దేన్నీ అరికట్టలేనని తెలుసు కానీ...నా వంతుగా గళమెత్తుతాను! | khushboo birthday special interview with sakshi | Sakshi
Sakshi News home page

దేన్నీ అరికట్టలేనని తెలుసు కానీ...నా వంతుగా గళమెత్తుతాను!

Published Sun, Sep 28 2014 10:45 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

khushboo birthday special interview with sakshi

 ‘‘పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు’’...
 నిక్కచ్చిగా ఖుష్బూ తన అభిప్రాయం చెప్పేశారు...
 భారతీయ వనితల నోటి నుంచి ఇలాంటి మాటలా?
 చాలామంది చెలరేగిపోయారు.. ఫలితంగా 22 కేసులు...
 ఇక ఖుష్బూ జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయం..
 చాలామంది ఊహించారు... కానీ సీన్ రివర్స్...
 ‘ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు’ అంటూ...
 ధర్మాసనం అన్ని కేసులూ కొట్టేసింది...
 ‘‘కథానాయికలు వేశ్యల్లాంటివారు...’’ ఓ దర్శకుడి వ్యాఖ్య..
 ఎవరూ పట్టించుకోలేదు.. కానీ ఖుష్బూ నోరు విప్పారు..
 ‘‘ఏమన్నావ్... నీ అంతు చూస్తా!’’.. అనేశారు...
 చివరికి ఆ దర్శకుడు దిగొచ్చి ‘సారీ’ చెప్పేశారు...
 అక్కడెక్కడో కుంబకోణంలోని పాఠశాలలో అగ్ని ప్రమాదం...
 100 మంది పిల్లలు చనిపోయారు.. ఈసారి ఖుష్బూ నోరు విప్పలేదు...
 ‘ఇక నుంచి దేవుణ్ణి నమ్మకూడదు’.. అని ఫిక్సయ్యారు.
 సమాజంలో ఎక్కడేం జరిగినా తనకే కావాలి.
 ఎందుకులే అని ఊరుకుంటే ఎవరు ముందుకొస్తారు?
 అందుకే నేను సైతం అంటూ దూసుకెళ్తారీ ఫైర్ బ్రాండ్.
 నేడు ఖుష్బూ పుట్టినరోజు.
 ‘ఇంటర్వ్యూ కావాలి’ అంటూ ‘సాక్షి’ ఫోన్ చేస్తే..
 ‘నేను తమిళ పత్రికలకు కూడా ఇవ్వడం లేదు.. ప్లీజ్ ఏమీ అనుకోకండి’ అనేశారు.
 రెండు, మూడు సార్లు ఫోన్లు, ఓ ఇ-మెయిల్ తర్వాత ‘ప్లీజ్ కాల్ మీ’ అంటూ ఎస్‌ఎమ్‌ఎ్‌స్...
 ఆ తర్వాత ఖుష్బూతో జరిపిన సంభాషణ ‘సాక్షి’కి ప్రత్యేకం...

హాయ్ ఖుష్బూగారు... ఎలా ఉన్నారు?
ఖుష్బూ: చాలా బాగున్నానండి. తెలుగు ప్రేక్షకులందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను.
 
ఇవాళ మీ పుట్టినరోజు కదా.. ప్రత్యేకత ఏంటి?
ఏమీ లేదు. నాకసలు పుట్టినరోజులు జరుపుకొనే అలవాటు లేదు. కానీ, మా పిల్లలు ఊరుకోరు కాబట్టి, వాళ్ల కోసం బయటికి ఎక్కడికైనా వెళుతుంటాం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే తత్వం నాది. అందుకే  నాకు మాత్రం అన్ని రోజులూ ఒకేలా అనిపిస్తాయి.
 
మీ ఇంట్లో ఏదో హడావిడిగా ఉన్నట్లుంది.. ఫోన్‌లో శబ్దాలు వినిపిస్తున్నాయి?
నిజమే. ఈ రోజు (శనివారం) మా పెద్దమ్మాయి అవంతిక పుట్టినరోజు. నాకూ, మా ఆయనకూ పుట్టినరోజు వేడుకల మీద శ్రద్ధ లేనప్పటికీ పిల్లల సరదా కాదనలేం కదా! అందుకని చిన్న సెలబ్రేషన్ ఏర్పాటు చేశాం. తల్లితండ్రుల నుంచి పిల్లలు కొన్ని కొన్ని కోరుకుంటారు. వారి కోరికలను తీర్చడం మన బాధ్యత కదా!
 
భలే ఉంది. రెండు రోజుల గ్యాప్‌లో మీ ఇంట్లో రెండు పుట్టినరోజు పండగలన్నమాట. అవంతిక పుట్టినప్పుడు మీకు కలిగిన అనుభూతిని ఓసారి గుర్తు చేసుకుంటారా?
నా కడుపులోని బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ‘మీ బిడ్డ చాలా పొడవుగా, కొనదేరిన ముక్కుతో, గులాబీ రంగుతో ఉంది’ అని డాక్టర్ చెప్పగానే, ఆనందం పట్టలేక ఏడ్చేశాను. బిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ స్పర్శ కలిగించిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మా చిన్ని దేవత అవంతిక మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఆనందం రెట్టింపు అయ్యింది. అవంతికకు ఇప్పుడు పధ్నాలుగేళ్లు. ఆనందితకు పదకొండేళ్లు. ఇద్దరికీ తండ్రి పోలికలు ఎక్కువ. భార్యాభర్తల బంధాన్ని బిడ్డలు మరింత పటిష్ఠం చేస్తారు. అందుకు ఓ నిదర్శనం నా వైవాహిక బంధం.
 
పెద్దయిన తర్వాత మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు?
పెద్ద పాప వాళ్ల నాన్నలా ఇంగ్లిష్ లిటరేచర్ చేయాలనుకుంటోంది. రెండో పాప కూడా వాళ్ల నాన్నలా సినీ టెక్నీషియన్ కావాలనుకుంటోంది. ఆమెకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ‘మేం ఆర్టిస్ట్‌లం అవుతాం’ అని మా పిల్లలిద్దరూ ఎప్పుడూ అనలేదు. మాకు కూడా ఆ ఉద్దేశం లేదు. మరి.. పెద్దయిన తర్వాత ఏమవుతారో చూడాలి.
 
చాలామంది సెలబ్రిటీలు తమ పిల్లల ఆలనా పాలనను పనిమనుషులకు వదిలేసి, పార్టీలు, షికార్లంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారనే ఫీలింగ్ బయటివాళ్లకు ఉంటుంది...
అది తప్పంటాను. మేమంతా ఇంట్లో పది మంది పనిమనుషులను పెట్టుకొని ఏ పుస్తకాలు చదువుకుంటూనో, టీవీ చూస్తూనో, పార్టీలు చేసుకుంటూనో గడిపేస్తామనుకుంటే పొరపాటు. నా పిల్లలకు నేను స్వయంగా వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. వాళ్లకి స్కూల్ లేనప్పుడు ఆలస్యంగా నిద్ర లేస్తాను. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఉదయం 5 గంటలకల్లా నిద్రలేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టి, లంచ్ బాక్స్ రెడీ చేసి, పంపిస్తాను. ఎప్పుడైనా మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి కుదరలేదనుకోండి.. డిన్నర్‌లో నా స్వహస్తాలతో వండినదే తినిపిస్తా. మా పిల్లలు నన్ను సెలబ్రిటీ అనుకోరు. నేను నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకూ వాళ్ళు పూర్తిగా చూడనేలేదు. బయటివాళ్లెవరైనా ‘మీ అమ్మగారు గొప్ప ఆర్టిస్ట్’ అంటే ‘అవునా..’ అంటూ చిలిపిగా ఓ నవ్వు నవ్వుతారు. ఇప్పుడు చెప్పండి నేను ఓ సాదాసీదా తల్లినా? కాదా? నేను మాత్రమే కాదు... సుహాసిని, రాధ,  రాధిక, నదియా.. వీళ్లందరూ తమ కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. కానీ అదేం తెలుసుకోకుండా ‘సెలబ్రిటీలు కదా..’ అని కొంతమంది ఏవేవో స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తారు.
 
సమాజంలో జరిగే సంఘటనలకు మీరు ఎక్కువగా స్పందిస్తుంటారు. చాలామందిలా మనకేంటిలే అని ఊరుకోకపోవడం మిమ్మల్ని వివాదాలపాలు చేస్తోంది కదా..?
చేయనివ్వండి.. ‘నేను బాగుంటే చాలు.. నా కుటుంబం బాగుంటే చాలు’ అనుకుంటే సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను స్వయంగా వెళ్లి, దేన్నీ అరికట్టలేను. అందుకే నా వంతుగా నాకు అనిపించింది, ధైర్యంగా చెబుతున్నాను. మన కళ్ల ముందు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మన జీవితానికి సంబంధం లేకపోయినా స్పందించాలనుకుంటాను. మంచి మాటలు చెప్పినప్పుడు వివాదాలపాలు కావడం సర్వసాధారణం. నేను చేసే వ్యాఖ్యలకు నిందించినా ఫరవాలేదు. ఎందుకంటే, నిందించేవాళ్లందరూ అపరిచితులే. ముక్కూ, మొహం తెలియనివాళ్లు అనే మాటలను మనసు వరకూ తీసుకెళ్లి, నా సమయాన్ని వృథా చేసుకోను. నాకు కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి.
 
 ప్రస్తుతం పూర్తిగా కుటుంబానికే పరిమితమైపోయినట్లున్నారు. వెండితెర, బుల్లితెరకు దూరంగా ఉండటంతో పాటు రాజకీయాలకు కూడా దూరం ఉంటున్నారెందుకని?
తమిళంలో సినిమా చేసి ఐదారేళ్లయ్యింది. తెలుగులోనూ అంతే. కన్నడంలో చేసి ఎనిమిదేళ్లయ్యింది. మలయాళంలో మూడేళ్లయ్యింది. అది కూడా నేను పెట్టిన నిబంధనలకు అంగీకరించడం వల్లే మలయాళ సినిమా చేశాను. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్ చేస్తాననీ, సాయంత్రం ఆరు తర్వాత షూటింగ్ చేయననీ, ఒకవేళ రాత్రి తొమ్మిది గంటల వరకూ చేస్తే, మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకూ షూటింగ్‌కి రాననీ కరాఖండిగా చెప్పాను. ఆ నిబంధనలకు ఒప్పుకోవడంతో అంగీకరించాను. కానీ, నేనలా చేయడం తప్పు కదా! నేనో దర్శకుడి భార్యను. ఓ ఆర్టిస్ట్ ఇలా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెళ్లిపోతానంటే దర్శకుడి కడుపు మంట ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలుసు. మా సొంత సంస్థలో తీస్తున్న సినిమాలకు నిర్మాతను నేను. ఓ ఆర్టిస్ట్ ఇన్ని కండిషన్లు పెడితే నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే, నా నిబంధనలతో ఇతరులను హింసించడం ఇష్టం లేక సినిమాలకు దూరంగా ఉంటున్నా. ఈ మధ్య ‘గెట్ రెడీ’ అనే టీవీ షోకి యాంకర్‌గా చేశాను. అది 52 ఎపిసోడ్స్ పూర్తయ్యింది. తర్వాతి సీజన్‌ను ప్రారంభిస్తే చేయాలనుకుంటున్నా. అలాగే, మరో తమిళ టీవీ షో ‘మానాడ మయిలాడ’ 75 ఎపిసోడ్స్ పూర్తయ్యింది. ఇక చాలనిపించింది. రాజకీయాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి కామా పెట్టాను. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో ప్రస్తుతానికి చెప్పలేను.
 
 ఓవర్ వర్క్ చేశాననే ఫీలింగ్‌తో ఇప్పుడు రిలాక్స్ కావాలనుకుంటున్నారా?
 అది ఒక కారణం. నాకు పూర్తిగా ఇంట్లో ఉండాలనే ఆశ ఉంది. అందుకే, ఇంటిపట్టున ఉంటున్నా.
 
మీరు తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ భర్త ఏమన్నారు?
నేను వర్క్ చేస్తానన్నా ఆయన కాదనలేదు. ఇప్పుడు చేయనన్నా ఏమీ అనలేదు. పెళ్లయిన తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి కుదరడం లేదని, భర్త మీద ఆధారపడిపోతున్నానని బాధపడేలా నా జీవితం లేదు. మా ఇరవయ్యేళ్ల వైవాహిక జీవితంలో ‘ఇది చెయ్యొద్దు’ అని మా ఆయన అన్నది లేదు. ఒకవేళ నేను తీసుకునే నిర్ణయాల విషయంలో తికమక పడితే అప్పుడాయన సలహా అడుగుతాను. అప్పుడు కూడా తన అభిప్రాయం చెప్పి, ‘నాకిలా అనిపిస్తోంది... నీక్కూడా సరైనదనిపిస్తే ఇలానే చెయ్.. లేకపోతే వేరే ఆలోచించు’ అంటారు.
 
ఈ మధ్య సుందర్‌గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. ఆ విజయంలో మీ భాగస్వామ్యం ఎంత?
దేని కోసమూ ఆయనను వేధించను. అదే నా భాగస్వామ్యం. ‘ఏ సినిమా చేయబోతున్నారు? కథ ఏంటి? ఆర్టిస్టులెవరు?’ అని ప్రశ్నలతో విసిగించను. ఆయన పనిని సంపూర్ణంగా చేసుకోనిస్తాను. ఆయన చాలా కూల్ పర్సన్. ఒకేసారి ఐదు, పది సినిమాలు చేసేయాలనుకోరు. అటు సినిమాలనూ, ఇటు ఇంటినీ చక్కగా పట్టించుకుంటారు.
 
ఉత్తరాది అమ్మాయి అయిన మీరు.. దక్షిణాది ఇంటి కోడలినవుతానని కలలో అయినా అనుకున్నారా?
అస్సలు లేదండి. జీవితం అంతే! ఏదీ మన చేతుల్లో ఉండదు! ఇరవైఅయిదేళ్ల క్రితం నేను మద్రాసు (ఇప్పటి చెన్నై)లో అడుగుపెట్టినప్పుడు నటిగా రాణిస్తాననీ, దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటిస్తాననీ అనుకోలేదు. చివరికి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు తమిళ అమ్మాయిని అయిపోయాను.
 
మీరేమో ఉత్తరం.. సుందర్‌గారు దక్షిణం.. మరి అత్తగారింట్లో సులువుగానే ఇమిడిపోగలిగారా?
ఓ ఆరేళ్లు డేటింగ్ చేసిన తర్వాత మేం పెళ్లి చేసుకున్నాం. పెళ్లికి ముందే నేను సుందర్ ఇంటికి వెళ్లేదాన్ని. ఇంట్లో అందరితోనూ కలుపుగోలుతనంగా ఉండేదాన్ని. అందుకని, ఆ ఇంటి కోడలైన తర్వాత సులువుగానే ఇమిడిపోగలిగాను.
 
పుట్టినిల్లు ముంబయ్.. మెట్టినిల్లు చెన్నైల్లో మీకు దేని మీద మమకారం ఎక్కువ?
ఇది క్లిష్టమైన ప్రశ్న. పుట్టిన ఊరు మీద మమకారం చంపుకోలేం. మిగతా జీవితాన్ని గడపాల్సిన ఊరి మీద కూడా ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. నేను ముంబయ్‌లో ఉన్నది 16 ఏళ్లు. చెన్నయ్‌తో నా అనుబంధం 27 ఏళ్లు. రెండు భిన్న సంస్కృతులకు సంబంధించిన జీవితం చూశామని అనిపించడం లేదు. ఉత్తరం, దక్షిణం అనే గీత  చెరిగిపోయింది.
 
మీరు దేవుణ్ణి నమ్మరట.. దానికి కారణం ఏదైనా ఉందా?
దాదాపు పదేళ్ల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం నా మనసును మార్చేసింది. ఆ ప్రమాదంలో సుమారు వంద మంది పిల్లలు చనిపోయారు. పెద్దవాళ్లు చనిపోతే ఏదో పాపం చేసి ఉంటారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, చనిపోయింది అభం శుభం తెలియని పసివాళ్లు. దేవుడే ఉండి ఉంటే.. ఎందుకు కాపాడలేకపోయాడు? అని ఆ రోజు చిన్నపాటి సందేహం కలిగింది. ఆ సందేహమే అపనమ్మకానికి దారి తీసింది.
 
మరి.. మీ భర్త కూడా నాస్తికవాదేనా?
ఆయనకు దైవభక్తి ఎక్కువ. పూజలు, పునస్కారాలు బాగా చేస్తారు. గుడికి వెళుతుంటారు. ఆయన గుడికి వెళుతున్నప్పుడు, నేనూ వస్తానంటాను. ‘వద్దులే’ అనేస్తారు.
 
కుటుంబంతో సహా మీరెళ్లే హాలిడే స్పాట్?
నాకు ఊటీ అంటే ఇష్టం. మాకు అక్కడో ఇల్లు కూడా ఉంది. మా పిల్లలకు స్కూల్ హాలిడేస్ అప్పుడు అక్కడికి వెళుతుంటాం. విదేశాల్లో న్యూజిలాండ్, సింగపూర్, లండన్ ఇష్టం. అక్కడికి కూడా వెళుతుంటాం.
 
కథానాయికగా చేస్తున్నప్పుడు మీ సమకాలీన తారల్లో మీరే బొద్దుగా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉన్నారు.. ఎప్పుడూ సన్నబడాలనుకోలేదా?
ఆడవాళ్లకు సరైన కొలతలు 36-24-36 అంటారు. నేనా కొలతలను ఎప్పుడూ పట్టించుకోలేదు. నేనెలా ఉన్నానో అలానే నాకిష్టం. మీ శరీరం బరువెంత? నడుము కొలత ఎంత? అన్నది కాదు... ఆరోగ్యంగా ఉన్నారా? లేదా అన్నదే ముఖ్యం. నాకు బీపీ, షుగర్ లేవు. కంటి చూపు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి?
 
ఇప్పుడు జీరో సైజ్ ఫ్యాషన్ కదా?
ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు. నాకిలా ఉండటమే ఇష్టం.
 
ఎక్కువగా చీరలే కట్టుకుంటారెందుకని?
సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకున్నాను కానీ.. నాకు మాత్రం చీరలే ఇష్టం. చీరలో ఉన్న అందం వేరే ఎందులో ఉంటుంది!
 
మీ పిల్లలు మోడ్రన్ డ్రెస్‌లేసుకోమని చెప్పరా?
ఈ విషయంలో మా ఇంట్లో వాదనలు జరుగుతుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి బయటికెళుతున్నప్పుడు చుడీదార్లు వేసుకోమని చెబుతుంటారు. నేనేమో చీరలే కట్టుకుంటా అంటే గొడవ గొడవ చేసేస్తారు.
 
మీ మేనిఛాయ చాలా బాగుంటుంది. ఆ రహస్యం చెబుతారా?
మా అమ్మానాన్నల స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. నేను ఫేషియల్ కూడా చేయించుకోను. సినిమాల్లో నటించేటప్పుడు కూడా తక్కువ మేకప్ వాడతాను. మీ మనసు స్వచ్ఛంగా ఉంటే.. అది మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. నా ఒంటి మెరుపుకు ఒక కారణం జీన్స్ అయితే మరో కారణం ఇదే!
 
ఫైనల్‌గా... ఒక్కసారి మీ జీవితాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
ఇంకా అంత జీవితాన్ని చూడలేదు. నలభై ఏళ్ల వయసులోనే అసలు జీవితం ప్రారంభం అవుతుందంటారు. సో.. నా జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. ప్రస్తుతానికి చాలా బాగుంది. భవిష్యత్తు ఇంకా ఆనందంగా ఉంటుందనుకుంటున్నా.
 
 - డి.జి. భవాని

సుహాసిని నా బెస్ట్ ఫ్రెండ్
నటి సుహాసిని నా బెస్ట్ ఫ్రెండ్. రాత్రి ఒంటి గంటకు కూడా ఫోన్ చేసి, నా మనోభావాలను చెప్పుకునేంత స్నేహం మా మధ్య ఉంది. ఇప్పటి కథానాయికల్లో త్రిష మంచి స్నేహితురాలు. ఇంకా కొరియోగ్రాఫర్ బృంద, నిర్మాత పంజు అరుణాచలంగారి అబ్బాయి పంజు సుబ్బు, ఒకప్పుడు చిరంజీవిగారితో ‘స్వర్ణ’ అనే అమ్మాయి సినిమాలు చేసింది కదా.. తన అసలు పేరు సుజాతా విజయ్‌కుమార్... ఆమె కూడా మంచి స్నేహితురాలు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement