Hemoglobin
-
తల్లీ బిడ్డలకు ఆరోగ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: రక్త హీనతను పూర్తి స్థాయిలో అరికట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జీవన శైలిలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాయామాల ఆవశ్యకతను వివరిస్తూ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒకసారి క్యాంపు నిర్వహించేలా చూడాలన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి రక్తహీనత, పౌష్టికాహార లోపం బాధితులను గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వారందరికీ పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందులు ఇచ్చే బాధ్యతను ఆరోగ్యశాఖ తీసుకుంటుందని, పౌష్టికాహారం బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ చేపట్టాలని నిర్దేశించారు. ఈ విషయంలో ఆయా సచివాలయాల పరిధిలో వైద్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. తద్వారా గ్రామ స్థాయిలో రక్త హీనతను పూర్తిస్థాయిలో నివారించగలుగుతామన్నారు. తగ్గిందో లేదో పర్యవేక్షించాలి పౌష్టికాహారాన్ని తీసుకున్నాక బాధితుల్లో రక్తహీనత తగ్గుతోందా లేదా? అనే అంశంపై కూడా దృష్టి పెట్టాలి. ఇచ్చిన పౌష్టికాహారాన్ని వారు తీసుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్థారించుకోవాలి. సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్న సమయంలోనే గర్భిణిలు, పిల్లలకు టీకాలు అందించారా? లేదా? అనే అంశాలను కూడా పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒకవేళ టీకాలు మిస్ అయితే వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంబంధిత గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఆ సమయంలో అక్కడే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. యాప్‌లో వివరాలు నమోదు పిల్లలు తమ వయసుకు తగ్గట్టుగా బరువు ఉన్నారా? లేదా? అన్నదానిపై కూడా అక్కడే పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఎవరైనా పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉంటే వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించిన వెంటనే ఆ వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తెచ్చి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో సచివాలయాల వారీగా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. డ్రై రేషన్‌పై ప్రత్యేక దృష్టి వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలుపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత నిశితంగా పర్యవేక్షించాలని నిర్దేశించారు. అంగన్వాడీలలో సూపర్ వైజరీ వ్యవస్ధ ఎలా పని చేస్తోందన్న దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఇందుకోసం బలమైన ఎస్‌వోపీని రూపొందించాలని సూచించారు. డ్రై రేషన్ పంపిణీపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రేషన్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్ బాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం.జానకి, పౌరసరఫరాలశాఖ ఎండీ జి.వీరపాండియన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..!
శరీరంలో తగినంత ఐరన్ ఉత్పత్తికాకపోతే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా తరచూ మైకం కమ్మడం, శక్తి హీణత వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లోనైతే పెరుగుదల మందగిస్తుంది కూడా. నిజానికి ఐరన్ అన్ని వయసులవారికి అవసరమే. కాబట్టి ఇతర విటమిన్లు, మినరల్స్ మాదిరిగానే ఐరన్ కూడా తగు మోతాదులో అవసరమేనన్నమాట. ఐరన్ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలను ఢిల్లీకి చెందిన ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. అనిత వర్మా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. చదవండి: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. ఇవి తిన్నారంటే..! శనగలు మన వంటకాల్లో తరచూ ఉంపయోగించే శనగల్లో ఐరన్ నిండుగా ఉంటుంది. కాయధాన్యాలు లేదా పప్పుదినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం పెసలు, అలసందలు, వులవలు, బీన్స్, చిక్కుడు గింజలు, శనగల వంటి కాయధాన్యాల్లో ఐరన్ స్థాయిలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! గుడ్డు సహజంగానే గుడ్డులో ఐరన్‌తోపాటు అనేక విటమిన్లు, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కర్రీ, ఫ్రై వంటి వంటకాల రూపంలో ప్రతిరోజూ గుడ్డు మన ఆహారంలో చోటుచేసుకుంటూనే ఉంటుంది. యూఎస్డీఏ ప్రకారం వంద గ్రాముల గుడ్డు తీసుకుంటే ఒక రోజుకు అవసరమైన 1.2 మిల్లీగ్రాముల ఐరన్ అందుతుందని వెల్లడించింది. బీట్రూట్ బీట్రూట్లో పొటాషియం, పాస్పరస్, కాల్షియం, కార్బొహైడ్రేట్ ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మాక్రొబయోటిక్ నూట్రీషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్ శిల్పా అరోరా ప్రకారం మన శరీరంలో తగినంత ఐరన్‌ను అందించడంలో బీట్రూట్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఆహారాల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఉసిరి ఉసిరికాయలో విటమిన్ ‘సి’తోపాటు శరీరానికి అవసరమైన ఇనుము కూడా పెంచుతుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం ఒకేరకమైన ఆహారంతో విటమిన్ ‘సి’, ఇనుము (ఐరన్) రెండూ పొందుకోవాలంటే ఉసిరి బెస్ట్! అని పేర్కొంది. పాలకూర పాలకూర వంటి ఆకుపచ్చ కూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఇతర నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో పాలకూరను తరచూ తీసుకోవడం ద్వారా ఐరన్ లోపాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!! -
చిరుధాన్యాలతో రక్తహీనతకు చెక్
హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్ మోతాదుల్లో వృద్ధి: ఇక్రిశాట్ చిరుధాన్యాలు.. ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు అని అందరికీ తెలుసు. మధుమేహం, గుండె సంబంధిత సమస్యల నియంత్రణలో చిరుధాన్యాలు మేలు చేస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వీటితో రక్తహీనతకూ చెక్ పెట్టొచ్చని తాజా పరిశోధన తేల్చిచెప్పింది. –సాక్షి, హైదరాబాద్ చిరుధాన్యాలకు పుట్టినిల్లు తెలంగాణ. వరిసాగు పెరిగాక... వాటి సాగు, వాడకం తగ్గిపోయింది. ఆరోగ్య స్పృహ పెరగడంతో మళ్లీ చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చిరుధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌తోపాటు రక్తంలోని ఫెర్రిటిన్ మోతాదు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధన ఒకటి తెలిపింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో నాలుగు దేశాల్లోని ఏడు సంస్థలు రక్తహీనత, చిరుధాన్యాల వాడకంపై పరిశోధన నిర్వహించాయి. 22 అధ్యయనాల పునఃసమీక్ష ఆధారంగా తాజా విషయాలను ఇక్రిశాట్ వెల్లడి చేసింది. ఫెర్రిటిన్ మోతాదు సగం హెచ్చు... రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఆరికలు, సామలు.. ఇలా మొత్తం ఆరు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్న వెయ్యిమందిపై ఇప్పటికే జరిగిన అధ్యయనాల ఫలితాలను తాము విశ్లేషించామని, ఇతరులతో పోలిస్తే వీరిలో హిమోగ్లోబిన్ మోతాదు 13.2 శాతం, ఇనుము కలిగి ఉన్న ప్రొటీన్ ఫెర్రిటిన్ 54.7 శాతం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇక్రిశాట్ సీనియర్ పౌషకాహారవేత్త డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. 21 రోజులనుంచి నాలుగున్నరేళ్ల పాటు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నవారిపై అధ్యయనం నిర్వహించినట్లు ఆమె చెప్పారు. ‘‘చిరుధాన్యాలు సగటు మనిషికి అవసరమైన రోజువారీ ఇను ము మొత్తాన్ని అందించగలవని స్పష్టమైంది. కానీ తినే ధాన్యం, ఎలా శుద్ధి చేశారన్న అంశాలను బట్టి ఎంత మోతాదులో అందుతుందనేది ఆధారపడి ఉంది. దీన్ని బట్టి రక్తహీనత సమస్యను ఎదుర్కొనేందుకు చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతా యని స్పష్టంగా చెప్పవచ్చు’’అని డాక్టర్ అనిత వివ రించారు. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ తాజా సం చికలో అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. 174 కోట్ల మందిలో సమస్య.. ప్రపంచవ్యాప్తంగా రక్తహీనతను ఎదుర్కొంటున్న వారు 174 కోట్ల మంది ఉన్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్ తెలిపారు. రక్తహీనత పిల్లల మానసిక, శారీరక అభివృద్ధిని నిరోధిస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయని, వీటికి పరిష్కారం చిరుధాన్యాల వాడకమేననని ఆయన వివరించారు. చిరుధాన్యాల్లోని సూక్ష్మపోషకాలు శరీరానికి అందవనడంలో ఏ మాత్రం నిజం లేదని, మిగిలిన ఆహార పదార్థాలతోపాటు చిరుధాన్యాలను తీసుకున్నప్పుడు, వాటిలోని ఇనుమును శరీరం శోషించుకుంటోందని ఈ అధ్యయనంలో స్పష్టమైందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ‘మై ప్లేట్ ఫర్ ద డే’పేరుతో చిరుధాన్యాలను ఎలా వాడుకోవచ్చో తెలిపామని, ఈ రకమైన ఆహారం ద్వారా భారత్‌లో రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని ఆమె చెప్పారు. పులియబెట్టడం, పాప్‌కార్న్ మాదిరిగా చేయడం ద్వారా చిరుధాన్యాల్లోని ఇనుము మూడు రెట్లు అధికంగా అందుతుందని, పిండిని ఆవిరిలో ఉడికించి చేసే ఆహారం ద్వారా 5.4 రెట్లు అందుతుందని, మొలకెత్తినవి, పొట్టు తొలగించినవి తినడం వల్ల రెండు రెట్లు ఎక్కువ ఇనుము శరీరానికి అందుతుందని ఆమె వివరించారు. -
ఏపీఎంఎస్‌ఐడీసీకి కమీషన్ల జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో (ఏపీఎంఎస్ఐడీసీ) తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారాలు బయట పడుతున్నాయి. మందుల కొనుగోలు నుంచి సివిల్ నిర్మాణాల వరకూ ఆన్లైన్ టెండర్లకు వేదికైన ఈ సంస్థలో గత నాలుగున్నరేళ్లలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి, చికిత్స అందించేందుకు ఎనీమియా స్క్రీనింగ్ యంత్రాల (హిమోగ్లోబిన్ డిజిటల్ మెషీన్లు) కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్లకు కక్కుర్తి పడిన ఏపీఎంఎస్ఐడీసీ గత ఆరు నెలలుగా 164 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయలేదు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యంత్రాలను రాకుండా అడ్డుకున్నారంటే ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 3,150 యంత్రాల కొనుగోలుకు టెండర్లు రాష్ట్రంలో ఏటా 7.50 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో 60 శాతం మంది రక్తహీనత బాధితులే. పదేపదే సూదితో గుచ్చి రక్తం తీయడం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాథమికంగా 164 పీహెచ్‌సీలకు అత్యాధునిక హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మెషీన్లు ఉంటే గర్భిణులు, బాలింతలకు సూది గుచ్చాల్సిన అవసరం ఉండదు. కనురెప్పలు తెరిచి, ఆ మెషీన్‌తో చూస్తే శరీరంలో ఎంతమేరకు రక్త శాతం ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ మెషీన్‌కు బ్లూటూత్ పరికరం ఉంటుంది. వైద్యుడు సుదూర ప్రాంతంలో ఉన్నా అతడి సెల్‌ఫోన్‌కు ఈ హిమోగ్లోబిన్ సమాచారాన్ని పంపించి, సలహాలు సూచనలు పొందవచ్చు. మొత్తం 3,150 మెషీన్ల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడీసీ 2018 అక్టోబర్ 9న టెండర్లు పిలిచింది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల పరిశీలన తరువాత డెమో కూడా పూర్తయ్యింది. బయోసైన్స్ అనే సంస్థ ఒక్కో మెషీన్‌ను రూ.21 వేలకు కోట్ చేసి, టెండర్లలో ఎల్1గా నిలిచింది. ఎల్2గా నిలిచిన మాసిమో అనే సంస్థ ఒక్కో యంత్రానికి రూ.80 వేలు కోట్ చేసింది. దీంతో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు టెండర్ అప్పగించాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ ఆ పని చేయలేదు. కమీషన్ల బేరం కుదరకపోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అవినీతి వల్ల 2019 జనవరి నుంచి ఇప్పటివరకూ ఆ మెషీన్లు సరఫరా కాలేదు. బయోసైన్స్‌కు ప్రొడక్ట్ లైసెన్స్ లేదు ‘‘హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్ల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లలో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు ప్రొడక్ట్ లైసెన్స్ లేదని మాసిమో సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై వెరిఫికేషన్ చేశాం. ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించాం. ఈ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకున్నాం. టెండర్ రద్దయ్యింది’’ – సీహెచ్ గోపీనాథ్, ఎండీ, ఏపీఎంఎస్ఐడీసీ -
ఉంగరం ఉన్న చోట్ల నల్లబడుతోంది.. ఏం చేయాలి?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – నవీన, సామర్లకోట మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి. ∙మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. ∙మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. ∙ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు. ∙చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. జుట్టు విపరీతంగా రాలుతోంది... పరిష్కారం చెప్పండి నా వయసు 22 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను అనిమిక్‌గా ఉంటాను. హిమోగ్లోబిన్ కూడా తక్కువే. కేవలం 10 శాతం మాత్రమే. దయచేసి నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి తగిన సలహా ఇవ్వండి. – సుష్మా, ఖమ్మం జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో పోషకాహార లోపం చాలా ప్రధానమైనది. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. బహుశా మీ ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు ఈ కింది సూచనలు పాటించండి. 1) మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14 శాతానికి పెరగాలి. ఇందుకోసం ఫెర్రస్ సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్–సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి. 2) ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం డాక్టర్ సలహా మేరకు బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనో యాసిడ్లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి. 3) మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి. 4) పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియల ద్వారా మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. నుదుటి చర్మం మందంగా మారుతోంది... ఎందుకు? నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – కె. కృష్ణమూర్తి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ–ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. ∙బరువు తగ్గించుకోవడం ∙జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం ∙మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... – ఆర్బుటిన్ – లికోరైస్ – కోజిక్ యాసిడ్ ∙పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి ∙యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్సూ్యల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ –500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు: ∙ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 – 6 సెషన్ల పాటు చేయించుకోవాలి ’ లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ ట్రైకాలజిస్ట్ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
సికిల్‌సెల్ విద్యార్థులకు ప్రత్యేక వైద్యసేవలు
సీతంపేట: గిరిజన ఆశ్రమపాఠశాలల్లో గతంలో జరిపిన హిమోగ్లోబిన్ పరీక్షల్లో సికిల్‌సెల్ ఎనిమియా పాజిటివ్‌గా వచ్చిన 106 మంది గిరిజన విద్యార్థులకు రక్తం ఎక్కించి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏలో విద్యార్థుల ఆరోగ్య విషయమై ఏటీడబ్ల్యూవోలు, పీఎంఆర్సీ, గిరిజన సంక్షేమశాఖ, వైద్యసిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ కొద్దిరోజుల్లో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రక్తాన్ని విద్యార్థులకే వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షలు హెల్త్ వలంటీర్ల ద్వారా నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో తాగునీటి కోసం 25 ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయన్నారు. ప్రాథమిక పాఠశాలలకు అవసరమైన ప్రాథమిక చికిత్స కిట్లు ఇవ్వాలని సూచించారు. అక్టోబర్ 15నాటికి విద్యార్థులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. ఈనెల 7,8 తేదీల్లో హెల్త్‌వలంటీర్‌లకు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్ మెండ ప్రవీణ్, న్యూనెట్ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ రాజు, ఏటీడబ్ల్యూవోలు బల్ల అప్పారావు, మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
రక్తం అంటే ఎర్రగానే ఉంటుందా?
అపోహ - వాస్తవం రక్తం అనగానే ఎర్రటి రంగే గుర్తుకు వస్తుంది. మానవ రక్తంతో పాటు చాలా జీవుల్లో ఉండే రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులో ఉండే హీమోగ్లోబిన్ అనే ఎరుపు రంగును ఇచ్చే పిగ్మెంట్. మన రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే హీమోగ్లోబిన్ అనే ఇనుము ఆధారిత పదార్థం వల్ల రక్తానికి ఈ ఎరుపు రంగు వస్తుంది. ఇక వెన్నెముక కలిగిజ జీవుల్లోనేఏ గ్రీన్ బ్లడెడ్ స్కింక్స్ అనే ఒక రకం బల్లుల రక్తం ఆకుపచ్చరంగులో ఉంటుంది. మనకు ఇనుము ప్రధానంగా ఉన్నట్లే... కొన్ని రకాల పీతల్లోని రక్తం కాపర్‌ను కలిగి ఉంటుంది. కాపర్ ప్రధానంగా ఉండే ఈ రకాలకు చెందిన పీతల (క్రాబ్స్) రక్తం నీలం రంగులో ఉంటుంది. ఇలా నీలం రంగులో రక్తం కనిపించడానికి హీమోసయనిన్ అనే నీలిరంగును ఇచ్చే పదార్థమే కారణం. ఇక బొద్దింక (కాక్రోచ్) రక్తంలో ఎర్ర రంగు లోపించడం వల్ల వాటి రక్తం తెల్లరంగులో ఉంటుంది. అన్నట్లు కొన్ని కీటకాల రక్తం పసుపుపచ్చ రంగులోనూ ఉంటుంది. -
ప్రాణాలు తీస్తున్న రక్తహీనత
మహిళలకు మాతృత్వం దేవుడిచ్చిన గొప్ప వరం. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారు మాతృత్వం కోసం పరి తపిస్తుంటారు. అమ్మతనంలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఆరాటపడుతారు. అలాంటి మాతృత్వం జిల్లా ఏజెన్సీలోని మహిళలకు శాపంగా మారుతోంది. గిరి సీమలో సరైన పోషకాహారం లభించక రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృత్యు ఒడికి చేరుతున్నారు. కొంతకాలంగా ఏజెన్సీలో ఎక్కడో ఓ చోట గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం లోపించి రక్తహీనతతో చనిపోతూనే ఉన్నారు. గత నెలలో సమస్యాత్మక మండలాల్లో ముగ్గురు బాలింతలు రక్తహీనతతో మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఉట్నూర్ : సాధారణంగా మనిషి శరీరంలో 14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. 12 నుంచి 16 గ్రాముల వరకు ఉంటే ఆరోగ్యవంతులుగా భావిస్తారు. ఏజెన్సీలోని గర్భిణి, బాలింతల్లో 15 నుంచి 18 గ్రాముల వరకు, చిన్నారుల్లో 9 నుంచి 12 గ్రాముల వరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. దీనికితోడు ఏజెన్సీలోని బాలింతలు, గర్భిణుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటోంది. ఏజెన్సీలోని పీహెచ్‌సీల పరిధిలో ఆగస్టు నెల వరకు 4,999 మంది గిరిజన గర్భిణులు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వీరిలో 75 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్న వారే కావడం గమనార్హం. వీరికి సరైన పోషకాహారం దొరక్క పరిస్థితి ఇలా ఉంది. వీరిలో చాలామంది నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకోకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో చాలామందిలో రక్తహీనత సమస్య రావడంతో ప్రసవ సమయంలో రక్తస్రావం అధికమై చనిపోతున్నారు. శాపంగా పోషకాహారం లోపం.. ఏజెన్సీలో పోషకాహార లేమి గిరిజనుల పాలిట శాపంగా మారుతోంది. సరిపడా ఆహారం దొరక్క.. దొరికిన దాంట్లో పోషక విలువలు కొరవడడంతో శ రీరంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా తగ్గుతోంది. ఎర్ర రక్తకణాల సంఖ్య పడి పోతూ రక్తహీనతకు గురవుతున్నారు. రక్తహీనతను నివారించడానికి గర్భిణి, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఉట్నూర్‌లో 2008లో ఏర్పాటుచేసిన పోషక ఆహార పునరావాస కేంద్రం మూతపడింది. సమస్యాత్మక మండలాలైన నార్నూర్, జైనూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిర్పూర్(యు)లోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన 170 సంపూర్ణ గ్రామ ఆరోగ్య కేంద్రాల్లో సగానికి పైగా మూతపడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆశయం నీరుగారుతోంది. ఏజెన్సీలోని మహిళల మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఆహార భద్రత కార్యక్రమం చేపట్టినా.. ఐటీడీఏ మధ్యలోనే చేతులెత్తేసింది. ఏజెన్సీలో 2007లో 35,402 గిరిజన కుటుంబాలు, 2008లో 28,217 కుటుంబాలు, 2009లో 11,667 కుటుంబాలు, 2011లో 13,269 కుటుంబాలకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించారు. తదుపరి నాలుగేళ్లుగా ఆ ఊసే లేదు. అవగాహన కరువు.. ఏజెన్సీలో మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి తీసుకోవాల్సిన పౌష్టికాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది ఆ దిశగా చర్యలు చేపట్ట డం లేదు. ఫలితంగా క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలకు వారు దూరంగా ఉంటున్నారు. ప్రసూతి సమయంలో ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే సాధారణ ప్రసూతి చేసుకోవాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భిణులుగా ఉన్న సమయంలో పేర్లు నమోదు చేసుకునే సిబ్బంది.. తర్వాత వారిని విస్మరిస్తున్నారు. ఏజెన్సీ వాసులు వైద్యం కోసం డివిజన్ కేం ద్రంలోని ఉట్నూర్‌లో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తుంటారు. ప్రసూతి సమయంలో గర్భిణులను ఈ కేంద్రానికి తీసుకువద్దామంటే సీహెచ్‌సీలో రెండు గైనకాలజిస్టు పోస్టులు, అనస్థీషియా, ప్రిడియాస్ట్రీషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఐటీడీఏ ద్వారా నెలసరి వేతనం రూ.లక్షన్నర ఇస్తామని ప్రకటనలు ఇచ్చినా.. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు ఎవ రూ రా లేదు. దీంతో సీహెచ్‌సీలో గైనకాలజిస్టులు లేక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొందరు అక్కడికి వెళ్లలేక.. ఆర్థిక స్థోమతకు నోచుకోక ప్రాణాలు కోల్పోతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం.. రక్తహీనతతో గర్భిణులు, బాలింతలు మృతిచెందకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను వివరిస్తున్నాం. - ప్రభాకర్ రెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి గత నెలలో మృత్యువాత పడిన బాలింతలు.. - జైనూర్ మండలం పుల్లారాకు చెందిన ఆత్రం లలిత(48). నెలలు నిండడంతో నెల రోజుల ముందుగానే ప్రసవం కోసం తల్లిగారిళ్లు గూడమామడకు వచ్చింది. ఆగస్టు 17న పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఉట్నూర్ సీహెచ్‌సీకి ఆటోలో తరలిస్తుండగా రక్తహీనతకు తోడు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తల్లి, పుట్టిన బిడ్డ మృతిచెందారు. - నార్నూర్ మండలం శివనారాకు చెందిన సిడాం రాంబాయి(22) గత నెల 25న రక్తహీనతతో మృతిచెందింది. 20 రోజుల క్రితం మగశిశువుకు జన్మనిచ్చిన రాంబాయి రక్తహీనతతో బాధపడుతోంది. దీనికి తోడు జ్వరం రావడంతో గాదిగూడ పీహెచ్‌సీకి వైద్యం కోసం తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమించిందని.. రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. - కెరమెరి మండలం కోలాంగూడ(డి)కు చెందిన ఆత్రం మారుబాయి(25) గత నెల 21న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. మూడు రోజులు చికిత్స పొంది మృతిచెందింది. రక్తహీనతతో బాధపడుతూ మృతి చెందిందని కుటుంబీకులు పెర్కొన్నారు. - వాంకిడి మండలం ఖిర్ది గ్రామానికి చెందిన ఈశ్వరిబాయి గత నెల 25న ఇంట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం జరగడంతో కొద్ది గంటల్లోనే మృత్యువాత పడింది. -
పైల్స్ - హోమియో చికిత్స
పైల్స్ వున్న వారి బాధ వర్ణనాతీతం. మలవిసర్జన తర్వాత ఈ బాధ కొన్ని గంటల వరకు ఉంటుంది. నొప్పి, మంట, దురద ఉండి, సూదులతో గుచ్చుకున్నట్లు వుండి వీరు ఒకచోట కూర్చోలేరు, నిల్చోలేరు. ఈ మొలలు చిట్లడం వలన రక్తస్రావం జరుగుతుంది. చాలారోజుల వరకు రక్తస్రావం అయితే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి ఎనీమియా రావడానికి ఆస్కారం ఉంది. జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, వాహనాలు అధికంగా నడపడం, వేసవికాలం, నీరు అధికంగా తీసుకోకపోవడం వలన ఇవి వస్తాయి. మలద్వారంతో కలుపబడిన పెద్ద పేగు చివరి భాగాన్ని మలనాళం లేదా రెక్టమ్ అంటారు. ఇక్కడ ఉన్న కణజాలంలో అధికంగా ఉండే రక్తనాళాల వాపు వలన ఈ స్థితి వస్తుంది. పురీష నాళం వెలుపలి భాగంలో వస్తే బాహ్య హెమరాయిడ్స్ అని, లోపలి భాగంలో వస్తే లోపలి హెమరాయిడ్స్ అని అంటారు. ఇవి బఠాణీ గింజ లేదా ద్రాక్షపండు పరిమాణంలో గులాబీ రంగులో, మూడు లేదా నాలుగు గుత్తులుగా లేదా విడిగా కూడా ఉండే ఈ స్థితిని మూలశంక (పైల్స్) వ్యాధిగా పేర్కొంటారు. ఎవరికి వస్తుంది..? ... గర్భిణులలో, ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నవారిలో సాధారణంగా చూస్తాం. పిల్లలలో ఈ వ్యాధిని అరుదుగా చూస్తాం. కారణాలు... మలబద్దకం మూలంగా అధికంగా ముక్కుటం దీర్ఘకాలిక విరేచనాలు గర్భస్థ పిండం ఒత్తిడి వలన, అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్ల వలన పొత్తికడుపు లేదా పేగులలోని క్యాన్సర్ సంబంధ కణుతుల వలన వంశపారంపర్యంగా అధిక బరువు, స్థూలకాయం హెమరాయిడ్లు, వేరికోస్ సిరల వ్యాధి ఉన్నవారిలో పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం... వంటివి. హెమరాయిడ్లు - రకములు... మొదటి తరగతి (ఫస్ట్ డిగ్రీ పైల్స్): రెక్టమ్ లేదా మలనాళం లోపలే ఉంటాయి; రెండవ తరగతి (సెకండ్ డిగ్రీ పైల్స్): పురీషనాళం తెరచుకుని ఉన్నప్పుడు వెలుపలికి వచ్చి, మలద్వారం మూసుకున్న వెంటనే లోపలికి వెళ్లిపోతాయి; మూడవ తరగతి (థర్డ్ డిగ్రీ పైల్స్): వెలుపలికి వచ్చి, హెమరాయిడ్లను లోపలికి చొప్పించిన వెంటనే లోనికి వెళ్లిపోతాయి; నాల్గవ తరగతి (ఫోర్త్ డిగ్రీ పైల్స్): మలద్వారం వెలుపల శాశ్వతంగా వేలాడుతూ ఉంటాయి. లక్షణాలు: చాలామంది ఎక్కువగా లోపలి హెమరాయిడ్ల (ఇంటర్నల్ పైల్స్)తో ఏ లక్షణాలూ లేకుండానే ఉంటారు. మలద్వారం తెరచుకున్న వెంటనే తాజా రక్తం మలద్వారం ద్వారా వెలుపలికి వస్తుంది. మలద్వారం చుట్టూ దురద ఉండవచ్చు. మూడు-నాలుగు దశలలోని హెమరాయిడ్లు, అధికంగా నొప్పి ఉండి చీము వంటి పలుచని ద్రవం విసర్జింపబడుతుంది. నివారించవచ్చా? మొలలు వచ్చిన తరువాత కంటె మొలల లక్షణాలు కనబడిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు. మొలలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో, జీవన విధానంలో మార్పు తీసుకొస్తే నివారించవచ్చు. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఫైబర్‌తో కూడిన పదార్థాలు, దప్పిక ఉన్నా లేకున్నా పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తీసుకోవడం, మాంసాహారం, మసాలాలు, పచ్చళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది. ఎక్కువసేపు కూర్చోకుండా, యోగా, వ్యాయామం చేయడం వలన నివారించవచ్చు. హోమియో చికిత్స వలన ప్రయోజనం ఉంటుందా? మొదటి మూడు దళలలోని హెమరాయిడ్లను పూర్తిగా నయం చేయటమేకాక, శస్త్రచికిత్స, అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాకుండా హెమరాయిడ్ వలన వచ్చే బలహీనతను తగ్గించి, శాశ్వతంగా రాకుండా చేస్తుంది. హోమియోలో ఆస్కులస్ హిప్, ఆలోస్, హెయాములస్, కొలింగ్ సోనియా, ఆర్గనిక్ ఆల్, నక్సామికా మందులు బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్ ph: 7416 107 107 -
వేవిళ్ల బాధ ఎక్కువగా ఉంది...!
నా వయసు 24. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఇదే తొలిచూలు. ప్రస్తుతం రెండోనెల. నాకు వేవిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఉండటంతో ఆహారం తీసుకోలేకపోతున్నాను. పైగా తిన్నది కాస్తా వాంతుల రూపంలో వెళ్లిపోతోంది. ఇదేమైనా ప్రమాదమా? నాకు సరైన సలహా ఇవ్వండి. - సులోచన, తుని గర్భధారణ జరిగాక వేవిళ్ల వల్ల వికారం (నాసియా), వాంతులు చాలా సాధారణం. ఇవి 10వ వారం ప్రెగ్నెన్సీ సమయంలో గరిష్ఠంగా ఉంటాయి. అంటే దాదాపు రెండున్నర నెలల సమయంలోనన్నమాట. సాధారణంగా ఇలా వికారం, వాంతులు అన్నవి ఉదయం వేళల్లోనే ఎక్కువ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది సాయంత్రాలతో సహా ఏ వేళల్లోనైనా ఉండవచ్చు. ఇలా వేవిళ్ల వాంతులు కావడం అన్నది ఎన్నిసార్లు జరిగితే అది సమస్యగా పరిగణించవచ్చంటూ మీలాగే చాలామంది అడుగుతుంటారు. దీనికి నిర్దిష్టంగా ఒక లెక్కంటూ లేదు. చాలా సుకుమారంగా ఉండేవాళ్లలో కేవలం రెండు మూడుసార్లకే నీరసపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఐదారు సార్లు వాంతులైనా తట్టుకోగలరు. ఇక దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అంటే... అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్నవాళ్లయితే వాంతులు అవుతున్న కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దాన్ని పెద్ద ఇబ్బందిగానూ, సమస్యగానూ పరిగణించాల్సి అవసరం లేదు. ఐదోనెల వరకూ ఇలా ఉండవచ్చు. అప్పటి వరకూ దీనివల్ల బరువు పెరగకపోయినా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఐదునెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటిచిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. ఇంటి చిట్కా విషయానికి వస్తే అల్లం మురబ్బా తీసుకోవడం గాని లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. ఇక ఆహార మార్పుల విషయానికి వస్తే... చాలామంది మహిళలకు ఈ సమయంలో వారి ఆహారపు అలవాట్లు మారినట్లుగా ఉంటాయి. అంటే... అంతకుమునుపు స్వీట్స్ ఇష్టపడని వారికి ఈ సమయంలో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాగే అంతకు మునుపు కారాలు, మసాలాలు అస్సలు ముట్టని వారికి, ఈ సమయంలో వాటిని ఎక్కువగా తీసుకోవాలని అనిపించవచ్చు. అయితే ఈ సమయంలో చేయాల్సిన ఆహారపు మార్పులంటూ పెద్దగా ఉండవు. అన్ని రకాల పదార్థాలూ తీసుకోవచ్చు. కాకపోతే మసాలాలు తగ్గించాలంతే. సాధారణంగా వేవిళ్ల బాధ మూడోనెల వరకూ ఉంటుంది. కొంతమందిలో ఐదో నెల వరకూ ఉండవచ్చు. అయితే ఐదునెలల తర్వాత కూడా తగ్గకుండా అదేపనిగా వాంతులవుతూ ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు వాంతులు తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో వాంతులు చాలా ఎక్కువగా ఉంటాయి. కడుపులో కవలలు ఉన్నా లేదా కొందరిలో ముత్యాలగర్భం ఉన్నా ఇలా జరుగుతుంటుంది. అందుకే వేవిళ్లు మరీ ఎక్కువగానూ/ తీవ్రంగానూ ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయించుకుని, అసాధారణ గర్భం ఏదైనా ఉందేమో అన్నవిషయాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా, నిశ్చింతగా మీ డాక్టర్ / గైనకాలజిస్ట్ ఫాలో అప్‌లో ఉండండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్