయన.. ‘నా తప్పులేంది సారీ అస్సలు చెప్పను ’ అని ఆమె.. మొత్తానికి ఇద్దరి మధ్యకు వచ్చే ఏ వాదనైనా చివరకు వాళ్ల అన్యోన్యతను చూసి తప్పుకొనైనా వెళ్తుంది లేదంటే ఇద్దరూ ఒకే మాటమీదకు వచ్చే అద్భుతమైన కన్‌క్లూజనైనా ఇస్తుంది! ఇదీ కుల మత వయసులకతీతమైన యాకూబ్, శిలాలోలితల ప్రేమబంధం!