మార్పు కోసం నిశిరాత్రిలో ప్రేమజంట | couple draw slogans for a change | Sakshi
Sakshi News home page

మార్పు కోసం నిశిరాత్రిలో ప్రేమజంట

Published Sat, Sep 10 2016 9:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

మార్పు కోసం నిశిరాత్రిలో ప్రేమజంట

మార్పు కోసం నిశిరాత్రిలో ప్రేమజంట

సాక్షి,వీకెండ్: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలోని ఎల్వీప్రసాద్‌ విగ్రహం దగ్గర బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కోసం ఏర్పాటు చేసిన షీట్స్‌ మీద మహాత్మాగాంధీ ‘ఐయామ్‌ సారీ’ అని చెబుతుంటారు. టోలిచౌకి దర్గా దగ్గర పిల్లాడికి బువ్వ పెడుతున్న తల్లి.. ‘నో లైన్‌ ఈజ్‌ ఏ లిమిట్‌ ఫర్‌ లవ్‌’ అంటూ గుర్తు చేస్తుంటుంది.

జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌ దగ్గరి పడి ఉన్న పైప్‌ మీద ‘ఛేంజ్‌ ది కంట్రీ’ అంటూ ఓ కుర్రాడు సూచిస్తుంటాడు. మనలో చాలా మంది ఈ వి‘చిత్ర’ సందేశాలను చూసే ఉంటారు. అయితే వీటన్నింటి వెనుక ఉన్న నిశిరాత్రి కష్టం చూసి ఉండరు. ఓ జంట ‘చిత్ర’మైన ప్రేమానుబంధం తెలుసుకొని ఉండరు.
                                 

‘సారీ చెబితే అది ఒక పెద్ద తప్పు అన్నట్టు అయిపోయింది. అయితే ఎలాంటి తప్పు అయినా సారీ చెప్పడంలో తప్పు లేదు. పెద్దవాళ్లు తప్పు చెప్పినా సారీ చెప్పరు. ఇట్స్‌ ఓకే అంటారు. అయితే అలా చెప్పడం అవసరమని తెలియజేసేందుకే ‘ఐయామ్‌ సారీ’ అంటున్న దేశనాయకుల చిత్రాలు గీశామ’ని చెప్పారు విజయ్, స్వాతి. నగరంలో పలు చోట్ల తమదైన గ్రాఫిటీ చిత్రాలతో సందడి చేస్తున్న ఈ జంట.. ఇలాంటి ఎన్నో సందేశాత్మక చిత్రాలను సిటీ నలుచెరగులా పంచుతోంది. ఈ జంట ప్రేమానుబంధ, చిత్రానుబంధ విశేషాలు వారి మాటల్లోనే...
 
‘కళ’గలిసిన ప్రేమ...  
జేఎన్‌టీయూలో ఫైన్‌ ఆర్ట్స్‌ చేస్తున్నప్పుడే ప్రేమ పలుకులు పలికిన మేము.. గ్రాఫిటీతోనూ ప్రేమలో పడ్డాం. కళలందు మన కలలు వేరయా... అన్నట్టు మా ఆలోచన కాస్త వైవిధ్యంగా ఉండేది. సామాజిక అంశాలపై మాట్లాడుతూ కూర్చుంటే అవి ప్రజల చెవులకు ఎక్కడం సందేహాస్పదమే. అత్యంత క్లిష్టమైన, చాలా బరువైన విషయాలను కూడా సులభంగా అందరికీ చెప్పగల గ్రాఫిటీతో ప్రజలను చైతన్యవంతులను చేయగలం అనిపించింది.

కాన్వాస్‌ మీద పెయింట్‌ చేస్తూనే గ్రాఫిటీ ద్వారా ప్రజోపయోగ చిత్రకళకు అర్థం చెబుదామనుకున్నాం. ఎనిమిదేళ్ల క్రితం మేం నిర్వహించిన తొలి ప్రదర్శనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికైంది. స్వరాష్ట్రం కోసం రగులుతున్న తెలంగాణపై ‘వÄñæ¬లెన్స్‌ నీడ్‌ నాట్‌ బి వైలెంట్‌’ అనే పేరుతో చిత్రం గీశాం. దానికి విమర్శకుల ప్రశంసలు రావడంతో పాటు చాలా మందిని ఆకట్టుకోవడంతో ఇక వరుసపెట్టి గీస్తూ వస్తున్నాం.

ఎన్నెన్నో సచిత్ర సందేశాలు...
స్వచ్ఛ భారత్‌ను దృష్టిలో పెట్టుకొని అది పార్లమెంట్‌ లోపల కాదు బయట కనిపించాలనే సందేశంతో ‘ది రియల్‌ ప్లేస్‌ టు డు’ చిత్రం గీశాం. ‘లవ్‌ కెన్‌ బ్రేక్‌ బారియర్స్‌’ పేరుతో కశ్మీర్‌ సమస్యను సున్నితంగా స్పృశించాం. ప్రభుత్వ పాఠశాలలు మూసేయాలనే వార్తలు వచ్చినప్పుడు.. వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌ రంగసాయిపేట స్కూల్‌కి వెళ్లి వారం రోజుల పాటు ‘స్కూల్‌ మూసేయడం పరిష్కారం కాదు. వసతులు కల్పించడం అవసరమ’ని గుర్తు చేసే చిత్రాలు గీశాం.

రాష్ట్ర విభజన జరిప్పుడు... అదొక భౌతికమైన విభజన మాత్రమే. మన మధ్య ఉన్న అనుబంధాలు పోవంటూ పిల్లాడికి బువ్వ పెడుతున్న తల్లి ‘నో లైన్‌ ఈజ్‌ ఎ లిమిట్‌ ఫర్‌ లవ్‌’ని టోలిచౌకి దర్గా దగ్గర చిత్రించాం. ప్రతి చిత్రానికి నేపథ్యాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం, మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎంచుకున్న అంశం స్ఫూర్తి పూర్తిగా ప్రతిఫలించేలా చిత్రాలు గీయడం... వంటి సమస్యలు ఎన్నున్నా అధిగమించాం. ఈ చిత్రాలు గీసేందుకు తగిన ప్లేస్‌ దొరకడం పెద్ద సమస్య. పబ్లిక్‌ ప్లేస్‌లలో యజమానుల అనుమతి తీసుకుంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఒప్పుకుంటారు.  

రాత్రి పూట... చిత్రాల బాట
సాధారణంగా రాత్రి సమయంలోనే ఈ గ్రాఫిటీ పనిమీద శ్రమిస్తాం. స్ప్రే బాటిల్స్, నిచ్చెన వగైరాలన్నీ సిద్ధం చేసుకున్నాక ప్లేస్‌ను ఎంచుకోవడం పెద్ద పని. రాత్రి 8 గంటలకు ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటల్లోపు గ్రాఫిటీ పూర్తి చేస్తాం. గ్రాఫిటీ అంతా సొంత డబ్బులతోనే  చేస్తున్నాం. ఆదాయం కోసం చిన్న చిన్న పెయింటింగ్స్‌ వేస్తుంటాం.

 – ఎస్‌.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement