ప్రేమ జీవన రాగం | I love living piece | Sakshi
Sakshi News home page

ప్రేమ జీవన రాగం

Published Sat, Nov 29 2014 8:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు, డాక్టర్ శశిప్రభ

డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు, డాక్టర్ శశిప్రభ

నువ్వు-నేను
- డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణరావు, డాక్టర్ శశిప్రభ


అనురాగం, ఆత్మీయత, ప్రేమల కలబోత ఆ కాపురం. భార్యాభర్తల అన్యోన్యతకు నిలువెత్తు నిదర్శనం ఆ సంసారం..  బిజీగా ఉండే వైద్య వృత్తిలోనే ఇద్దరూ ఉన్నా..జీవన రథాన్ని సేవాపథంలో నాలుగున్నర దశాబ్దాలుగా నడిపిస్తున్న ప్రేమైకమూర్తులు వారు. భేషజాలకు తావు లేని మమకారం, కష్ట సుఖాలలో ఒకే రకంగా స్పందించే స్థితప్రజ్ఞత. మనుషులు కాదు మనసులు కలవాలనే స్వచ్ఛమైన భావన.. ఇవన్నీ కలిస్తే డాక్టర్ దంపతులు సుంకర వెంకట ఆదినారాయణరావు, శశిప్రభ. వారి అనుబంధమే ఈ వారం యూ అండ్ ఐ ..
 
 ‘ఒక చేతికి ఉన్న వేళ్లు ఎలా కలిసి ఉండవో అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకుని సాగించే ప్రయాణమే దాంపత్యజీవనం’ అంటారు శశిప్రభ. ‘భార్యాభర్తలన్నాక కోపతాపాలు సహజం. పొద్దున్న పోట్లాడుకున్నా సాయంత్రానికి కలిసిపోయేలా ఉండాలి’ అంటారు ఆదినారాయణ. తమ 44 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవనంలో ఎన్నో మధుర స్మృతులున్నా తమ తొలిపరిచయం చెదిరిపోని జ్ఞాపకమన్నారు ఆదినారాయణ. ‘నేను అప్పట్లో ఆంధ్రా మెడికల్  కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తూండేవాడిని. శశిప్రభ మా జూనియర్.

ఒకరోజు నా మిత్రులు శశిప్రభను, ఆమె స్నేహితురాలిని ర్యాగింగ్ చేస్తున్నారు. వారడిగిన అన్ని ప్రశ్నలకు శశిప్రభ చాలా పొలైట్‌గా సమాధానం చెప్పడంతో ఆమెను ఏమీ అనకుండా పంపించేశారు. ఆమె వెళ్లిన తరువాత నా స్నేహితుడు ‘నాకు అక్కచెల్లెళ్లు లేరు..నేను ఆమెను నా సిస్టర్‌లా భావిస్తున్నా’ అన్నాడు. ‘నాకు నలుగురు సిస్టర్స్ ఉన్నారు. ఆమె అంగీకరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను’ అన్నాను. తర్వాత ఆ సంగతి మర్చిపోయాను. నా చదువైన తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో ఈ సంబంధం ప్రస్తావన వచ్చింది. అమ్మాయి పేరు శశిప్రభ అని చెప్పారు.

ఆ శశిప్రభే ఈమె అని తెలియడంతో అంగీకరించాను’ అని చెప్పారు ఆదినారాయణ. ‘డాక్టర్ బాలపరమేశ్వరరావుగారు ఆదినారాయణగారి అన్నగారు.  మా కాలేజ్‌లో ప్రొఫెసర్. అప్పట్లో అమ్మాయిలకు ఆయనంటే ఆరాధనాభావం ఉండేది. ఆయన సోదరుడే పెళ్లికొడుకని చెప్పడంతో నేను ఒప్పుకున్నాను. అలా 1970లో మా వివాహమైంది చెప్పారు శశిప్రభ. అప్పటికి నేను ఎండీ చేస్తున్నాను. అత్తగారు లేరు. మామగారు కూడా మా ఇంట్లో ఉండేవారు కాదు అందువల్ల నాకు అత్తగారిల్లనే భావం ప్రత్యేకంగా ఏమీ కలగలేదు. నా చదువుకు, తరువాత వృత్తికి ఆటంకం కలగకుండా మా అమ్మ పిల్లలను చూసుకునేవారు. వాళ్ల సహకారం వల్లే ఆర్థోపెడిక్ సర్జన్‌గా ఆయన, గైనకాలజిస్ట్‌గా నేను సక్సెస్ కాగలిగాం అన్నారు.

‘పిల్లల విషయం నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. అప్పటికే నేను పోలియో క్యాంప్స్ పెట్టేవాడిని. పిల్లల చదువులు, ప్రోగ్రెస్, ఇంటి వ్యవహారాలు ఆమె చూసుకోవడం వల్లే నేను 3 లక్షల మంది పోలియో పేషెంట్స్‌కు 10 లక్షల ఆపరేషన్లు చేయగలిగాను అని చెప్పారు ఆదినారాయణ. అమ్మాయి శేష్‌కమల్ ఇన్‌ఫెర్టిలిటీలో సూపర్‌స్పెషాలిటీ చేసి లండన్‌లో స్థిరపడింది. అబ్బాయి శశికిరణ్‌కు మేనేజ్‌మెంట్‌లో ఇంట్రస్ట్ ఉండడంతో అహ్మదాబాద్ ఐఐఎంలో చదివాడు. తనిప్పుడు ముంబయి మెకన్సీ కంపెనీలో పార్టనర్ .
 
ఇద్దరం కలిసే తినాలి
 
‘మా పెళ్లయిన దగ్గర్నుంచి ఇప్పటివరకు రోజూ లంచ్ ఇద్దరం కలిసే చేస్తాం. రెండైనా, మూడైనా అంతే. ఒకరు అర్జెంట్ కేస్ అటెండ్ అయినా వచ్చేవరకూ ఉండి అప్పుడు తింటాం. ఇప్పటికీ అంతే. ఇంట్లో కూడా మా సంభాషణంతా చాలావరకు హాస్పిటల్, కేసుల చుట్టూనే తిరుగుతుంది. ప్రత్యేకమైన కేసుల గురించి, క్రిటికల్ కండిషన్‌లో తీసుకునే జాగ్రత్తల గురించి ఇద్దరం చర్చించుకుంటాం’ చెప్పారు శశిప్రభ. డాక్టరు వృత్తి అంటేనే బిజీ జీవితం. ఇద్దరం డాక్టర్లే కావడం వల్ల కొంత పర్సనల్ లైఫ్ మిస్ అవడం సహజమే. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకు వచ్చే గుర్తింపు, రోగులు మమ్మల్ని గుర్తుంచుకోవడం, ఫలానా బిడ్డ మీ చలవ వల్లే తిరగగలుగుతున్నాడని చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. దానిముందు మేం కోల్పోయింది చాలా తక్కువ అనిపిస్తుంది’ అన్నారు ఆదినారాయణ.
 
అవ్యాజమైన అనురాగం

ఆయన అంతా సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. నలుగురికీ సహాయపడాలనే తత్వం. అది నాకు బాగా నచ్చుతుంది. డబ్బు ముఖ్యం కాదు నలుగురు మంచిగా చెప్పుకోవడం ప్రధానం. పదుగురికీ సేవ చేయడమే మనం చేయగలిగింది అంటారు. ఆయన తొందరగా అందరినీ నమ్మేస్తారు. అలా ఎన్నో సందర్భాల్లో మోసపోయారు. తర్వాత బాధపడీ ప్రయోజనం ఉండదు కదా అని ఆందోళన వ్యక్తం చేస్తారు శశిప్రభ. ‘అర్ధరాత్రి ఫోన్ వచ్చినా అంతే కమిట్‌మెంట్‌తో అటెండ్ అవుతుంది. చాలా సిస్టమేటిక్‌గా ఉంటుంది. నేను సంపాదించింది ఏమీ లేకపోయినా అన్ని విషయాల్లోనూ నాకు తోడూనీడగా ఉంది. తన సహకారం లేకపోతే మా ప్రయాణం ఇంత సాఫీగా నడిచేది కాదు అని తన శ్రీమతి గురించి చెబుతారు ఆదినారాయణ. రాణీ చంద్రమణీదేవి హాస్పిటల్‌లో సూపరింటెండెంట్‌గా రిటైరైన ఆదినారాయణరావు, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్‌గా రిటైరైన శశిప్రభ ఇప్పటికీ అదే ఉత్సాహంతో, సేవాభావంతో ఉన్నారు. శుభం ప్రేమ హాస్పిటల్ డెరైక్టర్ జనరల్‌గా ఆదినారాయణరావు, అదే ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా శశిప్రభ విధి నిర్వహణలో అంతే అంకితభావంతో చేస్తున్నారు.
 
  రాజేశ్వరి
  ఫొటో : శ్రీనివాస్ ఆకుల

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement