
హరీశ్ జయరాజ్ (Harris Jayaraj).. తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గించేశాడు. మిన్నలే (తెలుగులో చెలి చిత్రం) సినిమాతో ఈయన సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. వాసు, ఘర్షణ, ప్రేమించి చూడు, ఘజిని, సైనికుడు, మున్నా, ఆరెంజ్, రంగం, స్నేహితుడు, సెవంత్ సెన్స్, తుపాకీ, స్పైడర్ వంటి చిత్రాలకు సంగీతం అందించి తెలుగువారికీ దగ్గరయ్యాడు.
ఇంట్లో తిట్టేవారు
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో హరీశ్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. నాకు జీతం రాగానే సంగీత పరికరాలను కొనుగోలు చేసేవాడిని. వాటితోనే ఇంట్లో అడుగుపెట్టేవాడిని. అది చూసి ఇంట్లో వాళ్లు చాలాసార్లు నన్ను తిట్టారు. మంచి పాట ఇవ్వాలంటే అది హృదయం నుంచి రావాలి. హిట్ సాంగ్ ఇవ్వాలంటే అది మన మెదడు నుంచి రావాలి. ఈ రెండింటిలో ఏది కావాలన్నది మనం ఎంచుకోవాలి. అయితే మనం మనసు పెట్టి ట్యూన్ చేసిన పాట ఎన్నేళ్లయినా అదలాగే ఉండిపోతుంది. అది పదేళ్లే కావచ్చు.. వందేళ్లు కూడా కావచ్చు.
విజయ్ 10 సినిమాలు రిజెక్ట్ చేశా
హీరో విజయ్ (Vijay) పది సినిమాలను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ సినిమాలకు పని చేయడం ఒత్తిడితో కూడుకున్నది. అది నాకు మెంటల్ టార్చర్‌లా అనిపిస్తుంది. పనిని ఆస్వాదిస్తూ చేయాలి తప్ప భారంగా కాదు. మనం చేసే పని ముందు మనకు సంతృప్తి ఇవ్వాలి అంతే కానీ మన జేబు నింపుకోవడానికి కాదు. డబ్బుపై నాకు ఆశలేదు. అందుకే ఆయన 10 సినిమాలు తిరస్కరించాను. అవన్నీ ఒప్పుకుని ఏదో తూతూమంత్రంగా చేసివ్వడం, వేరేవారిని వెయిట్ చేయించడం ఇష్టం లేకే రిజెక్ట్ చేశాను. 11వ సారి మాత్రం ఒప్పుకున్నాను అని చెప్పుకొచ్చాడు.
విజయ్‌తో రెండు సినిమాలు
కాగా విజయ్ హీరోగా నటించిన నంబన్ (స్నేహితుడు), తుపాకీ చిత్రాలకు హరీశ్ శంకరే సంగీతం అందించాడు. నంబన్ సినిమా కంటే ముందు విజయ్ నుంచి 10 సినిమాల వరకు ఆఫర్లు రాగా వాటిన్నింటినీ తిరస్కరించానని హరీశ్ చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల
Comments
Please login to add a commentAdd a comment