వేవిళ్ల బాధ ఎక్కువగా ఉంది...!
నా వయసు 24. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఇదే తొలిచూలు. ప్రస్తుతం రెండోనెల. నాకు వేవిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఉండటంతో ఆహారం తీసుకోలేకపోతున్నాను. పైగా తిన్నది కాస్తా వాంతుల రూపంలో వెళ్లిపోతోంది. ఇదేమైనా ప్రమాదమా? నాకు సరైన సలహా ఇవ్వండి.
- సులోచన, తుని
గర్భధారణ జరిగాక వేవిళ్ల వల్ల వికారం (నాసియా), వాంతులు చాలా సాధారణం. ఇవి 10వ వారం ప్రెగ్నెన్సీ సమయంలో గరిష్ఠంగా ఉంటాయి. అంటే దాదాపు రెండున్నర నెలల సమయంలోనన్నమాట. సాధారణంగా ఇలా వికారం, వాంతులు అన్నవి ఉదయం వేళల్లోనే ఎక్కువ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది సాయంత్రాలతో సహా ఏ వేళల్లోనైనా ఉండవచ్చు.
ఇలా వేవిళ్ల వాంతులు కావడం అన్నది ఎన్నిసార్లు జరిగితే అది సమస్యగా పరిగణించవచ్చంటూ మీలాగే చాలామంది అడుగుతుంటారు. దీనికి నిర్దిష్టంగా ఒక లెక్కంటూ లేదు. చాలా సుకుమారంగా ఉండేవాళ్లలో కేవలం రెండు మూడుసార్లకే నీరసపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఐదారు సార్లు వాంతులైనా తట్టుకోగలరు. ఇక దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అంటే... అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్నవాళ్లయితే వాంతులు అవుతున్న కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దాన్ని పెద్ద ఇబ్బందిగానూ, సమస్యగానూ పరిగణించాల్సి అవసరం లేదు. ఐదోనెల వరకూ ఇలా ఉండవచ్చు. అప్పటి వరకూ దీనివల్ల బరువు పెరగకపోయినా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఐదునెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి.
వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటిచిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. ఇంటి చిట్కా విషయానికి వస్తే అల్లం మురబ్బా తీసుకోవడం గాని లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది.
ఇక ఆహార మార్పుల విషయానికి వస్తే... చాలామంది మహిళలకు ఈ సమయంలో వారి ఆహారపు అలవాట్లు మారినట్లుగా ఉంటాయి. అంటే... అంతకుమునుపు స్వీట్స్ ఇష్టపడని వారికి ఈ సమయంలో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాగే అంతకు మునుపు కారాలు, మసాలాలు అస్సలు ముట్టని వారికి, ఈ సమయంలో వాటిని ఎక్కువగా తీసుకోవాలని అనిపించవచ్చు. అయితే ఈ సమయంలో చేయాల్సిన ఆహారపు మార్పులంటూ పెద్దగా ఉండవు. అన్ని రకాల పదార్థాలూ తీసుకోవచ్చు. కాకపోతే మసాలాలు తగ్గించాలంతే.
సాధారణంగా వేవిళ్ల బాధ మూడోనెల వరకూ ఉంటుంది. కొంతమందిలో ఐదో నెల వరకూ ఉండవచ్చు. అయితే ఐదునెలల తర్వాత కూడా తగ్గకుండా అదేపనిగా వాంతులవుతూ ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు వాంతులు తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక కొందరిలో వాంతులు చాలా ఎక్కువగా ఉంటాయి. కడుపులో కవలలు ఉన్నా లేదా కొందరిలో ముత్యాలగర్భం ఉన్నా ఇలా జరుగుతుంటుంది. అందుకే వేవిళ్లు మరీ ఎక్కువగానూ/ తీవ్రంగానూ ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయించుకుని, అసాధారణ గర్భం ఏదైనా ఉందేమో అన్నవిషయాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా, నిశ్చింతగా మీ డాక్టర్ / గైనకాలజిస్ట్ ఫాలో అప్‌లో ఉండండి.
డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్