స్వచ్ఛమేవ జయతే
స్వచ్ఛభారత్.. ఇప్పుడు ఊపు మీదున్న క్యాంపెయిన్! ఈ ప్రచారానికి మద్దతు తెలుపుతూ చీపుర్లు పట్టుకున్న సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారో.. అసలైన స్వచ్ఛ భారత్ అంటే ఏంటో అర్థం చెప్పడానికి కుంచెలు పట్టుకున్న ఆర్టిస్టులూ అంతేమంది ఉన్నారు! వాళ్లలో ఈ వాల్ మీద గ్రాఫిటీని ఆవిష్కరించిన స్వాతి, విజయ్ అనే కళాకారుల జంటా ఉంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ప్రాంతం.. ఫిలింనగర్ దర్గా దగ్గర్లోని ఓ గోడ. పార్లమెంట్ భవనం.. దాని ముందు ఝాడు పట్టుకుని ఓ యువకుడు.. ఈ బొమ్మను ఆ జంట సోమవారం అర్ధరాత్రి మొదలు పెట్టి మంగళవారం మధ్యాహ్నానికల్లా పూర్తిచేశారు. ‘స్వచ్ఛభారత్ మొదలవ్వాల్సింది ఎక్కడెక్కడి రోడ్ల మీద నుంచో కాదు. ప్రజాప్రతినిధుల కుళ్లు రాజకీయాలతో నిండిపోయిన వ్యవస్థ నుంచే. ఆ కంపును ప్రక్షాళన చేయాల్సిందే యువకులే’ అని ఈ గ్రాఫిటీ అర్థం. స్వచ్ఛభారత్ పార్లల్ క్యాంపెయిన్‌లో స్వాతి, విజయ్‌లు చేసిన రెండో గ్రాఫిటీ ఇది. మొదటిసారి గచ్చిబౌలిలోని ఓ వాల్ మీద వేశారు.
‘ప్రతి పౌరుడు వంద గంటలు స్వచ్ఛభారత్ కోసం కేటాయిస్తే ఏడాది లోపు స్వచ్ఛభారత్‌ను సాధిస్తాం’ అన్న మోదీ మాటకు... ‘ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి కనీసం వంద గంటలైనా ఏకాగ్రతతో పనిచేస్తే పేరుకున్న ఫైళ్లన్నీ కదిలి.. అందులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి’ అంటూ కామన్‌మ్యాన్ ఆఫ్ ఇండియా కౌంటర్ ఇస్తున్నట్టుగా ఓ బొమ్మను వేసి క్యాప్షన్ రాశారు. స్వాతి, విజయ్‌లు మొదలుపెట్టిన స్వచ్ఛభారత్ పార్లల్ క్యాంపెయిన్‌లో ఈ ఫస్ట్ గ్రాఫిటీకి పురజనుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ముందుకు సాగుతున్నారు. అయితే వాల్స్ మీద గ్రాఫిటీ అండ్ స్ట్రీట్ ఆర్ట్ వేయడానికి చాలామంది అనుమతివ్వక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే సామాజిక ప్రయోజనం కోసం వేస్తున్న ఈ పెయింటింగ్ పదిమందిలోకీ వెళ్లాలంటే మెట్రో రైల్ పిల్లర్స్ అయితే మంచి వేదికలవుతాయని వీరు ఆకాంక్షిస్తున్నారు.
ఆలోచన ఇలా...
‘గ్రాఫిటీ అండ్ స్ట్రీట్ ఆర్ట్ మా స్పెషలైజేషన్. ఈ ఆర్ట్ ఉన్నదే సోషల్ కాజ్ కోసం. సో.. మేమూ అదే దారిలో వెళ్తున్నాం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియాలో జరిగిన గొడవల నేపథ్యంలో ‘వయోలెన్స్ నీడ్ నాట్ టు బీ వయెలెంట్’ అనే గ్రాఫిటీ వేశాం. ఉస్మానియా యూనివర్శిటీ వాల్ మీదే. స్టూడెంట్స్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒక సోషల్ కాజ్ తీసుకొని వేస్తూ ఉన్నాం.
స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ మమ్మల్ని ఎట్రాక్ట్ చేసింది... పార్లర్ క్యాంపెయిన్ చేయడానికి! ‘ఆత్మను పరిశుద్ధం చేసుకుంటే చాలు శరీరం దానంతటదే పరిశుద్ధం అవుతుంది’ అని మన యోగా చెబుతుంది. కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే చీపుర్లు పట్టడం కాదు... మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రక్షాళన చేయాలి. పేదరికం, అవిద్య, అనారోగ్యాన్ని తరిమేయాలి. ఈ అంతఃశుద్ధి జరిగితే భారతదేశ భౌతిక రూపం స్వచ్ఛంగా, పచ్చగా ఉంటుంది. దీన్ని తెలియజెప్పడానికే స్వచ్ఛ భారత్‌కి పార్లర్ క్యాంపెయిన్ స్టార్ చేశాం’ అంటారు స్వాతి, విజయ్‌లు.
సరస్వతి రమ