నేనింకా ప్రేమలో పడలేదు
నాకు ఇంకా ప్రేమ పుట్టలేదు. ఒక వేళ పుట్టినా నో ప్రోబ్లమ్ అంటున్నారు నటి కీర్తీసురేశ్. నిజంగా లక్కీ నాయకి అంటే ఈ బ్యూటీనే అనాలి. కోలీవుడ్‌లో తొలి చిత్రం ఫర్వాలేదు అనిపించుకున్నా, మలి చిత్రం సంచలన విజయాన్ని సాధించి కీర్తీసురేశ్‌కు యమ క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సుందరి చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అన్నీ భారీ అంచనాలున్న చిత్రాలే. విజయ్‌కు జంటగా ఆయన 60వ చిత్రంలోనూ, శివకార్తికేయన్ సరసన రెమో, బాబీసింహాతో పాంబుసండై, నానికి జతగా ఒక తెలుగు చిత్రంతో బిజీబిజీగా ఉన్నారు. ధనుష్‌కు జంటగా నటించిన తొడరి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా కీర్తీతో చిన్న చిట్ చాట్.
ప్ర: ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు?
జ: బాబీసింహాకు జంటగా నటిస్తున్న చిత్రం పాంబుసండైలో గార్మెంట్ కంపెనీలో పని చేస్తూ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. రెమో చిత్రంలో మెడికల్ విద్యార్థిని పాత్రను పోషిస్తున్నాను. ఇక విజయ్‌కు జంటగా నటిస్తున్న చిత్రంలో పాత్ర గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పను.
ప్ర: తెలుగు చిత్రాలలో గ్లామరస్‌గా నటించాల్సి ఉంటుందటగా?
జ: తెలుగులో మహేశ్‌బాబు బంధువుల అబ్బాయి నవీన్‌తో కలిసి అయినా ఇష్టం నువ్వు అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యాను. అయితే ఆ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. ఆ తరువాత రామ్ సరసన నటించిన నేను శైలజ చిత్రం విజయవంతమైంది. తాజాగా నానికి జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నాను. తెలుగైనా, తమిళం అయినా నేను గ్లామరస్‌గా నటించను. అంది నాకు సరిపడదు. తెలుగులో గ్లామరస్‌గా నటించాలని నన్నెవరూ ఒత్తిడి చేయలేదు.
ప్ర: సరే.. అప్పుడే అధిక పారితోషికం డిమాండ్ చేస్తున్నారట?
జ: ఎదుగుతున్న కాలంలో ఇలాంటి అసత్యప్రచారాలను ఎదుర్కొనక తప్పదు. వాటి గురించి పట్టించుకోను కూడా. నేను కథ విన్న తరువాత దాన్ని అమ్మకు చెప్పి అభిప్రాయం అడుగుతాను. ఇప్పటికి నేను నటించిన ఇదు ఎన్న మాయం, రజనీమురుగన్ తదితర రెండు చిత్రాలే విడుదలయ్యాయి. ఇక నా చిత్రం విజయం సాధించిందా? అని కాకుండా పారితోషికం పెంచాలని ఆలోచించేంత అర్హత నాకు ఉందా అని ఆలోచిస్తాను. అంత డిమాండ్ ఉంటే కచ్చితంగా పారితోషికం పెంచుతాను. అయితే ప్రస్తుతానికి పారితోషికం పెంచే ఆలోచన లేదు.
ప్ర: ప్రస్తుతం కథానాయికల విషయంలో గట్టి పోటీ నెలకొందనుకుంటా?
జ: పోటీ ఉంటేనే వేగం పెరుగుతుంది. మన మూ పరిగెత్తవచ్చు. ప్రతిభ ఉన్న వాళ్లే విజయం సాధిస్తారు. నేను నన్ను, నా ప్రతిభను నమ్ముకుంటాను. ఇతరుల గురించి అసూయ చెందను. నాకు నటి సిమ్రాన్ స్ఫూర్తి. ప్రియమానవ ళే, పంచతంత్రం చిత్రాలలో ఆమె డ్యాన్స్, నటన, మ్యానరిజం నాకు చాలా నచ్చుతాయి.
ప్ర: జయాపజయాలకు ఎలా రియాక్ట్ అవుతారు?
జ: నిజం చెప్పాలంటే నేను హీరోయిన్‌గా పరిచయం అవుతానని,ఈ స్థాయికి ఎదుగుతాననీ ఊహించలేదు. మలయాళంలో బాల నటిగా పరిచయం అయ్యి, ఆ తరువాత కథానాయకినయ్యాను. నా చిత్రాల ఫ్లాప్‌లకు కుంగిపోను. విజయాలకు పొంగిపోను. దేనినైనా ఒకేలా స్వీకరిస్తాను. అలాంటి మనస్తత్వంతోనే విజయ పయనం సాగించగలం.
ప్ర: ప్రేమ గురించి మీ అభిప్రాయం? మీరూ అందులో పడ్డారా?
జ: నేనింకా ప్రేమలో పడలేదు. నాకింకా ఆ సమయం రాలేదనుకుంటా. ఒక వేళ ప్రేమలో పడ్డా నాకు ఎలాంటి సమస్యలు ఉండవనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మానాన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లేగా.