Sundar
-
బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....
సాక్షి, గుంతకల్లు: బల్లి పడిని బిర్యానీని ఇచ్చారంటూ రైల్వే క్యాంటీన్ నిర్వాహకులను బెంబేలెత్తించి, నగదు దండుకోవాలనుకున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ టర్మినల్–కోయంబత్తూరుకు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న సుందర్‌పాల్ అనే ప్రయాణికుడు 4వ ప్లాట్ఫారంలో ఉన్న మారయ్య రైల్వే క్యాంటీన్లో వెజ్ బిర్యానీ కొనుగోలు చేశాడు. అనంతరం అందులో బల్లి పడిందంటూ నేరుగా వెళ్లి డిప్యూటీ రైల్వే స్టేషన్ మాస్టర్ జార్జ్, కమర్షియల్ మేనేజర్ అనూక్‌కు ఫిర్యాదు చేశాడు. కంగారు పడ్డ వారు వెంటనే రైల్వే ఆస్పత్రి వైద్యురాలు భార్గవిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదే సమయంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. బాధితుడిగా భావిస్తున్న సుందర్‌పాల్ పచ్చి మోసగాడుగా రైల్వే అధికారులు తేలింది. కావాలనే అన్నంలో చచ్చిన బల్లులను కలిపి రైల్వే క్యాంటీన్ యజమానుల బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేవాడిగా తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీఎం కుమార్‌గౌరవ్, సీటీఐ వై.ప్రసాద్ స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం జబల్పూర్ రైల్వేస్టేషన్లో ఇలానే సమోసలో బల్లి వేసి నాటకమాడి ఆ కాంట్రాక్టర్ నుంచి రూ.30వేలు గుంజినట్లుగా తేలిందన్నారు. తిరిగి గుంతకల్లులోనూ అదే తరహాలో కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 5 వేలు డిమాండ్ చేశాడని, దీనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. రైల్వే అధికారులు విచారణలో తాను వేసింది బల్లి కాదని సముద్రపు చేప అంటూ సుందర్‌పాల్ ధ్రువీకరించాడు. డబ్బు కోసం నాలుగైదు ప్రదేశాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. -
తమిళనాడును గెలిపించిన సుందర్
కోల్‌కతా: వాషింగ్టన్ సుందర్ (2/32, 33 పరుగులు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తమిళనాడు 5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్‌లో మంగళవారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ (యూపీ) 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ సురేశ్ రైనా (41 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లి (7,068)ను వెనక్కి నెట్టి రైనా టి20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (7,114) చేసిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. తర్వాత తమిళనాడు 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. సంజయ్ యాదవ్ (52; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, భరత్ శంకర్ 30 పరుగులు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగాల్ 3 పరుగుల తేడాతో ఢిల్లీపై, జార్ఖండ్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై, రాజస్తాన్ 22 పరుగుల తేడాతో కర్ణాటకపై గెలుపొందాయి. -
డిజిటల్ చెల్లింపులు దేశానికి గొప్ప అవకాశం
-
గూగుల్ సీఈవోకు ఇమ్మిగ్రెంట్ అవార్డ్!
న్యూయార్క్ః నలుగురు ప్రవాస భారతీయులకు అమెరికా ప్రత్యేక గౌరవం దక్కింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు మరో ముగ్గుర్ని ఈప్రత్యేక పురస్కారం వరించింది. జూన్ 30న జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారిని అమెరికాలోని కార్నీజియా కార్పొరేషన్ సత్కరించనుంది. అమెరికాకు గర్వకారణమైన నలుగురు ప్రవాస భారతీయులకు ఆదేశం ప్రత్యేక గౌరవాన్ని అందించనుంది. 'గ్రేట్ ఇమ్మిగ్రెంట్ః ప్రైడ్ ఆఫ్ అమెరికా' పేరిట కార్నెగీ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రతి యేటా అందిస్తుంది. 2016 సంవత్సరానికి గానూ విదేశీ మూలాలు కలిగిన మొత్తం 30 దేశాలకు చెందిన 42 మందిని పురస్కారాలకు ఎంపిక చేయగా.. వారిలో ప్రవాస భారతీయులు నలుగుర్ని ఈ ప్రత్యేక పురస్కారం వరించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు పీబీఎస్ న్యూస్ అవర్ కు చెందిన ప్రఖ్యాత వ్యాఖ్యాత, సినియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకన్సీ అండ్ కంపెనీ ఛైర్మన్ విక్రమ్ మల్హోత్రా, నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అవార్డు విజేత, రచయిత భారతీ ముఖర్జీలకు ప్రైడ్ ఆఫ్ అమెరికా అవార్డును అందించనున్నారు. జూన్ 30న న్యూయార్క్ లో నిర్వహించే కార్యక్రమంలో ఎంపికైన వారికి కార్నీజియా కార్పొరేషన్ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. అవార్డుకు ఎంపికైన వారంతా చదువు, ఆర్థికావకాశాలు, మతపరమైన శరణార్థులు, భద్రత వంటి అనేక అవసరాలతో అమెరికా వచ్చి స్థిరపడినవారని కార్నీజియా కార్పొరేషన్ ఛైర్మన్ గ్రెగోరియన్ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని..
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నానగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సుందర్ భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ.. వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయం పై గత కొన్ని రోజులుగా ఇంట్లో కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కుటుంబంలో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సుందర్ కత్తితో ఇద్దరు పిల్లలు సహా భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
వరుసగా నాలుగో విజయం
► లంకపై భారత్ గెలుపు ► రాణించిన విరాట్, సుందర్ ► అండర్-19 ముక్కోణపు సిరీస్ కొలంబో: వాషింగ్టన్ సుందర్ (77 బంతుల్లో 61; 5 ఫోర్లు), విరాట్ సింగ్ (89 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లు చెలరేగడంతో... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో లంక అండర్-19 టీమ్‌పై నెగ్గింది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేసింది. బండారా (116 బంతుల్లో 74; 4 ఫోర్లు), మెండిస్ (93 బంతుల్లో 65; 2 ఫోర్లు) రాణించగా మిగతా వారు నిరాశపర్చారు. 166 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక మరో 55 పరుగులు జోడించి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. కలీల్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. తర్వాత భారత్ 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సుందర్, విరాట్లకు తోడు మహిపాల్ (32), అనుమోల్‌ప్రీత్ సింగ్ (25) ఫర్వాలేదనిపించారు. సుందర్, అనుమోల్ మూడో వికెట్‌కు 55; విరాట్, మహిపాల్ ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. లాహిర్ కుమార రెండు వికెట్లు తీశాడు. -
ఫైనల్లో యువ భారత్
రాణించిన సుందర్, పంత్ * అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్‌కతా: వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్ యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సుందర్ వాషింగ్టన్ (75 బంతుల్లో 50; 6 ఫోర్లు; 2/25) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 222 పరుగులు చేసింది. హసన్ మిరాజ్ (90 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. సైఫ్ హసన్ (33), సైఫుద్దీన్ (30) ఓ మాదిరిగా ఆడారు. తర్వాత భారత్ 48.4 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి నెగ్గింది. రిషబ్ పంత్ (26 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. అమన్‌దీప్ (41), ఇషాన్ కిషన్ (24), విరాట్ సింగ్ (21) తలా కొన్ని పరుగులు జత చేశారు. పంత్, ఇషాన్‌లు 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే బంగ్లా బౌలర్ల ధాటికి ఓ దశలో భారత్ 116 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తడబడింది. ఈ దశలో సుందర్, అమన్‌దీప్ ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. -
హాస్య భరితంగా ఆయ్‌వుకూడం
హర్రర్ చిత్రాల ట్రెండ్ సాగుతున్న ఈ పరిస్థితుల్లో హాస్యపు జల్లులు కురిపించడానికి సిద్ధం అవుతోంది ఆయ్‌వుకూడం. సీనియర్ నటుడు పాండియరాజన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రానికి మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మించారు. నవ జంట గణపతి, సత్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రీతి, సుందర్, ప్రభురాజ్, రియాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన అన్భరసన్ చిత్ర వివరాలను తెలుపుతూ నటుడు పాండియరాజన్ ప్రముఖ శాస్తవేత్తగా నటించారన్నారు. ఆయన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి మెదడుకు ఫైటర్‌కు ఆయన మెదడును రోగికి మార్చడంతో సంభవించే సంఘటనలను హాస్యభరితంగా తెరకెక్కించినట్లు తెలిపారు. చిత్రం చూసిన నిర్మాత అరివళగన్ వెంటనే విడుదల హక్కులను కొనుగోలు చేసి తన పీకేఏ ఫిలింస్ సంస్థ ద్వారా తమిళనాడుతో పాటు సింగపూర్, మలేషియా, దుబాయ్, ఫ్రాన్స్ దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాలు బాగుందంటూ ప్రశంసించి యూ సర్టిఫికెట్‌ను ఇచ్చారని వెల్లడించారు. రమేష్ కృష్ణ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ చాయాగ్రహణం అందించారు. -
సీనియర్ సివిల్ జడ్జిలకు బదిలీ
కాకినాడ లీగల్: జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిలు బదిలీ కాగా, మరి కొంతమంది జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆర్వీఎన్.సుందర్‌ను విశాఖపట్నం న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి ఎన్. నాగరాజును నియమించారు. కాకినాడ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి. చక్రపాణిని రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో గుంటూరు జిల్లాలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కె.శ్రీదేవి పదోన్నతిపై నియమితులయ్యూరు. రాజమండ్రిలో న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎస్. శ్రీలక్ష్మి చీరాల సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యూరు. ఆమె స్థానంలో నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రజని నియమితులయ్యూరు. రాజమండ్రిలో ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి బి.గాయత్రిని విజయవాడ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో నెల్లూరు న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఎమ్. రామకృష్ణను నియమించారు.అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.మంగాకుమారిని పదోన్నతిపై నంద్యాల రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణను చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఒంగోలు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి.అమ్మన్నరాజు నియమితులయ్యూరు. రాజోలు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్ శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎ.కరుణ్‌కుమార్ నియమితులయ్యూరు. కొత్తపేట సీనియర్ సివిల్ జడ్జి టి.వెంకటేశ్వర్లు విశాఖపట్నం ఆరో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా లో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న వి.బి. ఎస్.శ్రీనివాసరావు నియమితులయ్యూరు. జూనియర్ సివిల్ జడ్జిలకు బదిలీ కాకినాడ నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న డి. రామలింగారెడ్డి ఒంగోలు ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో అనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న బి.ఎచ్.వి.లక్ష్మీకుమారిని నియమించారు. అనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జి బి.నిర్మలని నియమించారు. కాకినాడ ఐదో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. సన్యాసినాయుడు తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో భీమవరం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి మందా వెంకటేశ్వరరావు నియమితులయ్యూరు. కాకినాడ మొబైల్ కోర్టు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె. ప్రకాశ్‌బాబు విశాఖపట్నం ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో సోంపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నాగిరెడ్డి శ్రీనివాస్‌ను నియమించారు. కాకినాడ ఎక్సైజ్ కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కె.మురళీమోహన్ను భీమునిపట్నం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యూరు. రాజమండ్రి ఏడో అదనపు జూనియర్ సివిల్ జడి ఎం. గురునాధ్ నెల్లూరు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వై. శ్రీనివాసరావును నియమించారు. అడ్డతీగల జూనియర్ సివిల్ జడ్జి వి. గోపాలకృష్ణను నర్సీపట్నం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవర్నీ నియమించలేదు. ఆలమూరు అదనపు జూనియర్ సివిల్ జడి ్జ ఇ. ఆంజనేయులు బనగానపల్లె జూనియర్ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో విజయనగరం జిల్లా ఎక్సైజ్ కోర్టు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుబ్బారావును నియమించారు. అమలాపురం అదనపు జూనియర్ సివిల్‌జడ్జి ఎం. వెంకటేశ్వరరావు గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యూరు. అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు గురజాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కె.రత్నకుమార్‌ను నియమించారు. రామచంద్రపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.పద్మ నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదిలీ అయ్యూరు. తుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. శ్రీహరి విశాఖపట్నం రెండో రైల్వే మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ అయ్యూరు. ఆయన స్థానంలో తుని అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. శాంతిశ్రీ నియమితులయ్యూరు. ఆమె స్థానంలో ఆదోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎం.ప్రమిక్రాణి నియమితులయ్యూరు. -
లవ్ Heart
సుందర్, కరుణ నువ్వు-నేను YOU AND I Every woman deserves a man who loves and respects her. And every man deserves a woman who appreciates his efforts. అంటారు. వెల్‌నోన్ ఆర్టిస్ట్‌లు సుక్క కరుణ, సుక్క సుందర్ కూడా అలాంటి జంటే! అతను ఆమెను ఎంత ఇష్టపడతాడో అంతగా గౌరవిస్తాడు. ఆమె.. అతని విజయం కన్నా ప్రయత్నాన్ని విశ్వసిస్తుంది.. ప్రశంసిస్తుంది! ఈ ఇద్దరిదీ ప్రేమ వివాహం! వీళ్ల లవ్.. ఫస్ట్ సైట్లో స్టార్ట్ కాలేదు.. మరెప్పుడు? ఎలా? అసలు మీ కథ చెప్పండి అని అడిగితే.. ఇలా మొదలైంది వాళ్ల సంభాషణ.. ..:: సరస్వతి రమ ‘తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్ఏ క్లాస్‌మేట్స్‌మి. మొదటి రెండేళ్లు మా మధ్య ఇంటరాక్షనే లేదు. ఫస్ట్ ఐ యూస్డ్ టు హేట్ హిమ్. చదువు పక్కన పెట్టి సోషల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేవాడు. అందుకే నచ్చేది కాదు. అదీగాక నేను చాలా రిజిడ్‌గా ఉండేదాన్ని. దేనికోసం యూనివర్సిటీకి వచ్చామో అది చూసుకొని పోయేదాన్ని’ చెప్పింది కరుణ. ‘ఆమెకు క్వయిట్ అపోజిట్ నేను. అందరితో కలివిడిగా ఉండేవాడిని. మా క్లాస్‌లో అమ్మాయిలు ఉన్నదే ఏడుగురు. కరుణ తప్ప ఆరుగురూ నాతో క్లోజ్‌గా మాట్లాడేవారు. తను ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి నేనూ దూరంగానే ఉండేవాడిని. కాకపోతే గమనించే వాన్ని’ తన వెర్షన్ చెప్పాడు సుందర్. ఎన్నో సైట్‌కి లవ్ ఏర్పడింది మరి? ‘థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు భోపాల్‌లో ప్రింట్ బైనాలే ఎగ్జిబిషన్‌కి వెళ్లాం అందరం. అక్కడ మిగిలిన వాళ్లంతా అసలు ఎగ్జిబిషన్ వదిలిపెట్టి మిగిలిన ప్లేసెస్‌కి వెళ్లేవాళ్లు. నేను, సుందర్ ఇద్దరమే చాలా సీరియస్‌గా ఎగ్జిబిషన్ అంతా తిరిగాం. ఆ టైమ్‌లో ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడే సుందర్‌ను దగ్గరగా గమనించే, అర్థం చేసుకునే అవకాశం దొరికింది. అప్పుడే అతని లీడర్షిప్ క్వాలిటీస్‌పై రెస్పెక్ట్ పెరిగింది. తెలుగు యూనివర్సిటీ ఓ ఫ్యాకల్టీని కూడా అపాయింట్ చేసుకునే స్థితిలో లేనప్పుడు ఈయన ఇనీషియేషన్ తీసుకున్న తీరు, సమస్యను సాల్వ్ చేసిన వైనమూ గుర్తొచ్చింది. అప్పటి నుంచి సుందర్‌ను చూసే నా దృష్టి మారింది. అలా స్లో అండ్ స్టడీగా సాగిన మా ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగే కాదు ఎవర్ చార్మ్ కూడా’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది కరుణ. ‘బీఎఫ్ఏ తర్వాత ఎమ్ఎఫ్ఏ కూడా కలిసి చదివాం. ఎమ్ఎఫ్ఏ తర్వాత తను బరోడా వెళ్లింది. నేను ఇక్కడే చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో జాయిన్ అయ్యాను’ సుందర్ అంటుంటే ‘నేను బరోడా వెళ్లడం వల్లే సుందర్‌ను మ్యారేజ్ చేసుకోగలిగాను. అంతకంటే ముందు సుందర్ వాళ్లన్నయ్య పెళ్లికని వాళ్లూరు వెళ్లాను. అక్కడ సుందర్ వాళ్ల ఫ్యామిలీ, సిట్యుయేషన్ చూసినప్పుడు అనిపించింది.. సుందర్‌కి నా తోడు తప్పకుండా కావాలని. బహుశా అప్పుడే అతని మీద ప్రేమ మొదలై ఉండాలి. బరోడా వెళ్లాక అక్కడి ఆర్టిస్టులు తోటి ఆర్టిస్టులను పెళ్లి చేసుకోవడం, వాళ్ల కంపానియన్‌షిప్ చూశాక నేనూ ఆర్టిస్ట్‌నే పెళ్లిచేసుకుంటే కెరీర్, ఫ్యామిలీ లైఫ్ రెండూ డిస్టర్బ్ కాకుండా ఉంటాయనిపించింది. ఆ నిర్ణయానికి రాగానే సుందరే గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసి చెప్పేశాను ప్రేమ విషయాన్ని, పెళ్లి ప్రపోజల్‌ని కూడా’ కరుణ. ‘కానీ నేనిప్పటివరకు ఐ లవ్ యూ చెప్పలేదు తనకు’ పక్కనుంచి సుందర్. ‘అదే నా కంప్లయింట్’ చిరుకోపంతో కరుణ. ‘నిజానికి నేనే ముందు ప్రేమలో పడ్డాను తనతో. చెప్పడానికి నేను భయపడ్డాను. తను చెప్పి బయటపడింది. అలా 2009లో మా ప్రేమకు పెళ్లి రూపమిచ్చింది’ అన్నాడు కరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ! కెరీర్లో సహకారం.. కుటుంబంలో సగం బాధ్యత ‘కరుణది థియరిటికల్ నాలెడ్జ్. నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ రెండిటినీ కలిపి కలిసి పనిచేస్తాం’ అని సుందర్ అంటుంటే ‘సుందర్‌కి కలర్ కాంబినేషన్ బాగా తెలుసు. నా ఐడియాను తనతో షేర్ చేస్తే తను దానికి కలర్ కాంబినేషన్ చెప్తాడు’ భర్తకి కరుణ కితాబు. ‘తను హైదరాబాదీ. పెద్ద ఆర్టిస్ట్ (శ్రీహరి భోలేకర్) కూతురు. ఇంగ్లిష్‌లో దడదడలాడిస్తుంది. ఆమెకున్న ఈ ప్లస్లన్నీ నాలో మైనస్‌లు. పల్లెటూరి నేపథ్యం. వానాకాలం చదువు. ఇంగ్లిష్‌కి దూరం. ఇంగ్లిష్‌లో ఉన్న ఆర్ట్ బుక్స్ బాగా చదువుతుంది. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంగ్లిష్ మీద నేను పట్టు సాధించేందుకు హెల్ప్ చేస్తుంది’అంటూ భార్య సహచర్యం తన మైనస్‌లు ప్లస్ అయిన తీరును వివరించాడు సుందర్. ‘నేను ఇంటి పనుల్లో పూర్. మాకు రెండున్నరేళ్ల కూతురుంది. నా పీహెచ్డీ, ఆర్ట్ వర్క్ ఇవన్నిటితో పాపను చూసుకోవడం కుదరదు. ఆ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ సుందర్ బలవంతం వల్లే పీహెచ్డీ చేస్తున్నాను’అంటూ కుటుంబ నిర్వహణలో భర్త మోస్తున్న సగం బాధ్యతను చెప్పింది కరుణ. ‘చాలామంది ‘నువ్వూ పీహెచ్డీ చేయొచ్చుకదా..’ అని సలహాలిచ్చారు. ఎవరు ఎందులో పర్ఫెక్టో వాళ్లు ఆ పనిచేస్తే బాగుంటుంది. తనకు పీహెచ్డీ అంటే ఇంట్రెస్ట్ అందుకే ప్రోత్సహించాను. ఆమె అందులో బిజీ కాబట్టి ఇల్లు, పాప బాధ్యతను తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. నేను హౌజ్ హజ్బెండ్‌నని గర్వంగా చెప్తాను’ అన్నాడు సహచరుడు అన్న పదానికి అసలైన నిర్వచనంలా! పెళ్లాయ్యాక ఒకరికోసం ఒకరు మార్చుకున్న పద్ధతులు? ‘ఆయన సోషల్ యాక్టివిటీని కొంచెం తగ్గించుకున్నాడు. నా పట్ల హెల్పింగ్ నేచర్ పెరిగింది. నాకేం ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేదాకా నిద్రపోడు. నాకేమాత్రం ఇన్‌కన్వీనియెంట్ లేకుండా చూసుకుంటాడు’ మురిపెంగా కరుణ. ‘పెళ్లికి ముందు రిజిడ్‌గా, సెల్ఫిష్‌గా ఉండేదా.. ఇప్పుడు చాలా కలివిడిగా... లిబరల్గా మారింది. తనలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు తన ఫెలోషిప్ డబ్బులే మాకు ఆధారం. ఇంత కో ఆపరేట్ చేస్తుందని అనుకోలేదు’ సంబంరంగా చెప్పాడు సుందర్. ‘క్రెడిట్ అంతా తనదే’ కరుణ. ‘వర్క్ విషయంలో నా బెస్ట్ క్రిటిక్ తనే. నేను, నువ్వు అనే భావన ఉండదు మనమనే ఫీలే. అందుకే ఎవరికి బయటి నుంచి అప్రిసియేషన్స్ వచ్చినా ఇద్దరం హ్యాపీగా ఫీలవుతాం. నో జెలసీ’ సుందర్. ‘తను ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేస్తాడు. ఇండివిడ్యువల్ సక్సెస్కన్నా మా ఇద్దరి సక్సెస్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాడు’ కరుణ. ‘అన్ని విషయాల్లో ఇద్దరూ సమానమైన ప్రతిభ చూపలేరు. ఒకరు విజయం కోసం పోరాడుతున్నప్పుడు ఇంకొకరు అండగా నిలబడాలి’ అని సుందర్ అంటుంటే ‘మేం అదే ఫాలో అవుతున్నాం. ఒకరి ఎబిలిటీని ఇంకొకరం నిజాయితీ ఒప్పుకుంటాం. గౌరవిస్తాం. నమ్ముతాం’ అంటూ చెప్పింది కరుణ. ప్రేమలో పడడం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం అంటారు. అలా తమ ప్రేమను నిలబెట్టుకుందీ జంట! -
దేన్నీ అరికట్టలేనని తెలుసు కానీ...నా వంతుగా గళమెత్తుతాను!
‘‘పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు’’... నిక్కచ్చిగా ఖుష్బూ తన అభిప్రాయం చెప్పేశారు... భారతీయ వనితల నోటి నుంచి ఇలాంటి మాటలా? చాలామంది చెలరేగిపోయారు.. ఫలితంగా 22 కేసులు... ఇక ఖుష్బూ జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం.. చాలామంది ఊహించారు... కానీ సీన్ రివర్స్... ‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు’ అంటూ... ధర్మాసనం అన్ని కేసులూ కొట్టేసింది... ‘‘కథానాయికలు వేశ్యల్లాంటివారు...’’ ఓ దర్శకుడి వ్యాఖ్య.. ఎవరూ పట్టించుకోలేదు.. కానీ ఖుష్బూ నోరు విప్పారు.. ‘‘ఏమన్నావ్... నీ అంతు చూస్తా!’’.. అనేశారు... చివరికి ఆ దర్శకుడు దిగొచ్చి ‘సారీ’ చెప్పేశారు... అక్కడెక్కడో కుంబకోణంలోని పాఠశాలలో అగ్ని ప్రమాదం... 100 మంది పిల్లలు చనిపోయారు.. ఈసారి ఖుష్బూ నోరు విప్పలేదు... ‘ఇక నుంచి దేవుణ్ణి నమ్మకూడదు’.. అని ఫిక్సయ్యారు. సమాజంలో ఎక్కడేం జరిగినా తనకే కావాలి. ఎందుకులే అని ఊరుకుంటే ఎవరు ముందుకొస్తారు? అందుకే నేను సైతం అంటూ దూసుకెళ్తారీ ఫైర్ బ్రాండ్. నేడు ఖుష్బూ పుట్టినరోజు. ‘ఇంటర్వ్యూ కావాలి’ అంటూ ‘సాక్షి’ ఫోన్ చేస్తే.. ‘నేను తమిళ పత్రికలకు కూడా ఇవ్వడం లేదు.. ప్లీజ్ ఏమీ అనుకోకండి’ అనేశారు. రెండు, మూడు సార్లు ఫోన్లు, ఓ ఇ-మెయిల్ తర్వాత ‘ప్లీజ్ కాల్ మీ’ అంటూ ఎస్ఎమ్ఎ్స్... ఆ తర్వాత ఖుష్బూతో జరిపిన సంభాషణ ‘సాక్షి’కి ప్రత్యేకం... హాయ్ ఖుష్బూగారు... ఎలా ఉన్నారు? ఖుష్బూ: చాలా బాగున్నానండి. తెలుగు ప్రేక్షకులందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇవాళ మీ పుట్టినరోజు కదా.. ప్రత్యేకత ఏంటి? ఏమీ లేదు. నాకసలు పుట్టినరోజులు జరుపుకొనే అలవాటు లేదు. కానీ, మా పిల్లలు ఊరుకోరు కాబట్టి, వాళ్ల కోసం బయటికి ఎక్కడికైనా వెళుతుంటాం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే తత్వం నాది. అందుకే నాకు మాత్రం అన్ని రోజులూ ఒకేలా అనిపిస్తాయి. మీ ఇంట్లో ఏదో హడావిడిగా ఉన్నట్లుంది.. ఫోన్లో శబ్దాలు వినిపిస్తున్నాయి? నిజమే. ఈ రోజు (శనివారం) మా పెద్దమ్మాయి అవంతిక పుట్టినరోజు. నాకూ, మా ఆయనకూ పుట్టినరోజు వేడుకల మీద శ్రద్ధ లేనప్పటికీ పిల్లల సరదా కాదనలేం కదా! అందుకని చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశాం. తల్లితండ్రుల నుంచి పిల్లలు కొన్ని కొన్ని కోరుకుంటారు. వారి కోరికలను తీర్చడం మన బాధ్యత కదా! భలే ఉంది. రెండు రోజుల గ్యాప్‌లో మీ ఇంట్లో రెండు పుట్టినరోజు పండగలన్నమాట. అవంతిక పుట్టినప్పుడు మీకు కలిగిన అనుభూతిని ఓసారి గుర్తు చేసుకుంటారా? నా కడుపులోని బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ‘మీ బిడ్డ చాలా పొడవుగా, కొనదేరిన ముక్కుతో, గులాబీ రంగుతో ఉంది’ అని డాక్టర్ చెప్పగానే, ఆనందం పట్టలేక ఏడ్చేశాను. బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ స్పర్శ కలిగించిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మా చిన్ని దేవత అవంతిక మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆనందం రెట్టింపు అయ్యింది. అవంతికకు ఇప్పుడు పధ్నాలుగేళ్లు. ఆనందితకు పదకొండేళ్లు. ఇద్దరికీ తండ్రి పోలికలు ఎక్కువ. భార్యాభర్తల బంధాన్ని బిడ్డలు మరింత పటిష్ఠం చేస్తారు. అందుకు ఓ నిదర్శనం నా వైవాహిక బంధం. పెద్దయిన తర్వాత మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్ద పాప వాళ్ల నాన్నలా ఇంగ్లిష్ లిటరేచర్ చేయాలనుకుంటోంది. రెండో పాప కూడా వాళ్ల నాన్నలా సినీ టెక్నీషియన్ కావాలనుకుంటోంది. ఆమెకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ‘మేం ఆర్టిస్ట్‌లం అవుతాం’ అని మా పిల్లలిద్దరూ ఎప్పుడూ అనలేదు. మాకు కూడా ఆ ఉద్దేశం లేదు. మరి.. పెద్దయిన తర్వాత ఏమవుతారో చూడాలి. చాలామంది సెలబ్రిటీలు తమ పిల్లల ఆలనా పాలనను పనిమనుషులకు వదిలేసి, పార్టీలు, షికార్లంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారనే ఫీలింగ్ బయటివాళ్లకు ఉంటుంది... అది తప్పంటాను. మేమంతా ఇంట్లో పది మంది పనిమనుషులను పెట్టుకొని ఏ పుస్తకాలు చదువుకుంటూనో, టీవీ చూస్తూనో, పార్టీలు చేసుకుంటూనో గడిపేస్తామనుకుంటే పొరపాటు. నా పిల్లలకు నేను స్వయంగా వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్లకి స్కూల్ లేనప్పుడు ఆలస్యంగా నిద్ర లేస్తాను. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఉదయం 5 గంటలకల్లా నిద్రలేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టి, లంచ్ బాక్స్ రెడీ చేసి, పంపిస్తాను. ఎప్పుడైనా మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి కుదరలేదనుకోండి.. డిన్నర్లో నా స్వహస్తాలతో వండినదే తినిపిస్తా. మా పిల్లలు నన్ను సెలబ్రిటీ అనుకోరు. నేను నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ వాళ్ళు పూర్తిగా చూడనేలేదు. బయటివాళ్లెవరైనా ‘మీ అమ్మగారు గొప్ప ఆర్టిస్ట్’ అంటే ‘అవునా..’ అంటూ చిలిపిగా ఓ నవ్వు నవ్వుతారు. ఇప్పుడు చెప్పండి నేను ఓ సాదాసీదా తల్లినా? కాదా? నేను మాత్రమే కాదు... సుహాసిని, రాధ, రాధిక, నదియా.. వీళ్లందరూ తమ కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. కానీ అదేం తెలుసుకోకుండా ‘సెలబ్రిటీలు కదా..’ అని కొంతమంది ఏవేవో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. సమాజంలో జరిగే సంఘటనలకు మీరు ఎక్కువగా స్పందిస్తుంటారు. చాలామందిలా మనకేంటిలే అని ఊరుకోకపోవడం మిమ్మల్ని వివాదాలపాలు చేస్తోంది కదా..? చేయనివ్వండి.. ‘నేను బాగుంటే చాలు.. నా కుటుంబం బాగుంటే చాలు’ అనుకుంటే సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను స్వయంగా వెళ్లి, దేన్నీ అరికట్టలేను. అందుకే నా వంతుగా నాకు అనిపించింది, ధైర్యంగా చెబుతున్నాను. మన కళ్ల ముందు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మన జీవితానికి సంబంధం లేకపోయినా స్పందించాలనుకుంటాను. మంచి మాటలు చెప్పినప్పుడు వివాదాలపాలు కావడం సర్వసాధారణం. నేను చేసే వ్యాఖ్యలకు నిందించినా ఫరవాలేదు. ఎందుకంటే, నిందించేవాళ్లందరూ అపరిచితులే. ముక్కూ, మొహం తెలియనివాళ్లు అనే మాటలను మనసు వరకూ తీసుకెళ్లి, నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం పూర్తిగా కుటుంబానికే పరిమితమైపోయినట్లున్నారు. వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉండటంతో పాటు రాజకీయాలకు కూడా దూరం ఉంటున్నారెందుకని? తమిళంలో సినిమా చేసి ఐదారేళ్లయ్యింది. తెలుగులోనూ అంతే. కన్నడంలో చేసి ఎనిమిదేళ్లయ్యింది. మలయాళంలో మూడేళ్లయ్యింది. అది కూడా నేను పెట్టిన నిబంధనలకు అంగీకరించడం వల్లే మలయాళ సినిమా చేశాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్ చేస్తాననీ, సాయంత్రం ఆరు తర్వాత షూటింగ్ చేయననీ, ఒకవేళ రాత్రి తొమ్మిది గంటల వరకూ చేస్తే, మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకూ షూటింగ్‌కి రాననీ కరాఖండిగా చెప్పాను. ఆ నిబంధనలకు ఒప్పుకోవడంతో అంగీకరించాను. కానీ, నేనలా చేయడం తప్పు కదా! నేనో దర్శకుడి భార్యను. ఓ ఆర్టిస్ట్ ఇలా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్లిపోతానంటే దర్శకుడి కడుపు మంట ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలుసు. మా సొంత సంస్థలో తీస్తున్న సినిమాలకు నిర్మాతను నేను. ఓ ఆర్టిస్ట్ ఇన్ని కండిషన్లు పెడితే నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే, నా నిబంధనలతో ఇతరులను హింసించడం ఇష్టం లేక సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఈ మధ్య ‘గెట్ రెడీ’ అనే టీవీ షోకి యాంకర్‌గా చేశాను. అది 52 ఎపిసోడ్స్ పూర్తయ్యింది. తర్వాతి సీజన్‌ను ప్రారంభిస్తే చేయాలనుకుంటున్నా. అలాగే, మరో తమిళ టీవీ షో ‘మానాడ మయిలాడ’ 75 ఎపిసోడ్స్ పూర్తయ్యింది. ఇక చాలనిపించింది. రాజకీయాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి కామా పెట్టాను. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో ప్రస్తుతానికి చెప్పలేను. ఓవర్ వర్క్ చేశాననే ఫీలింగ్‌తో ఇప్పుడు రిలాక్స్ కావాలనుకుంటున్నారా? అది ఒక కారణం. నాకు పూర్తిగా ఇంట్లో ఉండాలనే ఆశ ఉంది. అందుకే, ఇంటిపట్టున ఉంటున్నా. మీరు తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ భర్త ఏమన్నారు? నేను వర్క్ చేస్తానన్నా ఆయన కాదనలేదు. ఇప్పుడు చేయనన్నా ఏమీ అనలేదు. పెళ్లయిన తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి కుదరడం లేదని, భర్త మీద ఆధారపడిపోతున్నానని బాధపడేలా నా జీవితం లేదు. మా ఇరవయ్యేళ్ల వైవాహిక జీవితంలో ‘ఇది చెయ్యొద్దు’ అని మా ఆయన అన్నది లేదు. ఒకవేళ నేను తీసుకునే నిర్ణయాల విషయంలో తికమక పడితే అప్పుడాయన సలహా అడుగుతాను. అప్పుడు కూడా తన అభిప్రాయం చెప్పి, ‘నాకిలా అనిపిస్తోంది... నీక్కూడా సరైనదనిపిస్తే ఇలానే చెయ్.. లేకపోతే వేరే ఆలోచించు’ అంటారు. ఈ మధ్య సుందర్‌గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. ఆ విజయంలో మీ భాగస్వామ్యం ఎంత? దేని కోసమూ ఆయనను వేధించను. అదే నా భాగస్వామ్యం. ‘ఏ సినిమా చేయబోతున్నారు? కథ ఏంటి? ఆర్టిస్టులెవరు?’ అని ప్రశ్నలతో విసిగించను. ఆయన పనిని సంపూర్ణంగా చేసుకోనిస్తాను. ఆయన చాలా కూల్ పర్సన్. ఒకేసారి ఐదు, పది సినిమాలు చేసేయాలనుకోరు. అటు సినిమాలనూ, ఇటు ఇంటినీ చక్కగా పట్టించుకుంటారు. ఉత్తరాది అమ్మాయి అయిన మీరు.. దక్షిణాది ఇంటి కోడలినవుతానని కలలో అయినా అనుకున్నారా? అస్సలు లేదండి. జీవితం అంతే! ఏదీ మన చేతుల్లో ఉండదు! ఇరవైఅయిదేళ్ల క్రితం నేను మద్రాసు (ఇప్పటి చెన్నై)లో అడుగుపెట్టినప్పుడు నటిగా రాణిస్తాననీ, దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటిస్తాననీ అనుకోలేదు. చివరికి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు తమిళ అమ్మాయిని అయిపోయాను. మీరేమో ఉత్తరం.. సుందర్‌గారు దక్షిణం.. మరి అత్తగారింట్లో సులువుగానే ఇమిడిపోగలిగారా? ఓ ఆరేళ్లు డేటింగ్ చేసిన తర్వాత మేం పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందే నేను సుందర్ ఇంటికి వెళ్లేదాన్ని. ఇంట్లో అందరితోనూ కలుపుగోలుతనంగా ఉండేదాన్ని. అందుకని, ఆ ఇంటి కోడలైన తర్వాత సులువుగానే ఇమిడిపోగలిగాను. పుట్టినిల్లు ముంబయ్.. మెట్టినిల్లు చెన్నైల్లో మీకు దేని మీద మమకారం ఎక్కువ? ఇది క్లిష్టమైన ప్రశ్న. పుట్టిన ఊరు మీద మమకారం చంపుకోలేం. మిగతా జీవితాన్ని గడపాల్సిన ఊరి మీద కూడా ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. నేను ముంబయ్‌లో ఉన్నది 16 ఏళ్లు. చెన్నయ్‌తో నా అనుబంధం 27 ఏళ్లు. రెండు భిన్న సంస్కృతులకు సంబంధించిన జీవితం చూశామని అనిపించడం లేదు. ఉత్తరం, దక్షిణం అనే గీత చెరిగిపోయింది. మీరు దేవుణ్ణి నమ్మరట.. దానికి కారణం ఏదైనా ఉందా? దాదాపు పదేళ్ల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం నా మనసును మార్చేసింది. ఆ ప్రమాదంలో సుమారు వంద మంది పిల్లలు చనిపోయారు. పెద్దవాళ్లు చనిపోతే ఏదో పాపం చేసి ఉంటారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, చనిపోయింది అభం శుభం తెలియని పసివాళ్లు. దేవుడే ఉండి ఉంటే.. ఎందుకు కాపాడలేకపోయాడు? అని ఆ రోజు చిన్నపాటి సందేహం కలిగింది. ఆ సందేహమే అపనమ్మకానికి దారి తీసింది. మరి.. మీ భర్త కూడా నాస్తికవాదేనా? ఆయనకు దైవభక్తి ఎక్కువ. పూజలు, పునస్కారాలు బాగా చేస్తారు. గుడికి వెళుతుంటారు. ఆయన గుడికి వెళుతున్నప్పుడు, నేనూ వస్తానంటాను. ‘వద్దులే’ అనేస్తారు. కుటుంబంతో సహా మీరెళ్లే హాలిడే స్పాట్? నాకు ఊటీ అంటే ఇష్టం. మాకు అక్కడో ఇల్లు కూడా ఉంది. మా పిల్లలకు స్కూల్ హాలిడేస్ అప్పుడు అక్కడికి వెళుతుంటాం. విదేశాల్లో న్యూజిలాండ్, సింగపూర్, లండన్ ఇష్టం. అక్కడికి కూడా వెళుతుంటాం. కథానాయికగా చేస్తున్నప్పుడు మీ సమకాలీన తారల్లో మీరే బొద్దుగా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉన్నారు.. ఎప్పుడూ సన్నబడాలనుకోలేదా? ఆడవాళ్లకు సరైన కొలతలు 36-24-36 అంటారు. నేనా కొలతలను ఎప్పుడూ పట్టించుకోలేదు. నేనెలా ఉన్నానో అలానే నాకిష్టం. మీ శరీరం బరువెంత? నడుము కొలత ఎంత? అన్నది కాదు... ఆరోగ్యంగా ఉన్నారా? లేదా అన్నదే ముఖ్యం. నాకు బీపీ, షుగర్ లేవు. కంటి చూపు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు జీరో సైజ్ ఫ్యాషన్ కదా? ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. నాకిలా ఉండటమే ఇష్టం. ఎక్కువగా చీరలే కట్టుకుంటారెందుకని? సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నాను కానీ.. నాకు మాత్రం చీరలే ఇష్టం. చీరలో ఉన్న అందం వేరే ఎందులో ఉంటుంది! మీ పిల్లలు మోడ్రన్ డ్రెస్లేసుకోమని చెప్పరా? ఈ విషయంలో మా ఇంట్లో వాదనలు జరుగుతుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి బయటికెళుతున్నప్పుడు చుడీదార్లు వేసుకోమని చెబుతుంటారు. నేనేమో చీరలే కట్టుకుంటా అంటే గొడవ గొడవ చేసేస్తారు. మీ మేనిఛాయ చాలా బాగుంటుంది. ఆ రహస్యం చెబుతారా? మా అమ్మానాన్నల స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. నేను ఫేషియల్ కూడా చేయించుకోను. సినిమాల్లో నటించేటప్పుడు కూడా తక్కువ మేకప్ వాడతాను. మీ మనసు స్వచ్ఛంగా ఉంటే.. అది మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. నా ఒంటి మెరుపుకు ఒక కారణం జీన్స్ అయితే మరో కారణం ఇదే! ఫైనల్‌గా... ఒక్కసారి మీ జీవితాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? ఇంకా అంత జీవితాన్ని చూడలేదు. నలభై ఏళ్ల వయసులోనే అసలు జీవితం ప్రారంభం అవుతుందంటారు. సో.. నా జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రస్తుతానికి చాలా బాగుంది. భవిష్యత్తు ఇంకా ఆనందంగా ఉంటుందనుకుంటున్నా. - డి.జి. భవాని సుహాసిని నా బెస్ట్ ఫ్రెండ్ నటి సుహాసిని నా బెస్ట్ ఫ్రెండ్. రాత్రి ఒంటి గంటకు కూడా ఫోన్ చేసి, నా మనోభావాలను చెప్పుకునేంత స్నేహం మా మధ్య ఉంది. ఇప్పటి కథానాయికల్లో త్రిష మంచి స్నేహితురాలు. ఇంకా కొరియోగ్రాఫర్ బృంద, నిర్మాత పంజు అరుణాచలంగారి అబ్బాయి పంజు సుబ్బు, ఒకప్పుడు చిరంజీవిగారితో ‘స్వర్ణ’ అనే అమ్మాయి సినిమాలు చేసింది కదా.. తన అసలు పేరు సుజాతా విజయ్‌కుమార్... ఆమె కూడా మంచి స్నేహితురాలు. -
విశాల్‌తో హన్సిక
నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు క్రేజీ నటి హన్సిక రెడీ అవుతున్నారు. వీరి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించనుంది. నిజానికి హన్సిక పూజై చిత్రంలోనే విశాల్ జత కట్టాల్సింది. కాల్షీట్స్ సమస్య కారణంగా అది కుదరలేదు. విశాల్ ప్రస్తుతం నటిస్తున్న పూజై చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. పాటల చిత్రీకరణకు చిత్ర యూనిట్ విదేశాలకు బయలుదేరనుంది. తదుపరి చిత్రానికి విశాల్ సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లోనే నిర్మించనున్నారు. దీనికి సుందర్.సి దర్శకత్వం వహించనున్నారు. మరో విషయం ఏమిటంటే సుందర్.సి దర్శకత్వంలో హన్సిక మూడవసారి నటించనున్న చిత్రం ఇది. ఇంతకుముందు తియవెలై సెయ్యనుం కుమారు రీమేక్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం సుందర్.సి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న అరణ్మణై చిత్రంలోను హన్సికనే ప్రధాన హీరోయిన్. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. విశాల్, హన్సికల కాంబినేషన్లో సుందర్.సి ఎంటర్‌టైయినర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం జూలై 9న ప్రారంభం కానుందని తాజా సమాచారం. ఒక కీలక పాత్రలో నటి సిమ్రాన్ నటించనున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు.