ప్రేమంటే ఏమిటంటే..? | Is saved ..? | Sakshi
Sakshi News home page

ప్రేమంటే ఏమిటంటే..?

Published Sat, Feb 14 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

ప్రేమంటే ఏమిటంటే..?

ప్రేమంటే ఏమిటంటే..?

గులాబీ పూస్తే ఒక్క రోజుపాటు అందంగా ఉంటుంది. మరుసటి రోజు తన రూపు కోల్పోతుంది. అదే మనసులో ప్రేమ పుడితే. అది అందంగా వికసించడమే కాదు. నిత్య ప్రవాహమవుతుంది. ప్రేమ కేవలం ఇద్దరు యువతీయువకుల మధ్య పుట్టేదే కాదు. తల్లీదండ్రులు పిల్లలు... అన్నా చె ల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... ఇలా సర్వవ్యాపితమైన ప్రేమను అందరూ వ్యక్తీకరించుకోవచ్చు. కానీ ‘ప్రేమకు ఒకరోజు’ పేరుతో ఏర్పడిన వాలెంటైన్స్‌డేను ప్రేమికులే జరుపుకొంటారు. మరి ప్రేమ ఈ ఒక్క రోజుకే పరిమితమా? అసలు ప్రేమకు ఒకరోజు అవసరమా? ప్రేమ ఎలా ఉండాలి? లాంటి అంశాలతో ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని రిజెన్సీ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ,బుల్లితెర నటుడు విజయ్, దర్శకులు శేఖర్‌సూరి(ఏ ఫిలిం బై అరవింద్), రాజేష్ (నా బంగారు తల్లి), బుల్లితెర కథానాయికలు సుభాషిణి, సునీత, అనూష, లహరిక, అనిత, మైత్రిక, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రేమపై తమ భావాలను ఇలా వ్యక్తీకరించారు.
 
ప్రేమికుల దినోత్సవం అనగానే చాలామందిలో నేటికీ ఒక అపోహ ఉంది. ఇది కేవలం ప్రేమించుకొనే యువతీయువకులకు సంబంధించిన అంశమని. కానీ ఇలాంటి ఆలోచనే తప్పంటున్నారు చర్చావేదికలో పాల్గొన్న పలువురు కాలేజీ విద్యార్థులు. అది నిత్యం ప్రవహించే నది లాంటిది. ప్రేమను ఒక్క రోజుకే పరిమితం చేసుకొని ఆరోజునే ప్రేమను వ్యక్తీకరించాలనుకోవడం సబబు కాదంటున్నారు. వాలెంటైన్ డేను సమర్ధిస్తారా.. సమర్థిస్తే ఎందుకు అంటూ దర్శకులు శేఖర్‌సూరి అడిగిన ప్రశ్నకు ‘మనసిచ్చి పుచ్చుకొని మాట్లాడుకోవడం ఏ రోజైనా చేయొచ్చు.

కానీ ప్రేమికుల మధ్య ఉన్న మనస్పర్థలను, వ్యత్యాసాలను తగ్గించేందుకు ఇలాంటి ఒక రోజు అవసరం. వారి మధ్య అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. ఆ రోజున ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు’ అని స్పందించారు విద్యార్థులు. కానీ వాలెంటైన్ డే అనేది అది కేవలం ప్రేమికులకు సంబంధించినది కాదు. ప్రతి ఒక్కరూ జరుపుకొనేదంటున్నారు దర్శకులు శేఖర్‌సూరి. అయితే పార్కులకు వెళ్లి, ఐస్‌క్రీమ్‌లు తిని అటునుంచి అటు సినిమాలకు వెళ్లడం ప్రేమకాదు, ఆలోచనలను, జీవితాన్ని మార్చి, సరైన దిశలో అడుగులు వేయించే ఒక బాధ్యత అంటున్నారు సిరిల్.
 
విషం చిమ్మొద్దు..

ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. అలాంటి ఆ ప్రేమ ఫలించలేదని కొందరు ‘విషం’ చిమ్ముతుంటారు. ఇది సమంజసం కాదంటున్నారు బుల్లితెర కథానాయిక మైత్రేయి. ఇలాంటి ధోరణి మారాలి. ప్రేమ మనిషినే కాదు.. మనసును కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రేమతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు మరో కథానాయిక లహరిక. ‘ప్రేమ అనేది ఒక్కరోజుకు పరిమితమైనది కాదు.. ఇది ప్రతి రోజూ ఉండాలి. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అది ఎవరితోనైనా సరే! ప్రేమను వ్యక్తీకరించుకోవడానికి ఒక రోజు ఉండాలి. కానీ అదే ప్రేమకు కొలమానంగా ఉండకూడదు’ అని అంటున్నారు దర్శకుడు రాజేష్. ‘అన్ని రోజులు ఒకేలా ఉంటే బాగుండదు. అదే ఒక రోజంటూ ఉంటే.. ఆ రోజు కోసం సంవత్సర కాలం ఎదురుచూస్తారు. ప్రేమించిన వారు తమ ప్రేమను వ్యక్తీకరిస్తూ ఇచ్చే అందమైన అనుభూతిని కలకాలం గుండెల్లో దాచుకుంటారు’ అని అభిప్రాయపడుతున్నారు సునీత.
 
జీవితాంతం...

చాలా మంది ప్రేమికుల రోజును గుర్తుంచుకుంటున్నారు కాని అంతకుముందు రోజైన ఫిబ్రవరి 13 భగత్‌సింగ్ చనిపోయిన రోజు. అలాంటి రోజును గుర్తుపెట్టుకోవడం లేదు. విదేశీ సంస్కృతిని ఇంతలా పాటిస్తున్న మనం... మన దేశంకోసం త్యాగం చేసిన వ్యక్తిని మరుస్తున్నాం. ఇలాంటివారిని గుర్తు పెట్టుకున్ననాడే మన దేశంపై, మనం ఇష్టపడే వారిపై ప్రేమను చూపగలమని అభిప్రాయ పడ్డారు నటి సుభాషిణి. ఈ వాలెంటైన్స్ డేనాడు ఒకరితో, వచ్చే వాలెంటైన్స్‌డేకు మరొకరితో.. ఇప్పుడు కొందరి ప్రేమ పరిస్థితి ఇది. కానీ ప్రేమ అంటే ఇద్దరు, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం నడిచే బాట. తప్పటడుగులను సైతం సరిచేసుకొని ముందుకెళ్లాలన్నారు నటుడు విజయ్.

- పి.నరసింహారెడ్డి, బంజారాహిల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement