ఆ ఉత్తరాలకు జవాబిచ్చేదాన్ని కాదు
ఒకరు శ్రుతి.. వేరొకరు లయ..ఒకరు తన్యావర్తనం..మరొకరు మధుర
వీణానాదం. అందుకే వారి సంసారమే సరాగాల సారం. మృదంగనాదమే
జీవన వేదమైన వంకాయల వారి వారసుడు, మార్దంగిక విద్వన్మణి వెంకటరమణ..
ఆయన సతీమణి, వీణాగాన విశారద మీనా కుమారి ఈ వారం యూ అండ్ ఐ.
‘ఇద్దరి అభిరుచీ సంగీతమే.. కుటుంబ నేపథ్యాలు వేరు. మా ఇద్దరి మధ్య కుదిరిన సమన్వయం సంతోషదాయకం. నేపథ్యం వేరుగా ఉన్నా, ఆలోచనలు ఒకే విధంగా ఉండడం అరుదు. అలాటి జంటల్లో మేమూ ఒకరం.. అలా అనుకున్నందుకు, అలా ఉన్నందుకు ఆనందంగా ఉంటుంది.’ అన్నారు మృదంగ విద్వాంసుడు వంకాయల వెంకట రమణమూర్తి, ఆయన భార్య, వీణ విద్వాంసురాలు మీనా కుమారి. తమ మధ్య ఉన్న ఆ సారూప్యతకు తామే ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయని చెప్పారు. వివాహానికి ముందే పరిచయమున్నా తమది పెద్దలు కుదిర్చిన వివాహమేనంటూ ఆ జ్ఞాపకాలు ఇలా గుర్తు చేసుకున్నారు.
రమణ: మాది విజయనగరం. నాలుగు తరాల సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం మాది. నాన్నగారు ప్రముఖ మృదంగ విద్వాంసుడు వంకాయల నరసింహం. ఆయన ఆలిండియా రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్. నేను 8వ తరగతి చదువుతుండగా వైజాగ్ వచ్చేశాం. నేను నాన్నగారి దగ్గరే మృదంగం నేర్చుకున్నాను. 1989లో రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా చేరాను. మీనా రేడియో ఆడిషన్‌కి వచ్చినప్పుడు తొలిసారి చూశాను. పొందికగా ఉన్న ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను.
మీనా : నాన్నగారు రైల్వేలో చేయడంతో చిన్నప్పుడు కలకత్తాలో ఉండేవాళ్లం. తర్వాత విజయనగరం వచ్చాం. అమ్మకు వీణ వచ్చు. తన ప్రోత్సాహంతో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వీణ నేర్చుకున్నాను.
రమణ: తర్వాత విజయనగరం సంగీత కళాశాలలోఉత్సవాలు జరిగినప్పుడూ కనబడేది. మీనాకు వీణ నేర్పిన గురువు మండ మాణిక్యంగారు ఈ సంబంధం తీసుకువచ్చారు. నాకు నచ్చిన అమ్మాయి కావడంతో వెంటనే అంగీకరించాను. 1991 అక్టోబర్‌లో మా నిశ్చితార్థం జరిగింది.
మీనా : అప్పుడు నేను మీరజ్ యూనివర్సిటీలోని గాంధర్వ మహా విద్యాలయలో ఎంఏ మ్యూజిక్ చేస్తున్నాను. పెళ్లి నిశ్చయమయ్యాక ఈయన ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాలో కవిత్వం బోలెడు ఉండేది. నేను జవాబిచ్చేదాన్ని కాదు. 1992 ఫిబ్రవరి 21న మా పెళ్లయింది.
రమణ : అప్పటికి మాది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు, అన్నయ్య, మేము అంతా కలిసే ఉండేవాళ్లం. మీనా అందరిలో బాగా కలిసిపోయింది. పెళ్లయిన కొత్తలో నా జీవిత పయనం గురించి మీనాతో ప్రస్తావించాను. మాది విలువలకు కట్టుబడి ఉన్న కుటుంబం. స్తోమత కోసం విలువలను పక్కన పెట్టాలా? లేక ఆత్మ సంతృప్తి కోసం వాటికి కట్టుబడి ఉండాలా? అని.. నాకు నచ్చినట్టే ఉండమని, తను నా వెన్నంటి ఉంటానని చెప్పింది. అలాగే ఈరోజు వరకూ ఉంది. అందుకే ఈరోజున సంతోషంగా, తృప్తిగా ఉన్నాను.
మీనా : విలువల్లేని జీవితానికి అర్థం లేదు. ఆయన ఆనందంగా ఉండటం కంటే నాకు కావలసింది ఏమీ లేదు. నా అభిప్రాయాన్ని గౌరవించబట్టే కదా ఆయన నన్నలా అడిగారనిపించింది. అందుకే అలా చెప్పాను.
రమణ : మీనా నా కోసం కెరీర్‌నే త్యాగం చేసింది. తను చాలా టాలెంటెడ్. కుటుంబమే ప్రపంచంగా గడిపింది. మాకు ఇద్దరు పిల్లలు. పాప,బాబు. పిల్లలు చిన్నప్పుడు కూడా తనే మేనేజ్ చేసుకునేది. మ్యుజిషియన్స్‌కు మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి.. అప్పుడే కార్యక్రమం రక్తి కడుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లానంటే మళ్లీ వచ్చేవరకు ఆ ధ్యాస లేకుండా మొత్తం తనే చూసుకుంటుంది.
మీనా : ఆయన కూడా కళాకారుడు కావడంతో నన్ను అర్థం చేసుకున్నారు. పిల్లల చిన్నతనంలో వాళ్ల దగ్గర ఎవరో ఉండాలి కదా.. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రేడియోలో ఏటా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుండేదాన్ని. ఆయ న ప్రోత్సాహం వల్లే రేడియోలో బి హై గ్రేడ్ ఆర్టిస్ట్‌ను కాగలిగాను. పిల్ల లు పెద్దవాళ్లవడంతో ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాను.
రమణ : పిల్లలను క్రమశిక్షణతో పెంచింది. చిన్నతనంలో నీతి కథలు, రామాయణ, మహా భారతాలు చెప్పేది. వాళ్ల చదువు తనే చూసుకునేది.
మీనా : పాప పేరు శ్రుతి సారణి. వీణలో మొదటి తీగన్నమాట. తనిప్పుడు బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. తను గాయని.. రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్. వయొలిన్ నేర్చుకుంటోంది. బాబు శ్రీ సుధాకృష్ణ. శ్రీ రాగం పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాం. బీ టెక్ ఫస్టియర్.. ఆయన దగ్గరే మృదంగం నేర్చుకున్నాడు. రేడియో ఆడిషన్‌కు వెళ్తున్నాడు.
రమణ : మేము ‘మూడు తరాల మృదంగం’ అనే కార్యక్రమం ఒకటి చేశాం. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో మా నాన్నగారు, నేను, మా అన్నయ్యగారి అబ్బాయి, మా అబ్బాయి పాల్గొన్నాం.
మీనా : నేనూ, ఆయనా కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేశాం. చెన్నైలో నిర్వహించిన వీణోత్సవం ‘ముద్ర’ వీటిలో ఒకటి.
రమణ : మా ఇద్దరివీ అభిప్రాయాలు చాలా బాగా కలుస్తాయి. ఒక్కోసారి మేమే ఆశ్చర్యపోతాం. అలాగే కోపం కూడా ఇద్దరికీ ఒకేలా వస్తుంది. ఒక స్థాయికి వెళ్లాక తను తగ్గుతుంది. కాసేపటికి నేనే వెళ్లి సారీ చెప్తాను. అదొక్కటీ అనుకుంటాను... ఒక్కసారైనా తను సారీ చెప్పచ్చు కదా అని.
మీనా : ఆయన మృదంగంలో ప్రవీణులు. చిన్న వయసులోనే రేడియోలో టాప్‌గ్రేడ్ ఆర్టిస్టు అయ్యారు. ఆకాశవాణి జాతీయ సంగీతోత్సవాల్లో గోల్డ్ మెడల్ వచ్చింది. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలే కాదు.. జాజ్, వెస్టర్న్, సింఫనీస్ సైతం పెర్ఫార్మ్ చేయగలరు. బాలమురళి, ఎల్. సుబ్రహ్మణ్యం, శశాంక్, జస్‌రాజ్, హరిప్రసాద్ చౌరాసియా వంటి ఉద్దండులతో కలిసి ప్రోగ్రామ్స్ చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీమూన్ సమక్షంలో 80 దేశాల ప్రతినిధుల మధ్య పద్మభూషణ్ ఎల్.సుబ్రహ్మణ్యంగారితో కలిసి ప్రోగ్రామ్ చేశారు. మృదంగరత్న, నాదోపాసక లాంటి అవార్డులు ఎన్నో.. ఇదంతా నాకు గర్వ కారణం.
రమణ : ఇది మీనా సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఓపిక ఎక్కువ. సింపుల్ లివింగ్ ఇష్టపడుతుంది. పద్ధతిగా మా కుటుంబాన్ని నడిపింది. ఇప్పటికీ రోజూ వీణ ప్రాక్టీస్ చేస్తుంది.
మీనా : ఎక్కడికైనా నలుగురం వెళ్తాం. షాపింగ్‌కు, సినిమాకు అంతెందుకు మాలో ఎవరికి జ్వరం వచ్చి ఆస్పత్రికి వెళ్లాలన్నా నలుగురం ఉండాల్సిందే. ఏదైనా నలుగురం షేర్ చేసుకుంటాం.
రమణ : జన్మనిచ్చిన అమ్మ, విద్యనిచ్చిన మా నాన్నగారు ఎంత ముఖ్యమో చక్కని జీవితాన్నిచ్చిన మీనా నాకు అంతే ముఖ్యం.